Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 27

 

                    పండిత - కవి - ప్రశంసా స్తబకము
                                   సంస్కృత కవులు                   
                                        బిల్హణుఁడు

    ఈతఁడు కాశ్మీర దేశమువాఁడు . ఆంధ్రదేశమున క్రీ|| పదవ శతాబ్ది నాఁట చాళుక్య రాజగు సోమేశ్వరుని యస్థానమునఁ బెక్కేండ్లు కవీశ్వరుఁడుగా నుండి యా రాజు చరిత్రమునే విక్రమాంక దేవచరిత్ర మను పేరఁ బ్రశస్త కావ్యముగా రచించినాఁడు . ఏదో కోపమువచ్చి తుదకు విక్రమాంక దేవుఁ డితని సర్వస్వమును హరించి దేశము నుండి వెడలఁ గొట్టఁగాఁ జెప్పిన శ్లోకము:--

    శ్లో||    సర్వస్వం గృహవర్తి కుంతలపతి ర్గ్రృహ్ణాతు తన్మే పున
        ర్భాండాగార మఖండ మేవ హృదయే జాగర్తి సారస్వతమ్
        రే! క్షుద్రా|| త్వజత ప్రమోద మధునా ప్యాయంతి మన్మందిరం
        హేలాందోళిత కర్ణతాళకరటి స్కంధాదిరూడా! శ్రియ!    239
        
    తొలుత రాజాస్థానమునఁ బ్రవేశము కలుగకపోఁగా నందుకై పండితుల వెంట రాజద్వారాశ్రయము జరుపునాళ్ళ'లో నాతఁడు చెప్పికొన్నది.

    శ్లో||    రాజద్వారే స్మరాగారే విశంతి ప్రవిశంతి చ
        దండవ త్పండితా స్సర్వే బిల్హణో వృషణాయతే    240

                  అతని వైదుష్యదర్పము :-
    
    శ్లో||    బిందు ద్వంద్వతరంగితా గ్రసరణి ! కర్తా శిరోబిందుకం
        కర్మేతి క్రమశిక్షితాస్వయకలా యే కేపి తేభ్యోంజలి!
        యే తు గ్రస్థసహస్రశాణ కషణ త్రుట్యత్కలంకై ర్గిరా
        ముల్లా సై! కవయంతి బిల్హణకవి స్తేష్వేవ సన్నహ్యతి.    241

    రాజద్వారము నాశ్రయించి చెడిన బిల్హణాదులఁ గూర్చి యెవరో చెప్పున శ్లోకము:--

    శ్లో||    జీవన్నేవ పిశాచతా ముపగతః ఖ్యాతః కవి ర్బిల్హణ!
        చందోగోయ మితి ప్రభాకరగురు ర్దేశా త్సముత్సరితః
         మాతంగత్వ ముపేయివా వరరుచిః ప్రఖ్యాత నామాపిస
        రాజద్వార ముపాశ్రీతైః ఖలు జనైః కిం కిం స సంభావ్యతే||    242


                                         పెద్ది భట్టు

    ఈతఁ డు వెలుగోటి సింగ భూపాలుని నాఁటి వాఁడు. మాలినాధుని పేర నీతఁడే గ్రంధములు రచించేనని ప్రతీతి. అందు కీ యైతిహ్య మున్నది . మల్లి'నాధుఁడును పెద్ది భట్టు నన్నదమ్ములు. మల్లినాదుఁడు మందబుద్ది గలవాఁడు. పెద్దిభట్టు పెద్దబుద్ది గలవాఁడు. వీరు నివసించు గ్రామము చేరువ నడవిలో  నొక యోగీశ్వరుఁడు తపస్సు చేసికొనుచుండెను. మందబుద్ది యగు మల్లినాధుఁడు తత్పరతతో నాయోగీశ్వరుని శుశ్రూషించుచుండెను. పెద్దిభట్టును సకృత్తుగా సందర్శించుచుండెడివాఁడు. మల్లినాధుఁద డొకప్పుడు కార్యవశమున గ్రామంతరమున కరిగెను. అన్నగారిచే నాజ్ఞప్తుఁడై యప్పుడు పెద్ది భట్టాయోగి నారాధించుచుండెను. అది యా యోగికి నిర్యాణకాల మయ్యెను. మల్లినాదుఁడు దగ్గఱ లేఁడయ్యెను. తన కిన్ని నాళ్లు చేసిన శుశ్రూషకై యా యోగి మల్లినాధునాకు సారస్వతము నుపదేశించి యుద్దరింపఁ దలచెను. కాని యట్లు తాటస్తింపదయ్యేను. అప్పుడు సేవించుచుఁ జెంతనున్న పెద్దిభట్టును జూచి మీయన్న కుఁజేయఁదలంచుకొన్న యుపదేశము నాతని యసన్నిధీ చే నీకుఁ జేయుచున్నాను. దీని ఫలము మీ యన్నగారికే చెందఁజేయుదువు గాక యని యొక మంత్రముపదేశించి యా యోగి సిద్ది పొందెను. పెద్ది భట్టంతలో మహోపాధ్యాయుఁ డయ్యెను. గుర్వాజ్ఞ చొప్పున నాతఁడు తాను రచించిన గ్రంధముల నన్నింటిని నన్నగారగు మల్లినాధుని పేరనే ప్రకటించెను.


                                మల్లినాధుని వైదుష్యము

    గ్రంధములందు మల్లినాధుఁడని పేరున్నది. కావున నా పేరే పేర్కొని యెదను. ఈయన స్వతంత్ర గ్రంధము లంతగా రచించినట్టు కానరాదు. హెచ్చుగా వ్యాఖ్యాన గ్రంధములే యగపడుచున్నవి. రఘువంశ కుమారసంభవ మేఘసందేశ కిరాతార్జునీయ శిశుపాలవధములకుఁ బంచకావ్యములన్న పేరు కల్గుటయును , సంస్కృత భాష నభ్యసించు విద్యార్ధులీ గ్రంధములనే ప్రధానముగా నారంభించి చదువుటయును, సుగమములైన మల్లినాద వ్యాఖ్యలు వెలసిన తర్వాతనే యేర్పడిన దని కొందఱు తలంచుట కలదు. కాని తార్కిక రక్షటికలో మల్లినాధుఁడే "స్పుటీకృతం చైత దస్మాభిః పంచ కావ్యటీకాసు " అనుట వలన నాయననాఁటికే యా గ్రంధములకుఁ బంచకావ్యసంజ్ఞ కలదని యేర్పడుచున్నది. ప్రధానముగా విద్యార్ధు లా గ్రంధములనే చదువుటకుఁ గారణము మల్లినాధ వ్యాఖ్యలు కావచ్చును. రఘు వంశాది కావ్యములకు మల్లినాధునకుఁ బూర్వకాలమందే పదుల కొలఁది వ్యాఖ్య లున్నవి. కాని ఈయాన వ్యాఖ్యలు వెలసిన తర్వాత వానికిఁ బ్రచారము తగ్గినది. ముద్రణాది సౌకర్యము లేని యాకాలముననే మన మల్లినాథుని గ్రంధము లా సేతుశీతాచలము వ్యాపించినవి. ఇట్టి వ్యాప్తికి వాని ఘనతయే కారణము.

    మల్లినాథుఁడు రచియించిన గ్రంధము లివి తెలియవచ్చుచున్నవి. రఘు వంశ, కుమారసంభవ , మేఘసందేశ, కీరతార్జునీయ,  శిశుపాలవధములను పంచ కావ్యములకు వ్యాఖ్యలు; నైషదవ్యాఖ్య , భట్టి కావ్యవ్యాఖ్య, ఏకావళి వ్యాఖ్య, తంత్రవార్తి కటీక, స్వరమంజరీవ్యాఖ్య (పరిమళము) , తార్కికరక్షటీక, జ్యౌతిష గ్రంధము . రఘువీర చరిత్రము -- ఇది మల్లినాధకృతి యగునో కాదో!

    పెద్ది భట్టు సింగభూపతి కాలమున నున్న వాఁడనుటకు సాధకముగా నీ క్రింది శ్లోకము దొరికినది. తర్వాత దీనిని చమత్కార చంద్రికలో చూచితిని.

            శ్లో||    కిం వాససా చీకిరిబాకిరేణ కిం దారుణా వంకరటింకరేణ
    శ్రీసింగభూపాల విలోకనార్ధం వైదుష్య మేకం విదుషాం సహాయమ్.    243
    
    పెద్దిభట్టోక నాఁడు చీఁకిరి చినుఁగుల ప్రాఁత కట్టుకొని, వంకర టింకర కఱ్ఱ చేతఁ బట్టుకొని సింగభూపతి విద్యత్సభకుఁ బోవుచుండఁ ద్రోవలో నెవరో యడిగిరఁట. "తాతగారూ! రాజసభ కిట్టి వేషముతో ఁబోవుచున్నారే" మని. అప్పుడాయన పై శ్లోకము చెప్పేనట!

    రెండవయర్ధము:-    పల్లకీ లేకపోయిన నేమి యని; పల్లకీకి చీకిరి బాకిరి కుచ్చులు, వంకర టింకర బొంగు ఉండును. మఱియుఁ బెద్దిభట్టు గణాదినప్రసాదము గలవాఁడని చంపూరామాయణవ్యాఖ్యాది శ్లోకములం దున్నది. రఘువంశాది వ్యాఖ్యలందుఁ బ్రధానముగాఁ జేసిన గణపతి స్త్రుతి శ్లోకము లున్నవి.

    పెద్దిభట్టు పేర నీ క్రింది కధలను గొందఱు చెప్పుచున్నారు. "పెద్దిభట్టు తోడల్లుఁడు ఘనాంతము వేదవిద్య నేర్చినవాఁడు. మంచి కండపుష్టి కలవాఁడు. పెద్దిభట్టు మంచి సంస్కృత సాహిత్యము, శాస్త్రపాండిత్యముఁ గలవాఁడు గదా! పెద్దయల్లుఁడగు నా వేదముగ్ధుఁడును , చిన్న యల్లుఁడగు నీ శాస్త్రచతురుఁడును నత్తవారింటి కేక కాలమున నొకప్పుడేతెంచిరి. అత్తమామ లా పెద్ద యల్లు నలక్ష్యముతో సగౌరముతోనూ, నీ పిన్న యల్లుని మన్నన మర్యాదల తోను జూడసాగిరి. అతని వేదవైదుష్యమును వెక్కిరించి యీతని శాస్త్ర చాతుర్యమును సన్నుతించిరి. అతనికి నడవలోఁ జాఁపమీఁదను, నీతనికిఁ బడుక గదిలోఁ బట్టేమంచము మీఁదను శయనవిధాన మేర్పఱచిరి. పెద్దాతఁడు కోపమునఁ గుములుచుండెను. పిన్నాతఁ డుత్సాహమున నుప్పొంగుచుండెను. పడుక గది నుండి రాత్రి లఘుశంకకు బయలి కేఁగుచు నీ పిన్నాతఁడు త్రోవలో నడవలోఁ బండుకొని యున్న తోడియల్లు నికతన్ను తన్ని యేఱుఁగక ప్రమాదమునఁ దన్నినట్లు నటించి "క్షమధ్వమ్" అని బుజ్జగించి పోవుచుండెను. ఒక నాఁడాయేను. రేన్నాళ్ళాయేను. అనుదినము నట్లే తన్నుచు "క్షమద్వమ్" చెప్పుచుండ సాగించెను. ఒకనాఁడు రేన్నాళోర్చుకొనెను. కాని పెద్దయాతఁ డా మీఁద నాఁగఁజాలఁడయ్యెను. మూఁడవ నాఁడు నట్లే యాతఁడు తన్ని "క్షమధ్వము"
    చెప్పెను. కోపాటోపముతో లేచి యాపెద్దయాతఁ డీ చిన్న యాతని సిగపట్టుకొని వంగలాగి "పొగరుబోతా! ప్రతిదినముఁ దన్నుచు నొకటే క్షమద్వము చెప్పసాగించితివి. నీకొక క్షమధ్వము వచ్చిన నాకు ముప్పది రెండు శ్రయద్వములు వచ్చును. ఏ మనుకొన్నావో నా దెబ్బ చూచికొ "మ్మని ప్రధమా ద్వితియేషు శ్రయధ్వం, ద్వితీయాస్తృతీయేషు శ్రయధ్వం, తృతీయా శ్చతుర్దేషుశ్రయధ్వం (ఇట్లు ముప్పది రెండు శ్రయధ్వములు గల వేదమంత్ర మున్నది) అని సస్వరముగాఁ జదువుచు నొక్కక  గ్రుద్దు చొప్పున ముప్పది రెండు గ్రుద్దులు వెన్నెముకలు విఱుగునట్లు వీఁపు మీఁదఁ దగిలించేను. అవమానితుఁడై పిన్న యల్లు డడఁగి యుండెను. అనేకు లీ కధను బెద్దిభట్టు పేరఁ జెప్పుదురు. తన్నులు తగిలినవనుటకు శ్రయద్వములయిన వనుట పారిభాషికముగా వైదికుల వాడుకలో నున్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS