ఏసీ వుంది .
"ఆ అమ్మాయిని అక్కడ పడుకోబెట్టండి " అన్నాడు డాక్టరూ , ప్రొడ్యూసర్ కూడా అయిన బాబూ సేట్.
సృష్టిని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టాడు రాజు. సరిగా ఒక వైపుకి పడుకోలేక సతమతమాయిపోతూ అటూ ఇటూ పోర్లుతోంది సృష్టి.
సృష్టి చేయి పట్టుకుని నాడి చూశాడు బాబూ సేట్.
"ఏమయింది ?" అన్నాడు రాజు కంగారుగా.
ఏమీ మాట్లాడలేదు బాబూ సేట్ . సృష్టి పొట్ట మీద నొక్కి చూశాడు. ఒక్కక్షణం సేపు ఆలోచించాడు.
"ప్లీజ్ చెప్పండి ! ఏమయింది ?" అన్నాడు రాజు.
"అబ్బే! ఏం లేదు! మెంటల్ టెన్షన్ ఫిజికల్ స్ట్రెయిన్ తాలుకూ ఎఫెక్టు అయి వుండాలి. ఒక్క అరగంట రెస్టు తీసుకుంటే అంతా సెటిలయిపోతుంది. " అని బాబూ సేట్ చెబుతాడేమో అని మనసులోనే ఎంతగానో కోరుకుంటున్న రాజుకి తీవ్రమైన ఆశాభంగం కలిగేలాగా.
"సీరియస్ కేసే!" అన్నాడు డాక్టరూ ప్రొడ్యూసర్ కూడా అయిన బాబూ సేట్. అంటూనే, అతను టెంటులో ఒక పక్కగా పెట్టి ఉన్న తన భారీ సూట్ కేస్ వైపు నడిచాడు. అందులో ఒక చిన్న ప్లాస్టిక్ బాక్సు ఉంది. అందులో కొన్ని టాబ్లెట్ల స్త్రిప్టూ , కొన్ని మందుల సీసాలూ, కొన్ని ఇంజక్షను వియల్పు కొన్ని డిస్పోజాబుల్ సిరెంజిలు వున్నాయి. బ్లడ్ ప్రెజర్ చెక్ చేసే ఆపరేటస్ కూడా వుంది.
"ప్లీజ్! త్వరగా ......" అన్నాడు రాజు.
అదోలా నవ్వాడు బాబూ సేట్. "అంత తొందరయితే ఎలా? మీరు ఇంకా అగ్రిమెంటు సంతకం పెట్టందే!" అని తన బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి, అందులో నుంచి ఒక స్టాంప్ డ్ పేపర్ తీశాడు.
"మీ పూర్తీ పేరేమిటి?" అని అడిగాడు రాజుని.
చెప్పాడు రాజు.
"వయసు ?"
చెప్పాడు.
"అడ్రసు ?"
బాధతో మూలుగుతోంది సృష్టి.
చటుక్కున బాబూ సేట్ చేతుల్లోని పేపర్లు లాక్కున్నాడు రాజు.
బ్లాంక్ పేపర్ల మీదే సంతకాలు పెట్టేశాడు.
"మీ ఇష్టం వచ్చిన కండిషన్లు రాసుకోండి. కానీ ప్లీజ్ ప్లీజ్ ....ఈ అమ్మాయిని సేవ్ చేయండి " అన్నాడు.
అంత బాధలోనూ అతని వైపు కృతజ్ఞతా పూర్వకంగా చూసింది సృష్టి.
నవ్వి, పేపర్లు బ్రీఫ్ కేసులో పెట్టేసుకున్నాడు బాబూ సేట్. తర్వాత సృష్టికి ఒక ఇంజక్షన్ ఇచ్చాడు.
ఇంజక్షన్ ప్రభావం కావచ్చును, లేదా బాబూ సేట్ హస్తవాసికావచ్చును సృష్టి మూలుగు తగ్గింది. నిశ్చలంగా రాజు వైపే చూస్తూ పడుకుంది.
ప్రొడక్షన్ మేనేజర్ ని పిలిచాడు ప్రొడ్యూసర్ బాబూ సేట్.
"ఆ కొత్త కుర్రాణ్ణి పంపించేశారా?" అన్నాడు.
"గజ్జికుక్కని తరిమేసినట్లు తరిమేశాం" అన్నాడు ప్రొడక్షన్ మేనేజర్ , గొప్ప ఘనకార్యం చేసినట్లుగా.
"శని వదిలింది -- ఇదిగో ఇతను రాజు.
ఇతనికి మేకప్ చేసి షూటింగ్ మొదలెట్టండి. డైరెక్టరు ఎక్కడ చచ్చాడు ?"
"కొండ మీద లొకేషన్ చూడ్డ్డానికి వెళ్ళారండి ."
"ఇతనికి ముందు మేకప్ వేయించు"
నెమ్మదిగా అన్నాడు రాజు.
"ఆ అమ్మాయి -- సృష్టి అల్ రైట్ అయ్యాక ...."
"షూటింగు దారి షూటింగుదే-- ట్రీట్ మెంటు దారి ట్రీట్ మెంటుదే -- దానికీ దీనికీ సాపత్యమేమిటి? ట్రీట్ మెంట్ కోసం షూటింగు ఆపుకుంటే నేను అడ్డం పడాలి. ఆవుడ్దోరంటే మజాకానా- మీటరు తిరిగిపోతూ వుంటుంది. వెళ్ళండి " అన్నాడు తొందర చేస్తూ.
సృష్టి పడుకుని ఉన్న టెంటు వైపు ఒకసారి నిస్సహాయంగా చూసి, తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ వెంట నడిచాడు రాజు.
వాళ్ళు కనుమరుగయ్యేదాకా చూసి, ఆ తర్వాత టెంటు లోకి నడిచాడు ప్రొడ్యూసరు బాబూ సేట్.
చలనం లేకుండా పడుకుని ఉంది సృష్టి.
"అద్భుతమైన ఫిగరు. అతిలోకసుందరి " అనుకున్నాడు ప్రొడ్యూసరు బాబూసేట్. సాలోచనగా కొద్దిసేపు ఆమె వైపు చూస్తూ ఉండిపోయి, తర్వాత ఏదో తట్టినట్లుగా వీడియో కెమెరా తీశాడు.
ఒంటిమీద తెలివి లేనట్లు నిస్సహాయంగా పడుకుని వుంది సృష్టి.
సూర్యుడు కూడా చూడని ఆమె వంటి ఒంపు సొంపులూ , అందాలని వీడియో కెమెరా రికార్డు చేయడం మొదలెట్టింది.
ఎన్ని కోణాల నుంచి సృష్టి అందాలని కెమెరాలో పట్టేయడానికి వీలవుతుందో అన్ని కోణాల నుంచి షూట్ చేస్తున్నాడు బాబూ సేట్.
ఆ అగ్రిమెంటుతో , ఈ కేసెట్ తో వీళ్ళిద్దరినీ పర్మనెంటుగా తన గ్రిప్పులో వుంచకోవచ్చును. తెలివంటే తనదీ.
* * *
"మా ప్రొడ్యూసరు బాబూ సేట్ గారిది భలే బుర్ర లెండి. తలలు మార్చి తలలు పెట్టగలడు " అన్నాడు ప్రొడక్షన్ మేనేజరు మణీందర్. అతన్ని అందరూ 'మనీ' అని పిలుస్తుంటారు.
"ఎంత తెలివైన వాడు కాకపోతే మహామహా వాళ్ళందరూ వెర్రి మొహాలు వేసుకుచూస్తుండగా తను మాత్రం గౌరవ డాక్టరేటు సాధించుకోగలడు?" అన్నాడు మనీ.
ఉలిక్కిపడ్డాడు రాజు.
గౌరవడాక్టరేటా?" అన్నాడు.
"అవును -- ఎప్పుడూ స్కూలు మొహం చూడని వాడు ఇవాళ డాక్టర్ బాబూ సేట్- అవార్డులు కొనుక్కున్నట్లే గౌరవ డాక్టరేట్ కూడా కొనుక్కొన్నాడు " అన్నాడు మనీ, మెచ్చుకోలుగా.
"అయితే అయన నిజం డాక్టరు కాడా?" అన్నాడు రాజు.
నవ్వాడు మనీ.
"బాబూ సేట్ గనక నిజం డాక్టరు అయితే , నేను దేవానంద్ అయినట్టు లెక్క !"
"మరి .....మరి .....అతని దగ్గర వున్న మందులు ?"
అదోలా నవ్వాడు మనీ.
"అవి ఆరోగ్యాన్ని బాగుచేసే మందులు కావు. వళ్ళు గుల్ల చేసే వ్యసనాలు. స్లీపింగ్ పిల్సూ, పెధడిన్ ఇంజక్షనులూ."
