మాధురి తల గిర్రున తిరిగిపోయింది.
ఆమె చెంపలు ఎరుపెక్కిపోయాయి.
అవమానంతో ఆమె తల దించుకుంది.
నోట మాట రావటం లేదు.
ఆమె ముఖ కవళికల్లో మార్పు తిలకిస్తూ నిల్చున్నాడు ప్రశాంత్.
"మాధురీ! ఈ ప్రవర్తనకి నువ్వు సిగ్గుపడాలి!" అంటున్నాడు వైస్ ప్రిన్సిపాల్.
ఆ తర్వాత ఏం జరిగిందో ప్రశాంత్ కి తెలీదు.
సూరిబాబు అతని చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు.
14
"థాంక్యూ సూరీ! నువ్వు చేసిన సహాయం నేను మర్చిపోలేను! అసలు ఇంత గొడవ జరగబోతోందని నీకు ముందే ఎలా తెలుసు?" అడిగాడు ప్రసాంత్.
"ఆమె ప్రెండ్స్ అందరూ మాట్లాడుకోవడం నా చెవిన పడింది! 'ఈసారి పాపం ప్రశాంత్ ని కాలేజీనుంచి సస్పెండ్ చేసేస్తాను. మాధురి విసిరిన వలలో చిక్కుకుని గిలగిల తన్నుకుంటాడు అమాయకుడు' అనటం నేను విన్నాను - వాళ్ల సంభాషణ జాగ్రత్తగా ఫాలో అయ్యాను. మాధురి నిన్ను గెస్ట్ హౌస్ కి పిలిపించి అందరిముందూ తల వంచుకునేలా చెయ్యబోతోందని తెలుసుకుని, వెంటనే అటు పరుగెత్తుకొచ్చాను. నేనొచ్చేసరికి మాధురి కేకలు వినిపించాయి. వెంటిలేటర్ లోంచి చూడగానే పరిస్థితి అర్దమయ్యింది. వెంటనే వెళ్లి మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను" చెప్పాడు సూరిబాబు.
ప్రశాంత్ దవడ ఎముక బిగుసుకుంది.
"సూరిబాబూ!ఇక నేను దాన్ని వదిలి పెట్టను. దాన్ని రాక్షసంగా ... పైశాచికంగా ..." అంటూ ఆవేశంగా ప్రశాంత్ అంటున్న మాటలకి మధ్యలోనే బ్రేక్ వేశాడు సూరిబాబు.
"నో! నువ్వు తొందరపడటం భావ్యంకాదు!ఆవేశం అనర్దాలకి దారితీస్తుంది!
"ఇలాంటి నీతి సూక్తులే నన్ను అనవసరంగా ప్రమాదాల్లోకి నడిపిస్తున్నాయి!"
" కాదు! మాధురి సంగతి నీకు తెలీదు! ఆమెకు యిలా మగాళ్ళని ఏడిపించటం ఓ సరదా! ఆమె ఒక టైప్ ఆఫ్ శాడిస్ట్ అని మా అనుమానం! ఆమెకు డబ్బు, హోదా, పరపతి అన్నీ వున్నాయి. వాటికి తోడు మగాళ్లని వెర్రెత్తించే అందచందాలున్నాయి!" చెబ్తున్నాడు సూరిబాబు.
"వుంటే! ఐ కేర్ ఎపిన్ ఫర్ దెమ్!" ప్రశాంత్ బుసకొడ్తున్నట్లు అన్నాడు.
సూరిబాబు ఆత్మీయంగా అతని భుజం మీద చెయ్యి వేసాడు.
"మైడియర్ ఫ్రెండ్! నిన్ను అవమానించాలని ఒక ఆడది ఎందుకు అనుకుంది?" ఆమెను నువ్వు దెబ్బకొట్టదల్చుకుంటే ఏం చెయ్యాలి!యివన్నీ నిదానంగా ఆలోచించు!"
"ఏమీలేదు! దానికి ఒల్లు కొవ్వెక్కింది! పొగరుబోతు...!" అంటూ ఏదో బూతు మాట అన్నాడు కసిగా.
"కరెక్ట్! పొగరనేది దేనివలన వస్తుంది! తను చాలా గొప్ప మనిషిని అని భావించుకున్నప్పుడు వస్తుంది! సుపీరియారిటీ కాంప్లెక్స్! ఆ ఇగోని దెబ్బకొట్టాలంటే ఏం చెయ్యాలి! ఆమె కన్నా గొప్ప వాడివి కావాలి! ఆమె కళ్లముందే నువ్వు ఆకాశమంత ఎత్తుకి ఎదగాలి?" సూరిబాబు అంటూ వుంటే ప్రశాంత్ అతనివైపు విస్మయంగా చూసాడు.
అతని నోట మాట రాలేదు.
నిర్నమేష దృష్టితో అతను చెబ్తున్న మాటలు వింటున్నాడు.
"నీకేం తక్కువ ప్రశాంత్! ఆరడుగుల ఆజానుబాహుడువి! అందగాడివి! స్పోర్ట్స్ మాన్ వి! కంచు కంఠస్వరం! నీ ప్రక్కన ఆమె నిలబడితే ఈర్ష్యపడే ఫిజిక్ నీది!.... ఇక నువ్వు సంపాదించ వలసినది పాపులారిటీ! పరపతి! హోదా! స్టేచర్!" ఆవేశంగా అన్నాడు సూరిబాబు.
"కానీ అది.. .అదెలా సాధ్యం?"
"నువ్వు రచయితవి కదా!"
"నేనా?" ఆశ్చర్యంగా అన్నాడు ప్రశాంత్.
"ఏం? నువ్వు కాలేజీ జర్నల్ కి రాయలేదూ?"
"అదా! ఏదో పిచ్చి కధ!"
"కరెక్ట్! ఈ రోజు సాహితీరంగాన్ని శాసిస్తున్నవి పిచ్చి రచనలే!" నవ్వుతూ అన్నాడు సూరిబాబు.
"వ్వాట్?"
"ఔను. ఏ పత్రికైనా తిరగెయ్! ఏ కధైనా చదువ్! ఏ రచనైనా చూడు!హత్యలు, దారుణాలు మానభంగాలు, అంతే! అంటే సెక్స్, వయలెన్స్, సస్పెన్స్, థ్రిల్, నాన్సెన్స్... అనే ముసుగులో స్వైర విహారం చేస్తున్నాయి! కాదంటావా?"
"ఏం? ఆ మాత్రం నువ్వు రాయలేవా?"
"నాకు తెలీదు!"
"నువ్వు ట్రై చెయ్యి! నేను నీకు నా పూర్తి సహకారం అందిస్తాను!" అన్నాడు సూరిబాబు.
తోచక రాసిన పిచ్చిరాతలేవో కాలేజీ మేగజైన్ లో ప్రచురించబడిన ప్రశాంత్ కి, ఉత్తమ కథా రచయిత. సూరిబాబు సహకారం! అదే... అదే... అతనిలోని రచయితకి మేలుకొలుపు!
