Previous Page Next Page 
దేవదాసు పేజి 26

    దేవదాసు మనస్సులోనే ఏదో లెక్క వేసుకున్నాడు. తరువాత-"నా యింటినుంచి తిరిగి వచ్చిన తరువాతనే ఇక్కడకు వచ్చావా?" అన్నాడు.
    చంద్రముఖి ఆశ్చర్యపోయింది. మీ యింటికి నేను వెళ్ళిన సంగతి మీకెలా తెలిసింది?" అన్నది.
    దేవదాసు అన్నాడు-"నీవు తిరిగి వచ్చిన తరువాతే నేను ఇంటికి వెళ్ళాను. నిన్ను పెద్ద కోడలు దగ్గరకు తీసికొని వెళ్ళిన దాసీ ద్వారా, నిన్న అశథ్ ఝారీ గ్రామం నుంచి చాలా అందంగా వున్న ఒక స్త్రీ వచ్చిందీ అని విన్నాను. కాని తెలుసుకోవడం ఎంత కష్టం? కాని ఇన్ని ఆభరణాలు ఎక్కడ చేయించావు?"
    "చేయించడంలేదు. ఇవన్నీ గిల్టు ఆభరణాలు. కలకత్తా వచ్చి వీటిని కొన్నాను. నిన్ను చూడటం కోసం నేను అనవసరంగా ఎంత ఖర్చు చేశాననుకున్నావు? పైగా నిన్న నీవు అసలు నన్ను గుర్తుపట్టలేకపోయావు."
    హఠాత్తుగా గుర్తుపట్టలేకపోయాను. ప్రయత్నించిన మీదట గుర్తుపట్టాను. చంద్రముఖి తప్ప నాకు ఇటువంటి సేవ ఎవరుచేస్తారని అనేక సార్లు మనసులో అనిపించింది" అన్నాడు దేవదాసు నవ్వుతూ.
    ఆనందం కారణంగా చంద్రముఖికి రోదించాలనే అభిలాష కలిగింది. కొంచెంసేపు మౌనంగా వుండి సేవదాస్! ఇప్పుడు నన్ను అలాగే ఏవగించుకొంటున్నావా లేదా?" అని అడిగింది.
    "లేదు, పైగా ప్రమిస్తున్నాను" అన్నాడు దేవదాసు.
    మధ్యాహ్నం స్నానం చేసేటప్పుడు చంద్రముఖి చూసింది. దేవదాసు రొమ్ముమీద ప్లానల్ గుడ్డ కట్టి వుంది. గాభరాపడి "ఇదేమిటి? ప్లానల్ ఎందుకు కట్టుకున్నావు?" అని అడిగింది.
    "గుండెలో ఓ విధమైన నొప్పి కలుగుతుంది. నీవు సుఖంగా వున్నావా?" అన్నాడు దేవదాసు.
    చంద్రముఖి తల బాదుకుంటూ "సర్వనాశనం చేయదలచుకున్నావా ఏం? ఊపిరితిత్తుల్లో నొప్పిగా వుందా?" అన్నది.       
    దేవదాసు నవ్వుతూ అన్నాడు__"చంద్రముఖి! అటువంటిదే ఏదో వుంది" అదే రోజు డాక్టరు వచ్చి చాలాసేపటివరకు పరీక్ష చేసిన తర్వాత ఇదే సందేహాన్ని సిద్దపరచాడు. మందు వ్రాసిచ్చాడు. ప్రత్యేకమైన జాగ్రత్తలో ఉంచకపోతే గొప్ప అనిష్టం జరగవచ్చు" అన్నాడు. ఇరువురూ దీని తాత్పర్యం తెలుసుకున్నారు. ఉత్తరం వ్రాసి ఇంటివద్దనుంచి ధర్మదాసును పిలిపించారు. చికిత్సకోసం బ్యాంకు నుంచి డబ్బు వచ్చింది. రెండు రోజులు ఈ విధంగానే గడిచిపోయాయి. కాని మూడో రోజు జ్వరం ప్రారంభమయింది.
    దేవదాసు చంద్రముఖిని పిలిచి "చాలా మంచి సమయానికి వచ్చావు. లేకపోతే నన్ను ఇక్కడ ఎవరు చూస్తారు? కన్నీళ్ళు తుడుచుకొని చంద్రముఖి తన శక్తికొలదిగా సేవ చేయడానికి కూర్చున్నది. రెండు చేతులు జోడించి ప్రార్ధించింది. భగవంతుడా! ఇటువంటి ఆకాలంలో ఇంతపని వచ్చిపడుతుందని కలలో గూడా ఆశించలేదు. దేవదాసును శీఘ్రంగా, ఆరోగ్యవంతునిగా చేయమని నా ప్రార్ధన."
    దాదాపు ఒక మాసం కన్న పైగానే దేవదాసు మంచంమీద పడివున్నాడు. మరల క్రమంగా ఆరోగ్యవంతుడవుతున్నాడు. రోగం ఎక్కువగా పెరగలేకపోయింది.
    ఇదే సమయంలో ఒక రోజు దేవదాసు "చంద్రముఖీ! నీ పేరు చాలా పెద్దది. పిలవడానికి కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లుంది. దీనిని కొంచెం చిన్నదిగా చేయదలచుకున్నాను" అన్నాడు.
    "మంచిది అలాగే" అన్నది చంద్రముఖి.
    "ఈ రోజు నుంచి నిన్ను "కోడలూ" అని పిలుస్తాను."
    చంద్రముఖి ఫక్కున నవ్వింది_"ఇలా పిలవడానికి ఒక ఉద్దేశ్యము కూడా వుండాలి" అన్నది.
    "ఏం, అన్ని విషయాలకు ఉద్దేశ్యం ఉంటుందా? నా ఇష్టం."
    "ఇష్టమే అయితే పిలువు. కాని ఆ ఇష్టం ఎటువంటిదో, అదైనా చెప్పు?"
    "వద్దు, కారణమేదీ అడగవద్దు."
    చంద్రముఖి తల వాల్చుకొని "మంచిది. అయితే అలాగే పిలువు" అన్నది.
    దేవదాసు చాలాసేపు మౌనంగా ఉన్న తరువాత హఠాత్తుగా గంభీరభావంతో అడిగాడు-"సరే కోడలూ! నీవు నాకు ఎవరివి? ప్రాణాన్ని సైతం లక్ష్యపెట్టకుండా నాకు ఇంత సేవ చేస్తున్నావు?"
    చంద్రముఖి సిగ్గుపడుతూ వుండే వధువూ కాదు, సంభాషణలో అలవాటులేని బాలికా కాదూ, దేవదాసు ముఖంవైపు దృష్టి వుంచి, స్నేహపూరితమైన కంఠంతో "నీవు నా సర్వస్వానివి. ఏం, ఇది ఇప్పటికీ గూడా తెలుసుకోలేకపోయావా?"
    దేవదాసు గోడవైపు చూస్తూ ఉన్నాడు. అటువైపే చూస్తూ నెమ్మదిగా అన్నాడు_"ఇదంతా నాకు తెలుసు. కాని దీని వలన ఆనందం లభించడం లేదు. పార్వతిని నేను ఎంతగా ప్రేమించేవాణ్ణి, ఆమె కూడా నన్ను ఎంతగా ప్రేమించేది. కాని దీనివలన చివరకు కష్టమే లభించింది. చాలా దుఃఖాన్ని పొందిన మీదట ఇక ఎప్పుడూ ప్రేమ అనే ఉచ్చులో పడగూడదనుకున్నాను. తెలిసి ఉండి పడలేదు కూడా. కాని నీవు ఏమిటి ఇలా చేశావు? బలవంతం పెట్టి నన్ను మళ్ళీ అందులో ఎందుకు బంధించావు?" అని చెప్పి కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న తరువాత మళ్ళీ_"కోడలూ, నీవు కూడా పార్వతిలాగే దుఃఖం అనుభవిస్తావనే అనిపిస్తున్నది."
    దేవదాసు పమిట చెంగుతో కప్పుకొని మంచంమీద ఒకవైపు మౌనంగా కూర్చొని ఉంది.
    చంద్రముఖి మళ్ళీ తన మృదువైన కంఠంతో చెప్పడం ప్రారంభించాడు_"మీ ఇరువురిలో ఎంతో వైషమ్యం ఉంది. ఒకామె ఎంతో అభిమానం గలది. ప్రబలమైనది. మరొకామె ఎంతో శాంతం గలది, సంయమనం గలది. ఆమె ఏమీ సహించలేదు. నీవు ఎంతో సహించగలవు. ఆమెకు ఎంతో కీర్తి ఉన్నది. ఎంతో పేరు ఉన్నది. నీవు ఎంతో కళంకం పొందినదానవు.అందరూ ఆమెను ప్రేమిస్తారు. కాని నిన్నెవ్వరూ ప్రేమించరు. అయినా నేను ప్రేమిస్తాను- ఎలా ప్రేమిస్తాను?" అని చెప్పి దీర్ఘమైన నిట్టూర్పు ఒకటి విడిచి మళ్ళీ చెప్పాడు-"పాప పుణ్యాలను విచారించేవాడు నిన్ను ఎలా విచారిస్తాడో చెప్పలేను. కాని మృత్యువు తరువాత, ఒకవేళ కలయిక అంటూ వుంటే నేను ఎన్నటికీ నీకు దూరంగా ఉండను."
    చంద్రముఖి లోలోపల రోదించింది. మనస్సు చాలా చిన్నబోయింది. మనసులో ప్రార్ధించసాగింది__ "ఓ భగవంతుడా_! ఏ కాలంలో గానీ, ఏ జన్మలోగానీ ఒకవేళ యీ పాపిష్టి దానికి ప్రాయశ్చిత్తమైపోతే నాకు ఈయననే బహుమతిగా ప్రసాదించవలసిందిగా కోరుతున్నాను.
                       *    *    *    *
    రెండు మాసాలు గడిచిపోయాయి. దేవదాసు ఆరోగ్యవంతుడు అయ్యాడు. కాని ఇంకా శరీరం దృఢంగాలేదు. గాలి మార్పు అవసరంగా వుంది. రేపు పడమటి ప్రాంతానికి వెళ్ళిపోతాడు. తోడుగా కేవలము ధర్మదాసుమాత్రమే వుంటాడు.
    చంద్రముఖి దేవదాసు చేయి పట్టుకొని "నీకు ఒక దాసీ కూడా కావాలి. నన్ను వెంట తీసికొని వెళ్ళు" అన్నది.
    "ఛీ! ఇది సాధ్యమవుతుందా? ఇంకేమైనా చేస్తాను గాని ఇంత సిగ్గులేని పని చేయలేను" అన్నాడు దేవదాసు.
    చంద్రముఖి మౌనం వహించింది. ఆమె తెలియనిదేమీ కాదు. అన్ని విషయాలూ సహజంగానే తెలుసుకున్నది. ఇంకేమైనా కానివ్వు, కాని ఈ ప్రపంచంలో ఆమెకు గౌరవం లేదు. ఆమె వుండటం వలన దేవదాసుకు సేవ బాగా జరుగుతుంది. సుఖం దొరుకుతుంది. కాని ఎక్కడా గౌరవం లభించదు. కళ్ళు తుడుచుకుని "ఇక మళ్ళీ ఎప్పుడు చూడగలను?" అన్నది.
    "ఇది చెప్పలేను. ఎక్కడవున్నా సరే, కాని నిన్ను మాత్రం మరచిపోను. నిన్ను చూడాలనే తృష్ణ ఎప్పుడూ వుంటుంది. అది మాసిపోదు" అన్నాడు దేవదాసు.
    నమస్కారం చేసి చంద్రముఖి వేరుగా నిలబడిపోయింది. మనసులో అనుకున్నది__"ఇదే చాలు నాకు. ఇంతకన్నా ఎక్కువ ఆశించడం వ్యర్థం."
    వెళ్ళేటప్పుడు దేవదాసు చంద్రముఖి చేతిలో మరో రెండు వేల రూపాయలు పెట్టి "వీటిని వుంచు, మనిషి శరీరాన్ని విశ్వసించలేము. తరువాత నీవు కష్ట సుఖాలలో ఎవరి ముందు చేయి చాపుతావు?" అన్నాడు.
    చంద్రముఖి దీన్నికూడా అర్ధం చేసుకున్నది. అందుచేతనే డబ్బు తీసుకున్నది. కన్నీరు తుడుచుకొని "నీవు ఒక్క సంగతి నాతో చెప్పిపో" అని అడిగింది.
    "ఏమిటి?" అన్నాడు దేవదాసు ఆమె ముఖంవైపు చూస్తూ.
    "పెద్ద కోడలు_మీ వదినె_నీ శరీరంలో చెడు రోగం పుట్టిందని చెప్పింది, ఇది నిజమేనా?" అన్నది చంద్రముఖి.
    ప్రశ్న వినగానే దేవదాసుకు చాలా దుఃఖం కలిగింది_"పెద్ద కోడలు అన్నీ చెప్పగలదు. అయితే నీకు తెలియదా ఏమిటి? నీకు తెలియని రహస్యం ఏమి వుంది నా దగ్గర? ఒక విషయంలో నీవు పార్వతి కన్న పెరిగిపోయావు" అన్నాడు.
    చంద్రముఖి ఒక్కసారి కళ్ళు తుడుచుకొని 'అంతా అర్ధమయింది. అయినా చాలా జాగ్రత్తగా వుండు. నీ శరీరం దుర్భలంగా వుంది. చూడు, ఏ రకమైన లోపమూ జరగకూడదు" అన్నది. ప్రత్యుత్తరంగా కేవలం నవ్వాడు దేవదాసు.
    "మరో భిక్ష, కొంచెం ఆరోగ్యం చెడిపోయినా తప్పకుండా నాకు కబురు చేయాలి" అన్నది చంద్రముఖి.
    దేవదాసు ఆమె ముఖంవైపు చూసి తల వంచుకొని "కబురు చేస్తాను_తప్పకుండా కబురు చేస్తాను కోడలూ!" అన్నాడు. మరొక సారి నమస్కారం చేసి చంద్రముఖి రోదిస్తూ రెండోగదిలోకి వెళ్ళిపోయింది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS