"ప్రేమట ప్రేమ! నాకు తెలియక అడుగుతానూ - అసలు ఈ ప్రేమ అంటే ఏమిటి?" అంది అరుణ. ముద్దాయిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్లుగా.
ఆమెకు 'ప్రేమ' అనే పదాన్ని ఉచ్చరించడానికే వంటిమీద తేళ్ళూ, జెర్రులూ పాకుతున్నట్లుగా అనిపించింది.
ప్రేమా దోమానూ!
తనని కూడా ఈ 'ప్రేమ' అనే రొంపిలోకి దింపడానికి మహా ఉత్సాహపడిపోయింది ఈ మహాతల్లి కదూ!
"ఇప్పుడు ఈ సీన్ లో ప్రేమ అంటే నీకు పరిహాసంగా అనిపించవచ్చును. సునీతా వాళ్ళది కాఫ్ లవ్. పిల్లాట లాంటిది. తెలిసీ తెలియని వయసు. అంత మాత్రాన ఈ ప్రపంచంలో ప్రేమ అనేది వుండదని అనుకోకు" అంది భావన.
"నా మొహమేమీ కాదూ? ప్రేమ అంటే మోహం. లేదా కామం. అంతే!"
'అట్లా అయితే రోమియో జూలియెట్ - దేవదాసు పార్వతీ - వీళ్ళందరిదీ మోహమూ కామమూ మాత్రమేనా? అమరప్రేమ కాదా?"
"ఒకటి నాటకం. ఒకటి నవల! అటు షేక్ స్పియర్, ఇటు శరత్ బాబూ తీరి కూర్చుని ఆలోచించి అక్షరాలుగా పేర్చిన కథలూ గాథలూనూ! అంతే తప్ప అవి అక్షరసత్యాలు కావు. అక్షరాలు వేరూ! సత్యాలు వేరూ!"
"నీకు అర్థం కానివన్నీ అసత్యాలని కొట్టిపారేయకు!" అంది భావన విసురుగా.
"పోనీ దీనికి జవాబు చెప్పు! ఆ 'ప్రేమ' అనేదేదో తల్లీకూతుళ్ళ మధ్య వుండదా?" అంది అరుణ తల్లి జాహ్నవికి దగ్గరగా జరుగుతూ.
"ఎందుకుండదూ?"
"పేరెంట్సూ, పిల్లల మధ్య ప్రేమ వుంటుంది సరే. ఫ్రెండ్స్ మధ్యన వుండకూడదా?"
"ఉంటుందని నీకు ఒకటో ఎక్కం అంత బాగా తెలుసు" అంది భావన ప్రేమగా అరుణ భుజాలమీద చెయ్యి వేస్తూ.
"ఇక్కడుంటే పిట్టలనీ, పూలనీ, మొక్కలనీ పళ్ళ చెట్లనీ నేను ప్రేమించడం లేదా. అవి కూడా నన్ను ప్రేమిస్తాయనే నా నమ్మకం."
"వెరీ పాజిబుల్!"
"ప్రాణం లేని వాటిమీద కూడా మనకి ప్రేమలాంటివి పుట్టుకు రావచ్చును. ఇదిగో! ఈ కిటికీలో ఉండే ఈ గులకరాయి. చూశావా? తెల్లగా, నున్నగా పక్షిగుడ్డులాగా లేదూ? అది నిజంగా పక్షి గుడ్డేనని ఇంటికి వచ్చిన వాళ్ళందరూ భ్రమపడుతుంటే నేను నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాను. అదంటే నాకెంతో ఇష్టం! ఒక విధంగా చెప్పాలంటే ఈ గులకరాతిని నేను ప్రేమిస్తున్నాను" అంది అరుణ. మాట్లాడకుండా వింటోంది భావన.
అరుణ మళ్ళీ చెప్పింది.
"ఈ గులకరాయి నాకు ప్రాణప్రదమని అన్నంత మాత్రాన నిజంగానే దానికోసం ప్రాణాలు ఇచ్చేస్తానా ఏమిటీ? ఆ మాటకొస్తే, ప్రాణస్నేహితుల కోసమైనా సరే ప్రాణాలు తీసుకునేవాళ్ళుంటారా ఏం?
పేరెంట్స్ కోసం ప్రాణాలిస్తారా? ప్రేమే కానీ ప్రాణాలిచ్చేటంతటి ప్రేమ కాదు. అవునా?"
"టేల్ ఆఫ్ టూ సిటీస్ లో..." అనబోయింది భావన.
"టేల్ - అంటే - కథ అని. టైటిల్ లోనే వుంది గదా! కథలు వద్దు. పేరెంట్స్ కీ పిల్లలకీ, ఫ్రెండ్సు మీద ఒకరికొకరికీ వుండే ప్రేమకంటే గొప్పదా ఆడా మగా మధ్యన పుట్టుకొచ్చే ఈ ఆకర్షణా?"
"నువ్వూ..." అని ఏదో చెప్పబోతున్న భావనని కట్ చేసేస్తూ అంది అరుణ.
"అవును! ఆకర్షణే! దానికే మురిపెంగా 'ప్రేమ' అనే పేరు పెడతాం. ఇంకా నిర్మొహమాటంగా చెప్పాలంటే, అది కేవలం కామం! అంతే! అది ఎంత చీప్ అయినా సరే, ఎంతటి బలంగా వుంటుందంటే చివరికి ప్రాణాలు కూడా ఇచ్చేసేటంత!"
"పవిత్ర ప్రేమ కూడా వుంటుంది అరుణా! ప్లేటోనిక్ లవ్!"
"ఉండవచ్చును. అయితే ఎప్పుడూ ఆపోజిట్ సెక్స్ తోనే! కదా! అమ్మాయి అబ్బాయితో ప్రేమలో పడిపోతుంది మన ఈ సునీతలాగా. నూటికి తొంభై పైచిలుకు కేసుల్లో అబ్బాయి అమ్మాయితో ప్రేమ నటిస్తాడు. ఇదిగో! దీని బాయ్ ఫ్రెండులాగా! ఇక్కడొకటి చెప్పు!"
"ఏమిటి?"
"రేపు ఇది-ఈ సునీత పూర్తిగా ఆల్ రైట్ అయిపోయాక, ఆ బాయ్ ఫ్రెండుగాడు ఉత్త పిరికిపంద అని తెలిసినా, వాడు తప్పు ఒప్పుకుంటే క్షమించేసి మళ్ళీ వాడివెంటే వెళుతుందేమో -కానీ - మాటవరసకి వాడు మొగాడే కాడని తెలిసిందనుకో - అప్పుడు కూడా ఈ పిల్లదానికి వాడిమీద 'ప్రేమ' కంటిన్యూ అవుతుందా?"
"మొగుడికి ఏ ఏక్సిడెంటు వల్లనో, లేదా హెల్త్ ప్రాబ్లెమ్స్ వల్లనో సంసారానికి పనికిరాకుండా పోతే, పెళ్ళాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారా ఏమిటీ?"
అప్పటికి వాళ్ళ మధ్య రిలేషన్ షిప్పు ఈ 'ఆడా మొగా ప్రేమ' అన్న వెగటు స్టేజిని దాటేసి, స్నేహం అనే ఉదాత్త స్థితిని చేరుకుని వుంటుంది. దానికితోడు అవసరాలు. అందుకని ప్రేమ అనే మేలిముసుగుని వేసుకు తిరిగే ఈ చౌకబారు ఆకర్షణ కంటే, స్నేహం వేల వేలరెట్లు బెటరు. ఫ్రెండ్! ప్రేమ అంటే నా దృష్టిలో ఇదిగో గుడ్డు అని భ్రమ కలిగించే ఈ గులకరాయి లాంటిది" అంది అరుణ.
వాదనలో నెగ్గలేకపోతున్నందుకు ఉక్రోషం లాంటిది కలిగి సైలెంటుగా వుండిపోయింది భావన.
అరుణలాగా ఏవేవో పాయింట్సు లాగి వాదించి నెగ్గడం కష్టం - కనీసం అరుణతో!
"కాస్త ఉప్మా అన్నా చేస్తా తిందాం" అని లేచింది భావన.
ఆమె అటు వెళ్ళగానే, చటుక్కున తల్లి జాహ్నవి ఒళ్ళో తలపెట్టి పడుకుంది అరుణ. ఆమె వీపు నిమురుతూ భావన చెప్పేది కూడా పూర్తిగా తప్పు కాదు నాన్నా!" అంది జాహ్నవి.
చివాలున లేచి కూర్చుంది అరుణ.
"నాన్నా? నాన్న అనే మాటే నా దగ్గర ఇంకెప్పుడూ అనకు! నాన్న అనే రెండక్షరాలంటేనే నాకు అసహ్యం! ఆ 'నాన్న' అనేవాడు నీకు చేసిన అన్యాయం చాలదూ? నన్ను కూడా నాన్నా అని పిలుస్తావేం! వెయ్యి జన్మలకి సరిపడా విషం మిగిల్చి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడే! ఇంకా నాన్నట....నాన్న!" అంది అరుణ ఆగ్రహంగా.
"ఎవరి కారణాలు వాళ్ళకి ఉంటాయమ్మా!" అంది జాహ్నవి అనునయంగా.
"మొగాళ్ళందరికీ ఒకే కారణం! ప్రేమ అని ఛీప్ గా పిలుచుకునే ఆకర్షణ! 'నాన్న' కూడా నిన్ను ప్రేమించే పెళ్ళి చేసుకున్నాడు కదా! నన్ను కన్న తర్వాత నీమీద మోజు తగ్గిపోయింది. మరొకటి కనబడింది - మళ్ళీ ప్రేమ పాఠాలు మొదలూ! నీమానాన నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మా నాన్న!" అంది అరుణ.
"నాన్న" అనే పదాన్ని పలుకుతున్నప్పుడు ఆమె గొంతులో చెప్పలేనంత అసహనం ధ్వనించింది.
మారు మాట్లాడకుండా ఉండిపోయింది జాహ్నవి.
అప్పుడు -
డాక్టర్ వెంకయ్య నర్సింగ్ హోంలో నుంచి పెద్దగా ఆండాళ్ళుగారి శోకాలు వినబడ్డాయి.
* * * *
హోటల్ గోరా ముందు తన క్వాలిస్ ఆపి కూర్చుని వున్నాడు దాస్.
హోటల్ గేటులోనుంచి అభిరాం బయటికి రావడం కనబడగానే చటుక్కున కిందికి దిగి ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ నిలబడ్డాడు.
అతన్ని అనుగ్రహిస్తున్నట్లుగా తలపంకించాడు అభిరాం.
"లోపలికి వెళ్ళి కూర్చుందామా!" అన్నాడు అభిరాం.
దాస్ మొహం వికసించింది.
తను ఒక్కడే వెళితే 'హోటల్ గోరా'లోకి అడుగుపెట్టనివ్వరు. అది కేవలం తెల్లతోలు వాళ్ళకే.
ఈ అభిరాం తనని తీసుకెళ్తానంటున్నాడు.
అదృష్టం!
ఏది నిషిద్ధమయితే ఇంక అదే మహా గ్లామర్ గా కనబడుతుంది కదా!
"కమ్" అని లోపలికి దారితీశాడు అభిరాం.
వాళ్ళు గేటు దగ్గరికి వెళ్ళీ వెళ్ళగానే హోటల్ లోపల నుంచి ఒక కుక్క కాలబైరవుడిలా ఉరుకుతూ వచ్చి దాస్ మీదికి దూకి పళ్ళతో ప్యాంటుని పట్టేసుకుంది. ఆ కుక్క మెడలో వేళ్ళాడుతోంది 'ఇండియన్ డాగ్' అని ఎంతో అవమానకరంగా రాసిపెట్టి వున్న అట్ట ముక్క!
కుక్క వెనకే పరిగెత్తుకు వచ్చిన జానీ దానినుద్దేశించి "డౌన్ బాయ్! డౌన్ బాయ్! అని అరిచాడు. అది కరిచే లోపలే.
భుజాలు చరిచి నవ్వాడు అభిరాం.
"సారీ మేట్! ఒక ఇండియన్ ఈ హోటల్లో అడుగుపెట్టడం ఈ ఇండియన్ డాగ్ కి కూడా ఇష్టం లేనట్లుంది. గొప్ప విదేశ భక్తురాలు!" అన్నాడు ఎగతాళిగా.
దాస్ ఒళ్ళంతా కదలిపోయేలా నవ్వాడు.
"అంతే సారూ! అంతే!" అన్నాడు.
అంతే!
అంతే తప్ప అదేమీ చిన్నతనం అనిపించలేదు అతనికి. పెద్దలతో పరిచయాలు పెరిగి తనూ మరింత పెద్దవాడయి పోతున్నప్పుడు ఈ చిన్నచిన్న విషయాలని పట్టించుకుని చిన్నతనం ఫీలవ్వడం ఎందుకూ?
"మేట్! మనం మా షిప్పుకి వెళ్ళి మాట్లాడుకుందాం. నీక్వాలిస్ ఇక్కడ వుంచు. మనం నా బైక్ మీద వెళదాం అన్నాడు అభిరాం.
బ్రహ్మానంద భరితుడయిపోయాడు దాస్.
'బాప్ రే! ఇవాళ తను నక్కని తొక్కివచ్చినట్లున్నాడు! లేకపోతే 'ఈస్టిండియా' అనే ఆ షిప్పులోకి వెళ్ళగలగడమే!
అది ఇంటర్నేషనల్ డాన్ లకీ, టెర్రరిస్టులకీ మీటింగ్ పాయింటు!
ఈ అభిరాం పెద్ద సముద్రపు దొంగ అని కూడా తనకి తెలుసు.
అతను ఒకప్పుడు మర్యాదస్తుడే అయిన మామూలు కెప్టెనట. ఇంతకాలంగా అతను నడిపిన షిప్పులేవీ దారితప్పలేదు గానీ కొంతకాలంగా అతను దారితప్పాడు. లాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతే లైసెన్స్ కేన్సిల్ అయిపోయింది.
