Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 26


    ఇద్దరికీ సరిగా దిళ్ళు అవీ సర్దాను. మూలుగుతూ, ముక్కుతూ ముసముసలాడుతూ మళ్ళీ నిద్రలోకి జారిపోయారు. లైటు తీసి, తలుపులు వేసి వరండాలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాను. ఆలోచనలు ముసురుతున్నాయి.
    ఈ ముసలాయన అవ్వ ఎవరు? ఏమిటీ జీవితం, అర్థం లేని ప్రశ్నలు. మహామహులు ఎందరో ఇటువంటి ఆలోచనలు చేసి చేసి కాలగర్బంలో కలిసిపోయారు. ఈ సృష్టి రహస్యాలను అర్థంచేసుకోగల స్తోమత మానవుడికి లేదు.
    కొంతదూరం పోగలడు. కొన్ని విషయాలను తేల్చగలడు. ఆ తేల్చినది సమగ్రమయినది కాదు కావటానికి వీలు లేదు.
    ఢిల్లీలో ఫాస్ఫేట్సు ఉన్నాయని థీసిస్ వ్రాసి వొకడు పి.హెచ్.డి. సంపాదిస్తే, అసలు లేనేలేవని వ్రాసి అదే డిగ్రీ సంపాదిస్తాడు మరొకడు. సైన్సు మారేది, సృష్టిధర్మం మారనిది. కాకపోతే అయిదువందల యాభై సంవత్సరాల నాటి కథను నేను యెట్లా చూడగలుగుతున్నాను. ఒకరోజు అలా జరిగితే భ్రాంతి అనుకోవచ్చు. మనో వైకల్యానికి ఒక ఉదాహరణ అనుకోవచ్చు. కాని వరుసగా అదీ కథలో క్రమం తప్పకుండా చూడగలుగుతున్నాను.
    ఒక్కొక్కప్పుడు మన కాన్షస్ ప్రవేశించలేని విషయాలు జబ్ కాన్షస్ లో వుండి ఏమరుపాటున ఉన్నప్పుడు అవి కాన్షస్ లోకి ప్రవహిస్తాయి. లేకపోతే దూకుతాయి. అది కలకాని, ఇది విచిత్రమే!
    ఆలోచిస్తూ వరండా మెట్లు దిగాను. అలవాటు చొప్పున నడిచాను. అయితే స్పృహలో లేను. ఆలోచనలు, అధిమానసికమయిన వొక ఉద్విగ్నత నన్ను ఆవరించి ఉన్నాయి. గుహ ముందుకు చేరాను. పెద్దియజ్వ ఆహ్వానించారు.
    "మహాశయా! ఈ రోజు వొక విషయం తేల్చనిదే నేను గుహలోకి రాను" భీష్మించావా, నటన. పోకుండా ఉండలేను.
    "ఏమిటి నాయనా అది?" తధాగతుడు అనంతుడిని సంబోధించినట్లుగా ఉన్నదా మాట్లాడే పద్ధతి.
    "లాగూ చొక్కాలతో, సిగరెట్లు పీకుతూ ఆశుచినై తిరిగే నన్ను పులితోలు మీద కూర్చోపెడితే పుణ్యమూర్తినై పోతానా? పద్మాసనం వేసినంత మాత్రాన పవిత్రుణ్ని అవుతానా?" నా ప్రశ్న.
    "నాయనా! దేహకార్యానికి అశుచి అనేది నైజం. నీవు దేహధర్మాన్ని అర్థం చేసుకున్నావు. కనుక నీకా నియమాలు లేవు" అంటూ ముందుకు సాగారాయన. "రా!" అంటూ ఆదేశించాడు.
    మళ్ళీ యధావిధి కార్యక్రమం జరిగింది.
    మల్లెపూల వర్షం కురుస్తున్నట్లు, మంచు వానలో తడుస్తున్నట్లు నా చుట్టూ, నామీదా, నా లోపలా అంతా వెలుగు వర్షమే. మణిశిల మామూలుగానే ముల్లోకాలను కప్పివేసింది.
    దారికోసం వెదికాను కావాలని. సంకల్పించాను. దారి దొరికింది. మణిశిలా మధ్యలో విచ్చుకున్న దారిని ఆవల దృశ్యాలు చూడసాగాను ఆసక్తిగా.
    కంచు ఢక్క పగిలిపోయేటప్పుడు ఆ శబ్దం కూడ వినిపిస్తే బాగుండును అనుకుంటూ ఆ దృశ్యాలలో లీనమయ్యాను!

                                                  7

    "మకరధ్వజుని కొంప ఒక చెంప కనుపింప చీరకట్టిన దయా చిగురుబోడి..." శ్రీనాధకవి ఓఢ్రయువతిని వర్ణిస్తూ తాను వ్రాసినప్ పద్యాన్ని మరొక పర్యాయం గుర్తుంచేసుకున్నాడు. కాని అది అశ్లీల సాహిత్యం కాలేడు. కారణ మేమంటే అవి మహాకవి వాక్కులు.
    బోయీలు ముత్యాల పల్లకిని స్వరబద్ధంగా రాగాలు తీస్తూ మోస్తున్నాడు. లోపల శ్రీనాధయ్య సుభాశీనుడై ఉన్నాడు. ఆయన మనసులో పై పద్యంలోని ప్రధమ పాదం పదే పదే చరిత్వ చర్వణ మౌతోంది.
    అప్పటిలో ఆ పద్యాన్ని విని కోమటి దేముడు ఎంత ఆనందించాడు. ఆ తర్వాత రాజుకు సాహిత్య దృష్టి తగ్గిపోయింది. కొండవీటి సామ్రాజ్యంగండ కత్తెరలో పడింది. ఒక చెంప గజపతులు, మరొకవంక ఫిరోజ్ షా, మరొక దిక్కు విజయనగర రాయలు. కొండవీటి రాజ్యాన్ని కబళించాలని తహతాహ లాడుతున్నారు. దేవగిరిని పాలించేసిన వేదగిరి ఎవరెప్పుడు కొండవీటి పైకి దండెత్తి వచ్చినా చేయి అందించుకున్నాడు. శాపగ్రస్తమై ఉన్న కొండవీటి రాజకుటుంబ చరిత్ర ఇంకా ఎక్కువ రోజులు కొనసాగదేమోననిపించింది. మనసు వికలమైంది.
    బోయీలు ముత్యాలశాలముందు (ఈ పేరుగల భవనం ఇప్పటికీ కొండవీటిలో ఉంది __రచయిత) ఆపివేశారు. శ్రేనాధయ్యను కోమటి దేముడు సాదరంగా ఆహ్వానించాడు. లోపల మామిడి సింగన్న, పెద్దియజ్వలు ఆశీనులై ఉన్నారు. శ్రీనాధయ్య పెద్దియజ్వకు నమస్కరించి కూర్చున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS