"అవతల నాకు వంటపనుంది_ దోసిలి తొందరగా పట్టు నీళ్ళు పోస్తాను..." కొంత విసుగు కనిపించింది ఇల్లాలి ముఖ కవళికలలో.
"చాలా సంతోషం తల్లీ! నీళ్ళు అవసరం లేదు, దాహం తీరిపోయిందమ్మా... నువ్వు నీ వంటపని చూసుకో తల్లీ..." అంటూ వెనుదిరిగాడు.
విషణ్ణ వదనంతో విపరీతమైన కంపనతో ముందుకు కదిలాడు.
"పైసాకు పనికిరాని అడుక్కుతినే వెధవక్కూడా ఆత్మాభిమానం! నీళ్ళు దోసిట్లో పోస్తాననటం తప్పా? అతను ఎవరో తెలియకుండా చేతికి చెంబు ఎలా ఇస్తాం?..." ఇంట్లోకి వెళ్ళి భర్తకి చెప్పుకుంది ఆ మహా ఇల్లాలు.
తన భార్యను ముసలివాడు నీళ్ళు తెమ్మని అవమానపరచాడన్నా భావంతో, షర్టు వేసుకొని రుసరుస బయటకు వచ్చాడు ఇంటి యజమాని.
"ఎవడవురా నువ్వు! నీళ్ళు అడిగి మళ్ళీ అక్కరలేదని వెళుతున్నావా?... పగలు కూపీతీసి రాత్రుళ్ళు దొంగతనం చేసే ముఠావాడివా?..." వెనుక నుంచి వినవస్తున్న కేకలకు భరత్ భూషణ్ ఆగాడు.
అప్పటికే ఇంటియజమాని కేకలకు చుట్టుపక్కల జనం మూగారు. విషయం వివరంగా చెప్పాడతను.
భరత్ భూషణ్ ని ఎవరూ ఏమీ అడగలేదు. అతను నేరస్థుడని నిర్ధారణకు వచ్చినట్లు నలుగురు కలసి అతని భుజముపై తువ్వాలతోనే పెడరెక్కలు విరచి కట్టి రిక్షాలో ఎక్కించి దగ్గరలో వున్న పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్ళారు.
సెంట్రి కానిస్టేబుల్ కు విషయం చెప్పి ముద్దాయిని అప్పగించి సాయంత్రం ఎస్.ఐ. వచ్చిన తరువాత మరలవచ్చి వివరంగా రిపోర్టు రాసి ఇస్తామని చెప్పి వెళ్ళిపోయారు.
నేరస్థుడిని పారిపోకుండా సెల్ లో వేశాడు సెంట్రీ.
చండప్రచండుడయ్యాడు మార్తాండుడు.
భరత్ భూషణ్ కు సెల్. మరల సెల్!
స్వాతంత్ర్య సమర యోధునికి అద్భుతమైన సత్కారం.
అలనాడు పరాయి పాలకులు తనని విప్లవ రచయితగా ముద్రించి, శిరచ్చేదం లేదా దేశబహిష్కరణ శిక్ష విధించినప్పుడు కాని, తరువాత కక్ష కొద్దీ అనేక సంవత్సరాలు తనను కటకటాల వెనుక వుంచినప్పుడుగాని ఇంతగా బాధపడలేదు అతను.
దేశ స్వాతంత్ర్య సమర మహాయజ్ఞంలో తనూ ఒక సమిధనయ్యాననే ఆత్మతృప్తి ఆరోజులలో తనకు మిగిలింది.
ఈనాడు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లు గడచినా, సమాజంలో అంటరానితనం ఇంకా వున్నదంటే...
ఈ మనుషుల మనస్తత్వాలలో మార్పు రావలెనంటే ఇంకెందరు మహానుభావులు పుట్టాలో, ఇంకెన్ని ఉద్యమాలు చేపట్టాలో!
అంటరానితనాన్ని నిరశించినందున తనకు ఈ రోజున ఇంత చక్కని సన్మానమా?-
అతని మనసు మూగగా రోదించింది.
సాయంత్రం స్టేషన్ కు ఎస్.ఐ. వచ్చాడు. సెల్ నుంచి ముద్దాయిని బయటకు తెచ్చి ఎస్.ఐ. ముందు హాజరుపరచి కేసు వివరించాడు సెంట్రీ.
భరత్ మౌనముద్రాంకితుడయ్యాడు. ఆయన గుండెలలసిపోయాయి. పోలీసులకి వివరణ ఇవ్వాలనిపించలేదు.
కాటికి కాళ్ళుచాపుకుని కూర్చున్న బక్కచిక్కిన ముదుసలిని చూసిన ఎస్.ఐ. పేరు వివరాలు రాసుకొని, అంటరానితనాన్ని నిరసిస్తూ అతను నీళ్ళు ముట్టకుండా వెళ్ళిపోయినట్లు నిర్ధారించుకొని అతనిని బయటకు పంపాడు.
బడబాగ్ని జ్వాలల మధ్య జ్వలిస్తున్న వ్యక్తిత్వం, ఆక్రోశిస్తున్న హృదయం__అంతరాత్మలో అంతర్యుద్ధం... ఇది నా దేశమేనా? ఇదేనా స్వతంత్రదేశం? ఇందుకా స్వరాజ్యం ...
* * *
భరత్ భూషణ్ చిన్నతనంలో తను తిరిగిన ప్రదేశాలన్నీ తిరిగాడు. పరిసరాలు పాతవే ప్రజలు మాత్రం కొత్తగా కనిపించారు. వేష-భాషలలో మార్పులు వింతగా కనిపించాయి.
ఒకనాడు పాశ్చాత్య నాగరికతను, సంస్కృతిని నిరశించిన భారతీయుల వేషభాషలలో ఈనాడు తిరిగి ఆ అనుకరణే కనిపిస్తున్నది. స్వాతంత్ర్య సంగ్రామంలో పాశ్చాత్య నాగరికతపై విముఖత చూపిన భారతీయుల వారసులేనా నేటి పౌరులు? విదేశీ వస్తువులు తగులబెట్టి, స్వదేశీ ఉద్యమం చేబట్టినవారి సంతతివారేనా వీరు?
ఏ ఇంత చూచినా ఏ వాడ తిరిగినా పాశ్చాత్య నాగరికతా ప్రభావానికి, వారి విషయ సంస్కృతికి లోనైనట్లు, విదేశీ వస్తువుల పట్ల ప్రజలు ఆకర్షితులైనట్టు ప్రత్యక్షంగా మేడిన్ జపాన్! మేడిన్ చైనా! మేడిన్ జర్మనీ! కనిపిస్తుంటే అతని హృదయం విలవిలలాడింది.
ఎందఱో మహానుభావులు, త్యాగధనుల రక్తతర్పణంతో త్యాగనిరతితో సంపాదించుకున్న దేశ స్వాతంత్ర్యానికి ఈ రోజున విలువ లేకుండా పోయింది. విదేశీ సంస్కృతికి దాసోహమంటున్నది జాతి ...
తిరిగి తన దేశాన్ని విదేశీ శక్తులు పెళ్ళగించుకుపోతున్నాయోమోనన్న భ్రాంతి కలిగింది. ఆ ఆలోచనకే అతని కళ్ళు చమర్చాయి. గుండెలో గునపాలు గుచ్చుకున్నాయి.
మైకులలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతోంది. కుర్రకారు గుంపులు, గుంపులుగా తిరుగుతున్నారు.'
ఓ కుర్రాడిని పిలిచి "జనరల్ ఎలక్షన్స్ కి క్యాన్ వాన్ చేస్తున్నారా?" అని అడిగాడు అతను.
