అప్పుడు స్మగ్లింగ్ లాంటిది ఏదో అయి వుంటుందని భావించాను. కానీ, ఇప్పుడు నువ్వు చెప్పే మాటలనుబట్టి అవి దొంగనోట్ల సూట్ కేసులు అయి వుంటాయనిపిస్తుంది."
"సో...ఈ రాకెట్ కు మూలవిరాట్ జయచంద్ర అన్నమాట" అన్నాడు వీరేష్.
ఆమె అవునన్నట్టు తలవూపింది.
అటు తిరిగి, ఇటు తిరిగి ప్రస్తుతం ఏ.సి.పి వీరేష్ ఆలోచనలు అన్నీ జయచంద్రపై కేంద్రీకృతమయ్యాయి.
అయితే వాళ్ళిద్దరి సంభాషణను మూడవ వ్యక్తి విన్నట్టు ఆ ఇద్దరికీ తెలియదు.
* * * *
అది మూతపడిన సినీ స్టూడియో.
దానికి ఎదురుగా కిరణ్ ఫోటో స్టూడియో
స్టూడియో కౌంటర్ లో వున్నాడు ఫోటో గ్రాఫర్ కిరణ్.
అతనికి తన దగ్గరవున్న ఫోటోలను చూపించాడు వీరేష్.
అతను కొన్ని క్షణాలుఆ ఫోటోలను నఖశిఖపర్యంతం పరీక్షించాడు.
"వీళ్ళలో ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేను కానీ, మొత్తానికి వీళ్ళు ఆరోజు ఈ పరిసరాలలోనే తచ్చట్లాడినట్టు గుర్తు" అన్నాడు అతను.
వీరేష్ కు ఆ మాత్రం క్లూ దొరకడం ఆనందంగా వుంది.
వెంటనే కవర్ లోంచి జయచంద్ర ఫోటో తీసి చూపించాడు.
"లేదు సార్... ఆ రోజు కారులో వచ్చింది ఇతనుకాదు"
వీరేష్ భృకటి ముడిపడింది.
ధీరజ చెప్పిన మాటలనుబట్టి ఇంచుమించు అందరూ జయచంద్ర చేతికింద పనిచేస్తున్న వాళ్లేనని అర్దమయింది.
దొంగనోట్ల వ్యవహారంలో పరోక్షంగా ఆ రాకెట్ నడిపే వాళ్ళకు జయచంద్ర సహకరిస్తుండి వుండవచ్చు.
ఆరోజు చతుర్వేదిని చంపిన వ్యక్తిని ఫోటోగ్రాఫర్ స్పష్టంగా చూశాడు.
జయచంద్ర ఫోటోచూసి అతనుకాదుఅని తేల్చి చెప్పడాన్నిబట్టి అతను నిజమే చెబుతున్నాడు అనిపించింది అతనికి.
కాకపోతే ఈ కేసులో అప్పటివరకు చిన్న ఆధారంకూడా దొరకలేదు.
అయితే జయచంద్ర మనుషులే ఆ ఘాతకం వెనుక వున్నారు. అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు అతనిపై నిఘావేస్తే ప్రయోజనం వుండవచ్చు.
ధీరజ ఎటూ అతని విషయంలోనే పరిశోధిస్తుంది కాబట్టి తనకు మరింత అవకాశం వున్నట్టే అనుకుంటూ తన ప్లాట్ వేపు కారుని పోనిచ్చాడు వీరేష్.
ఆశ్చర్యం... ప్లాట్ లాక్ చేసి స్లిప్ పెట్టి వుంది.
"సారీ డియర్... నువ్వు వచ్చేదాకా రెస్ట్... రెస్ట్ అంటూ బెడ్ మీద పడుకుని వుంటే నా పనులు అన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఆగిపోయి వున్నాయి_ అందుకే వెళుతున్నాను."
ఆ ప్రయత్నంగా ధీరజ ఇంటివైపు కారుని పోనిచ్చాడు.
ఏ.సి.పి. వీరేష్ నెట్టగానే తెరుచుకున్నాయి తలుపులు.
లోనికి అడుగు పెట్టిన వెంటనే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి బిత్తరపోయాడు.
నలుగురు ఆగంతకులు చూట్టూ నిలబడి వున్నారు.
మధ్యలో చేతులు కట్టిపడేసి వుంది ధీరజ.
ఆమె ముందు మరో ఇద్దరు కూర్చుని వున్నారు.
"ఒరే... చేవచచ్చిన వెధవల్లారా... చేతులు కట్టేసి దౌర్జన్యం చేయడం కాదురా. కట్లు వూడతీయండిరా ఆడంగి వెధవల్లారా..." ధీరజ రొప్పుతూ అంటుంది.
"వారెవ్వా... కోపంలో కూడా నవ్వు చాలా బాగుంటావు... పొగరుబోతు గుర్రాన్ని కట్టేయాల్సిందే. నీ పొగరు దిగున తరువాత కట్లు విప్పుతాం. వరసగా నీ అందమయిన శరీరాన్ని పంచుకున్నాక నీలో ఓపిక ఇంకా వుంటే అప్పుడు ఎదురుదాడి చేద్దువుగానీ..." వెకిలిగా నవ్వూతూ అన్నాడు ఒకడు.
మిగిలిన వాళ్ళంతా అతని నవ్వుతో శృతి కలిపారు.
మరి ఒకడు మరింత చొరవచేసి ఆమె బ్లౌజ్ ని పట్టి గుంజడంతో పీలకలయిపోయింది.
ఆ దృశ్యం చూడడంతో వీరేష్ పళ్ళు పట పటా నూరాడు.
వీరేష్ రావడం గమనించి కోపంగా వెనుదిరిగారు వాళ్ళు.
"రేయ్..." సింహగర్జన చేస్తూ ఒక్కసారిగా ఆ నలుగురిమీదకు లంఘించాడు వీరేష్.
నాలుగంటే నాలుగు కిక్ లతో ఆ నలుగురూ దిమ్మతిరిగి కళ్ళు తేలవేశారు.
రెండో రౌండ్ కే గగ్గోలు పెడుతూ పరుగు లంకించుకున్నారు.
కట్లు విప్పదీసిన మరుక్షణం చిన్నపిల్లలా అతనని అల్లుకుపోయింది"లేడీ కమెండోగారి సాహస లీలలు ఇకనయినా చలిస్తారా?"
అంటున్న వీరేష్ వేపు బేలగా చూసిందామె.
"వీరూ.... నువ్వు రావడం ఇంకొంచెం ఆలస్యం అయి వుంటే ఏం జరిగి వుండేదో తలుచుకుంటుంటే నా ఒళ్ళు జలదరిస్తుంది" కళ్ళవెంట వీరు ఉబికింది.
"పిచ్చి పిల్లా... ఏమీ కాలేదుగా? నేను వచ్చేశానుగా? ఊరుకో"
"ప్లీజ్ వీరూ! నాకు ఎందుకో భయంగా వుంది. నాలో ఇంత బేలతనం ఎలా వచ్చిందో నాకు అర్ధం కావడంలేదు. ఈ రాత్రికి ఇక్కడే నాదగ్గిరే వుండిపో. నీతోడు లేకపోతే ఇక నేను బతకలేను అనిపిస్తుంది"
ధీరజను నడిపించుకుంటూ తీసుకెళ్ళి బెడ్ పై పడుకోబెట్టాడు అతను.
"వీరూ.... నన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళవద్దు."
"ఓకే..ఓకే.. టెన్షన్ ఫీల్ కావద్దు"
"పెళ్ళి కాకుండానే ఒక రాత్రి అంతా తనతో ఉండిపోమంటుందేమిటా అనుకుంటున్నావేమో! నీపై నాకా నమ్మకం వుంది. భార్యాభర్తలం కానంత మాత్రాన ఒకే బెడ్ పై పడుకుంటే అపవిత్రులమైపోము. మన మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు ఈ సమాజానికి భయపడనవసరంలేదు."
"ధీరజా.... నా విషయం అలావుంచు! ఎందరో వుంటున్న అపార్ట్ మెంట్ ఇది. ఒక రాత్రి పెళ్ళికాకుండానే మనం గదిలో వున్నాం అని తెలిసిన మరుక్షణం నిన్ను చులకనగా చూస్తారు.
"ఏడిచారు... ఇందాక అంతమంది గూండాలు వచ్చి నా శీలాన్ని హరించబోతే ఎలాంటి ప్రతిఘటనా చేయలేని వాళ్ళకు నన్ను నిందించే హక్కు వాళ్ళకు ఎవడు ఇచ్చాడు? ఐ డోంట్ కేర్! నాకు నువ్వు... నీకు నేను_ దట్సాల్" ధీరజ స్థిరంగా అంది.
ఏం చెప్పటానికి వీరేష్ కు సమాధానం దొరకలేదు.
అలాగే అతని గాఢపరిష్వంగంలో ఒదిగి పడుకున్న ధీరజ నిర్బీతిగా, హాయిగా నిద్రపోయింది.
వీరేష్ మాత్రం ఆ రాత్రి నిద్ర కరువయిపోయింది.
బయట ఎవరో తలుపులు దబదబా బాదుతున్న చప్పుడు...
వీరేష్ వెళ్ళి తలుపు తెరిచాడు.
పక్కపోర్షన్ దంపతులు నిల్చుని వున్నారు.
అతన్ని చూడగానే గతుక్కుమన్నారు.
"ఏమిటి? ఏం కావాలి మీకు?"
