"బావా, దాచకుండా చెబుతావుకదూ, నీ గురువెవరు? నీ మనస్సే నీ గురువా? అందరివలె నువ్వూ ఒక సద్గురువును వెదకుకొన్నావా?"
"ఈ ప్రశ్న నీకెందుకు తట్టింది హఠాత్తుగా?" అని నవ్వాడు భార్గవరామ్. "దాని జవాబు నీకంత అవసరం కాకపోవచ్చు. కుతూహలం దేనికి?"
"చెప్పరాదా?"
భక్తిగా కన్నులు మూసుకొని ఎంతో పవిత్రమైన విషయం చెబుతున్నట్లుగా, మృదువుగా చెప్పాడతను; "నా గురుదేవులు ఒక ముస్లిం!"
"ఆ!"
"ఆ నివ్వెరపాటు దేనికి, దేవదాసీ? నేను ముస్లింగా మారాననా? నాకు ముస్లింగురువేమిటనా? నేను మతం మార్చుకొన్నానన్న భయం నీకక్కరలేదు. వారు రామోపాసకులు! రామదాసు కాలంలో కబీరుదాసు ఒక్కడే కాదు. ఇప్పుడు కూడా వెతికితే అట్టివారు అగుపడకపోరు!"
తేలికగా ఊపిరి తీసుకొని వదులుతూ మరొక ప్రశ్న వేసింది? "ఎక్కడుంటారు ఆయన."
"ఏమిటి? నువ్వూ ఆయన పాదాలను ఆశ్రయించాలనుకొన్నావా? నవ్వుతూ అడిగాడు.
తీవ్రంగా తలాడించింది దేవదాసి. "నాకలాంటి ఊహలేం లేవు. బావా! తన మనసే సద్గురువు కాగలిగిన అర్హత కలిగినప్పుడు మరో గురువుకొరకు వెదకులాట దేనికి?"
"నీ ఊహ కొంత పొరపాటు. అంతటి మహానుభావులు కూడా సద్గురు ఆవశ్యకతను గురించి ఒప్పుకున్నారు!"
"తా చెడ్డకోతి వనమెల్లా చెరచిందట! నీవిద్య దానికి కూడా ఎక్కడ నేర్పుతావులే! అభం శుభం ఎరుగని పసిది..... దేవతా, అక్కడినుండి లేచిరా." భోజనానికి పిలువవచ్చిన కృష్ణవేణి. బావ మరదళ్ళ సంభాషణ విని మండిపోతూ ఇద్దర్నీ కసిరి భోజనానికి పిలువకుండానే వెనుదిరిగింది.
మెట్లు దిగుతూ తనననుసరిస్తున్న దేవదాసితో "ఆ బైరాగివాడితో నీకీమాటలేమిటే? చిన్నపిల్లవు! నీకిప్పుడు వేదాంతం కావలసివచ్చిందా? పిచ్చివేషాలు వేయకు! ఇప్పటి నుండి ఆ జిజ్ఞాస దేనికి, సంసారసాగరం ఈది మహ విరక్తి పొందినదానిలా?" అన్నది మందలింపుగా కృష్ణవేణి.
"సిగ్గుపడింది దేవదాసి. "లేదత్తా!"
"చాల్లే! నే విననట్టు!"
9
స్నానంచేసివచ్చి పీటమీద కూర్చుని నామం దిద్దుకోడానికి చేతిలో త్రిచూర్ణం కలుపుతున్నారు రావుగారు. ఆయనగాలితో ఫిర్యాదుచేసింది కృష్ణవేణి. "మీ కొడుకు సావాసంపట్టి నా మేనకోడలు బుద్ధి చెడగొట్టుకుంటున్నట్లుంది.
"అదేమిటి?" అన్నారాయన ఆశ్చర్యపోతూ.
నిన్నరాత్రి విన్నదేమో వివరించింది. "తురకవాడి పాదం పట్టాడట" అంది ఏహ్యభావంతో.
"అయితే!" నామం దిద్దుకొని చేయి కడిగేసుకొన్నారు బొట్టుపుల్ల పెట్టెలో పెట్టేసి, వత్తి ఏ ప్రమిదలో వెలిగితేనేం? మనకు కావలసింది వెలుగు!" అన్నారు.
మూతి తిప్పింది కృష్ణవేణి, "హుఁ! వెలుగు! నిండు ప్రాణాన్ని నిలువునా చీరేయగల కసాయ వెధవలు!"
"ఆ మహానుభావుడెవరో నీ కొడుకును జ్ఞానమార్గంలోకి తిప్పి నీకు కాకుండా చేశాడని కోపమైతే, ఆ జాతి నంతటినీ ద్వేషించేందుకు దాన్ని కారణం కానీకు! వారిలో నవనీత మనస్కులు లేరూ? మన ఊరి సాహెబుగురించి నీకు ప్రత్యక్షంగా తెలుసునే? భార్గవుడి మూడేళ్ళ వయస్సులోనేమో? అమ్మ పోసిపోయింది. పోయింది ప్రాణం అనుకొన్నాం. అతడు కాదూ నీ బిడ్డను మంత్రమో తంత్రమో వేసి బ్రతికించింది? మన ఊరికి అతడు ఆపద్భాంధవుడేకదా! ఆపద నెత్తిమీద పెట్టుకొని ఎవడు ఏ రాత్రీపగలు వచ్చినా ఆ పేద సాహెబు గుడిసె తలుపు తెరిచే వుంటుంది. వారికోసం అందునా అతడు హనుమాన్ ఉపాసకుడనో, రామోపాసకుడనో చెప్పుకొంటారు! అతడిని నిందించు చూద్దాం."
మరిమాటరాలేదు కృష్ణవేణికి. ఆయన సంధ్యావందనానికి అన్నీ అమర్చసాగింది.
