'అలాగే శ్రీకాంత్ . అవును గాని నా వుత్తరాలకి ఒక్కదానికి సమాధానం యివ్వలేదెం? అంత పరాయిదాన్నయి పోయేనా?'
పక్కలో బాంబు ప్రేలినట్లు అదిరి పడ్డాడు శ్రీకాంత్. కళ్ళు చిట్లించి కనుబొమ్మలు ముడివేసి అర్ధం కాని వాడిలా అడిగాడు. 'యేమిటి నువ్వనేది. నాకు వుత్తరాలు నువ్వు రాశావా . జోక్ చేయకు.'
'జోక్ కాదు శ్రీకాంత్. నిజం చెబుతున్నాను నన్ను నమ్మండి. ఒకటి కాదు ఈ నేలా పది హిను రోజుల్లో నాలుగు రోజులకి ఒకటి చొప్పున మీరు జవాబు రాయకపోయినా నేను విసుగు లేకుండా రాశాను. ఒక్కదానికి జవాబు యిచ్చి వుంటే యెంత సంతోషిద్దును?'
'నో, నో నేను ఒక్క వుత్తరం కూడా అందుకోలేదు. దైవసాక్షి గా. అసలు నాకు వొచ్చిన వుత్తరాలన్నీ ఏమైనట్లు?'
'యేమిటో యిప్పుడు మీరే జోక్ చేస్తున్నారేమో అనిపిస్తోంది.' నిరశాగా అన్నది హేమ నళిని.
'హు' చిత్రంగా శబ్దం చేశాడు శ్రీకాంత్. 'మనిషికి మనిషి మీద నమ్మకం వుండాలి గానీ ఓట్లు నీటి మీద వ్రాతలు అయిపోవా నమ్మకం లేకపోతె. నేను ఒక్క వుత్తరం కూడా అందుకోలేదు. అందుకు నా అంతరాత్మ సాక్షి!
'యెన్ని వుత్తరాలు. ఒక్కో వుత్తరం లో మీపట్ల నా అభిమానాన్ని యెలా వ్రాశాను? నాన్నగారు నాకు యిచ్చిన అధికారం, చనువు యిందుకు కారణం శ్రీకాంత్. నాన్నే అందరి తండ్రుల మాదిరి ఆంక్షలు విధించేట్లయితే నేను వుత్తరం రాయగాల్గే దాన్నేనా.'
'ఉండు వుండు హేమా నా తల తిరిగి పోతున్నది. నాకసలేవీ తెలియడం లేదు. మా యింట్లో పనివాళ్ళు కూడా ఒకళ్ళో ఇద్దరో తప్ప యెక్కువ మంది లేరు. నాన్నగారు అమ్మే ప్రొద్దస్తమానూ యింట్లో వుంటారు. ఈ మధ్య కాలంలో యెక్కడికి వెళ్ళలేదు కూడా. ప్రొద్దుటి నుంచీ సాయంత్రం వరకూ యింట్లోనే గడిపే వాడిని. నాకు ఒక వుత్తరం కూడా అందలేదంటే ఆ వుత్తరాలు ఏమైపోయినట్లు? అమ్మదేచేసిందా? యెంత నింద? అమ్మ మీద యింతటి నేరాన్ని విధించడం మహా పాపం. ఆవిడకి యించు మించు ఈ ప్రపంచంతో సంబంధమే లేదు. ముఖ్యంగా నేనంటే అమ్మకి యెంత యిది? అటువంటి అమ్మ యిలాంటి పనులు చేస్తుందా. అమ్మ బి.య్యే తెలుసా?
'మరెవరు చేశారంటారు?'
శ్రీకాంత్ నొసలు చిట్లించాడు. 'ఎవరున్నారు యిలాంటి పాడు పనులు చేసేందుకు?సభ్యత సంస్కారం లేని వాళ్ళు యేవరున్నారు? మా యింట? అంతా చిత్రంగా పజిల్ లా వుంది?
హేమ నళిని మౌనం వహించింది కాస్సేపు. శ్రీకాంత్ కి ఆవలింతలు వస్తున్నాయి నిద్రా దేవికి స్వాగతం పలుకుతూ. 'మరి నేను వస్తాను,' అంది హేమ నళిని . శ్రీకాంత్ నిద్ర ముంచుకు రాగా పక్కలో వొత్తిగిలిపడుకున్నాడు.
13
అతను ఉద్యోగం లో జాయిన్ అయాక వేరే రూమ్ తీసుకుని వుంటానన్నాడు. రామచంద్ర చౌదరి అందుకు ఒప్పుకోలేదు. 'మాతో వుండేందుకు నీకు యిష్టం లేకపోతె యింత పెద్ద యిల్లు వుంది. వో గది నీకు నచ్చింది చూసుకుని అందులో వుండు. మాతో బాటే భోజనం చేయాలని నిన్నేమీ నిర్భంధించము. నీ గదికే వస్తుంది భోజనం.'
'మీకు చాలా శ్రమండి. విడిగా వుంటే అమ్మా, నాన్నా యెప్పుడైనా వచ్చేందుకు వీలుంటుందనే మాటికి అన్నాను.' అన్నాడు.
'చటర్జీ నేనూ చాలా పాత స్నేహితులం శ్రీకాంత్. అతను నా దృష్టి లో పరాయి వాడు కాదు. పెద్దవాడిని నేను చెప్పింది విను.'
శ్రీకాంత్ అతని మాటల్ని త్రోసి వేయలేక పోయాడు. అతనికి రెండు మూడు నెలలు గడిచేసరికి వుద్యోగం చాలా బాగున్నట్లు తోచింది. అతన్ని చాలాకాలంగా రాధికని చూడాలనే కోరిక పీడిస్తోంది. కొత్త వుద్యోగం లో సెలవు పెట్టిందుకు వీలు లేనందు వల్ల బలవంతంగా అణుచుకున్నాడు ఆ కోరికని.
పద్మనాభం సాయంత్రం అయిదు గంటల కి శ్రీకాంత్ రూమ్ కి వచ్చి అక్కడే కూర్చుని అతను వచ్చేవరకూ లైబ్రరీ పుస్తకాలు చదువు కుంటుంటాడు. తను రాగానే గంటా అరగంటా ఒక్కో రోజు రాత్రి యెనిమిది దాటి పోయినా కబుర్లలోంచి తెరుకోరు.
పద్మనాభం శ్రీకాంత్ కోసం యెదురు చూస్తూ వాలు కుర్చీ లో కూర్చున్నాడు. శ్రీకాంత్ రాగానే హేమ నళిని యిద్దరికీ కాఫీ, టిఫిన్ పంపింది.
టిఫిన్ చేసి కాఫీ త్రాగాక శ్రీకాంత్ ని వుద్దేశించి పద్మనాభం అన్నాడు. 'మీరు చదువుకున్నవారు. ఒక్క విషయం అడుగుతాను సూటిగా చెబుతారా?'
శ్రీకాంత్ తలెత్తాడు. 'యేమిటి?' అన్నట్లు చూస్తూ.
'నాన్నగారూ మిమ్మల్ని యిక్కడ వుండమని అనడం లో అర్ధం గ్రహించలేదా మీరు.'
'లేదు. ఏం? యెందుకని అలా అడుగుతున్నారు?'
'మీ నాన్నగారు మీతో చెప్పనే లేదా?'
'మా నన్నాగారా? అబ్బే నాకేం చెప్పలేదే?'
'మా హేమని మీకు యిచ్చి పెళ్లి చేసి యీ లక్ష రూపాయల మేడ మీకే యిస్తాం అని ఆయన రాశారు. అందుకు మీ నాన్న గారు యేమని రాశారో తెలుసాండి.'
'చెప్పండి.'
'అల్లుడేలాగూ అక్కడికి రాబోతున్నాడు. మధ్య నా ప్రమేయం యేముంది? మీ పిల్లకి యిష్టం అయితే శ్రీకాంత్ అదృష్ట వంతుడే ,' అని.
శ్రీకాంత్ చేతిలో సగం తాగుతున్న కాఫీ కప్పు జారిపోయింది. అతను నిలువెల్లా వోణికిపోసాగాడు. తల కొద్దిగా వాలిపోయింది. అతను నిలుచున్న చోటునే కూర్చుండి పోయాడు. పద్మనాభం ఖంగారుగా నౌఖర్ని కేక వేశాడు. యింటిల్లిపాదీ వచ్చారు. శ్రీకాంత్ కి ఐదు నిమిషాల తరువాత స్పృహ వచ్చింది. డాక్టరు రాగానే యెక్కడి వాళ్ళు అక్కడ సర్దుకున్నారు.
రామచంద్ర చౌదరి కొడుకుని పిలిచి 'కారణం యేమిటి?' అని అడిగాడు.
పద్మనాభం కొంచెం అలోచించి ' అతను బలహీనంగా వున్నాడు నాన్నగారూ. అంతకు మించి మరేం వుంటుంది? ' అని జవాబు చెప్పాడు. తండ్రికి నిజం చెప్పాలనిపించలేదు. శ్రీకాంత్ కి తగిలిన గాయమేదో బలమైనది కనుకనే అతను ఆ విధంగా తెలివి తప్పి పడిపోయాడని పద్మనాభం గ్రహించక పోలేదు.
శ్రీకాంత్ మర్నాటి నుంచి పద్మనాభాన్ని తప్పించుకుని తిరాగడం ప్రారంభించాడు. అతను సాయంత్రం యింటికి వేళకి రావడం కూడా మానేశాడు. పద్మనాభం నాలుగైదు రోజుల తర్వాత శ్రీకాంత్ ని కలుసుకుని అతని భుజం మీద చేయి వేసి 'మీరు అపోహ పడుతున్నారు. నేను నాన్నగారితో గాని చెల్లాయి తో గానీ యే విషయమూ చెప్పలేదు. నేను మీకు స్నేహితుడిని కానంటారా శ్రీకాంత్. నాతొ చెప్పండి. నేను మీకు అనుకూలం అయిన ఏర్పాట్లన్నీ చేస్తాను. చెల్లాయి మిమ్మల్ని గుడ్డిగా ఆరాధిస్తోంది. యే క్షణం లో అయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని పిచ్చి పిల్ల భ్రమ పడుతోంది. మీ తిరస్కారం దానికి పెద్ద దెబ్బే. అయినా దానికోసం మీరు ఏదో చేయాలని మేము మిమ్మల్ని యిలా యిరకాటం లో వుంచడం వుచితం కాదు.
'మీరు మానసికంగా చాలా గాయపడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మీ మనసులో మాట వినేందుకు నేను స్నేహ పాత్రుడి ని కానంటారా?' అని అడిగాడు.
శ్రీకాంత్ దృడంగా నిశ్చయించు కున్న ఆలోచనలు కదిలిపోయాయి. పద్మనాభం అతని యెదుట కూర్చున్నాడు. శ్రీకాంత్ గంగ పెళ్ళి విషయం చెప్పి, హేమ నళిని తనకి వుత్తరాలు రాయడం అవి అందకపోవడం కూడా చెప్పాడు. అంతా విని పద్మనాభం దీర్ఘంగా నిట్టూర్చి 'ఇదంతా మీ నాన్నగారే చేశారని యెందుకనుకోరూ?' అని ప్రశ్నించాడు.
శ్రీకాంత్ తల అడ్డంగా తిప్పి, ' నాన్నగారికి నేనంటే చాలా ప్రేమ . అయన నన్ను మాములుగా చూడలేదు. నాకోసమే అమ్మని చేసుకున్నారు. ఉమేష్ ని కూడా అయన అంతగా పట్టించుకోలేదు,' అన్నాడు.
'నాన్నగారు యివాళో రేపో మిమ్మల్ని స్వయంగా కనుక్కుందాం అనుకుంటున్నారు. మీరు అధైర్యపడి తప్పనిసరిగా ఈ పెళ్లికి ఒప్పుకోవద్దు. యిష్టం లేని పెళ్ళిళ్ళ ఫలితాలు అంత బాగుండవు. దాని కన్నా బలవన్మరణం మేలు.' అన్నాడు.
.jpg)
అతను అన్నట్లు గానే వో ఆదివారం పూట రామచంద్ర చౌదరి గారే శ్రీకాంత్ గది' లోకి వచ్చాడు. శ్రీకాంత్ లేచి నిలుచుని ' నాకు కబురు పంపక పోయారండి నేను వచ్చేవాడిని కదా. మీరు శ్రమ తీసుకున్నారు.' అన్నాడు.
రామచంద్ర చౌదరి గంబీరంగా అన్నాడు. 'కొన్నిసార్లు డిగ్నిటీ మైంటైన్ చేయడం మంచిది కాదోయ్ శ్రీకాంత్. ముఖ్యంగా నీతో పని వుండి వచ్చాను. నాపని కనుక నేనే రావాలి. లా ప్రకారం. కూర్చో నువ్వు కూడా .' అతను కూర్చోగానే శ్రీకాంత్ కూర్చున్నాడు.
'అసలు విషయం, యిన్నాళ్ళూ నిన్ను ప్రత్యేకంగా చూశానని నువ్వు తెలుసుకునే వుంటావు. మా అమ్మాయి హేమ నళినిని నీకు యివ్వాలని మేము అనుకుంటున్నాం. ఈ విషయం మీ నాన్నకి రాస్రే అతను యిష్టపడినట్లు జవాబు రాశాడు. మరి నీ అభిప్రాయం చెప్పు శ్రీకాంత్. యిటువంటి కార్యాల్లో మొహమోటాలు పనికి రావు. స్ట్రైట్ ఫార్వార్డ్ గా వుండాలి. ఎస్. ఆర్. నో . ఏదో ఒకటి చెప్పు మా హేమని చేసుకోవడం లో నీకేదైనా అభ్యంతరం వుంటే.'
'నాకు.......' శ్రీకాంత్ కొంత తటపటాయించి నిశ్చలంగా జవాబు చెప్పాడు. 'నాకు యిష్టం లేదండి ' రామచంద్ర చౌదరి గాబరా పడి పోలేదు. తాపీగా లేచి నిలుచుని 'థాంక్స్ . నీలాంటి పిల్లలంటే నాకు చాలా యిష్టం. ముక్కుకు సూటిగా మాట్లాడితే అపార్ధాలు వుండవు. హేమ పిచ్చి పిల్ల. చిన్నది కద యింకా......యేమేమో అనుకుంటోంది. నిన్ను బలవంతం చేసి తన మీద అభిప్రాయాన్ని చెప్ప మన వచ్చును. యిప్పుడే దానికీ సంగతి చెప్పకు. నేను మెల్లగా చెబుతాను. లేదా సమయం చూసుకుని నువ్వు చెప్పినా సరే,' అని వెళ్ళిపోయాడు.
మరో సందర్భం లో అతని స్థానం లో మరే యితర వ్యక్తీ అయినా వున్నట్లయితే తప్పకుండా తను చేసిన సహాయానికి చిలవలూ పలవలూ అల్లి నగిషీలు చెక్కి అణువణువున తూట్లు పడే విధంగా దెప్పి పొడిచే వారు. కానీ రామచంద్ర చౌదరి అటువంటి మనిషి కాడు. మనసు కీ, మనిషికీ, విజ్ఞానానికీ, స్వంత అభిప్రాయానికి చాలా విలువని యిచ్చేవాడు. అందుకే అతను నెమ్మదిగా కదిలి వెళ్ళిపోయాడు.
అతను ప్రయాణం అయి వెడుతుంటే ,
'మళ్ళీ యెప్పుడు వస్తారు శ్రీకాంత్ ,' అని అడిగింది హేమ నళిని.
'చెప్పలేను . అన్నాడు. అతను అనగానే, 'నాన్నగారికి చెప్పారా?
'దేనికి?'
'అయన మిమ్మల్ని యిక్కడే వుంచు కోవాలను కున్నారు. అటువంటప్పుడు చెప్పద్డా.'
'నువ్వలా కూర్చో హేమా. నీతో చాలా సంగతులు మాట్లాడాలి.'
'ఏం యిన్నాళ్ళూ లేని మాటలు చివరి సమయంలో గుర్తుకు వచ్చాయా. ఫరవాలేదు ఈ హడావుడి లో నేనేం వినదలుచుకోలేదు. మళ్ళీ వచ్చాక చెబుదురు గాని తీరుబడిగా.'
'మళ్ళీ వస్తానని గారంటీ యేవిటి?'
'శ్రీకాంత్ !' హేమనళిని అతని వైపు గాబరాగా చూసింది.
'గాబరా పడకు హేమా నువ్వలా కూర్చో.'
హేమ నళిని కూర్చోలేదు. అతనున్న చోటికి వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి 'వీల్లేదు శ్రీకాంత్ . మిమ్మల్ని నేను వెళ్ళ నివ్వను. నన్ను విడిచి మీరెలా వెళ్ళగలరో అదీ చూస్తాను.' అన్నది. ఆమె కళ్ళలో అప్పటికే కన్నీటి బిందువులు నిలిచాయి.
అతను సున్నితంగా ఆ చేతుల్ని తప్పించేసి అడుగు దూరంలో నిలబెట్టి, 'నన్ను మాట్లాడనివ్వు హేమా. నా పరిస్థితి కొంచెం విను.' అన్నాడు.
'కొంచెం యేమిటి పూర్తిగా బ్రతుకంతా వింటాను. మిమ్మల్నిచ్చి పెళ్లి చేస్తానని నాన్నగారు అన్నారు. ఆడపిల్ల యింత తెగించి చొరవ తీసుకుని మగవాడితో ప్రవర్తించడం యేమిటి? అని ఎవరనుకున్నా నాకేమీ ఫరవాలేదు. మీరు కావాలి నాకు! చాలు. యింకీ ప్రపంచంతో నాకు పని లేదు.'
శ్రీకాంత్ దీనంగా చూస్తుండి పోయాడు అరక్షణం. 'నేను ఈ ప్రపంచపు దురదృష్టవంతుల జాబితా లో మొదటి మనిషిని. నేనూ ఒకప్పుడు యెన్నో ఆశలు పెంచుకున్నాను . యేవేవో అనుకున్నాను. అంతా క్షణం లో జరిగిపోయింది. నా పాలిట విధి వక్రించి వికటాట్టహాసం చేసింది. నేను చిన్ననాటి నుంచీ మనసులో నిలుపుకుని నాది అని గర్విస్తూ వచ్చిన ప్రతిమని యెవరో లాక్కుపోయారు.'
