Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 26


    "సరే, నీ ఇష్టం! నీ మనసుకు నచ్చితేనే నేను వెళ్ళి మాట్టాడుతాను. లేదంటే 'ఊఁ' అను వాడి అంతు తేలుస్తాను" అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ.
    "ప్లీజ్! ఇంతటితో ఈ విషయం వదిలేయండి. అవసరమైన వ్యక్తుల గురించి ఆలోచించడం దండగని మీకు నేను వేరే చెప్పనవసరం లేదు."
    "ఆల్ రైట్, అనూషా! అర్ధరాత్రి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాను. ఆవేశం అణుచుకోలేక పోయాను. ఏమీ అనుకోవద్దు."
    "ఫరవాలేదులెండి. ఆ ఆవేశం అటువంటిది!" అంది.
    అతను వెళ్ళిపోయాడు.
    అనూష భారంగా నిట్టూర్చింది.
    ఒకవైపు ఆనంద్ తనను అనుమానించాడు. మరొకవైపు పోలీసులు సమ్రాట్ ను అనుమానిస్తున్నారు.
    అతని గురించి అందరూ చెడ్డగా అనుకుంటున్నప్పుడు పనికట్టుకుని అతని దగ్గరే ఉద్యోగం చేయాలనుకోవడం అంత శ్రేయస్కరం కాదనిపించింది.
    జీవితంలో ఇంకా ఎన్ని చేదు అనుభవాలు చవిచూడాలో!
    ఆలోచనలో పడింది అనూష.


                                *    *    *    *


    సమ్రాట్ మెడను సుతిమెత్తని చేతులు చుట్టుకున్నాయి.
    వెనుదిరిగి చూసిన అతను క్షణం ఆశ్చర్యపోయాడు.
    కళ్యాణి నవ్వుతూ కనిపించింది.
    ఆ రోజు అతను తిరస్కరించాడన్న కోపంతో విసురుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు యిలా ప్రవర్తించడం వింతగా అనిపించిందతనికి.
    "ఏమిటీ పనులు? పెళ్ళి కావలసిన పిల్లవు!" అసహనంగా అన్నాడు.
    "నేను నిన్ను ప్రేమిస్తున్నాను సమ్రాట్! నా ప్రేమను కాదనకు. నువ్వు లేనిదే నేను బతకలేను." కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా పెదవిని అదిమిపెట్టి అన్నదామె.
    "సారీ! ఇప్పటివరకు అభిమానినంటూ వెంటబడి వేధించుకు తిన్నావు. ఇప్పుడు ప్రేమా, పెళ్ళి అంటూ నన్ను చంపుకు తింటున్నావు!"
    "అంటే నన్ను కేవలం అభిమానిలాగే చూశానంటావా?" అడిగింది ఆవేశంగా.
    "అవును అభిమానివే! ఇప్పటికీ, ఎప్పటికీ అభిమానివే! ప్రేమా, పెళ్ళీ అంటూ ఏమిటీ అర్థంలేని మాటలు? నాకిష్టం లేదని ఇదివరకే మీ నాన్నకు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. నన్నొదిలి పెట్టు!"
    "థాంక్స్ సమ్రాట్! ఇప్పటి వరకూ అభిమానిలా నన్ను ఆదరించి, గౌరవించినందుకు చాలా థాంక్స్?" కళ్యాణి కళ్ళ నీళ్ళు తుడుచుకుని విసవిసా వెళ్ళిపోయింది.
    కళ్యాణి విషయంలో తను కఠినంగా ప్రవర్తించాడు. ఆమె తనంటే ఇష్టపడి వెంటపడుతున్నా కాదనుకున్నాడు.
    కారణం_ తన మనసులో సాహితికే స్థానం ఉన్నది.  
    ఆలోచనలో పడిన సమ్రాట్ అనూష రాకను గమనించలేదు.
    "శెభాష్" అనూష అమితానందంతో అంది.
    సమ్రాట్ ఖంగుతిన్నాడు.
    "నువ్వెప్పుడొచ్చావు అనూషా!" తనను తాను సంభాళించుకుంటూ అడిగాడు.
    "మీరు కళ్యాణికి చక్కగా సమాధానం చెప్పారు. వయసు వచ్చిన పిల్ల హద్దుల్లో ఉండటం మరచిపోతే నష్టపోయేది ఎవరో గుర్తు చేశారు." అతన్ని ప్రశంసిస్తూ అంది.
    "అయితే, మా సంభాషణంతా విన్నావా?" అనుమానంగా అడిగాడు.
    అనూష బదులుగా చిరునవ్వు నవ్వింది.
    "అభిమానుల పట్ల నేను ఎంత నిక్కచ్చిగా ఉంటున్నానో నువ్వు ప్రత్యక్షంగా చూశావు. కాని ఇన్ స్పెక్టర్ వీరేష్ నన్ను అనుమానిస్తున్నాడు. గౌతమి ఆత్మహత్యకూ, నాకూ లంకె పెడుతున్నాడు" ఆవేదనగా అన్నాడు.
    "ఇన్ స్పెక్టర్ ను దర్యాప్తు చేయనివ్వండి. అప్పుడే మీరు నిర్ధోషి అని తెలుసుకుంటాడు."
    "కాని, ఈ లోపుగా ప్రజలు నన్ను దోషిగా అనుకుంటే నా ప్రతిష్ట ఏం కావాలి?"
    "యశస్సు ఉన్నచోట విమర్శ పుడుతుంది. మీరు యథావిధిగా రచనలు చేయండి" అంటూ అతని చేతికి ఒక కవరు ఇచ్చింది.
    కవరు తీసి చూసిన సమ్రాట్ క్షణం కొయ్యబారిపోయాడు.
    "అనూషా! ఎందుకీ నిర్ణయం తీసుకున్నావు?"
    సమ్రాట్ ముఖంలో నెత్తురు చుక్క లేనట్టయింది.
    ఇలా జరుగుతుందని అతను కలలో కూడా ఊహించలేదు.
    "అబ్బే! మీరు లేనిపోనివి ఊహించుకుని బాధపడవలసిన పనిలేదు. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను."
    "ప్లీజ్ అనూషా! మరోసారి ఆలోచించు. నీ మనసును ప్రశాంత పరచుకుని, ఆ తరువాతే నీ నిర్ణయం తెలియచెయ్!" ప్రాధేయపూర్వకంగా అన్నాడు.
    అనూష చిరుమందహాసం చేసి మెదలకుండా వెళ్లిపోయింది.
    అనూష ఇచ్చిన రాజీనామా లేఖ టేబుల్ మీద వెక్కిరిస్తూండగా, రాస్తున్న కొత్త నవల తాలూకు కాగితాలను, కలాన్ని మూలకు నెట్టివేసి, విసురుగా బయటకు నడిచాడు సమ్రాట్.


                               *    *    *    *


    తను ఇన్ స్పెక్టర్ వీరేష్ కు ఇచ్చిన మాట గుర్తుంది బిందుమాధవికి.
    కాని, తను ఇంతవరకు అనూష గురించి ఆలోచించలేదు. తండ్రీ కూతుళ్ళను కలిపే ప్రయత్నం ఏదీ చేయలేదు.
    ఈరోజు మళ్లీ ఇన్ స్పెక్టరు వీరేష్ తన బాధ్యతను గుర్తుచేయడంతో అనూషను తీసుకురావడానికి సాహితిని పంపింది.
    ఒకవేళ తన ప్రయత్నాన్ని ముందుగానే పసికట్టి అనూష సాహితీ వెంట రాకపోతే, ఇన్ స్పెక్టరు వీరేష్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇక శ్రీపతికి తను చేయగలిగిన సహాయం లేనేలేదు.
    కాని, అలా జరిగితే నష్టపోయేది అనూషే! సమ్రాట్ మాయలో పడి ఆమె కూడా గౌతమిలా... ఆపై ఆలోచించలేకపోయింది బిందుమాధవి.
    అయినా అనూష తెలివితక్కువదేమీ కాదు. ఆమె తెలిసి తెలిసీ తన జీవితాన్ని నాశనం చేసుకోదు. ఆమె తెలివితేటలమీద తనకు అచంచలమైన విశ్వాసం వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS