Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 26


    "బుద్దొచ్చింది. ఆడపిల్ల ఎంతైనా చేయగలదని ఒప్పుకుంటున్నా. నాకు సరిగానే బుద్ధి చెప్పావ్"

 

    "వెనకనుంచి అతనంటున్న మాటలు విని విజయగర్వంతో నవ్వుకుంది రమణి" అని ముగించాడు తరుణ్.

 

    "అయితే కథ సుఖాంతమన్న మాట" మొత్తం విన్నాక అంది మౌనిక.

 

    "ఆఁ అమ్మాయిలంటే అలా వుండాలి. కయ్యానికయినా వియ్యానికయినా సై అంటే సై అనేట్టు వుండాలి. మగాడు ఒకటంటే తిరిగి నాలుగు అనేటట్లుండాలి. అంతే తప్ప ముసుగేసుకుని మూల కూర్చోకూడదు.

 

    ఆ మాటలన్నీ తమను దృష్టిలో పెట్టుకునే అంటున్నాడని మౌనికకు తెలుసు.

 

    అందుకే అంది "మా పరిస్థితులు వేరు."

 

    "కాదన్నది ఎవరు? జీవితమంటే ఆల్ జీబ్రా లెక్కకాదు ఎవరేసినా ఒకటే ఆన్సర్ రావడానికి. పరిస్థితులు వేరేగా వుంటాయి. అయితే అవి ఎలాంటివయినా వాటినుంచి బయటపడాలి. కొత్త జీవితాన్ని వెతుక్కోవాలి. అంతేగానీ ఎక్కడో ఏదో అపశ్రుతి జరిగిందని మొత్తం జీవితాన్నే ఆర్పేసుకోకూడదు"  

 

    ఇక వాదించి లాభం లేదని ఆమెకి అర్థమైంది. అది విమలాబాయి టెక్నిక్. అవతలివాడు ఏదో ఆశించి వాదిస్తున్నాడని తెలిసినప్పుడు మనము వాదించకుండా ఫుల్ స్టాప్ పెట్టేయ్యాలి.

 

    విమలాబాయి మనసులో మెదిలేప్పటికి ఉపన్యాసానికి వెళ్ళాలన్న విషయం గుర్తొచ్చింది.

 

    పడకమీద నుంచి లేచి హడావుడిగా తయారై సభామందిరానికి వెళ్ళింది.

 

    అక్కడ చేరిన ఇంతకాలానికి మొదటిసారి ఆమె మనసు వశం తప్పుతోంది. ఉపన్యాసం బుర్రకెక్కడం లేదు. దానిస్థానే తరుణ్ మాటలు వినిపిస్తున్నాయి.    

 

    ఉపన్యాసం అయిపోయింది. గంటసేపు ఉపన్యాసం విన్నా ఒక్క ముక్క కూడా గుర్తుకు రావడం లేదు. జీవితం ఆల్ జీబ్రా లెక్కకాదన్న అతని మాటలు నూటికి నూరుపాళ్ళు నిజంలా తోస్తోంది.

 

    ఈ వికారాలన్నీ బుర్రలోంచి పోవాలంటే ఇప్పుడు జరగబోయే ఆత్మ ప్రక్షాళనా కార్యక్రమంలో తను చేసిన తప్పును అందరికీ చెప్పెయ్యాలి. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం కూడా జరిగిపోవాలి. తను ఏం శిక్ష వేసుకోవాలో కూడా ఆమె అప్పటికే నిర్ణయించుకుంది.

 

    ఆమె వెళ్ళేటప్పటికే ధ్యానమందిరంలో సదన్ లోని అమ్మాయిలు అందరూ హాజరై వున్నారు. డయాస్ మీదున్న కుర్చీలో కూర్చుంది. ఎదురుగ్గా వున్న టేబుల్ మీద కొవ్వొత్తిని వెలిగించింది.

 

    కరెంట్ వుండగా కొవ్వొత్తిని ఎందుకు వెలిగించిందో అక్కడున్న ఎవరూ ఊహించలేకపోయారు.

 

    ఆమె అందరివైపూ చూసింది. ఎవరూ ఏ పాపమూ చేసినట్టు లేదు - మౌనంగా వున్నారు.

 

    తప్పు చేసింది తనొక్కతేనన్న మాట. అందుకే అందర్లా తను మామూలుగా లేదు. తప్పు చేశానన్న భావన తన ముఖంలో కనిపిస్తున్నట్టు అందరూ తనవైపే చూస్తున్నట్లనిపించింది.

 

    కుర్చీలోంచి మెల్లగా లేచింది.

 

    అమ్మాయిలకి అర్థమైంది. మౌనిక ఏదో తప్పు చేసింది. అందుకే అందరూ ఊపిరి బిగపట్టి ఆమె ఏం చెబుతుందో వినడానికి ముందుకి వంగారు. కానీ మౌనిక ఏదైనా తప్పు చేసిందంటే నమ్మలేకపోతున్నారు. ఈ భావాలన్నీ వాళ్ళ ముఖాల్లో కనిపిస్తున్నాయి.

 

    "నేను ఏ తప్పూ చేసి వుండనని మీ నమ్మకం. కానీ ఎవరూ క్షమించనంత పొరపాటుచేశాను"

 

    చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దం. మొత్తం తమ దేహమే చెవులై పోయినట్టు వింటున్నారు వారు.

 

    "నేను ఓ యువకుడికి ఆశ్రయమిస్తున్నాను" ఆమె చెప్పడం ఆపింది.

 

    నిశ్శబ్దం పగిలిపోయినట్లు అమ్మాయిలు భారంగా వదులుతున్న గాలి చప్పుడు వినిపించింది. అమ్మాయిలంతా షాక్ అయిపోయి, ప్రాణం లేని నిశ్చలన చిత్రాలుగా మారిపోయారు. వాళ్ళ ముఖాల్లో ఆశ్చర్యం అరచేయి మందాన పేరుకుంది.

 

    "నిన్న రాత్రి ఆ యువకుడు వచ్చాడు..." అని ప్రారంభించి తను విమలాబాయికి చెప్పాలని వెళ్లడం, అక్కడ అతనికోసం వెదుకుతున్న మనుషులు కనపడడం అంతా చెప్పింది.

 

    చివరికి ముక్తాయింపుగా "ఇప్పుడూ అతను నా గదిలోనే వున్నాడు. అతనికి ప్రమాదం తప్పేవరకు వుంటాడేమో" అని ముగించింది.

 

    అమ్మాయిల్లో చిన్నగా వణుకు ప్రారంభమైంది. ఎవరో ఒక అపరిచితుడికి ఆశ్రయమివ్వడం, అందులోనూ ఆ యువకుడితో పక్క పక్క గదుల్లో పడుకోవడం వాళ్లకి మింగుడుపడడం లేదు. కొందరైతే కనురెప్పల్ని కూడా ఆర్పడం కూడా మరిచిపోయారు.

 

    "ఇదంతా పచ్చి నిజం. ఉదయం, మధ్యాహ్నం కైవల్య చేత నా టిఫిన్, భోజనం తెప్పించి అతనికి పెట్టాను. రాత్రుల్లో ఆ యిబ్బంది వుండదనుకుంటాను - కైవల్య రాత్రి భోజనం తినదు కాబట్టి ఆమె భోజనం అతనికి పెడదామనుకుంటున్నాను"

 

    మెల్లమెల్లగా గుసగుసలు ప్రారంభమయ్యాయి. అందరూ దానిమీద పక్కవారితో తమ అభిప్రాయాలు ప్రకటించాక "నేను చేసింది ముమ్మాటికి తప్పే. కానీ ఒక మనిషి ప్రాణం కాపాడాలన్న తపన నన్ను ఈ పనికి పురికొల్పింది. అయినా తప్పు తప్పే. అందుకే శిక్ష వేసుకుంటున్నాను"

 

    ఆమె ఏం శిక్ష వేసుకుంటూ వుందో ఎవరికీ అంతుబట్టలేదు. అయితే దాన్ని కనిపెట్టిన కైవల్య "వద్దు మౌనికా" అంటూ డయాస్ మీదకి పరిగెత్తింది.

 

    ఏం జరుగుతుందో అర్థంకాని అమ్మాయిలు అలా కైవల్య కేసి చూస్తున్నారు.

 

    డయాస్ మీదకి వెళ్ళిన కైవల్య మౌనిక కుడిచేతిని బలాన్నంతా ఉపయోగించి ఇవతలికి లాగేసింది.

 

    అప్పుడు తెలిసింది అక్కడున్న వాళ్ళకి మౌనిక ఏం శిక్ష వేసుకుందో? నిన్న రాత్రి అని మొదలు పెట్టినప్పటినుంచి ఆమె తన అరచేతిని కొవ్వొత్తి పైనే పెట్టి వుంచింది. అరచేయి పూర్తిగా కాలిపోతున్నా ఆ ధ్యాసైనా లేకుండా భరించింది.

 

    ఈ దారుణాన్ని చూసి కదిలిపోయి ఇద్దరమ్మాయిలు బిగ్గరగానే ఏడ్వటం మొదలుపెట్టారు. మిగిలిన వారి కళ్ళల్లో నీళ్ళు ఊరి డయాస్ మీదున్న మౌనిక మసగ్గా కనిపిస్తోంది. ఈ శిక్ష ముందు ఆమె చేసిన తప్పు చాలా చిన్నదిగా కనిపిస్తోంది.

 

    అందరి దగ్గరా వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నట్లు ప్రేమానంద అనే అమ్మాయి లేచి, అందరివైపు చూసి, ఆ తరువాత మౌనిక వైపు తిరిగి "మీరు చేసింది తప్పా ఒప్పా అని చర్చించడం కంటే అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా అదే చేస్తారని చెప్పగలను. ఓ మనిషి బయటపడితే అతనిని చంపేస్తారని తెలిసినప్పుడు ఎలా బయటికి పంపగలం?   

 

    కాబట్టి మీరు చేసింది చాలా సహజంగా వుంది. ఇందులో చిత్రించాల్సింది ఏమీ లేదు. "మీరు వేసుకున్న శిక్ష మాత్రం భయంకరమైంది" అని కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS