సంధ్యాదేవి నుదుట అద్దిన సింధూరంలా సూర్యుడు మరోసారి ఉదయించాడు...
గాలి మామూలుగానే వీస్తోంది.
పూలు ఎప్పటిలానే పూస్తున్నాయి.
ప్రపంచం రోజూ మాదిరిగానే చైతన్యాన్ని పుంజుకుంటోంది.
ఎక్కడో ప్రవహిస్తున్న వైతరిణి సుడుల గురకలు వేస్తూ రసాతలం వేపు సాగిపోతోంది.
సరిగ్గా అదే సమయంలో మేడ మెట్లు దిగుతున్న శశాంక కూడా మారనట్టే కనిపిస్తున్నా జాగ్రత్తగా గమనిస్తే అర్ధమైపోతోంది. అతడో సుదీర్ఘ స్వప్నం తర్వాత అప్పుడే నిద్రలేచినట్టు.
కాని ఎంత పరిశీలించినా ఎవరూ గుర్తించలేరు ఏ మంత్ర కవాటం అతని మనసు అరల్లో తెరుచుకుందో. మరే త్రేతాగ్ని కొన్ని రోజులపాటు పొగచూరిన అతడి గుండె పొరల్ని కాల్చి జ్వలిస్తూ వుందో...
అప్పటికి రెండు రోజుల క్రితమే రాజమణిగారి అంత్యక్రియలు పూర్తిచేసిన శశాంక నెమ్మదిగా హాల్లోవున్న రాజమణి, కృపల ఫోటోల ముందుకొచ్చాడు.
తదేకంగా ఓ ధ్యానంగా చూశాడు. ఫోటోలోని కృప కళ్ళకేసి__
ఎక్కడో ఓ వరం వేదనగా కదిలి ఓ రక్తపు బొట్టుని అశ్రువుగా మార్చి అతడి కనుకొనల్లోకి నెట్టింది.
"ఎందుకు కృపా! తల్లిచాటు బిడ్డలా నీ చీర చెంగుమాటున ఒద్దికగా బ్రతికిన నేను ఇప్పుడు స్వంతంగా నడక నేర్వబోతుంటే ఎందుకు బాష్ప బిందువుగా మారి నన్ను వారించాలనుకుంటున్నావు. నీ స్మృతుల సరళరేఖను దాటి నిన్ను నాకు దూరం చేసినవాళ్ళ నెత్తుటి ఆజ్యంలో హోమాన్ని రగిలించబోతుంటే ఎందుకమ్మా అమ్మలా నన్ను ఆపాలనుకుంటున్నావు... నీ మనో విపంచి శృతి చేసిన ఒక స్వరంగా బ్రతికిన నేను శాసనాల తీగలను త్రెంచుకుని అపస్వరాలతోనైనా మృత్యుగీతాన్ని ఆలపించబోతుంటే ఇదేమిటీ అడ్డుపడతానంటావు? ఎక్కడో గుండె ఆకాశంలో ఇంకా మిణుకు మిణుకుమంటూ మిగిలిపో తప్ప క్షణ క్షణం గుర్తుకొచ్చి నిన్న అసుర సంధ్యలోనే గడ్డకట్టిన వెలుగురవ్వల జడిని కరిగించి నన్ను కాల్చాలని ప్రయత్నించకు..."
గిరుక్కున వెనక్కి తిరిగాడు. నిన్నటి తన వ్యక్తిత్వానికి అంత్యక్రియలు పూర్తిచేసినట్టు...
"అయ్యా" సాంబయ్య నిలబడి వున్నాడు....
అక్కడ టేబుల్ పై బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేసిన సాంబయ్య గమనిస్తూనే వున్నాడు. రెండు రోజుల గడువులో శశాంకలో వస్తున్న మార్పుని...
అతని గురించి పూర్తిగా తెలిసిన చివరి సాక్షి సాంబయ్య. అవును. పదిహేనేళ్ళ పరిచయంలో శశాంక ఏమిటీ అన్నది బాగా తెలిసిన మూడో వ్యక్తి నౌకరు సాంబయ్య మాత్రమే.
తను సృష్టించుకోబోయే కొత్త ప్రపంచంలో సాంబయ్య అవసరమూ ఇక లేదని నిన్న రాత్రే నిర్ధారించుకున్నాడు. అందుకే అంతకాలం ఆ ఇంటికి సేవచేసిన సాంబయ్యకి తను చెల్లించే చివరి రుణంగా పాతికవేలు సిద్ధంచేశాడు కూడా.
అది చెప్పాలనుకుంటుండగానే వినీల లోపలికి వచ్చింది.
"హల్లో" ముందు శశాంక పలకరించాడు ఈసారి.
"గుడ్ మార్నింగ్" వినీలలో అస్పష్టమైన ఉత్సాహం "ఇంత ఉదయమే ఎందుకొచ్చానో తెలుసా" ఏదో అర్థం కాని మార్పుని అతడిలో గమనిస్తూనే అంది.
"చెప్పండి."
"మిమ్మల్ని అభినందించాలని."
"దేనికి?"
"షూటింగ్ ఫెడరేషన్ వాళ్ళు పిటిఐకి పంపిన టెలిప్రింటర్ మెస్సేజ్ లో చూశాను. సరిగ్గా మరో వారంలో మీరు ఒక్కటే ఈ జర్మనీ ఫోల్ నగరంలో జరగబోయే ఇంటర్నేషనల్ షూటింగ్ కాంపిటీషన్స్ కి వెళ్ళబోతున్నారు" శశాంకలో పెద్దగా రియాక్షన్ కనిపించకపోయేసరికి "అదేంటీ... ఇంత మంచి వార్తని మోసుకొచ్చిన నాకు కనీసం థాంక్స్ కూడా చెప్పరూ" అంది తనదైన లాలిత్యాన్ని గొంతులో నింపుకునే.
"రండి, బ్రేక్ ఫాస్ట్ చేద్దురుగాని"
"నాకేం నచ్చలేదు"
"ఏంటి"
"ఘడియకి ఏకవచనం, మరో ఘడియకి బహువచనంతో మీరు నన్ను ఎడ్రస్ చేయడం..."
అప్పటికే టేబుల్ ముందు కూర్చున్న శశాంకకి బాధాకరంగానైనా గుర్తుకొచ్చింది కృప.
ఆ నవ్వులో నిశ్శబ్దంగా కదిలే కనుపాపలను మూసే రెప్పల కదలికల్లో ప్రతి క్షణమూ ఎదుటివాళ్ళ ఆనందాన్ని మాత్రమే చూడాలనుకునే ఆ తత్వంలో, ఫాలభాగంపై అందంగా నర్తించే కురుల స్పర్శని సైతం గుర్తించకుండా మాటలతో సైతం మౌనాన్ని ధ్వనింపచేసే పెదవుల అదురుపాటులో ఎక్కడో కృపకీ, వినీలకీ చాలా పోలికలు కనిపించాయి.
బిడియంగా తలవాల్చుకుంది వినీల. సూటిగా కళ్ళల్లోకి చూడగలిగే సాహసం లేని ఒకే ఇష్టమైన అబ్బాయి ఉండుండి మనసు లోతుల్లోకి చూడడం ప్రారంభిస్తే ఎంత నిబ్బరం కల ఆడపిల్లలో అయినా కలిగే అతి సహజమైన అలజడి ఆమెలో.
ఇలాంటి నిశ్శబ్దాన్ని ఆమె కూడా తట్టుకోలేక పోయింది. "అంటే ఇంత మంచి న్యూస్ తెచ్చినా బ్రేక్ ఫాస్ట్ తో సరిపెట్టేస్తారా" అంది తన మొహంలో భావాలు కనిపించకుండా జాగ్రత్తపడుతూ.
