చి తి లో స తి
కుమారి హరిత భరతనాట్య ప్రదర్శన!
రంగస్థలంమీద నృశింహావతార ఘట్టం అధ్బుతంగా సాగిపోతున్నది.
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పాములతో కరిపించమనడం, ఏనుగులతో త్రొక్కించమనడం. సముద్రంలో పారవేయమనడం - హరి హరి అంటావా హరి ఈ స్తంభమున కలడా అని గదతో స్తంభాన్ని మోదగానే హరి నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి ఉగ్రమూర్తిగా నిలవడం - చాలా అధ్బుతంగా అభినయించింది హరిత.
కెమెరాలు క్లిక్ క్లిక్ మన్నాయి.
కరతాళ ధ్వనులమధ్య తెరపడింది.
ప్రేక్షకులు పారవశ్యంతో లేచారు.
"చాలా చిన్న వయసులో గొప్ప ప్రావీణ్యం సంతరించుకుందా అమ్మాయి" పద్దెనిమిదేళ్ల హరితమీద ప్రశంశలవర్షం కురుస్తోంది.
"ఆ అమ్మాయికి ఈ డాన్సేకాదు. శాస్త్రీయ సంగీతం కూడా వచ్చు. పెయింటింగ్ లో కూడా మంచి అభిరుచి వుంది. స్కూల్లో ఫస్టు వస్తూనే ఇవన్నీ ఎలా నేర్చుకోగలిగింతా అని నాకెప్పుడూ ఆశ్చర్యం వేస్తూ వుంటుంది. హరిత తల్లి నా క్లోజ్ ఫ్రెండ్. కూతుర్ని చూసి ఎంత గర్వపడతారో ఆమె విషయంలో అంత శ్రద్ద తీసుకొంటారా తల్లిదండ్రులు. అన్నిట్లో ఆ అమ్మాయిని ఉత్సాహపరుస్తుంటారు. ...." ఉత్సాహంగా ఎవరికో చెబుతూన్న సుందరి ముందుకు దూసుకుపయింది. "ఏయ్ హేమలతా!" అంటూ.
".... నిజంగా అలాంటి కూతుర్ని కన్నందుకు మీ జన్మ చరితార్దమైంది" అన్న ప్రేక్షకుల ప్రశంసలకి పులకింతల మధ్య వున్న హేమలతా, ఆమె భర్తా సుందరి కేకకు ఇటు తిరిగారు.
"అధ్బుతం! మహాధ్బుతం! హరిత ఏదో డాన్స్ క్లాసెస్ కి అటెండ్ అవుతూందని తెలుసుగాని ఇంత గొప్పగా చేయగలదని అనుకోలేదు. అసలు అభినందించాల్సింది మీ ఇద్దరినీ! ఈ ప్రతిభ వెనుక మీ కృషి ఎంతైనా వుంటుంది!" హేమలత చేతులు పట్టుకొని ఆనందంతో ఊపేస్తూ అంది సుందరి.
"కృషి అంటూ పెద్దగా ఏంలేదు! ప్రోత్సాహం మాత్రమే మేం అందించాం. నాట్యంలో దానికున్న అభిరుచే దాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిందని నా నమ్మకం."
"హరితకు తారాపధంలోకి దూసుకుపోయే, అవకాసాలు బాగా కనిపిస్తున్నాయి నాకు!.... అన్నట్టు ఈ మధ్య ఎవరో ప్రొడ్యూసరు తన సినిమాలో నృత్యప్రధానమైన భూమికను పోషించమని అడిగినట్టు విన్నానే! ఏమైంది?"
"నిజమే! జానకి నా ఫ్రెండు. ఆవిడకి అన్నగారట. జానకి ఇంట్లో అమ్మాయిని చూసి, అమ్మాయికి నాట్యం, సంగీతం వస్తుందని తెలిసి, తను తీయబోయే నృత్య సంగీత ప్రధానమైన సినిమాలో అమ్మాయికి మంచిపాత్ర వుందని, సరిగ్గా హరితలాంటి అమ్మాయికోసమే తను గాలిస్తున్నానని అన్నాడట హరితకు ఇష్టమే అయినా మేమే వద్దన్నాం" చెప్పింది హేమలత.
"అరే! ఎందుకలా చేశారు? హరితకు ఎంత మంచి అవకాశం పోగొట్టారు? మీరు ఒప్పుకొని ఉండాల్సింది. హరిత అందానికి, అభినయానికి తారాపధంలో బాగా రాణించగలదనిపిస్తుంది."
"ఏదో సంసారపక్షంగా వుండేవాళ్లం. మనకెందుకా సినిమాల గొడవ! ఆ వాతావరణం మనకు సరిపడేదికాదు"
డ్రెస్ మార్చుకుని వచ్చింది హరిత. "వెడదాం మమ్మీ" అంటూ.
"ఇంటికి వెళ్లగానే దిష్టితీయి!" అని సలహా ఇచ్చింది సుందరి కదులుతూ.
* * * *
హరిత తన గదిలో చదువుకూంటూంది.
తల్లి వచ్చి పిలిచింది. "కొంచెం ఇలా వస్తావా? ఎవరో పత్రికా విలేఖరి. .. వాళ్ల పత్రికకోసం నిన్ను ఇంటర్వ్యూ చేస్తాడ!"
"అబ్బా! నేను చదువుకోవాలి మమ్మీ! నన్ను డిస్టర్బ్ చేయొద్దు! అతడికి కావలసిన వివరాలు నువ్వే చెప్పేసి పంపించు!"
అని తల్లిని బలవంతంగా పంపించి తను చదువులో నిమగ్నమైపోయింది.
* * * *
వారం రోజుల తర్వాత ఒకనాడు హరిత కాలేజీకి వెళ్ళగానే స్నేహితులు చుట్టేశారు - ఆమె ఇంటర్వ్యూ పడిన పత్రిక చూపుతూ.
"ఇంటర్వ్యూ ఇలా ఇచ్చావేమిటి? చక్కటి గృహిణిగా, మంచి తల్లిగా చక్కగా కాపురం చేసుకోవడమే నా జీవితాశయం అని చెప్పావేమిటి? గొప్ప డాన్సరు కావాలనీ, పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాలనీ..... అది నీ జీవితాశయమని చెప్పేదానివి!" అడిగింది సబిత అనే అమ్మాయి.
"పరీక్షలొస్తున్నాయి కదా... చదువుకోవాలని మా అమ్మకి చెప్పాను.. .ఆ ఇంటర్వ్యూ సంగతి ఆమెనే చూచుకోమని. అది తెచ్చిన తంటా ఇది!" చెప్పింది హరిత.
అటునుండి అబ్బాయిల గుంపు వెడుతూంది అప్పుడే.
రాజీవ్ అనే అబ్బయి హరితకేసి చూసి కన్నుగీటుతూ "నా బిడ్డలకు మంచి తల్లి, నాకు చక్కటి గృహిణి కాగల అమ్మాయి కోసమే నా తపస్సురా!" అన్నాడు ప్రక్కనున్న వాడితో.
హరిత ముఖం ఎర్రమందారమైంది.
ఇంకోసారి అయితే చీల్చి చెండాడేదిగాని, ఇప్పుడు తల్లి చేసిన పనికి బోనులోపడి మృగరాజులా గుర్రుగా చూసింది.
ఇంటికి వస్తూనే తల్లి మీద విరుచుకుపడింది. "ఏమిటి మమ్మీ నువ్వు చేసిన పని? గొప్ప డాన్సరుని కావాలని పోస్టుగ్రాడ్యుయేషన్ చేయాలని నా కల. కలకాదు.... నా ఆశయం! ఆ సంగతి నీకు తెలుసు. తెలిసీ ఆ పత్రిక ఇంటర్వ్యూలో అలా ఎందుకు చెప్పావు?"
"ఏం చెప్పానే?" హఠాత్తుగా కూతురు విరుచుకుపడుతూంటే అయోమయంగా చూసింది హేమలత.
"చక్కటి గృహిణిగా, మంచి తల్లిగా జీవితం కొనసాగించడమే నా ఆశయమని ఎందుకు చెప్పావు?"
"ఓ అదా!" హేమలత హాయిగా నవ్వేసింది. "ప్రతి ఆడపిల్ల చివరికి జీవిత పరమార్దం అదేకదా! నువ్వు ఎంత చదివినా, ఎంత గొప్ప కళాకారిణివైనా చివరికి గృహిణిగా మారక తప్పదుకదా? ఇహ పిల్లల్ని కనకపోతే అందం, ఆనందం ఏముంది? ఒక్కగానొక్క కూతురివి. నీ భవిష్యత్తు గురించి మేం కనే కల అది! నిన్ను గొప్ప డాన్సరుగా చూడటం కంటే, ముచ్చటైన సంసారం, ముత్యాల్లాంటి బిడ్డలకు తల్లివైనప్పుడే మాకు నిజమైన ఆనందం."
"ఆపాటిదానికి ఈ చదువు, ఈ డాన్సు, ఈ సంగీతం ఇవన్నీ ఎందుకు?" హరిత ఉక్రోషంగా అడిగింది.
"గొప్ప గొప్ప కళాకారిణులు, బాగా చదువుకొన్న వాళ్ళు పెళ్లిళ్లు మానేస్తున్నారా!" ఆశ్చర్యంగా అడిగింది హేమలత. "డాక్టర్లు, యాక్టర్లు, మినిష్టర్లు - అందరూ పెళ్లిళ్లు చేసుకొంటున్నారు. పిల్లల్ని కంటున్నారు వాళ్లని ఇంటర్వ్యూ చేసి చూడు.... ఇల్లు దిద్దుకోవడంలో వుండే ఆనందం దేనిలోనూ లేదంటారు?భర్తకు తమ చేతుల్తో వండి పెట్టుకోవడం గొప్ప అనుభూతిగా చెబుతారు. ఎంత గొప్ప పదవులు నిర్వహించే వాళ్లయినా సంసార మాధుర్యాన్ని మించింది లేదని చెబుతారు"
