Previous Page Next Page 
పరిహారం పేజి 25


    పారిజాత మేనత్త కామమ్మ వాళ్ళ ఊరు బొత్తిగా పల్లెటూరు ఆ ఊరికంతా సంపన్నులు వీళ్ళే. కావమ్మ మంచి వ్యవహార దక్షత గల మనిషి నాగులకూ, వడ్డీలకూ నడుపుతూ ఉంటుంది. పచ్చగా చింత పువ్వులా ఒంటినిండా బంగారంతో, నల్లటిశరీరంతో లక్ష్మీదేవి ఎలాంటి వారిని వరిస్తుందా అన్న ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కనిపిస్తూంది.
    భర్త వెంట వచ్చిన పారిజాతను చూడగానే, చేతులు చాచి అమాంతం ఆపిల్లను చుట్టవేసి, "పుత్తడి బొమ్మలా ఎంత బాగున్నావే?  ఇక ఈ రోజు నుండి ఈ ఇంట్లో దీపం వెలిగించుకోనక్కరలేదు. నిరంతరం తాంబూల చర్వణంతో ఆవిడ పళ్ళు గారపట్టి అసహ్యంగా కనిపిస్తున్నాయి.
    అన్న పోయిన విచారాన్ని వ్యక్తపరచడానికి బదులు ఆవిడ తన సౌందర్యాన్ని ఎందుకు ప్రశంసించి మురిసి పోతున్నోద ఆవిడ కొడుకు హనుమంతరావును చూశాక తెలిసిపోయింది పారిజాతకు.
    "అమ్మా! ఈ పిల్లనేనా నాకిచ్చి పెళ్ళి చేస్తానన్నావు? ఎంత బాగుందో? నేను తనకి నచ్చుతానా?" తల్లి వెనుక నక్కి చూస్తూ అడిగింది నల్లగా, పొట్టిగా, లావుగా ఉన్న ఒక ఆకారం. ఆ ఆకారానికి చెవికి పోగూ, తెల్లటి బట్టలు, కుడి కాలికి ఓ రాగి కడియం ఉన్నాయి. కళ్లు ఎర్రగా పళ్ళు తెల్లగా ఉన్నాయి. ఆ ఆకారం పలికిన మాటలు విన్న పారిజాతకు గుండె జల్లుమంది. మేనత్త ఆదరానికి అర్ధం ఆ క్షణమే తెలిసిపోయింది. జుగుప్సతో , భయంతో వణికిపోయింది.
    ఆ తరువాత ఒక్కొక్కరే ఇరుగుపొరుగులు వచ్చి పారిజాతను చూడసాగారు "మొత్తానికి కావమ్మ అదృష్టవంతురాలు. శ్రమలేకుండా అందమైన కోడల్ని సంపాదించుకొంది."
    "పాపం, పిల్ల చీకట్లో పిల్లాణ్ణి చూసి దడుసుకొంటుందేమో!"
    "ఈ ఇంటికి పట్టిన నలుపు ఈ పిల్ల కోడలిగా పడితే వదిలిపోతుంది!"
    "ఏమో! చిన్న హనుమంతులవారే దిగితే?"
    పకపకలు!
    పారిజాతకు తల తిరిగిపోసాగింది.
    కామమ్మ రావడంతో వాళ్ళ సంభాషమ టక్కున ఆగిపోయింది.
    వారం రోజులు గడిచిపోయాయి.
    కోడల్ని కాలు క్రింద పెట్టకుండా అపురూపంగా చూడసాగింది కామమ్మ. రోజూ ఏదో ఫలహారాలు చేసి తినమని వేధిస్తూంది. మరీ ఇంత సన్నగా, నాజూకుగా ఉంటే ఈ పల్లెటూరి కాపురాలకు పనికిరావు అంటూ నవ్వుతుంది. రోజుకు నాలుగుసార్లు కోడలికి దిష్టి తీస్తూ ఉంటుంది.
    మేనత్త అతి ప్రేమ పారిజాతకు వాంతి చేసుకొన్నట్లుగా ఉంది. హనుమంతును తను చేసుకోనని చెప్పే అవకాశమే ఆవిడ ఇవ్వడంలేదు.
    ఒక శుక్రవారంరోజు పారిజాతకు తలంటిపోసి, తన నగలపెట్టె తెరిచి పారిజాతకు ఒక్కొక్కనగే అలంకరించింది కామమ్మ. బరువుగా మోటుగా ఉన్న నగలు చెవులకూ, మెడకూ చేతులకూ కాళ్ళకూ తగిలిస్తోంటే మేనత్త తనను ష్టదిగ్బంధం చేస్తున్నట్టుగా అనిపించింది. సాయంకాలం ఊళ్ళో ముత్తయిదువులను పిలిచి చీరా సారే ఇచ్చి నిశ్చితార్ధం చేస్తున్నట్టుగా ప్రకటించడంతో ఇక ఊరుకోలేక పోయింది పారిజాత.
    "అంతా నీ ఇష్టమేనా అత్తా? నాకిష్టమో కాదో కనుక్కోనక్కరలేదా?" అని అడిగింది.
    "ఏమిటీ? ఎక్కడో ముష్టిముండను తీసుకువచ్చి ఇంత ఐశ్వర్యానికి రాణిని చేస్తుంటే ఇష్టపడని దెక్కడైనా ఉంటుందా?" ఆవిడ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి చూసింది.
    "నీ డబ్బుకూ, ఐశ్వర్యానికీ ఆశపడే వాళ్ళెవరూ లేరిక్కడ. నీ అడంగిచేష్టల కొడుకును నేను చస్తే చేసుకోను."
    "నా కొడుకు అడంగి చేష్టలవాడా? నీ నోరుపడ! ఎంత మాటన్నావే? ఆ అడంగివాడికే నిన్ను కట్టబెట్టి పిల్లలు కనేలా చేయకపోతే నాపేరు కామమ్మ కాదు!"
    "నీ కొడుకును చేసుకొనేకంటే బావిలో పడి చావడం హాయి!"
    "దూకవే! వెళ్ళి దూకవే! చూస్తాను. ఇంత వైభోగం నాకోడలివి అవుతావని కాదే చేసింది? దెష్టముండా! తీయ్ ఆ నగలు! విడువు ఆ చీర! ఎవరి సొమ్మని కులుకుతున్నావు"
    పారిజాత విసురుగా తీయబోతుంటే కామమ్మ మీద పడి ఊడలాగింది.
    తన పాతచీర కట్టుకొని, కొత్తచీర కుప్పగా చుట్టి కామమ్మ ముఖాన విసిరికొట్టింది పారిజాత.
    రాకాసిలా రెచ్చిపోయింది కామమ్మ. పారిజాత జుట్టుపట్టి లాగుతూ  "నడూ నా ఇంట్లోంచి. ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు" అని అరిచింది. వీధిగుమ్మందాకా లాక్కు వచ్చేసరికి హనుమంతు అడ్డుపడ్డాడు. "అయ్యోపాపం! పారూను వెళ్లగొట్టకే నన్ను పెళ్ళి చేసుకోకుంటే ఫర్వాలేదే. ఇంట్లో ఉండనివ్వు పారును!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS