Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 26

"తెలిసిందనేగా చెబుతున్నాను."
"సరేలే, ఏం తెలిసిందో చెప్పు!"
"అందరూ కనేదేమిటో తెలిసింది. అందరూ కనేది పిల్లల్ని" ఆనందంగా చెప్పాడు పర్వతరావు.
బస్సు కదిలిపోయేలా నవ్వాడు గోవర్ధనం.
"ప్రశ్న అందరూ కనేది అనేవుంది కాని, ఆడవాళ్ళకు సంబంధించింది అనిలేదు. కొంపముంచి నువ్వుకూడా పిల్లల్ని కంటావా ఏమిటి?" నవ్వుతూ అడిగాడు ముత్యాలరావు.
 పర్వతరావు కొద్దిగా సిగ్గుపడ్డాడు.
"మరోసారి ఆలోచించి చూడండి!" అన్నాడు గోవర్ధన్.
మళ్ళీ ముగ్గురూ ఆలోచనలో పడ్డారు.
రెండేరెండు నిమిషాల తరువాత.
"నేను కనుక్కున్నాను. చాలా తేలికైన జవాబు. ప్రశ్నే తేలికయినపుడు, జవాబు మాత్రం ఎలా కష్టంగా వుంటుంది? అన్నాడు పుండరీకాక్షయ్య.
"సరే! కనుక్కున్నదేమిటో చెప్పండి!" అన్నాడు గోవర్ధన్.
"అందరూ కనేది క...ల...లు." పుండరీకాక్షయ్య టకీమని చెప్పాడు.

"కరెక్ట్!" వెంటనే అన్నాడు గోవర్ధన్.
ముత్యాలరావు, పర్వతరావు మొహమొహాలు చూసుకున్నారు. ఇంత చిన్న ప్రశ్నకి జవాబు చెప్పలేక పోయామేమిటా సరే! నాకు తోచినదేదో నేనుకూడా ఒక ప్రశ్న వేస్తాను. మీరు చెప్పగలరేమో చూద్దాం?" అన్నాడు పుండరీకాక్షయ్య.
"నాకు చిక్కు ప్రశ్నలూ, సరదా జవాబులూ అంటే చాలా యిష్టం. ఆ ప్రశ్నేదో త్వరగా వెయ్యండి" అన్నాడు గోవర్ధన్.
పుండరీకాక్షయ్య ఏమంటాడో అని ఆత్రుతగా చూశారు పర్వతరావు, ముత్యాలరావు ఆయన ముఖంలోకి.
"అందరూ దేనితో బాధ పడతారు?"
"మీరు ప్రశ్నించింది మనస్సుకి సబంధించినదా, లేక శరీరకమైనదా?" అడిగాడు గోవర్ధన్."నేను అడిగిన ప్రశ్న ఏమిటి?" అందరూ దేనితో బాధపడతారు..." అనికదా! ఇది మనస్సుకు సంబంధించిందా? శరీరానికి సాబంధించిందా? మరొకటా మరొకటా అన్నది నేను చెప్పను. నేను అడిగిన ప్రశ్న చిలిపి ప్రశ్న. ఆ ప్రశ్న ఏమిటంటే "అందరూ దేనితో బాధపడతారు అని. మీరో చిలిపి సమాధానం ఆలోచించి చెప్పండి!" అన్నాడు పుండరీకాక్షయ్య.
వెంటనే ముగ్గురూ ఆలోచనలో పడ్డారు.
"అందరూ దేనితో బాధపడతారు?"
'తల నొప్పితోనా!'
'ఊహూ!'
'తలనొప్పి కొందరికే వస్తుంది'
'మరి కాళ్ళ నొప్పితోనా?'
'ఊహు! కాళ్ళ నొప్పి కూడా కొందరికే వుంటుంది'
'కాళ్ళే లేనివాడికి కాళ్ళ నొప్పులు కూడా వుండవు'
'మరేమయ్యుంటుంది?'
'అందరూ బాధపడేది ఎదుటివాడు తిడితే.'
ఈ ఆలోచన వచ్చిన గోవర్ధనం ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే చెప్పాడు. "అందరూ బాధపడేది దేనికో నాకు తెలిసింది."
"ఇంక ఆలస్యం ఎందుకు? తెలిస్తే చెప్పేసేయి!" అన్నాడు పుండరీకాక్షయ్య.
"ఎదుటివాడు తిడితే బాధపడని వ్యక్తి అంటూ ఎవరూ వుండరు. మనిషి అన్న ప్రతివాడికీ తిట్లు చాలా బాధ కలిగిస్తాయి" అన్నాడు గోవర్ధన్.
"నా ప్రశ్నకి జవాబు ఇదికాదు. బండ చెముడు వున్న వాడిముందు నుంచొని తిడితే, వాడికేమీ వినపడదు కదా. తిట్టినా బాధపడని వాళ్ళు కొందరు వున్నారు. ఊహరాని పసిపిల్లల్ని తిట్టామనుకో వాళ్ళూ బాధపడరు. ఎందుకంటే వాళ్ళకి అవి తిట్లని తెలియవు కనుక." అని వివరించాడు పుండరీకాక్షయ్య.
"నాకూ మొదట ఇదే ఆలోచన వచ్చింది. కానీ, మళ్ళీ నా ఆలోచన తప్పని తెలిసి, మాట్లాడకుండా మళ్ళీ వేరే ఆలోచనలో పడ్డాను" పర్వతరావు అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS