"మీ పని అయిందా?"
"ఆఁ "
"అయితే పదండి పోదాం."
ఇద్దరూ లిఫ్టు వేపు నడిచారు.
"అన్నట్టు ఏదో గౌను సంగతి చెప్పింది రమణి..." అంటూ ఆమెని చూశాడు.
"దాని కోసమే ఇపుడు మన ప్రయాణం అంటూ!" రాజేశ్వరి నవ్వింది.
0 0 0
ఆటోలో కూర్చున్నారిద్దరూ...అబిడ్స్ నుంచి విజయనగర్ కాలనీకి ప్రయాణం....
రాజేశ్వరి భుజంమీద చెయ్యివేశాడు రాజారామ్. ఆమె దగ్గరయింది. 'అయ్ లవ్ యూ రాజీ!' అని అందామనుకొని ఆగిపోయాడు. ఆటో రొద. అటూ ఇటూ నడిచే వాహనాల హోరు....ఇప్పుడుకాదు...మరోసారి చెబ్దాం....అనుకున్నాడు. ఆమె మెదమీదికి చేతిని పోనిచ్చాడు...ఇటు తిరిగి అతని కళ్ళలోకి చూసింది. లాలన. అభిమానం. జాలి. కోరిక. ఇలా ఎన్నో మెరిసాయి అతని కళ్ళలో.
ఆటో ఆగింది. దిగి లోనికి వెళ్ళబోతూ గేటు దగ్గర ఆగాడు రాజారాం. ఏమిటన్నట్టు చూసింది రాజేశ్వరి.
మెయిల్ బాక్స్ తెరచి చూశాడు ఒకేఒక్క ఉత్తరం ఉంది. చేత్తో పట్టుకుని మేడ మెట్లెక్కాడు. అతన్ని అనుసరించింది రాజేశ్వరి.
రమణి నిద్రపోతోంది. భవానీ ఏదో డిటెక్టివ్ నవల చదువుకుంటోంది. కాసేపు అదీ ఇదీ మాట్లాడాక భావాన్ని వెళ్లిపోయింది. బంగారం రంగు గౌనున్న బేగ్ ని పట్టుకుని సోఫాలో కూర్చుని ఉంది రాజేశ్వరి. రమణిని లేపనా మాననా అని ఆలోచిస్తోంది ఆమె.
అంతలో రాజారాం కి ఉత్తరం సంగతి గుర్తొచ్చింది. జేబులోంచి తీశాడు. తెల్లని ఖరీదైన కవరు. దానిమీద తన అడ్రస్ నీట్ గా టైప్ చేసి ఉంది కవరు చించాడు. ఓ ఎక్సర్ సైజు కాగితం మీద రెండే రెండు లైన్లు ఉన్నాయి. ఎవరో తెలుగు రానివాళ్ళు రాసినట్లున్నాయా అక్షరాలు.
నీ కూతుర్ని తీసుకుని ఈ ఊరు వదలిపో...
ఆ కాగితాన్ని రాజేశ్వరికి ఇచ్చాడు. మంచంమీద అమాయకంగా నిద్రపోతున్న రమణిని చూశాడు.
ఉత్తరం చదివి రాజేశ్వరి నిర్ఘాంతపోయింది. వెంటనే ఏం మాట్లాడలేకపోయింది. చివరికి... అంటే రమణి ఆ వ్యక్తిని నిన్న నిజంగానే చూసింది" అంది.
8
అన్ని సౌకర్యాలూ, అలంకరణలూ ఉన్న తన ఇల్లు ఓ పెద్ద జైలులా అనిపించింది రాజారాం కి. కిటికీ అవతల కనిపిస్తున్న చీకటి మరింత చిక్కనై ఘనీభవిస్తున్నట్టు అనిపించింది. కాలనీలో ఉన్న ఎన్నెన్నో వీధుల్లో కనిపించని క్రూరమృగాలు తారట్లాడుతున్నట్టు కూడా అనిపించింది.
డ్రాయింగ్ రూం లో రాజేశ్వరి, భవాని, రాజారామ్, ఇన్ స్పెక్టర్ మహావీర్ కూర్చుని మెల్లిగా మాట్లాడుకుంటున్నారు. పక్కగదిలో రమణి గాఢంగా నిద్రపోతుంది. ఆమె మంచం పక్కనే నేలమీద చాప పరుచుకుని వంటామె లక్ష్మీకాంతమ్మ నిద్రపోతోంది.
చేతిలో ఉన్న ఉత్తరాన్ని ఇన్ స్పెక్టర్ మహావీర్ ఎన్నోసార్లు పరిశీలనగా చూశాడు.
"దీన్నిబట్టి చూస్తే ఈ 'మనిషి' ఇక్కడి వాడేనన్న నిర్దారణకి మనం రాకతప్పదు. వాడిక్కడే ఎక్కడో స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. రమణి ఎ క్షణంలోనైనా ఎప్పుడైనా తనని చూసి గుర్తుపడ్తుందని భయపడ్తున్నాడు. చిన్నపిల్లలు చాలా విషయాలని ఎంతో త్వరగా మర్చిపోతారు. భయపెట్టో బెదిరించో కొన్నాళ్ళపాటు రమణిని ఎక్కడికయినా పంపించెయ్యాలని వాడి ప్లాను!" అన్నాడు. మహావీర్ నిదానంగా.
"నేను అదే అనుకుంటున్నాను. కొన్నాళ్ళపాటు రమణిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది" అన్నాడు రాజారామ్. అతని కంఠం రుద్దమైపోయింది.
ఈ విషయంలో మీరేం భయపడనక్కర్లేదు. అయినా ఒక విషయం మీరు మర్చిపోతున్నారు. రమణిని మీరు ఎక్కడికయినా పంపగలరేమో కాని, మిమ్మల్ని మాత్రం మా ఇన్ స్పెక్టర్ దుర్గారావు వదలడు!!
"సరే - మేం ఎక్కడికీ వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాం అనుకోండి. రమణి మళ్లీ 'అతన్ని' చూసి గుర్తుపడితే? లేదా ఆ అవకాశం రాకుండా మళ్లీ ఏదయినా అఘాయిత్యం చేస్తే?" అన్నాడు రాజారామ్.
"రమణి ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తాను. వాడెలాంటి అఘాయిత్యం చెయ్యకముందే వాడిని బొక్కలోకి తోయిస్తాను.
"అంటే-ఈ నాలుగు గోడల మధ్యా బందీల్లా ఉండి పోవాలన్న మాట మేమంతా?"
"రాత్రివేళల్లో తప్పదు మరి! పగటిపూట మాత్రం రమణి బాడీగార్డ్స్ లేనిదే ఎక్కడికి వెళ్ళకూడదు. రమణి వెంట భవానీ అనుక్షణం ఉంటుంది. అంతేకాదు మఫ్టీలో ఉన్న పోలీసులు మీ ఇంటిని ఇరవై నాలుగ్గంటలూ ఓ కంట కనిపెడ్తూ ఉంటారు."
"అన్నట్టు మీకో విషయం చెప్పడం మరచిపోయాను. రేపు అనంతగిరి పిక్నిక్ వెళ్దామని ప్లాన్ వేశాం. భవానీ కూడా మాతో వస్తున్నారు" అన్నాడు రాజారామ్.
"మంచిదే. వెళ్ళిరండి- ఈ టెన్షన్ అయినా కాస్త తగ్గుతుంది." అంటూ ఇన్ స్పెక్టర్ మహావీర్ లేచాడు. "నేనీ ఉత్తరాన్ని తీసుకువెళ్తున్నా. లేబరేటరీలో ఇచ్చి హేండ్ రైటింగ్ విషయం ఎనలైజ్ చేయిస్తాను" అన్నాడు.
"ఈ ఉత్తరం ఎవరు రాసి ఉంటారో నా ఊహకి అందడంలేదు" అంది రాజేశ్వరి తనలో తను అనుకున్నట్టు.
"అన్నట్లు రాజేశ్వరిగారూ, నేనూ, భవానీ బయలుదేరుతున్నాం. మీరు వస్తానంటే మీ ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం" అన్నాడు మహావీర్.
రాజేశ్వరి లేచి నిలబడింది. రాజారామ్ కళ్ళలోకి చూసింది. నిజానికి ఆమెకి ఇంటికి వెళ్ళాలనిలేదు. రాజారామ్ కళ్ళలో కూడా ఆమెకి అదే భావం కన్పించింది.
కాని...
"వెళ్ళొస్తానండీ" అంది.
"అలాగే!" అని మాత్రం అనగలిగాడు రాజారామ్.
అంతా వెళ్ళిపోయాక రమణి నిద్రపోతున్న గదిలోకి నడిచాడు రాజారామ్.ఎంతో అమాయికంగా ఉన్న ఆమె మొహం చూస్తూ మంచంమీద పక్కనే కూర్చున్నాడు. ఏడు వసంతాలయినా నిండని చిన్నది __ విధి చేతిలో ఎంత క్రూరంగా చిక్కుకుంది! గతాన్ని తలుచుకుంటూ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ - ఆమె పక్కనే పడుకున్నాడు. రమణి చెంపల్ని మృదువుగా రాశాడు. ఆ స్పర్శకి రమణి కదిలింది నిద్రలోనే. 'డాడీ' అంటూ కలవరించింది.
