డిఫెన్స్ లాయర్ సమాధానం తోచక గొణుక్కున్నాడు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదం వింటూ రవి దగ్గరగా బెంచీమీద కూర్చుని వున్న తండ్రి ముఖంలోకి చూశాడు. జగన్నాథం అసహాయంగా ఓ క్షణం కొడుకు ముఖంలోకి చూసి, కళ్ళు వాల్చుకున్నాడు.
జనంలో కలకలం బయలుదేరింది. బాల్ - బేబీ కథ గురించి తర్క వితర్కాలు బయలుదేరాయి.
జడ్జి తల వంచుకుని ఏదో రాస్తున్నాడు.
జనం మధ్య నుంచి ఇందిర జడ్జి దగ్గరకు వచ్చి నిలబడింది. జడ్జి కుతూహలంగా ఆమె ముఖంలోకి చూశాడు.
"మిలాడ్ ! నేను ముద్దాయి తరపున వాదిస్తాను. నాకు అనుమతి కావాలి!"
రవి కళ్ళు ఒక్కసారిగా వెలిగాయి. కానీ ఆ వెలుగు ఎంతోసేపు నిలవలేదు. జగన్నాథం సంభ్రమాశ్చర్యాలలో ఇందిరకేసి చూస్తూ వుండిపోయాడు. కోర్టులో ఉన్నవారంతా కుతూహలంగా జడ్జి జవాబు కోసం చూడసాగారు.
జడ్జి తల పంకిస్తూ చిరునవ్వు నవ్వాడు. "గో ఎ హెడ్" అన్నాడు.
ఇందిర జడ్జీకి థాంక్సు చెప్పి ముద్దాయి నిల్చున్న బోను దగ్గిరకు వచ్చింది. ఇద్దరి కళ్ళూ ఓ క్షణం కలుసుకున్నాయి. రవికి ఆనాడు...మొదటిసారిగా పరిచయం అయినాడు...తను రైల్లో ఇందిరతో అన్న మాటలు గుర్తొచ్చాయి. పెదవులమీద లీలగా హాస రేఖ కదిలింది.
"ప్రొసీడ్!" అన్నాడు జడ్జి.
"మిలాడ్ ! బాల్ - బేబీ కథ కల్పిత కథ అని బోర్డు వారు నిర్ణయించబోయే ముందు ముద్దాయికి సాక్ష్యుల్ని వెదికి తెచ్చుకొనే అవకాశం కల్పించగలరు. వారు ఈ వూరు అయివుండాలి. కనుక ముద్దాయికి సాక్షుల్ని వెదికే అవకాశం కల్పించాలి."
పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నిలబడ్డాడు. ముందుకు వచ్చి "మిలాడ్ ! ముద్దాయిని 402 క్రింద బుక్ చేయడం జరిగింది. ముద్దాయికి బెయిల్ ఇవ్వడానికి వీలులేదు" అన్నాడు.
"మిలాడ్ ! న్యాయానికి చెవులే కానీ కళ్ళు లేవని అందరికీ తెలుసు. సాక్షులు కధనం మీదనే న్యాయాన్యాయాలు నిర్ణయించబడతాయి. అటువంటప్పుడు ముద్దాయికి ఆ అవకాశాన్ని కలిగించక పోవడం న్యాయమా? కోర్టే నిందితుడ్ని అపరాధిగా నిరూపించడం కాదా? ఒక విధంగా ఎదుటి పార్టీని సమర్థించినట్టు కాదా?"
ఇందిర వాదిస్తూ వుంటే రవి మంత్రించినట్టు నిల్చుండిపోయాడు. జగన్నాథం కళ్ళలోకి జీవం వచ్చింది. జడ్జి ఆలోచనలో పడ్డాడు.
"మిలాడ్ ! ముద్దాయిని ముప్పయ్ రోజులు బెయిల్ మీద విడిపించండి. గడువు లోపల ముద్దాయి తగిన సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయలేకపోతే కోర్టు ఫర్ దర్ గా ప్రొసీడ్ కావచ్చును."
ఇందిర వాదన అందరికీ సమంజసంగానే అనిపించింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేస్తూ వుంటే జడ్జి వారించాడు.
జనంలో గుసగుసలు ప్రారంభం అయ్యాయి. అందరూ జడ్జికేసి కుతూహలంగా చూడసాగారు.
ఇందిర "ఎవరా?" అనే కుతూహలం అందరిలో కలిగింది. ముద్దాయికీ, ఆ యువతికీ ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలనే ఉబలాటం కొందరిలో కలిగింది. వారికి వారే ప్రశ్నలు వేసుకుని, సమాధానాలు చెప్పుకోసాగారు.
జడ్జి ముద్దాయిని ముప్పయ్ రోజులు బెయిల్ మీద రిలీజ్ చేస్తున్నట్టు చెప్పాడు.
జగన్నాథం ఇందిరకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఇద్దరూ రవి కోసం ఎదురుచూస్తూ నిల్చున్నారు.
"థాంక్యూ లాయర్!" అంటూ వచ్చిన రవి పేలవంగా నవ్వాడు.
రవి ఇందిరను జగన్నాధానికి పరిచయం చేశాడు. ఇందిర తన రవిని ప్రేమించిన యువతి అని తెలుసుకున్న జగన్నాధానికి అంత బాధలో కూడా గర్వం కలిగింది.
"రామ్మా! ఇంటికి వెళదాం" అన్నాడు జగన్నాథం.
"సాయంత్రం వస్తాను. ఇంకా ఇంటికి వెళ్ళలేదు. తిన్నగా స్టేషన్ నుంచి కోర్టుకే వచ్చాను. అమ్మకు కన్పించి వస్తాను" అన్నది ఇందిర రవి ముఖంలోకి చూస్తూ.
"అలాగే డ్రాప్ చేస్తా! రా" అన్నాడు రవి కారు దగ్గరకు నడుస్తూ.
ఇందిర వాకిలిముందు కారు దిగి రవినీ, జగన్నాధాన్నీ లోపలకు ఆహ్వానించింది.
"ఇప్పుడు కాదమ్మా! తర్వాత వస్తాం! నువ్వు సాయంత్రం తప్పక వస్తావు కదూ?" అన్నాడు జగన్నాథం.
"అలాగేనండీ! రెండు మూడు గంటల్లో వస్తాను" అంటూ జగన్నాధానికి నమస్కరించింది.
"వస్తాను రవీ!" రవికి చెప్పి లోపలకు వెళ్ళిపోయింది ఇందిర.
అనుకోకుండా వచ్చిన కూతుర్ని చూసి ఆశ్చర్యపోయింది రాధాదేవి.
ఇందిర పరుగెత్తుకు వెళ్ళి తల్లిని కౌగిలించుకుంది.
"ఏమిటమ్మా! ఉత్తరం ముక్కయినా రాయకుండా వచ్చావు? స్టేషనుకి కారు పంపేదాన్నిగా?" అన్నది రాధాదేవి కూతురి తల ఆప్యాయంగా నిమురుతూ.
"నేను ఒక అర్జెంటు కేసుమీద వచ్చాను. ఇది నా మొదటి కేసు. నన్ను దీవించమ్మా!" ఆమె తల్లి పాదాలకు నమస్కరించింది.
