నవ్వేసింది. కాదు పడి పడీ నవ్వింది.
"నిజం కాదా?"
"యూ ఆర్ క్లెవర్ ఆదిత్యా!" పంటి బిగువున నవ్వు ఆపుతూ అంది. "మీకూ ఆడపిల్లల మనస్తత్వం అర్ధమైపోయింది. నిజమే, మీరు వెంటనే వెళ్ళడం నాకు ఇష్టంలేకపోయింది. అందుకే టాపిక్ లేకుండా ఇంతసేపూ మాట్లాడింది."
ఎందుకో ఆదిత్య మనస్సు కలుక్కుమంది. ఇలా తను చెప్పింది నిజమే అనకుండా ప్రణయ మరో నిర్వచనం చెప్పి 'మీరంటే యిష్టం ఆదిత్యా! అంటే ఆనందించేవాడేమో.
ఒక తెలివయిన అమ్మాయి ఇష్టాన్ని యిలాగే వ్యక్తంచేస్తుందని వూహించలేకపోయిన ఆదిత్య "వెళతాను మరి" అన్నాడు మళ్ళీ.
"మీరొట్టి పప్పు ముద్ద"
"అదేం?"
ప్రశ్నలకి జవాబు చెప్పడం తప్ప జవాబుకి అందని ప్రశ్నలు కొన్ని వుంటాయని వూహించలేరు."
ఈ స్టేట్ మెంట్ కి అర్ధం తోచలేదు.
"ఏమిటీ అమ్మాయి? క్షణం రెక్కల్ని టకటకా కొట్టుకునే చిన్న పావురాయిలా కనిపిస్తూ మరుక్షణం అర్ధంకాని భాషలో రాసిన ఉద్ర్గంథంలా అనిపిస్తుందేం?
అపార కృపాతరంగితాలైన నయనాలతో ధైర్యాన్నిస్తూ అంతలోనే స్నిగ్ధ దరహాస పరిమళాల్ని అదృశ్యంచేసి, ఒంటరి సౌధాంతగర్భాన దేన్నో శోధించే ఆర్తిలా ధ్వనిస్తూందేం?
ఆమె భావప్రకటనలోనా, లేక తను అర్ధం చేసుకోవడంలోనా- ఎక్కడుంది లోపం?
అసలిలా ఆలోచించడాన్నేమంటారు?
సిద్దాంత చర్చకోసం ఓ సమస్య ఉంటే తప్ప స్థిమితంగా మాట్లాడలేని వ్యక్తులు మాత్రమే కనిపించే ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో ఏదీ లేకుండా ఎన్ని గంటలపాటైనా చర్చించగల శక్తి ఆమెకెలా అబ్బింది?
"ఏమిటి మహానుభావా! వెళతానని చెప్పి ఆలోచనల్లో కూరుకుపోయారేమిటి?" అడిగింది మృదువుగా.
"ఇది కూరుకుపోవటం కాదు."
"మరి?"
"ప్యూనరల్ అనే పదంలోని అక్షరాలనుంచి మరో మంచి భావాన్ని చెప్పగలరా?"
క్షణం ఆగి అంది. "ఫ్యూనరల్ ని మరోలా పేర్చితే రియల్ ఫన్ అవుతుంది."
"దటీజ్ ప్రణయ" అభినందనగా అన్నాడు. "మీరు ఫ్యూనరల్ ని కూడా రియల్ ఫన్ గా మార్చగల వ్యక్తి."
"మరి తెల్లవార్లూ ఇలాగే మాట్లాడుతూ మీరూ ఆ రియల్ ఫన్ ఎంజాయ్ చేయొచ్చుగా!"
"అభ్యంతరం లేదు" అసంకల్పితంగా అన్నాడు.
"కాని నేను వుండనివ్వనుగా!"
"బలవంతంగా వుంటానూ అంటే?"
"బెదిరించి పంపిస్తా."
"కానివ్వండి."
"కాని బలంతో కాదు."
"మరి?"
"తెలివితో."
"చూడాలని వుంది నాక్కూడా."
"నిజమా?"
క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు. "నిజం ప్రణయా! ఎందుకో మీ ముందు మేధలో నేనెంతటివాడినో తెలుసుకోవాలనుంది."
ఆమె నేత్రాలు విప్పారితాలయ్యాయి. "అంటే ప్రబంధలా నేను ఓడిపోతా ననుకున్నారా?"
"అని ఖచ్చితంగా అనలేను" ఏ ఉద్విగ్నత ఆదిత్యనలా మాట్లాడించిందో అతడికి తెలీదు. "కాని నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది."
ప్రణయ మొహంలో ప్రసన్నత చెరిగిపోలేదు. కాని కొద్దిగా సీరియస్ నెస్ చోటుచేసుకుంది. "మీ నమ్మకాన్ని నేను అభినందిస్తున్నాను ఆదిత్యా! ప్రపంచం మనగురించి పట్టించుకోని ఈ సమయంలో మీతో నాకూ చిన్న పోటీకి దిగాలని వుంది కాని మీరు ఓడితే నాకేమిస్తారో అదిచెప్పండి."
"అది మీరే అడగొచ్చు."
"నేను అడిగేది మీ దగ్గర లేకపోవచ్చు."
"నా దగ్గర వున్నదేదో మీకు తెలుసుగా?"
"సరే..." భావరహితంగా అంది- "మరి నేను ఓడిపోతే?"
"మీరు ఇవ్వగలిగిందే నేనూ అడుగుతాను."
"మరోసారి ఆలోచించుకోండి ఆదిత్యా!"
"నేను సిద్దంగా వున్నాను."
ఆదిత్యలో ఏదో మార్పును గమనించింది ప్రణయ.
తొలిరోజు పరిచయానికీ, ఇప్పటికీ చాలా దైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఒకరికోసం మరొకరు ప్రదర్శించే ఆసక్తికి ఇద్దరూ అలా రూపం ఇవ్వాలను కుంటున్నారేమో!
"కూర్చోండలా" అంది. ఆదిత్య కూర్చోగానే తనే గెలుస్తానన్న నమ్మకంతో చెప్పింది- "ఒకవేళ మీరు ఓడితే నేను ఎప్పుడో ఏదో అడగను. ఈ రాత్రికే అడుగుతాను."
"సరే."
"వెనకాడకూడదు."
"ప్రామిస్."
"వెల్" ప్రణయ ఉద్విగ్నంగా అంది. "ఆకతాయితనంగా మొదలైన పందెంలో ఎవరేం నష్టపోయినా గాని మనం ఒకర్నొకరం పూర్తిగా తెల్సుకోవటానికి ఇది నిజమైన పరీక్షగా భావిస్తున్నాను ఆదిత్యా! ఇప్పుడు చెరో పదిహేను ప్రశ్నలు వేసుకుంటూ మార్క్సు ప్రిపేర్ చేద్దాం. ఏ టాపిక్ మీదయినా సరే. ఓడినవారు గెలిచినవాళ్ళు అడిగింది యివ్వాలి. జవాబుకి గడువు లేదు. ఎంత టైమైనా తీసుకోవచ్చు."
