Previous Page Next Page 
మంచివాడు పేజి 26


                                                                   గ్రహబలం


  కాంతమ్మ ఆ రోజు మరీ చీకటి వుండగానే లేచింది. చకచకా పని చేసుకుంది. భర్త మంగపతి. ఇంకా నిద్రలేవలేదు.
"మీ నాన్నను లేవమనవే! అవతల ప్రయాణం పెట్టుకొని ఇంకా ఏం నిద్ర?" కూతుర్ని కేకపెట్టి చెప్పింది. మంగపతి ఆదరాబాదరాగా లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగి స్నానానికి వెళ్ళాడు.
కాంతమ్మ వంట పనిలో మునిగిపోయింది.
"అమ్మాయ్! ఒసేయ్! నిన్నేనే?"
"అబ్బ! ఏమిటే ఆ కేకలు" కూతురు తార చిందులు తొక్కింది.
"పేపరు రాలేదా?"
"ఆదివారం పేపరు ఇంత త్వరగా వస్తుందా ఏమిటి?" అనేసి వెళ్ళిపోయింది.
వెళ్ళేముందు కాస్త "గ్రహణం" చూచుకొని వెళ్తే బాగుణ్ను! ఆ పేపరు సమయానికి రాదు! అయినా ఆదివారం, అమావాస్య. పెళ్ళి సంబంధం చూడటానికి ఇవ్వాళ బయలుదేరడం ఏమిటి? ఆ మనిషికి ఎంత తోస్తే అంతే. అరవ వాళ్ళకు అమావాస్య మంచిదట!
"ఏమే! వడ్డించావా?" స్నానం చేసి పూజ ముగించి హడావిడిగా వంటింట్లోకి వచ్చాడు మంగపతి.
"ఇదో వడ్డిస్తున్నా!" ఆలోచనల నుంచి బయట పడింది.
ఆదరాబాదరా నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని లేస్తున్న భర్తతో "అయ్యో! అదేమిటండీ! మజ్జిగ పులుసు వేసుకోకుండానే లేచారు" అని నొచ్చుకుంటూ అన్నది కాంతమ్మగోతాం పట్టాతో కుట్టిన సంచిలో రెండు ధోవతులూ, నాలుగు పొగాకు కాడలూ పెట్టి అందించింది.
"ఈ సంబంధమైనా ఖాయం చేసుకురండి?" అన్నది.
"అంతా మన చేతుల్లోనే వుందా ఏమిటే?"
"త్వరగా బయలుదేరండీ... మళ్ళీ వర్జం జొరబడుతుంది." అన్నది కాంతమ్మ.
మంగపతి వీథి వాకిలి మెట్లు దిగుతుండగానే నెత్తి ముసుగుతో వెంకాయమ్మ ఎదురైంది. ఠక్కున ఆగిపోయాడు.
"ఎక్కడ చచ్చావే?" అంటూ పెళ్ళాన్ని వెర్రికేక పెట్టి పిల్చాడు మంగపతి.
"అయ్యో ఏమిటండీ? ఏం జరిగిందీ? శుభమా అంటూ వెళ్తూ ఆ మాట లేవిటి?" సాగదీస్తూ కాంతమ్మ బయటికి వచ్చింది.
ఇంకేం జరగాలి! ఇంట్లో ఏం పారిపోతుందని లోపలకు పరిగెత్తావ్? అట్లా ఎదురొచ్చి చావకూడదూ?" విసుక్కున్నాడు.
"అసలు సంగతేమిటో చెప్పండీ!" అంటూ "ఏం జరిగింది."
"ఇంకా ఏం జరగాలి? గడప దిగుతుండగానే వెంకాయమ్మ ఎదురైంది."
"అయ్యో రాత! శుభమా అంటూ లగ్ననిశ్చయాలకు వెళుతూంటే ఈ అపశకునం ఏమిటండీ?" నీళ్ళు కారిపోయింది కాంతమ్మ.
ఇంట్లో ఎదిగి గుండెల మీద కుంపటిలా వున్న పిల్లకు పెళ్లి చెయ్యాలని ఆ దంపతులు నానా పాట్లూ పడుతున్నారు. కూతురు మనువు మాట్లాడటానికి వెళ్తున్న మంగపతికి దుశ్శకునం ఎదురైంది. ఈసారన్నా ముడి పడుతుందని ఇద్దరూ గంపెడు ఆశతో వున్నారు.
మంగపతి తేవడానికి చాలా సంబంధాలే తెచ్చాడు. కాని ఒక్కటీ కుదర్లేదు.
వచ్చిన సంబంధం తల్లికి నచ్చితే కూతురికి నచ్చదు. కూతురికి నచ్చితే తల్లికి నచ్చదు. తల్లీ కూతుళ్ళకు నచ్చితే తండ్రికి నచ్చదు. ముగ్గురికీ నచ్చితే కట్నం ఎక్కువ ఇవ్వలేక బెడిసిపోతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS