Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 27


    
    "ఏమిటీ, అప్పుడే వెళ్ళాలనుకుంటున్నారా?"
    
    "మీరు ఇక పడుకుంటారేమో కదూ?"
    
    "భాష మార్చుకోవాలి మీరు."
    
    అర్ధంకాలేదు ఆదిత్యకి.
    
    "ఇక నిద్రపోతారేమో కదూ అనాలి కాని పడుకుంటారా అని, అందులోనూ అమ్మాయిల్ని అడక్కూడదు."
    
    "సారీ" తత్తరపడ్డాడు "పొరపాటైపోయింది."
    
    నవ్వేసింది ఫకాల్న "మీలో నచ్చనిదిదే."
    
    "ఏమిటి?"
    
    "ప్రతి విషయంలోనూ అలా సరెండర్ కాకూడదు. కనీసం కొన్నింటిలో నయినా పోరాడి మీరే రైటని నిరూపించుకోవాలి."
    
    "కాని..." ప్రణయ కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు. "తప్పయి నప్పుడు కరెక్టు చేసుకోవాలి తప్ప ఆర్గ్యుమెంటెందుకు?"
    
    "ఆర్గ్యుమెంట్స్ మనిషిని షార్పెన్ చేస్తాయి కాబట్టి."
    
    "కాని పడుకుంటారా అనటం తప్పేగా?"
        
    "కాదు" టక్కున అంది ప్రణయ. "నిద్రపోవడమన్నది జరిగేది పడుకున్నాకనేగా?"
    
    "అవును."
    
    "పడుకున్నాక కూడా ఒక్కోసారి నిద్రపట్టకపోవచ్చుగా!"
    
    "అయితే?"
    
    "ఆ నిద్రకి హామీ మీ రివ్వలేరుగా! ఆలాంటప్పుడు పడుకుంటారా అని అడిగితే తప్పేమిటి?"
    
    "మీతో నేను మాట్లాడలేను."
    
    ప్రణయమీద ఏర్పడుతున్నది ఇష్టమో, లేక మరోలాంటి భావమో అతడికీ తెలీదు. కాని కలుసుకున్న ప్రతిసారీ ఇలాంటి చర్చే జరుగుతుంది. అయినా అది ఇబ్బందికరంగా అనిపించడంలేదు. ఉత్సాహంగా వుంటుంది. ఈ భావాన్నేమంటారో అతడికి తెలీదు.
    
    పుస్తక పరిజ్ఞానంలో ప్రణయకన్నా తక్కువవాడు కాకపోయినా మానసికమైన విశ్లేషణలో ఆమె ముందు స్వల్పంగానే మిగిలిపోతున్నాడు.
    
    "ఇబ్బందిగా వుందా?" అంది.
    
    "దేనికి?"
    
    "సరదాగా కలుసుకున్న ప్రతిసారీ ఇలా అల్లరి పెడుతున్నందుకు."
    
    "ఇది అల్లరిపెట్టడం కాదే!"
    
    "మరి?"
    
    "ఎడ్యుకేషన్."
    
    "అంటే నా దగ్గర మీరు స్టూడెంట్ గా మారిపోతుంటారా?"
    
    "మరే..."
    
    "మీకిది కూడా అలవాటన్నమాట. అదే....ముఖస్తుతి."
    
    "ఛ....ఛ! ఇది నిజం ప్రణయా! మీతో మాట్లాడడాన్ని ఇష్టపడతాను. మీకూ తెలీదు-స్వతహాగా నేను చాలా ముభావంగా వుండేవాడ్ని. కానీ మీతో పరిచయమయ్యాక..." బిడియంగా తలవంచుకున్నాడు. "మాటలూ నేర్చుకున్నాను."
    
    "నేర్చుకున్న ప్రతిదానికీ ఫీజు చెల్లించాలిగా?"
    
    "అడగండి."
    
    "ఇస్తారా?"
    
    "ఇవ్వగలిగిందైతే..."
    
    అరక్షణం పాటు నిశ్శబ్దంగా వుండిపోయింది ప్రణయ. "అడుగుతాను ఆదిత్యా! ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు."
    
    లిప్తపాటు ఆమె కళ్ళలోకి చూసి వెంటనే తల తిప్పుకున్నాడు.
    
    "చెప్పగలరా?" అడిగింది ప్రణయ.
    
    "ఏమిటి?"
    
    "నే నడిగే దేమిటో?"
    
    మరీ సిగ్గనిపించింది- "తెలీదు ప్రణయా!"
    
    "బహుశా కొంత ఊహించి వుంటారు మీరు."
    
    చాలా ఊహించాడు కాని అలా ఊహించాననడానికి మనస్కరించలేదు.
    
    "ఒక అమంయి అలా సమయం వచ్చినప్పుడు అడుగుతాను అనేది ఏ విషయంలోనూ మీరు అంచనా వేయగలరు ఆదిత్యా! ఒక జాతీయస్థాయి క్విజ్ కాంపిటీషన్ లో మొదటిస్థానంలో నిలబడగలిగే మీరు ఆమాత్రం అర్ధంకాని మనిషని నేను పొరపాటు పడటంలేదు. అయితే నేను ఏదో నిజంగా కోరుకోవాలని అలా అనలేదు."
    
    "మరి?" విస్మయంగా చూశాడు.
    
    "అలా మీలో ఓ ఊహకి అంకురం వేయాలనిపించింది. ఆ తరువాత అదేమిటో మీరు చెబితే వినాలనీ అనిపించింది. ఒకవేళ మీరు సూటిగా నేననుకున్న పాయింట్ కి వచ్చినా అణువంత కోపగించుకునేదాన్నేమో కూడా చిత్రం చూశారా?" నవ్వేసింది అల్లరిగా. "నిజానికి అల్లరిపెట్టడం అంటే యిది."
    
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    
    "వయసులో ఉన్న ఓ అమ్మాయి అబ్బాయితో అలా పరోక్షంగా వ్యక్తం చేసేది ప్రేమ విషయంలోనే కానక్కర్లేదు ఆదిత్యా....! తనమీద ఆసక్తి పెరిగేట్టు చేయాలని కూడా ఇప్పుడు చెప్పండి- మీరంటే నాకున్న అభిప్రాయం ఏమిటి?"
    
    చాలా సున్నితమైన ప్రశ్న అది. ప్రసక్తిని ఏ పక్కనైనా మళ్ళించే అవకాశముంది.
    
    ప్రణయలాంటి అసాధారణమైన తెలివీ, అంతస్తు గల అమ్మాయి ఇలా ప్రశ్నించింది ఎందుకో ఖచ్చితంగా అర్ధం కాకపోయినా, తనూ అంత తెలివి గానే జవాబు చెప్పాలనుకున్నాడు.
    
    "ఆనందంగా జీవించడమన్నది ఓ కళ అయితే ఆ కళ తెలిసిన అరుదైన అమ్మాయి మీరు."
    
    "ఎందుకలా అనిపించింది?"
    
    "నన్ను వెళ్ళనివ్వకుండా ఆపాలనుకున్నారు. ఆపటానికి ఓ కారణం కావాలి- మీ దగ్గరున్న పెద్ద ఆయుధం అందంగా మాట్లాడగలగటం. అందుకే పడుకుంటాను అని నేనన్న పదంతో మొదలుపెట్టి ఇలా పదాలు పేర్చుకుంటూ పోయి పదిహేను నిముషాలపాటు ఆపేయగలిగారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS