Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 27


    "అమ్మమ్మ అలా అనకూడదు. అది నాకు సెంటిమెంటు."


    "నీ బొంద" అనుకొంది.


    భారతి పర్స్ లోంచి రూపాయి బిళ్ళ తీసిచ్చింది.


    "మహా ప్రసాదం!" అన్నాడు బోసుబాబు.


    భారతి నవ్వుకొంది.


    ఇలా కబుర్లు చెబుతూ ఇంటివరకూ క్షేమంగా చేరిపోవాలి. అది భారతి ఆలోచన.


    అందార రాశి భారతితో కలిసి అడుగులు వేస్తూ మాట్లాడుతూ అంత దూరం నడవడమే ఓ వరంగా అతననుకొంటున్నాడు.


    "నీకో కాంప్లిమెంటు ఇవ్వాలనుకుంటున్నాను. అభ్యంతరం లేకపోతే వింటానంటే చెబుతాను!" అన్నాడు.


    భారతి అతనికేసి చూసింది.


    బోసుకి కాస్త సందిస్తే ఎలా వాగుతాడో తనకి తెలీని విషయం కాదు. ప్రస్తుతం నిర్మానుష్యంగా వున్న రోడ్డుపైన వున్నది తను పక్కనే పోకిరీ అబ్బాయి నడుస్తున్నాడు. అలాటివాడిని చేతల్లోకంటే వాగుడులో వుంచడం ఆ సమయంలో ఎంతైనా మంచిది. వాడు భుజంపైన చెయ్యి వెయ్యడమో, లేక చెయ్యి పట్టుకోవడం కంటే అదేమేలు!" అన్న విషయం భారతికి బాగా తెలుసు.


    "ఏమిటీ అని అడగవేం?" అన్నాడు.


    "అడగకపోయినా ఎలాగూ నువ్వే చెప్పేస్తావు. అందుకే వూరుకొన్నాను" అంది.


    'దివాంచి' బార్ సందు తిరిగారు. ఇంకో అయిదారునిమిషాలు నడిస్తే ఇల్లొచ్చేస్తుంది.


    "ఇప్పుడే ఇంద్రలోకం నుంచి నాకోసం దిగివచ్చిన రంభలా వున్నావు. నీలాంటి రంభని నేనెక్కడా చూడలేదు" అన్నాడు.


    "నీ మొహం, రంభ లెంతమంది వుంటారేమిటి? అంది నవ్వుతూ.


    "నువ్వు నన్నెలా పిలిచినా నేను బాధపడను కానీ ఓ సంగతి చెప్పనా?"


    "మళ్ళీ ఏమొచ్చింది?"


    "నాకీ రాత్రి నిద్ర పట్టదు"


    "గార్డినాల్ బిళ్ళలు వేసుకో!" అంది చిరుకోపంతో భారతి. నిజానికి భారతికి వళ్ళు మండిపోతోంది. కానీ పైకి అలా నటిస్తోంది. భారతి తనతో ఫ్రీగా మాట్లాడుతున్నదనుకొంటున్నాడే గానీ ఆ ఫూల్ కి ఆమె తన నడ్డుపెట్టుకొని ఇంటికి సురక్షితంగా వెళుతోన్నదన్న సంగతి అతనికి తెలీదు.


    "ఏ బిళ్ళలు మింగినా నిద్రరాదు భారతీ, ఆడామగా కలిసి ఏడడుగులు నడిస్తే చాలంటారు. అలాంటిది నీతో కలిసి పక్కనే నడుస్తూ వచ్చి ఇప్పటికి అయిదువేల రెండువందల ఎనభై అడుగులు వేశానంటే నీ కెంత దగ్గరగా వచ్చేశానో తెలుసా?" అన్నాడు.


    "బాగుంది గోల. అక్కడ్నించి ఇక్కడికెన్ని అడుగులేశావో లెక్క పెట్టుకొస్తున్నావన్నమాట!"


    "అవును. గుడినుంచి మన ఇంటికి మైలు దూరం. మైలుకి 1760 గజాలు. గజానికి మూడు అడుగులు చొప్పున లెక్కకడితే 5280 అడుగులన్నమాట."


    "ఐసీ, అలానా. అయితే నువ్వు ఇప్పుడు సుమారు 755 మంది అమ్మాయిలతో కలిసి నడిచినట్టన్నమాట" అంది ఫక్కుమని నవ్వేస్తూ.


    "అదెలా?" అన్నాడు అయోమయంగా బోసుబాబు.


    "పిచ్చి ఇంజనీరూ, ఒక ఆడా మగా కలిసి ఏడడుగులు నడిస్తే చాలంటారన్నావు. నువ్వు అయిదువేల రెండు వందల ఎనభై అడుగులు నడిచానన్నావు. 5,280ని ఏడుపెట్టి భాగారించు. అమ్మాయిలెంతమందో తెలుస్తుంది" అంది.


    బోసుబాబు పకపకా నవ్వాడు.


    "తెలివైనదానివే" అన్నాడు.


    "గడుసుదాన్ని కూడా బోసు!" అంది భారతి.


    అతను ఆగిపోయాడు.


    "భారతీ!" అని పిలిచాడు.


    ఏమిటబ్బాయ్?"


    "నిన్నో మాటడుగుతాను. ఇదిప్పటి మాట కాదు. నువ్వు పుట్టినప్పట్నుంచీ నేను చెప్పాలనుకుంటున్న మాటకావచ్చది" ఆగాడు.


    "డొంక తిరుగుడు ఒద్దు. చెప్పేది త్వరగా చెప్పి తగలడు" అంది ఈసడింపుగా.


    "నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎదురుగా రసగుల్లా ప్లేటుని పెట్టి చేతులు కట్టేసి నోటికి ప్లాస్టరు వేసినట్టుగా ఉంది నా పరిస్థితి. నువ్వు నా కంటికి కనిపిస్తూనే వుంటావు. కానీ మన మధ్య బోలెడంత దూరం వుండి ఆ దూరం దగ్గరైపోవాలి"


    "ఒళ్ళెలా వుంది?" కోపంగా అంది భారతి.


    "నువ్వు కొరడా పెట్టి కొట్టినా ఫరవాలేదు. సమయం వచ్చింది, అవకాశం దొరికింది కనక చెబుతున్నాను. ఒకే ఒక్కసారి..... ప్లీజ్...... నువ్వు నా దానివి కావాలి. నిన్ను మనసారా, కరువుతీరా పిండుకు తాగేయాలనుంది."


    "షటప్!" అంది ముక్కుపుటాలు ఎగిరిపడుతూండగా భారతి.


    "ముందే చెప్పాను. నువ్వు కొరడా పెట్టి కొట్టినా బాధపడనని. జీవితకాలమంతా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూనే వుంటాను"


    "ఏడిశావు. నువ్వు పది జన్మలెత్తినా నీకు అలాంటి అవకాశంరాదు. ఇంతదూరం బాడీగార్డులా వచ్చావు. దానికి థాంక్స్" అని విస విస నడిచింది భారతి.


    రాస్కెల్. ఏం వాగాడు వాడు. ఒక్కసారి వాడికి లొంగిపోవాలట. పెళ్ళికాని ఆడపిల్లని ఎవరైనా 'నిన్ను ప్రేమిస్తున్నాననీ, పెళ్ళి చేసుకోవాలనుందనీ అడుగుతారు. కానీ ఈ వెధవ ఎలా అడుగుతున్నాడో.'


    బోసుబాబు గుణం ఎలాంటిదో భారతికి పూర్తిగా అర్థం అయిపోయింది.


    బోసుబాబు మాత్రం తనకి ఆ అవకాశం ఖచ్చితంగా దొరుకుతుందని నిర్ధారించుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS