Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 26


    అసలు అతడితో పరిచయమూ చిత్రంగా జరిగింది.
    
    ఎమ్మెల్యేగా ఎన్నికయిన వాసుదేవరావుని ఓ ఉద్యోగం విషయంలో రికమెండ్ చేయమని అడగటానికి గెస్ట్ హౌస్ కి వెళ్ళింది.
    
    ముందురోజు మరోరోజు రమ్మన్నాడు. మరోరోజు వెళ్ళాక మరేదో కావాలన్నాడు. ఆ మరేదో అందివ్వటం ఇష్టంలేక మందు సేవిస్తున్న వాసుదేవరావుకి దూరంగా వెళ్ళబోయింది.
    
    సాధ్యంకాలేదు. కాదు- సాధ్యం కాకుండా చేశాడు. ఆమె ప్రతిఘటించింది. కానీ లాభం లేకపోయింది.
    
    అంతే! ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. 'పోలీసులు, ప్రభుత్వం' అంటూ బజారు కెక్కలేదు.
    
    తనమీదే ఆధారపడి బ్రతుకుతున్న వృద్ద తల్లిదండ్రులమీద, తనమీద జాలి కావచ్చు.... లేదా తనమీద తనకే ఏర్పడ్డ జుగుప్స కావచ్చు.
    
    అతఃదిని ఎదిరించి బ్రతకలేనని తెలుసుకున్నాక దాన్నే బ్రతుకుగా మార్చుకుంది.
    
    ఏరోజుకన్నా తనకు అణువంత ఆశ్రయం అతడు ఇస్తాడేమో అని కలలు కన్నా ఆ తరువాత ఆమె మానం అతడధిరోహించబోయే స్థానాలకి సోపానంగా మార్చడంతో, నిశ్శబ్దంగా ఆ జీవితాన్ని అంగీకరించింది.
    
    ఇప్పుడిప్పుడే తనపైన తనకే జుగుప్సలాంటిది కలుగుతున్నా, ఆ స్థితిలో అంతకుమించి ఏం చేయాలో తెలీక, అనుక్షణం కుమిలిపోకుండా ఆ స్థానాన్ని కాపాడుకోవాలనుకుంటూంది.
    
    ఇప్పుడు నిజానికి డబ్బుకి కొదవలేదు. పెద్ద ఇల్లు, పెద్ద కారు చాలా వున్నాయి.
    
    కానీ ఏదో వెలితి. జవసత్వాలు ఉడికిపోతున్నాయన్నభయం. డబ్బొక్కటే కాదు ఆనందాన్నిచ్చేది అన్న ఆలోచన.
    
    భ్రాంతిలాంటి జీవితంలో ఎండమావుల వెంట పరుగుపందెం.

    ఎక్కడో ఏ గుండె అరల్లోనో దీనికంతటికీ వాసుదేవరావే కారణమన్న ఉక్రోషం.
    
    "ఏమిటి ఆలోచిస్తున్నావు?" అడిగాడు వాసుదేవరావు.
    
    బడలికగా నవ్వింది- "నా గురించి."
    
    "నీకేమైంది?"
    
    చాలా చిన్నప్రశ్నే కానీ ఒక జీవితమంత జవాబు వుంది. ఆ జవాబు అతడికి తెలిసినా అమాయకంగా అడుగుతున్నాడు.
    
    "నేను చాలా అందగత్తెను కదూ?"
    
    "అనుమాన మెందుకొచ్చింది?"
    
    "అనుమానం కాదు" క్షణం ఆగి అంది- "ఇంత అందముండీ ఈ విషయంలో మీకేమీ సహాయపడలేకపోతున్నందుకు అవమానం."
    
    జీవితం నేర్పిన తెలివో, లేక అతడి సంపర్కంలో అబ్బిన రాజకీయ పరిజ్ఞానమో, మృదువుగా అతడిని మభ్యపెట్టింది- "లేకపోతే మీకు చాలాచోట్ల సాయపడ్డ నా అందం రాయ్ విషయంలోనూ సాయంగా మారేది."
    
    "రాయ్ వయసు పైబడ్డవాడు" ఆ విషయం యిక్కడ చర్చించడం అతడికి అసహ్యంగా వుంది. "పైగా ఇలాంటి వ్యవహారాలు అలా పరిష్కృతము కావు."
    
    "మరేం చేద్దామనుకుంటున్నారు?"
    
    "అసలు నేను ఎక్కువ వర్రీ అవుతున్నది ప్రబంధ గురించి."
    
    "పోనీ ప్రబంధని నేను మార్చనా?"
    
    "మార్చటానికి ప్రబంధ పార్టీ కాదు."
    
    చురుక్కుమంది సౌదామినికి. అయినా తనూ నవ్వేసింది.
    
    "ప్రబంధ తల్లి ప్రేమ తెలీకుండా పెరిగిన ఆడపిల్ల."
    
    "అయితే?"
    
    "నేను ఎలాగూ తల్లిని కాలేను. కానీ ప్రబంధకి తల్లిగా మారి ప్రబంధని మీ ఆలోచనలకి అనుగుణంగా మారుస్తాను."
    
    "అసాధ్యం."
    
    "నేను చాలా అసాధ్యాల్ని సాధ్యాలుగా మార్చాను."
    
    "ప్రబంధ మొండితనంలో నా కూతురు."
    
    "ఆ కూతురు తండ్రినే నా ఆకర్షణలో వుంచుకున్న ఆడదాన్ని నేను."
    
    కోపం రాలేదు వాసుదేవరావుకి. సౌదామిని తమ సంబంధాన్ని ఇంత ఆత్మవిశ్వాసంతో ప్రకటించటం ఆనందమనిపించింది.
    
    "కొంతకాలం ప్రబంధతో ఉంటే నీకే తెలుస్తుంది సౌదీ!"
    
    "ఉన్నాక ఆమె ఎంత మారిపోయిందీ మీకూ అర్ధమవుతుంది."
    
    "ఛాలెంజ్ చేస్తున్నావా?"
    
    "దానికి మీరే పేరుపెట్టినా నాకు అభ్యంతరంలేదు."
    
    "అయితే సాధిస్తానంటావ్!"
    
    "సాధించడమే కాదు, ఆరు నెలల్లో మీ అమ్మాయి 'పెళ్ళీ-పెళ్ళీ' అని మీ వెంటపడేట్టు చేస్తాను."
    
    "పందెమా?"
    
    "ఎస్" ధీమాగా అంది. "అలా నేను మార్చగలిగితే మీరు నాకేమిస్తారు?"
    
    సాలోచనగా అన్నాడు- నిన్ను రాజ్యసభకి మెంబర్ని చేస్తాను."
    
    రెప్పలార్పకుండా చూసింది అరనిమిషంపాటు.
    
    "మాట నిలబెట్టుకుంటారా?"
    
    "నేను వాసుదేవరావుని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని."
    
    "సరే.... నేను రేపే బయల్దేరుతున్నాను."
    
    చాలా గమ్మత్తుగా నిర్ణయం జరిగిపోయింది.
    
    ఆమెను వదిలించుకోవాలని అనుకుంటున్న ముఖ్యమంత్రి ఈ మార్గంలో ఆమెని తనకు దూరంగా పంపుతున్నాడని సౌదామినికి తెలీదు.
    
    అతడికి దూరం కావాలని ఇప్పుడిప్పుడే ఆమె కూడా కోరుకుంటుందని వాసుదేవరావుకీ తెలీదు.
    
    అదే... ఒక బలమైన రాజకీయవ్యవస్థ పునాది కదలటానికి కారణమైంది.
    
                                                                 * * *
    
    రాత్రి తొమ్మిదిన్నర కావస్తూంది.
    
    విశాఖపట్టణం వాల్తేర్ అప్ లేండ్స్ లోని ప్రణయ ఇంట్లో అంతసేపూ కూర్చున్న ఆదిత్య ఇక వెళతానన్నట్లుగా లేచాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS