తోటమాలి తిరపతి తోటలో పూసిన మల్లెపూలని మాలకట్టి తెచ్చి భారతికిచ్చాడు. ఆ మల్లెమాలని అపురూపంగా ఒక జడలో పెట్టుకొంది.
భారతి గుడికి వెళ్లడానికి బయలుదేరింది.
లక్ష్మిపతి కోర్టు నించి వచ్చాడు.
"ఎక్కడికమ్మా ప్రయాణం?" అడిగాడు.
"గుడికి డాడీ!" అంది.
"కారులో వెళ్ళు!" అన్నాడు లక్ష్మిపతి.
"నో డాడీ, చల్లగాలికి మెల్లగా అలా నడిచి వెళ్ళొచ్చేస్తాను"
"ఏ గుడికమ్మా?"
"ఆంజనేయస్వామి గుడికి డాడీ! జస్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ అపోజిట్!"
"నీ యిష్టం!" అన్నాడు తండ్రి.
భారతి రిస్ట్ వాచి టైం చూసుకొంది. ఆరున్నరయింది.
చల్లగాలి వీస్తోంది. చీకటి తెరలు కమ్ముకు రావడంతో రోడ్డుపైన మెర్కురీ దీపాలు వెలిగాయి.
కాంపౌండ్ వాల్ గేటు తీసుకొని భారతి రోడ్డుమీదికొచ్చింది.
భారతి మెల్లగా నడుస్తోంది. అతి నాజూగ్గా నడుస్తోంది. ఆమె రోడ్డుమీద అలా నడుస్తుంటే వయ్యారం ఒలికి చుట్టూపడిపోతున్నట్టుగా ఉంది. రోడ్డుమీద మెర్క్యురీ దీపాల వెలుగు ఆమె మొహం పైన పడి ఏ అప్సరసో ఇంద్రలోకం నించి దిగొచ్చి ఆ రోడ్డు మీద నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది.
సహజంగా పాంటు షర్టు వేసుకొని తిరిగే భారతి చీరా, జాకెట్టు ధరిస్తే ఇంత అందంగా వుంటుందని వూహించడం కష్టమే.
ఇంతకాలం ఈ అమ్మాయి ఈ అందాన్నంతా ఎక్కడ ఏ లాకరు జిప్పుల్లో దాచిందబ్బా అన్నట్టుగా పావుగంట పట్టింది.
గుడిలో కాళ్ళు కడుక్కుని పూలు పళ్ళు పూజారికిచ్చి దండం పెట్టుకొంది. దేవుని దర్శనం కోసం వచ్చిన చాలామంది దేవుడి సంగతి మరచిపోయి భారతినే రెప్ప వేయకుండా చూడ్డం మొదలుపెట్టారు.
భారతి అందం అలాంటిది.
చెక్కు చెదరని అజంతా శిల్పానికి ప్రాణంవచ్చి కదులుతున్నట్టుగా ఉంది చూసేవాళ్ళకి.
భారతి తీర్థం ప్రసాదం తీసుకొని, నుదుట సింధూరం పెట్టుకొని హంసలా నడిచివెళ్ళి ఓ పక్కన కూస్సేపు కూర్చుంది.
ఏడుంబావు అయింది. చీకటి బాగా పడింది.
భారతి గుడి బయటికి వచ్చింది. రోడ్డు కాస్త నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు క్రాస్ చేసి విద్యుత్ సౌద పక్కగా నడుస్తూ.....
"హలో!" అన్న మాటకి ఉలిక్కిపడి వెనక్కి చూసింది భారతి.
బోసుబాబు చెరకు బండి దగ్గర నిలబడి ఉన్నాడు.
భారతి అతనికేసి సూటిగా చూసింది. ఆమె జడలోని మల్లెలు ఘొల్లుమని గుభాళించాయి. ఆమె పూసుకున్న వుడుకులం వాసన అతని మీదికొచ్చింది.
బోసుబాబు నవ్వాడు.
భారతి కళ్ళు దీపాల్లా మెరుస్తున్నాయి.
గీసినట్టున్న నల్లని కనుబొమలు, కళ్ళు ఆర్పినపుడు రెప్పలు విసనకర్రల్లా అనిపిస్తున్నాయి.
భారతి మెడ తిప్పి......
"ఏమిటన్నట్టు" గా చూసింది.
"నా కిప్పుడు రూపాయి దండగ!" అన్నాడు బోసుబాబు.
భారతి విసుగ్గా వెనక్కి తిరగబోయింది.
"ఎందుకలా అని అడగవే?" అన్నాడు.
"అడగాల్సిన అవసరం నాకులేదు" అంది.
ఒంపులు తిరిగిన వొళ్ళు.
పూపిరి పీలుస్తున్నా, విడుస్తున్నా, మెడ కదిల్చినా ఒయ్యారం వలికిపోతున్న విగ్రహం ఆమెది. బోసుబాబు గుటకలు మింగాడు. అటు తర్వాత బోసుబాబు అప్పుడు.....
"నేనిప్పుడు చెరకు రసం తాగాను. గ్లాసు ఖరీదు రూపాయి. మీరు ముందు కనబడితే నారు రూపాయి దండగయ్యేది కాదు"
"అంటే?" కోపంగా అడిగింది.
"నిన్ను చూస్తే నాకు చెరుకురసం తాగినట్టుగా వుంటుంది భారతీ!"
"ఒళ్ళు దగ్గర పెట్టుకో మిస్టర్. చెరకు రసం కాదు. విషం తాగిస్తాను పిచ్చి వేషాలేస్తే!" అంది చకచక నడవబోతూ.
బోసు ఆమె వెనకే నడుస్తూ "నీ చేత్తో ఇస్తే విషం అయినా అమృతంలా తాగేస్తాను" అన్నాడు.
రోడ్డుపైన జనసంచారం లేదు. వాహనాలు మాత్రం వేగంగా పోతున్నాయి. 'రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు, ఈ పీడ ఎక్కడ్నించి వచ్చిందిరా బాబూ' అనుకొంది భారతి.
వీడి పీడ వదిలించుకోవడం ఎలాగా అని ఆలోచించింది.
డాడీ మాట విని కారులో వస్తే వీడి పీడ తనకుండేది కాదు. తప్పు తనదే.
"ఇంతకీ నా రూపాయి బాకీ ఎప్పుడు చెల్లిస్తారు?"
"నువ్వు చచ్చినప్పుడు" అని చెప్పాలనుకొంది.
కానీ అతనితో గొడవ పడేకంటే వాడినే ఇంటివరకూ బాడీగార్డుగా తీసుకెళితే సరిపోతుందనిపించింది. లేకపోతే ఇంటివరకూ ఇలా సతాయిస్తాడు రోగ్.
భారతి సన్నగా నవ్వింది.
"నేనేం నీకు బాకీ పడలేదే?" అంది.
"తప్పు అలా అనకు. నువ్వు ముందే కనబడితే ఆ చెరకు రసం తాగేవాడిని కాదు. ఇప్పుడెలాగూ కనపడ్డావు కనుక ఆ డబ్బులు నువ్వు ఇవ్వడం ధర్మం."
"ధర్మం చెయ్యమంటే నాకు అభ్యంతరం లేదు" అంది భారతి.
"అప్పనుకో, ధర్మమనుకో, నువ్వు ఇవ్వాలేగానీ దాన్ని నా జీవితమంతా దాచుకొంటాను" అన్నాడు.
ఎర్రమంజిల్ దాటారు.
"వెధవ రూపాయని అన్నాళ్ళు దాస్తావా?" అడిగింది భారతి.
