Previous Page Next Page 
మ్యూజింగ్స్ -2 పేజి 26


    మనిషి అనుభవించగా మిగిలిపోయిన బాధ - ద్వేషం, జాలి, ఉత్సాహం, ప్రేమ ఇవీ కళాసృష్టికి మూలం. అందమైన స్త్రీని చూసి కలిగిన మనోసంచలనాన్ని ఒకడు బూతులతో, ఒకడు శాశ్వతమైన కవిత్వంలో, శిల్పంలో, ఇంకొకడు ఆమెను రాత్రికి కలుసుకునే ప్రయత్నంలో తీర్చుకుంటారు. కాని చాలామందికి సంచలనమే లేదు. సౌందర్యం చూసినప్పుడు. కవి సౌందర్యానికి ప్రతి ఫలంగా ప్రతిఫలించే కళని సృష్టిస్తాడు. సృష్టి సౌందర్యాన్ని వ్యాఖ్యానం చేసి చూపుతాడు ప్రజల మంద దృష్టికి.
    ఒకవిధంగా అన్ని వుత్సాహాలూ అంతే.
    ఎదన్నా కొత్త వుత్సాహం shallow youths లోను లేని యువకుల్ని ప్రోత్సహించినప్పుడు, వాళ్ళు దాన్ని భారించుకో లేక, పైకి పొంగి, తల తిరిగి లోకం మీద పడతారు. తీగ విద్యుశ్చక్తిని ఇముడ్చుకోలేనప్పుడే పైకి వెలుగు కనిపిస్తుంది. వెలుగు కనిపించకపోయినా, లోపలి శక్తిని గుర్తించడం చాలా కొద్ది మందికే చేతనవుతుంది. అందువల్లనే మహారుషుల్ని సోమరిపోతులనుకుంతారేమో ప్రజలు!
    సోషలిస్టు అని పేరు పెట్టుకున్నంతమాత్రాన, ఆ పేరు వల్లనే తక్కినవాళ్ల కన్న అధికులైపోయినట్టు feel అవుతారు, మాట్లాడతారు. కాని అంత మాత్రం, అనవసరమైన పొంగూ, అన్యాయమైన ఆత్మవిశ్వాసం, లేంది ఏ పనీ చెయ్యలేడు మానవుడు. బ్రహ్మసమాజంలో చేరినప్పుడు అట్లానే అనిపించేది.
    "ఈన్ స్టీన్! ఏం గొప్ప! బ్రహ్మోకాడుగా!"
    "టాగూరా! పూర్తిగా కాదుగా!'
    హిమాలయాలా , ఆకాశమా , పుష్పాలా! ఏ సమాజంలోనూ చేరలేదు అవి. ఏం గొప్ప నాకన్న అనిపించేది.
    నన్ను చూడవొచ్చినమిత్రులు.
    "కే.సి.డే . రికార్దు హోటళ్ళలో పెట్టడం తప్పు అన్నారటగా! మీరూ?"
    అని అడిగారు , నేను వ్రాసేవి నాకు జ్ఞాపకం వుంటాయనుకొని ఆలోచిస్తున్నాను, జ్ఞాపకం తెచ్చుకోడానికి.
    కే.సి.డే అంటే మండిపడే రసికులైన మిత్రులు జ్ఞాపకం వొచ్చారు.
    "సామాన్యజనం వినకూడదనా?" అన్నారు.
    నేను అలోచించి వ్రాసినది అర్ధం కాకపొతే, నేను ఆలోచించకుండా చప్పున చెప్పే సంజాయిషీ అర్ధమవుతుందా?
    ఎక్కడ నా అనుభవం, నా ఆలోచన పద్దతి, చదివే ప్రజలకి అర్ధం కాకపోతుందోనని, చెప్పే విధంలో సొగసుల్ని , బింకాల్ని,  బిగింపులని, శైలి నడకల్ని, కళని,చేతులారా , ధ్వంసం చేసి, నా thought ని dilute చేసే నా ప్రయత్నం , నా బాధ , నాకు జ్ఞాపకం వొచ్చాయి.
    "ఇంకా అర్ధం కాలేదా? లేక అర్ధం చేసుకోడం ఇష్టం లేదా? తాము దేన్నీ నమ్మడం తమకి ఉపయోగమో, తమకి ఘనత నిస్తుందో దానికి విరుద్దమైన దాన్ని సహించడం ఎంత కష్టం!
    కే.సి.డే పాటల్ని హోటళ్ళలో వినిపించడంలో విక్రుతిం కనపడకపొతే, మీకు కే.సి.డే ని వినే అర్హత లేదు. లేక కే.సి.డే కి మిమ్మల్ని మెప్పించే అర్హత లేదు. కళ అందరి సొమ్ము నిజం. కాని కళని అనుభవించగల అర్హత కొద్ది మందికే వుంది. అందరికీ వుండాలి ఆ అర్హత. లేదు మరి. నాకు paintings అనుభవించగల అర్హత లేదు. గొప్ప చిత్రాలు తగలపడుతున్నా నేను నొచ్చుకొను. కాని చిత్రకారుడు కుమిలిపోతాడు.
    మనకి అర్ధం కాని సౌందర్యాన్ని, చీల్చి , దుమ్ములో చల్లి ఇంతకన్న ఏమీ లేదని చప్పరించి, సంతుష్టిపడతారు. నువ్వు కళ'లో లీనం కావాలి. కళ నీలో లీనం కాదు. స్త్రీ సౌందర్యాన్ని పూజించడం చేతకానన్నాళ్ళు స్త్రీని ఎన్ని విధాల వుపయోగించుకున్నా, ఆమె నీదవుతుంది. కాని ఆమె సౌజన్యం నీకు చిక్కుతుందా? మల్లెపువ్వుల్ని నలిపి, చంటి పిల్లను గిల్లి, అడ ఆమెని అదిమి, ఆకాశం కనపడకుండా కిటికీ మూసి, జయించానని కులికే శునకత్వం పోనన్నాళ్ళు ఇంతే.
    అయినా యీ కళ జోలి నీ కెందుకు? వోద్దన్నా జీవితం మీద సృష్టి సౌందర్యాన్ని గుమ్మరిస్తున్నన్నాళ్ళు ఇంతేలే. తిను. అందరికీ తిండి పెట్టు.....కాని తిండి కన్న ముందు .....తిండిని జయించి ..... ఆకాశపు నీలమూ ......గాలిలో చల్లదనమూ..... నీళ్ళలో మెత్తదనమూ .....కాంతిలో ఉజ్వలత్వము ..... ఇవి వున్నాయి. ఇవే లేకపోతె .......ఉదయానే దళ్లా మీద పువ్వులు నవ్వకపోతే, ముంగిట్లో పిల్ల గంతులేయ్యకపొతే, చూర్లలో పిచ్చికలు అరవకపొతే, శీతాకొకచిలకలు ఆకులో ఎగరకపొతే , స్త్రీ కులకకపొతే నీ కళ్ళ ముందు .......తిండి తిని.....తరవాత.....ఎందుకు బతికి? జొన్నలూ, వోడ్లూ, అందాల్ని వేదచల్లె పొలాల నించి పండుతున్నాయి. నువ్వు పుట్టగానే , అనవసరంగా , నీ తల్లి గర్భంలోంచి గొప్ప ప్రేమోద్రేకం కలగకపోతే, ఆమె స్తనంలో పాలు నీ నోట్లోకి వొచ్చేవా? గడ్డిదూడను ముందు పెడితే గాని, గేదె పాలివ్వదే?
    సౌందర్యం, సుహృద్భావం, ప్రేమ , ఆనందం, కళ, వీటిని వొదిలి, ఏ ప్రయత్నం చేసినా, ఎంత ఉత్సాహం ఉదృతం చూపినా ఎంత త్యాగం చేసినా వృధా.
    ఎంతదూరం, వెల్లినా, ఏమి దొరకక, పరుగు వేడి తప్ప ఏమీ పొందేది లేక, వెనక్కి తిరగవలసిందే!
    ఏ ప్రోత్సాహాలు మృగాల్ని మనుషులు గాను, మనుషుల్ని నాగరికతలోకి, evclve ఎవాల్యు చేశాయో, వాటిని వొదిలేస్తే ........
    అందుకనే వెనక్కి పోతాం. కృతయిగంలో ధర్మం, అపక్వాహారం, రుష్యాశ్రమాలూ, బట్టలు వోడుక్కోడం, గడ్డాలు పెంచడం ఇవన్నీ వెర్రి కలలనిపిస్తుంది.
    కే.సి.డే ప్రతివారి హక్కు. ప్రతివారూ వినాలి. అని గోలపడే వారు , ప్రజల కోసం ప్రయత్నించేవారు.... ప్రజలకి భోజనమే కాదు, కళ'నీ, జ్ఞానాన్ని , పంచి పెట్టాలని , పెనుగులాడేవారు.....ఏం చేస్తున్నారు....వాళ్ల బాధల్ని తీసేసేందుకు.....?
    "దరిద్రం, అధికారగర్వం, యీ సంఘక్రూరత్వం, ఆకలి, స్త్రీల సుకుమారత్వం, పిల్లల అసహాయత్వం ...."
    "ఈ ధనసమస్య పరిష్కారమయిందా...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS