తిమ్మారావుకి కసిపెట్టి ఈసారి ఒక ఇంగ్లీషు నవలని పూర్తిగా ట్రాన్స్ లేట్ చేసి "కసా బిసా" అనే పూర్తియాక్షన్,క్రైం,సెక్స్,సస్పెన్స్ నవల రాశాడు.అదికూడా"సొంత డబ్బా" అనే మరో తెలుగు పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడి తిమ్మారావుకి మరికాస్త పేరు వచ్చింది.ఇహ ఒకటే కసితో ఊగిపోయి ఇంగ్లీషు నవలలు అనువదిస్తూ తెలుగులో రాసెయ్యసాగాడు తిమ్మారావు.
తిమ్మారావుకి రచయితగా కాస్త గుర్తింపయితే వచ్చిందికానీ అది అతనికి ఏ మాత్రం తృప్తిని ఇవ్వలేదు. ఎవరు చూసినా "నువ్వు నెంబర్ వన్ రచయితవా?కాదా?" అని అడుగుతున్నారు.వాళ్ళలా అడుగుతుంటే ఇతను సిగ్గుతో చచ్చిపోతున్నాడు,తను నెంబర్ వన్ రచయిత కానందుకు.
అసలు నెంబర్ వన్ రచయిత అంటే అర్ధం ఏమిటి? నెంబర్ వన్ రచయితలు ఒక్కళ్ళే ఉండాలిగా?... మరి తెలుగులో ఇంతమంది నెంబర్ వన్ రచయితలు ఎలా ఉన్నారు?
ఈ రహస్యం కనుక్కోడానికి తిమ్మారావు నెంబర్ వన్ రచయితల్లో ఒకడైన పిశాచిరావు ఇంటికి వెళ్లాడు.
కాలింగ్ బెల్ నొక్కాడు.
"కమిన్..."లోపలినుండి గొంతు వినిపించింది.
దగ్గరకు వేసి ఉన్న తలుపుల్ని తోసుకుని తిమ్మారావు లోపలికి అడుగుపెట్టాడు.ఎవరో తలుపు వెనకాలనుండి తిమ్మారావు కాళ్లమధ్య కాలుని పెట్టారు.తిమ్మారావు ధబేల్న బోర్లపడిపోయాడు.అతని కళ్లు బైర్లు కమ్మాయ్...
"హాయ్ హోయ్... ఒక రచయితని పడగొట్టేశం..."ఎవరో అరిచారు.
ఆ గది చప్పట్లతో మారుమోగింది.తిమ్మారావు మెల్లగా తలెత్తి చూశాడు.ఆ గదిలో పిశాచిరావుతో బాటు ఇంకా పదిమంది దాకా రచయితలు ఉన్నారు.
తిమ్మారావు తను వచ్చిన పని చెప్పాడు.అది వింటూనే అక్కడ ఉన్న రచయితలందరూ కిందపడి దొర్లి దొర్లి నవ్వారు.పిశాచిరావు మరీ...
"భలేవాడివే... అసలు ఈ మాత్రం బుర్రలేకుండా నువ్వు రచయితవి ఎలా అయ్యవో నాకు అర్థం కావడంలేదు... నెంబర్ వన్ రైటర్ అని పాఠకులు అంటే అవ్వరు... ఎవరికి వారు అనేస్కోడమే!... నీకు కనిపించిన ప్రతి ఒక్కడితో మిగతా రైటర్లందరూ ఒట్టి వెధవలనీ ఇంగ్లీషు నవలలు కాపీ కొట్టి పైకొచ్చారానీ నువ్వు మాత్రం గొప్ప రచయితవనీ ప్రస్తుతం తెలుగులో నువ్వే నెంబర్ వన్ రచయితవనీ చెప్పుకోవాలి... తెల్సిందా?" అన్నాడు పిశాచిరావు నవ్వుతూ.
తిమ్మారావుకి జ్ఞానోదయం అయినట్టు అయ్యింది.
"మీరంతా ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యారు?" అని అడిగాడు తిమ్మారావు మిగతా రచయితల్ని.
"నేనే వీళ్లని ఇక్కడికి పిలిపించాను... కాస్త బాగుపడే రచయిత ఎవడన్నా ఉంటే వాడిని ఎలా పడగొట్టాలి?.... వాడిని ఎలా డిఫేమ్ చెయ్యాలి? అని ఆలోచిస్తున్నాం... బాగుపడే వాడ్ని చూసి ఆ మాత్రం కుళ్లిపోకపోతే ఏం బాగుంటుంది చెప్పు?..."నవ్వాడు పిశాచిరావు.
"మేము అప్పుడప్పుడూ ఇక్కడ సమావేశమై ఇలా ఎవరెవర్ని ఎలా పడగొట్టాలి?... ఎవరిమీద బురద జల్లాలి అని అలోచిస్తుంటాం...."అన్నాడు మరో రచయిత.
తిమ్మారావుకి హుషారుపట్టింది.తనకి దగ్గర్లో ఉన్న ఒక రచయిత కాళ్లలో తన కాలుపెట్టి మెలేసి కిందపడేసి "నేను కూడా వాళ్లనీ వీళ్లనీ పడగొట్టే స్కీములో చేర్తా... నాకిది ఎంతగానో నచ్చింది..."అన్నాడు.
అందరూ చప్పట్లు కొట్టి తమ హర్షం తెలియజేశారు.
ఆ రోజు మొదలుకొని తిమ్మారావు ఏదైనా ఒక మంచి నవల రాద్దాం అని ఆలోచించడం మాని ఎవడిని ఎలా పడగొడ్డం, ఎవడిమీద బురద చల్లుదాం అని ఆలోచిస్తూనే జీవితాంతం గడిపేశాడు.ఆ విధంగా అతని మెదడు కుళ్లిపోవడంతో మంచి రచయిత కాలేకపోయాడు.
* * *
