Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 26

"ఎందుకేమిటి? ఎంచక్కా నువ్వే మళ్ళీ అన్నీ విప్పేస్తావు కదా_ అందుకుని"
"ఏయ్ పిల్లా... ఏదో పోనీలే పాపం ఆపదలో ఉంది  కదా అని ఆదుకుంటే తెగరెచ్చిపోతున్నావు. కావాలని అలా చేసావే అనుకో ఈ సారి నిజంగానే వదిలివేసిపోతాను. అర్ధం అయిందా?"
"అబ్బా... అప్పుడే అంత కోపం తెచ్చుకోవాలా? ఏంటి?"
లోగొంతుకతో నసగడం విన్న ఏ.సి.పి. వీరేష్ పెదవులపై చిరునవ్వు తొంగి చూసింది.
అది గమనించిన ధీరజ ఫక్కుమని నవ్వింది.
ఆ గది నవ్వులతో ప్రతిధ్వనించిపోతుంది.
అంతవరకూ ఆ గది చాటున పొంచి వున్న వ్యక్తి వాళ్ళ మాటలన్నీ శ్రద్దగా ఆలకించి.... ఇంకా ఎలాంటి సంభాషణా దొర్లడం లేదు అని అర్ధం కావడంతో మెల్లగా రోడ్ మీదకు చేరుకున్నాడు.
   
                       *    *    *    *
ఫోరెన్సిక్  లాబ్ లో సిరలాజికల్ టెస్ట్ జరిపారు.
ఆ టెస్ట్ లో స్టూడియోలో సేకరించిన ఎండిన రక్తపుమరకలు ఇన్ స్పెక్టర్ చతుర్వేదివి అని తేలిపోయింది.
అదీకాక ఆ స్థలంలో దొరికిన స్టార్ అతని యూనిఫారమ్ కు చెందినదే అనికూడా తెలియడం వలన చతుర్వేదిని స్టూడియోలో చంపారని ఇన్ వెస్టిగేషన్ లో నిర్దారించాడు వీరేష్.
సైదాబాద్ గూండాలు అ హత్య వెనుక ఉన్నారు అని తేలింది.
సైదాబాద్ స్టేషన్ లోని రౌడీ షీటర్ల ఫైల్స్ అన్నింటినీ ముందు వేసుకున్నాడతను.
రకరకాల నేరాలతో నేరస్థులుగా  నమోదు కాబడి తర్వాత నిర్దోషులుగా విడుదుల అయినవారే ఎక్కువుగా వున్నారు.
వాళ్ళ చరిత్రలు చదువుతుంటే వాళ్ళు తప్పక ఆ ఘోరాలు చేసి ఉంటారు అనే ఎవరయినా భావించక తప్పదు. కానీ న్యాయస్థానం మాత్రం ఏ రౌడికీ ఎలాంటి శిక్ష విధించలేకపోయింది.
ఎవరో ఒకరు వారికి బాక్ గ్రౌండ్ ఇన్ ఫ్లుయెన్స్ చేయడం వలన నిరపరాధులుగా బయటపడి తిరిగి నేరాలు చేయడానికి అలవాటు పడిపోయారు. వాళ్ళకు ఒకవైపు రాజకీయం రక్షగా నిలిస్తే మరి ఒకవైపు కిరాయి దాదాలు భుజం కాస్తూ ఉంటారు.
చాలా కేసులలో అసలు నేరస్థులనే గుర్తించినట్టు దాఖాలలు లేవు.
బహిరంగంగా వాళ్ళు తిరుగుతున్నా పోలీసుల ఫైళ్ళలో మాత్రం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆచూకీ తీస్తున్నట్టుగానే నోట్ చేయబడి వుంది తప్ప మరి ఎలాంటి ప్రోగ్రస్ కనిపించలేదు.

    వీరేష్ కులంకషంగా అన్ని సి.డి. ఫైల్స్ ను తిరగేసి రౌడీషీటర్ల లిస్టును తయారు చేశాడు.
వాళ్ళలో శిక్ష అనుభవించేవారిని,చనిపోయిన వాళ్ళను, తనకు అనవసరం అనిపించిన వాళ్ళను తీసివేయగా చివరగా పదిమంది తేలారు.
 ఈ పదిమంది నిందుతులను ఒక పట్టుపడితే ఆ దొంగనోట్ల రాకెట్ నడిపే ఘరానావ్యక్తి ఎవరో, ఇన్ స్పెక్టర్ చతుర్వేదిని ఎవరు చంపారో, తనపై హత్యా ప్రయత్నం చేసింది ఎవరో తేలిపోతుంది.
పదిమంది పూర్తి వివరాలను వాళ్ళ ఫోటోలతో ఫైలుగా తయారుచేసి బయటపడే సరకి సాయత్రం అయింది.
వీరేష్ అసలు తను ఏ పనిమీద బయలుదేరాదో అప్పుడు గుర్తుకు వచ్చింది.
హడావిడిగా హెల్త్ క్లబ్ సెంటర్ కు బయలుదేరాడు.
క్లబ్ సెక్రటరీ ఆఫీసులోనే వుంది.
వీరేష్ చెప్పింది వినడంతో గాభరా పడిపోయిందామె.
"అతను మీ కానిస్టేబుల్ నే అని చెబితే... ఆ కూల్ డ్రింక్స్ ను మా బోయ్ చేత పంపించాను. అంతేతప్ప మీపై హత్యాప్రయత్నం చేయడానికి పంపించారని  నిజంగా నాకు తెలియదు సార్.... నన్ను నమ్మండి" కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతూ వేడుకున్నది ఆమె.
ఆమె చెబుతున్నది నిజమేనని అనిపించింది అతనికి.
ఎందుకంటే, నిజంగా చంపాలని ప్రయత్నించేవాళ్ళు అలా తమ ఐడెండిటీని బయటపడేలా ప్రవర్తించరు. అందుకే ఇలాంటిదే ఏదో జరిగి ఉంటుందని వీరేష్ ముందే వూహించాడు.
"లుక్ మేడమ్... మిమ్మల్ని కలిసిన వ్యక్తి ఈ ఫోటోలలో ఎవరయినా ఉన్నాడేమో గుర్తు పట్టగలరా.... ప్రయత్నించండి"
"నో....వీళ్ళలో ఎవరూ లేరా?"
ఎవరూ లేరా...?"
లేరు అన్నట్టు పెదవి విరిచింది ఆమె.
వీరేష్ నిరుత్సాహంగా వెనుదిరిగాడు.
ఇంటికి వెళ్ళిన తరువాత ధీరజకు జరిగింది చెప్పడంతో ఆమెలో ఆవేశం తొంగి చూసింది.
"థాంక్స్ వీరూ...ఈ ధీరజ అంటే అడబెబ్బులి అన్నా విషయం మరచి పోయినట్టున్నారు. పిరికిపందల్లా దొంగదెబ్బలు తీసేబదులు ఎదురుగా రావచ్చు కదా! నేనంటే ఏమిటో నిరూపిస్తాను. నన్ను చంపాలని చూసింది ఎవరో వాళ్ళ అంతు చూస్తాను" ముక్కుపుటాలు ఎగురువేస్తూ అంది.
"ఇట్స్ అల్ రైట్ ధీరజా... ఆవేశపడకు.... విశ్రాంతి తీసుకో"
"నెవ్వర్... రేపు ఉదయమే ఆగిపోయిన నా పరిశోధనను మొదలుపెడతాను. నాపై హత్యాప్రయత్నం చేసిన వాళ్ళను అంత తేలికగా వదలను."
ధీరజ గొంతు స్థిరంగా అంది.
తను ఏం చెప్పినా వినే స్థితిలో లేదని అర్ధం కావడంతో వీరేష్  మౌనం వహించాడు.
అతని చేతిలో వున్న సైదాబాద్ గూండాల ఫోటోలు చూసి ఆశ్చర్యపోయింది ధీరజ.
"వీళ్ళ ఫోటోలు నీ చేతికి ఎలా వచ్చాయి?"
"వీళ్ళ ఎవరో నీకు తెలుసా?"
"ఎందుకు తెలియదు... జయచంద్ర మనుషులు వీళ్ళు..."
బీరువా వద్దకు నడచి వెళ్ళి అడుగునవున్న సీక్రెట్ షెల్స్ లో నుంచి కొన్ని ఫోటోలను తీసి వీరేష్ కు అందించింది.
వాటిని చూడడంతో వీరేష్ బిత్తరపోయాడు.
సూట్ కేసులను ఇందిరా పార్క్ లో మార్చుకుంటుండగా తీసిన ఫోటోలు అవి.
వీరేష్ ఆశ్చర్యపోయింది అందుకుకాదు.
తను ఎవరినయితే దొంగనోట్లముఠాకు సంబంధం వున్నదని భావించి వెదుకుతున్నాడో ఆ పదిమందిలోని నలుగురు వ్యక్తులు ఆ ఫోటోలలోవున్నారు.
"ధీరజా! ఎప్పుడు తీశావు ఈ ఫోటోలను?"
"కొద్దిరోజుల క్రితం ట్రెజర్ హంట్ జరిపారు గుర్తుందా? దీనిలో ఏదో గూడుపుఠాణీ వుందనిపించి పాల్గొన్నాను. అంతేకాదు, జయచంద్ర మనుషులు అక్కడక్కడా తచ్చట్లాడుతూ కనిపించడం నాలోని అనుమానాన్ని బలపరిచింది. ఆ మిస్టరీ చేదించేవరకూ నేను నిద్రపోనని నీకు తెలిసిందేకదా. అందుకే వాళ్ళను ఒక కంట కానిపెడుతూనే వున్నాను.
తమను ఎవరూ గమనించడంలేదు అనే ధీమాతో ట్రెజర్  హంట్ ను అడ్డు పెట్టుకుని సూట్ కేసులను మార్పిడి చేసుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS