"ఇక్కడ చాలా మంచిగా ఉంది. దొంగలెవరో, దొరలెవరో, మీలాంటి తెలివిగలవారికి తెలుసుగాబట్టే మా ఒంటిమీద దెబ్బపడకుండా మమ్మల్ని క్షేమంగా ఉంచారు. ఇదంతా మీ దయ సార్!" అని వినయంగా ఓ నమస్కారం పారేసి అన్నాను.
ఆ దెబ్బతో గురుడు డంగైపోయాడు.
ముఖాన అంతా తుమ్మబంక పట్టించి, మండుటెండలో ఎండబెట్టిన ముఖారవిందంతో అంతవరకూ ఉన్న ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ప్రసన్న వదనుడై ఓ చిరునవ్వు చిందించాడు.
"అయితే ఇక్కడ బాగుందంటావ్?"
"బాగుండట మేమిటి సార్! చాలా చక్కగా ఉంటేణు. నా సంతోషం ఏమిటంటే మీరు నన్ను అనుమానించలేదు. దొంగకానివాడిని, దొంగా అంటే ఎంత బాధపడతాడు. మీరే చెప్పండి సార్! మీరలా అనకపోవటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది సార్! మీరేమి అడిగినా నేను చెప్పటానికి సిద్ధంగా ఉన్నాను సార్! తప్పుచేస్తే భయపడాలిగాని, తప్పు చెయ్యకపోతే భయమెందుకు సార్! అడగండి సార్! అడగండి" అన్నాను.
"పదేపదే నేను అడగండి సార్!" అనే మంత్రం జపించానంటే ముందు ఈయన బుర్ర తిరిగి నన్ను నమ్మటం జరుగుతుంది. ఆయన నన్ను అనుమానించకపోతే బ్రతికి బయటపడటం చాలా తేలిక. నే ఊహించినట్లుగానే నేను అన్నమాట నా మంత్రం వర్ధనరావు మీద పనిచేసినాయ్.
"నీలాంటివాళ్ళు సహకరిస్తే మా డిపార్టుమెంట్ కి కష్టాలు ఉండవు. చెడ్డ పేరూ రాదు. దొంగ మాదచ్చేద్ వెధవలు నేరం చేసి, అది ఒక ప్రక్క రుజువు అయినా మాకేం తెలియదు సార్ అని బొంకుతూ ఉంటారు. నిజం మాత్రం చస్తే చెప్పరు. అలాంటిది నీవు "అడగండి సార్" అంటూ వుంటే నాకు బహు ముచ్చట వేస్తున్నది.
అలా నాతో మాటాడుతూ ఉన్న ఇన్ స్పెక్టర్ గారికి అంతలోనే ఏ అనుమానం వచ్చిందో, ముఖం గంటుపెట్టుకొని "ఏయ్! నువ్వు నన్ను పొగడటం లేదుకదా! పొగడ్తలకి నేను లొంగను. నీకు తెలుసో లేదో!" అన్నాడు.
"ఛ! ఛ! మిమ్మల్ని నేను పొగడటమేమిటి సార్! నాకు అంత అవసరం ఏముంది చెప్పండి! నేనా తప్పు చెయ్యలేదు. నిజానిజాలు మీకు తెలుసు. ఇంక పొగిడే పనేముంది సార్!" చాలా వినయంగా అన్నాను.
"ఈ సంగతి నాకు తెలీదుటోయ్! నిన్ను పరీక్ష చేద్దామని ఉత్తుత్తిగా అలా అన్నానంతే. ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి నువ్వు ముక్కు సూటిగా జవాబు లివ్వాలి."
"అలాగే సార్! అడగండి!"
ఆ తరువాత.
మా మధ్య చిన్న ఫార్సు జరిగింది. ఆయన అడ్డమైన ప్రశ్నలూ వెయ్యటమూ, నేను అడ్డదిడ్డంగా జవాబులు ఇవ్వడము ఓ పదినిముషాల పాటు సాగింది.
ఉన్నట్టుండి ప్రశ్నల మధ్యలో "మీ బాస్ ఎలా ఉంటాడు?" అంటూ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు నా ముఖంలోకి గ్రుచ్చిచూస్తూ అడిగాడు.
"బాస్! బాస్ ఏమిటి సార్?" అమాయకంగా అడిగాను.
"అదేనయ్యా! మీ ఇద్దరినీ పట్టి బంధించి తీసుకొచ్చాడే! వాడి సంగతి నేను అడిగేది"
"వాడు నాకు బాస్ ఎలా అవుతాడు సార్? నేను ఏమన్నా దొంగల ముఠాలోని మనిషినా!"
"నువ్వు దొంగల ముఠాలోని మనిషి కాదులేవయ్యా! మొత్తానికి ఆ ముఠావున్న స్థావరంలోనే బంధించబడ్డావు కదా! బాస్ గాడు ఎలా వుంటాడో నీకు తెలియాలి కదా! అదన్నమాట నేను అడిగింది."
"బాస్ ఎలా వుంటాడో మీకు తెలియదా సార్?" ఎదురుప్రశ్న వేశాను.
"బాస్ ఎలా వుంటాడో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరో కోన్ కిస్కా గొట్టంగాడు ఫలానా స్థావరం దొంగల ముఠాకి నిలయం అని, అక్కడో పెద్ద దొంగల ముఠా వుందనీ, అకస్మాత్తుగా ఆ స్థావరం మీదికి దాడిచేస్తే మీకు ఎందరో దొంగలు, హంతకులు, స్మగ్లర్లు దొరుకుతారనీ, అదనీ, ఇదనీ ఫోనుచేస్తే, ఈ ఫోనులో నిజానిజాలు ఎంతవరకూ వున్నాయో అని మూడురోజులు చాటుగా మాటువేసి చూశాను నేనూ, నా సిబ్బంది. నిజంగా అది దొంగల స్థావరమే అని గ్రహించి నేను నా మందీ మార్భలంతో అకస్మాత్తుగా దాడిచేశాను. ఆ దాడిలో చచ్చినవాళ్ళు చచ్చారు బ్రతికివున్న వాళ్ళు పారిపోయారు. ఇంతకీ ఆ బాస్ గాడు ఎలా వుంటాడో తెలియదు. వాడు చచ్చాడో తెలియదు, పారిపోయాడో తెలియదు..."
అక్కడే నిల్చున్న కానిస్టేబుల్ అహోబిలం, ఇన్ స్పెక్టర్ గారి మాటలకి అడ్డు తగులుతూ, "ఇదంతా వీడికి ఎందుకు చెప్పటం సార్!" అన్నాడు.
"నిజమే సార్! ఇదంతా నాకు చెప్పటం ఎందుకు సార్!" అమాయకంగా అడిగాను.
అప్పటికే కొంత నాకు అర్థమయిపోయింది.
బాస్ అంటే గిట్టనివాడో, మరో దొంగల ముఠా నాయకుడో మా బాస్ తాలూకా ఆచూకీ పోలీసులకి ఫోను ద్వారా అందించాడు.
