"అదిగో... ఆ చాపమీద కూర్చున్నాడే... మా అల్లుడు... 29 కల్లా ఢిల్లీలో వుండాలి. ఓ రెండుమూడు రోజుల ముందే మంచి ముహూర్తం వుంటే పెట్టాలి" అన్నాడు.
అప్పుడే లోపలకు అడుగుపెట్టిన ఓ కాషాయాంబరధారి "శాస్త్రిగారు! పక్కవీధిలో ఓ శాల్తీ మిస్ అయిందట. మీరు అక్కడకెళ్లి పని చూడండి" అని బ్రహ్మల్ని పంపించేసి చనువుగా ఓ కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
"మీరు.." అన్నాడు మామగారు.
"పేరెందుకులేండి... నేను ఢిల్లీ నుంచే వచ్చాను. ఇండిపెండెంటుగారి ప్రయాణం, ఢిల్లీకి ఫ్లైటు, అన్నీ నేనే ఎరేంజ్ చేస్తా, ఢిల్లీలో మకాం కూడా. రాచమర్యాదలు జరిపిస్తా" అని వచ్చీ రాని తెలుగులో మాట్లాడి, జేబులోంచి ఫోను తీసి ఢిల్లీ మాట్లాడుతున్నాడు హిందీలో ఒక్కముక్క అర్థం కావడం లేదు అక్కడెవరికీ.
ఆయన ఫోను పెట్టేసి లక్ష్మీబాయితో- "అమ్మాయ్! ఫికర్ మత్ కరో- ఇండిపెండెంటుగారికి ఢిల్లీలో ఫైవ్ స్టార్ హోటల్లో సూటు బుక్ చేశాను. వెంటనే సూటుకేసు సర్దు" అన్నాడు చిరునవ్వుతో.
మామగారు "అయినా ఇంత ఖర్చు మేం భరించుకోవటం..."
"భలేవారు! ఆప్ చింతా మత్ కరో. మొత్తం నేను చూసుకుంటా గదా!" అన్నాడు.
లక్ష్మీబాయి ఆనందంగా లోపలికెడుతూ "హుఁ.. ఈ మొద్దావతారం ఎప్పుడన్నా ఊరు కదిల్తేనా! ఢిల్లీ పంపటానికి కనీసం ఓ కొత్త సూటుకేసు కూడా లేదు.. పక్కింటి వాళ్ళను అడుగుతాను" అనుకుంటూ బయటకొచ్చి గేటు తీసింది.
"పాత సూటుకేసులకి కొత్త సూటుకేసులిస్తాం" అని అరుస్తూ నిలబడ్డాడు ఒకాయన గేటు ముందరే. తెల్లగుడ్డ టోపి, నల్లకోటు వేసుకుని వున్నాడు. లక్ష్మీబాయి ఆశ్చర్యంగా చూసింది.
"ఏమిటో? పాత సామాన్లకీ పాతబట్టలకీ స్టీలు సామాన్లిస్తారుగానీ పాత సూటుకేసుకి కొత్తదిస్తావా! నీకేం మతి పోయిందా? నేనేం అంత తెలివితక్కువ దానిలా కనబడుతున్నానా? ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. వెళ్ళెళ్ళు... చెయ్యి ఖాళీగా లేదు. అలా పైకి పో" అంది. ఆ మనిషి ఒళ్ళంతా పళ్ళు చేసుకుని నవ్వుతూ, 'ఆహా! పొద్దున్నే ఎంత చల్లటి మాటన్నావ్ తల్లీ.. 'చెయ్యి' ఖాళీగా లేకపోవడమే మాక్కావల్సింది" అని అటూ ఇటూ చూసి తగ్గు స్వరంతో "మీవారు ఇండిపెండెంటేగదమ్మా?" అని అడిగాడు.
"అవును. అయితే ఏంటట?"
"మాతో 'చేయి' కలిపితే ఈ సూటుకేసులో వున్నదంతా మీదే" అని ఓ కొత్త సూటుకేసు అందించాడు.
ఇప్పటికి లక్ష్మీబాయికి విషయం కొంచెం కొంచెం అర్ధమవుతోంది.
మొహం విప్పారుతుండగా, "మా ఇం(డిపెండెం)టాయనకి ఇంత విలువుందా? ఇంతకీ ఎంతుందిందులో?" అని అడిగింది.
"ఏ సూటుకేసులో ఎంతుందో ఎవరు చెప్పగలరమ్మా? అయినా మీ మంచి కోసం చెప్తున్నా. లోపల ఢిల్లీకి ఫ్లైటూ, బంగళాలో మకాం అని చెప్తున్నాడే ఆయన్ని తొందరగా పంపెయ్యండి" అని అప్పటికే పాత సూటుకేసులు పట్టుకుని క్యూలో నిల్చున్న వాళ్ళని వదిలించుకుంటూ "పాత సూటుకేసులకి అంతకన్నా డొక్కు సూటుకేసులిస్తాం" అని అరుచుకుంటూ వెళ్ళిపోయాడు.
లక్ష్మీబాయి లోపలికొచ్చి సూటుకేసు భద్రంగా దాచి, అన్నయ్యను పిల్చి చెప్పింది. అతను థ్రిల్లయిపోయి "అప్పుడే తొందరపడి ఎవరికీ మాటివ్వకు. హరిశ్చంద్ర నాటకం చూశావుగదా! అది తిరగేసి, బావని వేలంపాటలో పెడదాం" అని గుసగుసగా చెప్పి హాల్లోకి వెళ్ళాడు.
"ఇన్ లియే, మేము సూర్యకాంతంలాంటి వాళ్ళం-మా ఉద్యానవనంలోని సరస్సులో మీ అల్లుడుగారు పూర్తిగా వికశించేలా చూస్తాము" చెప్తున్నాడాయన.
ఇండిపెండెంటు మొగ్గలారా ముడుచుకు కూర్చున్నాడు. ఎప్పుడొచ్చాడో చాపమీద నుంచి కుర్చీలోకి మారాడు.
బామ్మర్ది కలగజేసుకున్నాడు. "సూర్యకాంతం కాదు. సూర్యకాంతి. అయినా కలువలు వికసించాలంటే కావాల్సింది చంద్రకాంతి. అద్సరే అసలు విషయానికి రండి. అస్ లీ బాత్ కో ఆయీయే" అన్నాడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న హిందీ ప్రావీణ్యంతో.
"క్యామై నదిలీ బాత్ కరో రహా హుఁ? బహారో పూల్ బర్సావో మేరా మహబూబ్..." అంటూ లేచి ఇండిపెండెంటుని కావలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. లక్ష్మీబాయి బిర్రుగా చూసింది. "మా వారు ఆర్.ఎం.పీ. డాక్టరేగానీ మీరనుకుంటున్నట్లు హోమోపతీ కాదు" అంది. ఆయన "మేరీ ప్యారీ బెహనియా" అని రెండు చేతులూ సాచి లక్ష్మీబాయి వేపు వెళ్ళసాగాడు. బామ్మర్ది ఆయన్ని అడ్డుకుని, "బహోత్ హోగయా. పైసలు ఎంతిస్తావ్.. అద్చెప్పు ముందర" అని నిలదీశాడు. "పైసలా? అభీతక్ ఫైసలా నహీ హువా. ఈ దేశం సమగ్రత కోసం హెల్ప్ చేయండి. భగవంతుడు మేలు చేస్తాడు. కావాలంటే ఇండిపెండెంటుగారి పేరు మీద సీతమ్మవారికి లక్షకుంకుమార్చన చేయిస్తాం" అన్నాడు.
"కుదర్దు. ఐదు లక్షల కుంకుమార్చన చేయించాలి" అన్నాడు బామ్మర్ది బింకంగా. "మనలో మనకేటి భాయీ! మూడు లక్షల కుంకుమార్చన చేయిస్తాం" అన్నాడాయన గుంభనంగా.
"నాలుగున్నర లక్షల కుంకుమార్చన కంటే ఒక్క కుంకుమార్చన తగ్గినా ఒప్పుకోం" అన్నాడు బామ్మర్ది మొండిగా.
ఆయన దీనంగా "జరా సమఝ్ నేకీ కోషిష్ కరో, ఇప్పటికే కొన్ని లక్షల కుంకుమార్చనలు చేయించి మా జబ్బలు బాగా వాచిపోయి కాపడం పెట్టుకుంటున్నాం" అని 'హేరామ్' అంటూ పడకకుర్చీలో కూలిపోయాడు.
అంతలోనే చిరిగిన పంచె, అతుకుల లాల్చీతో దబ్బపండల్లే వున్న ఓ బట్టతలాయన లోపలికి ప్రవేశించి పడకకుర్చీలో పడుకున్న అతన్ని వెనకనుంచీ చూసి, జేబులోంచీ సెల్ ఫోన్ తీసి నెంబరు నొక్కాడు. పడక్కుర్చీలోపడుకున్నాయన జేబులో సెల్ ఫోన్ మోగింది. ఆయన తీసి 'హాయ్' అన్నాడు.
"మై.. కాలాకృష్ణ బోల్ రహా హుం. ఏమయింది?" అన్నాడు.
పడక్కుర్చీ ఆసామీ "వీళ్ళు మొండి ఘటాల్లా వున్నారు. అస్సలు లొంగటం లేదు" అన్నాడు అచ్చ తెలుగులో.
"ఠీక్ హై. నీ వల్లేమవుతుందిగానీ - మనకింక ఒక్కటే మెజార్టీ కావాలి. బయట ఆటో వుంది. నువ్వు వెంటనే ఆటో ఎక్కి ఢిల్లీ వెళ్ళిపో. నే చూసుకుంటాలే అన్నీ" అన్నాడు కాలాకృష్ణ.
"ఆటోలో ఢిల్లీ పోవాలంటే చాలా రోజులు పడుతుందేమో" నసిగాడు.
"తుమ్హారా బొంద. నేరుగా ఎయిర్ పోర్టుకు పో. బెస్టాఫ్ లక్" అని ఫోను మూసేసి ముందరికొచ్చి షేక్ హ్యాండిచ్చాడు. అప్పుడే పడక్కుర్చీలోంచి లేచి నిల్చున్నవాడు తెల్లబోయాడు. "మీరిక్కడే వున్నారా!" అన్నాడు.
"అవును. నేరుగా మాట్లాడితే లాబీలో మాట్లాడినట్టవుతుంది. పైగా లాబీయింగ్ అంటారు. అయినా సెల్ ఫోన్లు రాకముందు కూడా అన్ని పార్టీల నాయకులూ సెల్ లో మాట్లాడుకున్నవాళ్ళేగా! సరే నువ్వు బయల్దేరు" అని అతనెళ్ళిపోగానే ఇంట్లో అందరికీ వినయంగా దణ్ణం పెట్టాడు.
"ఎవరు మీరు" అని అడుగుతూంటే ఇండిపెండెంటు అత్తగారు వచ్చింది. "నేనే పనిలో పెట్టా. పెరడంతా శుభ్రం చేసి కొత్త మొక్కలు నాటిపెడతానన్నాడు. ఓ పాతికిస్తే చాలన్నాడు" అంది. అందరూ అయోమయంగా చూస్తుండగానే కాలాక్రిష్ణ పెరట్లోకి వెళ్లిపోయి "మేరి దేష్ కి ధర్తీ" అని పాడుకుంటూ పెరడంతా దున్నసాగాడు.
