అబ్బాయిగారిని కొంచెమయినా బాధ పెట్టకండి. వస్తువులు మనుషుల సాయం ఏది కావలసి వచ్చినా దివాణాలకు వచ్చి తీసుకోండి! దివాణం వేరు ఈ యిల్లు వేరు కాదు.
మీరు మనుషులతో పాటు మీరంతా నావారే!" అని చెప్పింది పనివారికి. పనివారి ముఖంలోకి కళ వచ్చేసింది.
వారంతా మరో క్రొత్త యజమాన్యంలోకి క్రొత్త ప్రపంచంలోకి కాలుపెట్టినట్లు సంతోషించారు. ఆ యింటి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అంతా ఆమని తన బాధ్యతగా తీసుకుంది.
కొనవలసిన వస్తువులు అమర్చవలసిన తీరు అంతా ప్లాన్ చేసి కాగితం మీద వ్రాసుకుంది! ఉన్నది చాలా కొద్ది సమయం కాబట్టి అందుకు తగిన ప్లానింగ్ యిచ్చి దివాణంలో డబ్బు తీసుకోమని ఆదేశించింది.
ఆ రెండు కుటుంబాల మధ్య రెండు అనే పదం ఒకటి అయింది ఆ క్షణంలోనే! ఈ హడావిడి అంతా చాచి వాల్మీకి ఆశ్చర్యపోయాడు.
అతని హృదయం తలిదండ్రులు దూరం కావటంవల్ల ఒంటరితనం వల్ల కాలిన పెనంలా అయిపోయి ఉంది.
దానిమీద వాత్సల్యపు జల్లులు చిలకరించింది సుమిత్రాదేవి.
అతడు ఆర్ద్రతా భావాన్ని పొందాడు.
నేను ఒంటరివాడను కాను. వీరంతా నా వాళ్ళే అనే భావం దృఢముగా నాటుకుపోయేలా అతని గుండెల మీద ముద్రలు రచించిందామె. సుమిత్ర గురించి ఎప్పుడూ ఏవో గంభీరమయిన వార్తలు వింటూ ఉండేవాడు వాల్మీకి. ఆ గాంభీర్యం వెనుక ఎంత పెద్ద ప్రేమ సముద్రం ఉందో ఇప్పుడు అతనికి బాగా అర్ధమయింది.
"అత్తాయమ్మగారూ! నాకేమీ పనిలేకుండా చేస్తున్నారు. కాలక్షేపానికి అయినా కాస్తంత పని ఉండాలి కదా?" అన్నాడు.
ఆ పిలుపుతో మరింతగా పులకించిపోయింది సుమిత్ర. ఆ పిలుపు కోసం ఎంత కాలంగా ఎదురుచూస్తోంది తాను.
వారసుడు కోసం ఆమె పెట్టుకున్న ఆశలు కంటున్న కలలు ఆ పిలుపుకు పులకించి చివురించినట్లుగా అయినాయి.
"బాబూ! పెళ్ళి అయిన మరుక్షణం నుంచి ఈ రెండు కుటుంబాల బాధ్యతల్ని మగవాడుగా నువ్వే మోయాలి! ఈ ఆడ పెత్తనాలకి ఆఖరు ఘట్టం ఈ పెళ్ళి! అందుకే పెళ్ళి అయిం తరువాత అందరూ నువ్వు చెప్పినట్లు వింటారు. అలాగే నడుచుకుంటారు.
ఈ తొమ్మిది రోజులు మాత్రం నువ్వు నేను చెప్పినట్లు వినాలి! బహుశా జీవితంలోనే ఆఖరు బాధ్యత ఇది.
వీళ్ళ నాన్నగారు పోయాక మొండిలాగా ఎన్నో బరువులు ఈడ్చాను. ఎన్నో రాత్రులు ఒంటరిగా నా గదిలో పిల్లలు చూడకుండా ఏడ్చాను. నా జీవితంలోని విషాదమంతా చరమగీతం పాడుకుంటున్న శుభవేళ ఆసన్నమయింది బాబూ!
నా ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు.
"నన్నెవరూ ఆపకండి!" అన్నదామె కళ్ళు తుడుచుకుంది.
"అందరూ అత్తాయమ్మగారు చెప్పిన విధంగా నడుచుకోండి. ఈ క్షణంనించి మీ యజమానిని నేను కాదు.
అత్తాయమ్మగారే!?" అని చెప్పి పని వారిని వదిలి వెళ్ళిపోయాడు. అతడు పట్నం పోయేందుకు జీపు అప్పగించింది.
డ్రయివర్ కి చెప్పింది.
"ఈ నాలుగు రోజులూ నువ్వు జీపు తీసుకుని అబ్బాయిగారి దగ్గరే ఉండాలి. మేము కారు వాడుకుంటాం"
"థాంక్సు మమ్మీ!" అంది ఆమని. పల్లెలో వీధులు బావుండవని మారుతిని షెడ్ లోకి తోయించి ఉంచింది ఇంతకాలం.
దాన్ని బయటకు తీస్తాననటం ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది.
సాయంత్రం వరకు అక్కడే ఉండి ఆ ఇంటి రూపు రేఖలు అప్పటికప్పుడే కొంతవరకూ మార్చేశారు. బాగా అలసిపోయి తిరుగుముఖం పట్టారు.
అలసట నిండిన ముఖంతో యింటికి వచ్చిన అమ్మను చెల్లిని గమనించింది గాయత్రి. వారు రంగంలోకి దిగిపోయి పెళ్ళి సందడి ప్రారంభించిన విషయం ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతున్న మనుషులద్వారా అడిగి తెలుసుకుందామె.
వియ్యం అనుకోగానే వింత వింత మార్పులు వస్తాయి.
ముక్కు ముఖం తెలియని వారు కూడ ఆత్మబంధువులు అయిపోతారు.
వాల్మీకి ఇంటిలో జరిపించాలనుకుంటున్న ప్రతి చిన్న మార్పు చేర్పులను ఎంతో శ్రద్ధగా పరిశీలించుతోంది. పని వారిని అడిగి తెలుసుకుంది. తనకు తోచిన సూచనలు వారిద్వారా తల్లికి అందించింది!
ఆ యింటిలోని వారందరి ఆలోచనలన్ని చూరగొంటున్న ఏకైక వ్యక్తి వాల్మీకి! అతడే అందరి భవితవ్యాలకు నిర్మాత అవుతాడు.
ఎంతో సంబరంగా చెల్లిని అడిగింది.
"వంటగదిలో వస్తువులు అన్నీ మార్పించేశారా?"
"ఎందుకు అడుగుతావులే అక్కా! మమ్మీకి ఈ యింటిమీద కన్నా ఆ ఇంటిమీద శ్రద్ధ ఎక్కువయిపోయింది. నీకేమో మా కన్నా బావగారు దగ్గర చుట్టమయిపోయారు. ఇంక మా సంగతి పట్టించుకునేవారు ఎవరున్నారని ఈ వివరాలన్నీ చెప్పాలి నీకు?
అయినా అడగాలని అడుగుతున్నావు కాని ఆ యింటిలో ఏమేమి జరుగున్నాయో మా కన్నా నువ్వే ముందుగా తెలుసుకుంటున్నావు.
అవునా? కాదా? అబద్ధం చెప్పకు" అంది ఆమని!
"కొంటె కోణంగి మాటలు చాలించు! అయినా నిన్ను ఎవరూ ఎందుకు పట్టించుకోవటం లేదు? నీకు ఎవరేం తక్కువ చేశారు?"
"నా ప్రయాణం గురించి ఎవరయినా అడిగారా? రేపటి ఉదయమే కదా నేను వెళ్ళిపోవాలి!" అంది. ఈ మాటలు విని ఉలికిపడింది గాయత్రి.
"ఏమిటి రేపటి ఉదయం నువ్వు వెళ్ళిపోతావా?"
"అవును! మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయటానికి ఫీజులు కట్టాలి"
"అందుకోసం ఈ సమయంలో నన్ను విడిచి వెళ్ళిపోతావా?"
"మరి చదువు మానుకోమంటావా ఏమిటి?"
"మానుకోవటం ఎందుకు? ఐ.ఏ.ఎస్. చెయ్యి! మధ్యలో ఈ రాయి విసరకపొతే ఏమవుతుంది?" అంది ప్రార్ధనా పూర్వకంగా!
"వివాహం విద్య నాశాయ అన్నారు కాని అక్క వివాహం చెల్లెలు విద్య నాశాయ అని ఎవరూ అనలేదు" అన్నదామె.
9
మాంగల్యం తంతునానేన-మమజీవన హేతునా! కంఠే బధ్నామి శుభాశేత్వం జీవ శరదాం శతం" ఆత్మ తాలూకు కాంతులతో తొణికిసలాడే కళ్ళతో చూస్తోంది ఆమని. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పదివేలమందికి చేతులు కడిగించి న భూతో నభవిష్యతి అన్నంత ఘనంగా పెళ్ళి జరిపించింది సుమిత్ర. గాయత్రి దంపతుల తలమీద అక్షతలు వేసి కళ్ళు తుడుచుకుంది.
ఇంత పెద్ద వ్యవస్థని రక్షించగల మగరెక్కలు ఈనాటికి ఈ యింటికి తోడుగా వచ్చాయి అనే ఆలోచన ఎంతో సంబరాన్ని కలిగిస్తోంది.
ముత్యాలు కలిపిన తలంబ్రాలు పోసుకున్నారు.
ఒకానొక అపురూపమయిన కానుక యిచ్చింది ఆమని.
అది అనేక పొరల కాగితాలమధ్య ఇమిడిపోయి ఉన్న చిన్న ప్రజంటేషన్.
పంతులుగారు కాగితం చుట్ట బహుభద్రంగా విప్పుతూ ఉంటే కాగితాలు పోగులుపడ్డాయి. కానీ ప్రజంటేషన్ ఇంకా బయటపడలేదు.
ఈ కొంటె కోణంగి తెచ్చిన వస్తువు ఏమిటా అని క్రీకంట గమనిస్తూనే ఉంది గాయత్రి. చుట్టూ చేరిన ఫ్రెండ్స్ బెటాలియన్ నవ్వుతున్నారు.
విప్పగా విప్పగా ఒక అగ్గిపెట్టెలాంటి ఆకారంలో చిన్న కంటెయినరీ బాక్సు కనిపించింది. అప్పటికే నగరంనించి వచ్చిన అమ్మాయిలు కొందరు వాస్తవాన్ని గుర్తించి నవ్వేశారు. అమాయకంగా పంతులుగారు కంటెయినర్ మూత విప్పేశారు. దానిలోంచి కండోమ్స్ జారి ఆయన ఒడిలో పడ్డాయి. అవేమిటో అర్ధంకాక కంగారుగా లేచి నిలబడ్డాడు. అవి క్రిందపడ్డాయి.
పెళ్ళికి వచ్చిన వేలాదిమంది ఈ తమాషా చూచి నవ్వుతున్నారు. అందరితో కలిసి వాల్మీకి కూడ ఆహ్లాదంగా నవ్వేశాడు.
గాయత్రి "ఈ కొంటెపిల్లకి సిగ్గయినా లేదు. ఆడపిల్లలు అలా చేయవచ్చా" అనుకుంది. చెల్లెలివంక చురచుర చూచింది. సిగ్గుపడి మరింత దింపేసింది.
"ఈ పిచ్చిపిల్లకి ఇంకా పసిపిల్లల చేష్టలు పోలేదు" అనుకున్నాడు వాల్మీకి.
"ఓసి రాలుగాయీ! బావగారికి అప్పుడే సందేశాలు యిచ్చేవరకూ వచ్చావా?" అనుకుంది సుమిత్రాదేవి.
పెళ్ళిలో అందరి చూపులు ఆమని మీదనే.
దంపతులు లేచివచ్చి పెద్దలకు నమస్కరించారు.
"శీఘ్రమే సుపుత్రుడు కలగాలి" అని ఆశీర్వదించింది సుమిత్ర.
"పెళ్ళికాగానే పిల్లలు పుడితే ఎంజాయ్ మెంట్ ఉండదు. అయిదారు సంవత్సరాలు పిల్లలు లేకపోవటమే మంచిది" అని సలహా యిచ్చింది ఆమని.
దంపతులతో పాటుగా ఫాంహౌస్ కి వచ్చింది.
అక్కడకూడ సుమిత్రగారి మనుషులే పనులన్నీ చూచుకుపోతున్నారు.
గాయత్రికి భర్తను తానుగా పలకరించే సాహసంలేదు.
అతడేదయినా అడిగినా ఎంతో అలోచించి సమాధానం చెబుతుంది. ఆమని తీరుమాత్రం రవంతయినా మారలేదు.
"బావగారూ! రండి కారమ్స్ ఆడుకుందాం" అంది భోజనాలయిం తరువాత.
"అక్కకు ఆట రాదుగా! రిఫరీగా ఉంచుకుందాం" అని నిర్ణయిం చేసింది తనే.
వాల్మీకితో ఆట ప్రారంభించింది.
