Previous Page Next Page 
కావేరి పేజి 25

    తన ఆఖరి అస్త్రం ఉపయోగించాలన్న ఆలోచన కలిగింది.

    ఒకవేళ పెళ్ళయినా కట్టుకున్న మొగుడితో కాపురం చేస్తుందన్న నమ్మకంలేదు దానికి సినిమాపిచ్చి! ఈ పిచ్చిని ఇంకాస్త ముదరపెట్టితే ఆ భగవంతుడుకూడా ఆ కావేరీని ఆపలేడు!

    అసలు కావేరి మనస్తత్వం ఎలావుందో తెలుస్తుంది! రేపు స్కూలుకి రాకపోతుందా? అప్పుడు తెలుస్తుంది దానిసంగతి!

    అని ఊరట చెందింది. కాని ఆ మరురోజు స్కూలుకి రాలేదు కావేరి.

    కాలువగట్టుమీద గంటసేపు నిలబడి ఎదురుచూసింది.

    ఎంత ఆలస్యంగా వస్తే మాత్రం ఇంతసేపు ఎలావుంటుంది? ఇంకా రాదేమో? తనపెళ్ళి ఇంకా పదిరోజులేగా వుంది? ఆ అత్తా వెళ్ళవద్దని వుంటుంది. లేకపోతే వచ్చేదే?

    ఆ రోజంతా క్లాసులో ఎదురు చూసి చూసి విసుగు చెందింది.

    స్కూలునుంచి వస్తూనే సరాసరి కావేరి దగ్గిరకు వెళ్ళింది.

    పెరటి దొడ్డిలోవున్న ములగచెట్టుక్రింద కూర్చునివుంది. కావేరి చూపులు ఇక్కడలేవని గ్రహించింది. వెనుకగావెళ్ళి భుజంమీద చేయివేసేసరికి ఉలిక్కిపడింది కావేరి.

    "ఎందుకు అంత ఉలిక్కిపడ్డావు? మీ బావ అనుకున్నావా?" అంటూ నవ్వుతూ పక్కనే కూర్చుంది.

    "ఛా!ఛా! ఎలా అనుకుంటాను? స్కూలునుంచేనారావటం?" అనడిగింది పుస్తకాలనుచూసి-

    "అవును! యింటికి వెళ్ళితే అమ్మ ఇంక బయటికిరానివ్వదు! ఎంత కట్టడిలో పెడుతుందో నీకూ తెలుసుగా? నీకొక ముఖ్యమయిన విషయం చెప్పాలని వచ్చాను."

    "ఏమోతే అది?" ఆత్రుతగా అడిగింది.

    "నీకు పెళ్ళని తెలిసిన తరువతః డ్రాయింగ్ మాష్టారు ఎంత బాధపడ్డారో? ప్రముఖ కళాకారిణి అవబోయే వ్యక్తికి పెళ్ళి అని సంకెళ్ళు వేస్తారా? ఇదేమన్నా న్యాయంగా వుందా? అని నన్ను అడిగారు. నీకు పెళ్ళి అనేసరికి నీరుగారిపోయారు మాష్టారు. ఎందుకంటావా? నిన్ను ప్రముఖతారను చేయాలనుకున్నారట! అసలు ఒక్క డ్రాయింగ్ మాష్టారు ఏమిటి? ఎంతోమంది మాస్టార్లు నీ గురించి బాధపడ్డారు. నువ్వు గొప్ప సినిమాతారవయిపోతావన్న నమ్మకం వారిలో వుండబట్టే అందరూ అంత బాధపడ్డారు.

    నువ్వు అప్పుడప్పుడూ డబ్బులుయిచ్చి సినిమా పుస్తకాలు తెప్పించుకునే దానివి! జయసుధ జీవితచరిత్ర వేశారు అందులో!

    ముందు నీలాగానే వాళ్ళింట్లో అందరూ అభ్యంతర పెట్టారట! ఆ తరువాత వారు వప్పుకాకపోయినా తానే చొరవచేసి యిద్దరు ముగ్గురు నిర్మాతలను కలుసుకాగానే సినిమాచాన్సులు వచ్చేయట! ఇంకా చూసుకో! ఆ వెంటవెంటనే ఓ ఇరవై సినిమాల్లో బుక్కయిపోయిందట.

    తీసుకెళ్ళి నీకివ్వమన్నది తెస్తే నువ్వేమంటావో అని భయపడి తెలీదు. చదివితే నీకే ఆశ్చర్యం కలుగుతుంది."

    "నిజంగా!"

    "అవునుకావేరీ? నువ్వు గొప్ప సినిమాతారవయిపోతావని నాకూ వున్నది. మద్రాసువెళ్ళితే చాలు! నీకు కావలసినన్ని సినిమాల్లో ఛాన్సు యిస్తారు. యిక్కడ గోళ్ళుగిల్లుకుంటూ కూర్చుంటే ఎవరిస్తారు! ఆలోచించుతావుగాని ఉపయోగం ఏమిటి? ఏమిటి? ఎలాగో నీకు పెళ్ళిచేసి ఇంట్లోనే కత్తి పడవేయాలని చూస్తున్నారుగాని నీ కోరిక ఏమిటో ఏ ఒక్కరూ గ్రహించటంలేదు. ఇక యింతేలే నీ జీవితం! వస్తాను. ఆలస్యం అయితే మా అమ్మ ఊరుకోదు!"

    "ఆ పుస్తకం రేపు తెచ్చిపెట్టవూ?" జాలిగా అడిగింది.

    "ఆ...తీసుకువస్తానుగాని నీ గురించి నువ్వు గట్టిగా మరొక్కసారి ఆలోచించు. బయటికి వెళ్ళి గొప్ప సినీతారవయిపోతావో? ఇంట్లోనే వుండి నీ మొగుడికి, నీ అత్తకి వెట్టిచాకిరీ చేస్తావో?" అంటూ వెళ్ళిపోయింది సుబ్బులు!

    సుబ్బులు అన్న మాటలు కావేరిమీద బాగా పనిచేశాయి. తను ఎంతో అందమయినదని అందరూ అంటున్నారు. సినిమాతార అవగల అదృష్టం వుందంటున్నారు? నిజానికి తను మద్రాసులోపుట్టి పెరిగివున్నట్లయితే ఈ సరికి పెద్ద సినీతార అయిపోయి వుండేది.

    పెళ్ళితో తనను నాలుగుగోడల మధ్యా బంధింపచేయటమే! ఇంకెక్కడి తన కోరిక? ఆ మూడుముళ్ళతోనే అయిపోతుంది తనపని! ఆ రోజున తను నాటకంలో పాల్గొన్న తరువాత ఎంతమంది అభినందించారు? ఎన్ని విధాలుగా పొగిడారు? తనలోని కళాతృష్ణను ఎవరూ అర్ధంచేసుకోరేమిటి? తనను మద్రాసు తీసుకెళ్ళి నిర్మాతలకి పరిచయం చేయకూడదూ? వీళ్ళకసలు ఏమీ తెలియదు. ఏదో యింత వండుకుని తినటమే తెలుసు! రేపు తను గొప్ప హీరోయిన్ అయితే అందరూ తనింటిమీద పడి తినరూ? తను హీరోయిన్ అవ్వాలంటే ఏంచేయాలి? ఏంచేస్తే బాగుంటుంది? ఆలోచించుతోంది కావేరి.

    "దొడ్లో కూర్చున్నది నీకోసమే కాబోలు!"

    అంటున్న పార్వతి మాటలు వినిపించి తనకోసం వచ్చింది ఎవరా? అనుకుని తలతిప్పి చూసింది కావేరి!

    వినాయకరావు నవ్వుకుంటూ కావేరి కూర్చున్నచోటుకి వచ్చాడు చేతిలో సినిమాపత్రికలు వున్నాయి. ఆత్రుతగా వాటిని తీసుకుంది.

    "వాటిని తీరికగా చూద్దువుగాని మనం సినిమాకు వెళ్ళుదామా?" అనడిగాడు వినాయకరావు నవ్వుతూ.

    "అత్తయ్య ఏమయినా అంటుందేమో బావా?..."

    "మా అమ్మకి తెలియకుండా రెండవ ఆటకి వెళ్ళుదాం. నా సైకిల్ మీద తీసుకెళతానుగా? నువ్వు రెడీ అయివుండు! నేను వస్తాను!"

    సినిమాకు సైకిల్ మీద తీసుకెళతానంటే కావేరికి ఎంతో సంతోషం కలిగింది. యిలా ప్రతీ సినిమాకు బావతో కలిసి వెళ్ళవచ్చును! సరదాగా వుంటుంది సైకిల్ మీద వెళ్ళుతుంటేను!...యిది వరకుటిలా ఆంక్షలు వుండవు! వచ్చిన ప్రతీ సినిమా చూసేయవచ్చును....బావతో కలిసి బస్తీకి కూడా వెళ్ళవచ్చును...అప్పుడిహ తనకి ఆంక్షలు పెట్టేవారే వుండరు.

    "నేను నీ ఎదురుగా వున్నప్పుడు కూడా ఎక్కడో చూస్తూ మరేదో ఆలోచించుతూ వుంటావేమిటి?..." అనడిగాడు వినాయకం!

    "మా బావతో ప్రయాణం ఎలా వుంటుందోనని ఊహించుతున్నాను..." అంది నవ్వుతూ!

    "ఎలా వుంటుందో నువ్వే చూస్తావుగా?..." అంటూ యింక అక్కడ వుండకుండా వెళ్ళిపోయాడు.

    లోపలికి వచ్చాక కావేరి తల్లికి చెప్పింది.

    "బావా నేనూ సినిమాకు వెళ్ళుతున్నామని,"

    ఎవరయినా చూస్తే ఏమనుకుంటారూ? అని అనబోయి ఆగిపోయింది. కావేరికి ఎంత సినిమాపిచ్చి వున్నదో? అందుకే తీసుకెళతానన్నాడు. అయినా ఆ యిద్దరినీ దగ్గిరగా వుంచాలి! లేకపోతే గంటలతరబడి ఆలోచించుతూ కూర్చుంటున్నది. దీనికింకా సినిమాపిచ్చి పోలేదు! అనుకుంది సుభద్రమ్మ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS