దయాల్ తల వంచుకున్నాడు.
"చీర, జాకెట్, టాయిలెట్ బాక్స్, మంచి గిల్టు ఆభరణాలు మొదలయినవి ఎక్కడ దొరుకుతాయి?"
దయాల్ అవి లభించే చోటు చెప్పాడు.
"అవన్నీ కూడా మంచివి చూసి ఒక సెట్ కొనవలసి ఉంటుంది. నేను వచ్చి నచ్చినవి తీసుకుంటాను" అని నవ్వి మళ్ళీ "నాకు ఇంకా ఏమేమి కావాలో అవన్నీ నీకు తెలుసుకదా? ఒక దాసీని కూడా మాట్లాడాలి."
"ఎప్పుడు కావాలి?" అన్నాడు దయాల్.
"ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా కావాలి. రెండు మూడు రోజులలో చూసిపెడితే బాగుంటుంది" అని చెప్పి అతడి చేతికి వంద రూపాయల నోటు యిచ్చి "మంచి మంచి వస్తువులు చూసి తీసుకొనాలి. చౌకబారువి తీసుకోవద్దు" అని చెప్పింది.
మూడవరోజు ఆమె కొత్తగా తీసికొన్న ఇంట్లోకి వెళ్ళిపోయింది. రోజంతా కేవల్ రామ్ ను తీసికొని తనకు నచ్చిన విధంగా ఇంటిని అలంకరించింది. సాయంత్రం కాబోయేముందు ఇహ తనను అలంకరించుకుంటూ వుంది. సబ్బుతో మొహం కడుక్కొంది. తరువాత పౌడర్ అద్దుకుంది. ఎర్ర రంగుతో పాదాలకు రంగు వేసుకుంది. తాంబూలం నమిలి పెదవులకు రంగు వేసుకుంది. తరువాత కొత్తచీర, జాకెట్ ధరించింది. ఒంటినిండా ఆభరణాలు ధరించింది. చాలా రోజుల తరువాత ఈ రోజు తల దువ్వుకొని కేశాలను అలంకరించుకొని నుదుట బొట్టు పెట్టుకుంది. అద్దంలో ముఖం చూసుకొని మనసులో 'ఇంకా నా నుదుట ఏమేమి వ్రాసి వుందో?' అని అనుకొన్నది.
పల్లెటూరి పిల్లవాడు కేవల్ రామ్ యీ అలంకరణ, ఈ దుస్తులు చూసి గాభరాగా "ఇదేమిటక్కా?" అని అడిగాడు.
చంద్రముఖి నవ్వి "ఈ రోజు నా భర్త వస్తాడు కేవల్!" అన్నది.
కేవల్ రామ్ విస్మయంతో చూస్తూ వున్నాడు.
సాయంకాలం తరువాత క్షేత్రమణి వచ్చింది. "అక్కా! ఇదంతా ఏమిటీ?" అని అడిగింది.
చంద్రముఖి తల వుంచుకుని నవ్వుతూ "ఏం-ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదా?" అన్నది.
క్షేత్రమణి కొంచెం సేపు మౌనంగా చూస్తూ వుంది. తరువాత "వయసు ఎంతగా పెరుగుతూ పోతుందో, సౌదర్యం కూడా అంతగా పెరుగుతూ పోతుంది" అన్నది.
ఆమె వెళ్ళిపోయింది. చంద్రముఖి ఈ రోజు చాలా రోజుల తరువాత మళ్ళీ కిటికీ వద్దకు వచ్చి కూర్చున్నది. ఇదే ఆమె పని. అది చేయడానికే ఆమె వచ్చింది. ఎన్ని రోజులు ఆమె ఇక్కడ వుంటుందో అన్ని రోజులు ఇదే చేస్తుంది. కొందరు కొత్త వ్యక్తులు రాదలచుకొని వున్నారు. వాళ్ళు తలుపు నెట్టేవాళ్ళు. కాని అదే సమయంలో "ఇక్కడకు రావద్దు" అని కేవల్ రామ్ అంటూ వుండేవాడు.
పూర్వ పరిచితులు ఎవరయినా వస్తే చంద్రముఖి కూర్చొని, నవ్వుతూ మాట్లాడేది. మాటల సందర్భంలో దేవదాసు విషయం అడిగేది. వాళ్ళు చెప్పలేకపోతే నిర్లిప్తంగా వాళ్ళకు వీడ్కోలిచ్చేది. రాత్రి ప్రొద్దుపోయిన తరువాత స్వయంగా బయటికి వెళ్ళిపోయేది. ప్రతి పేటా, ప్రతి ద్వారమూ తిరిగేది. చాటునుండి జనం చెప్పుకునే మాటలు జాగ్రత్తగా వినేది. కొందరు వ్యక్తులు అనేక రకాల మాటలు మాట్లాడుకుంటూ వుండేవారు. కాని ఆమె వినదలచుకున్నది. వినలేకపోతున్నది. వచ్చేపోయే వాళ్ళల్లో చాలామందిని దేవదాసని భ్రమపడి దగ్గరకు వెళ్ళేది. కాని అతడు మరొక వ్యక్తి కాగానే నెమ్మదిగా తిరిగి వచ్చేది. మధ్యాహ్నం పూట ఆమె తన పూర్వపు పరిచితురాండ్ర ఇండ్లకూ, స్నేహితురాండ్ర ఇళ్ళకూ వెళ్ళేది. మాటల సందర్భంలో "ఏం? దేవదాసు విషయం మీకేమైనా తెలుసా?" అని అడిగేది.
"దేవదాసు ఎవరూ?" అని వాళ్ళు మళ్ళీ అడిగేవాళ్ళు.
చంద్రముఖి ఆసక్తితో పరిచయం చేస్తూ వుండేది-ఎర్రటివాడు, తల మీద ఉంగరాలు తిరిగిన జుట్టు, ముఖంమీద ఒకవైపు గాయపడిన మచ్చ వుండేది. ధనవంతుడయిన మనిషి, చాలా డబ్బు ఖర్చు చేస్తాడు. ఏం-మీకు ఎవరికయినా తగిలాడా?"
ఎవరూ జాడ చెప్పలేకపోయే వాళ్ళు. నిరాశతో - నిర్లిప్తంగా వున్న మనస్సుతో చంద్రముఖి ఇంటికి తిరిగి వచ్చేది. చాలా రాత్రివరకు దారివైపు చూస్తూ వుండేది. నిద్రవస్తే ఉదాసీన భావంతో లోలోపల....అనుకునేది__"ఇది నీవు నిద్రపోయే సమయమా?"
ఇదే విధంగా ఒక నెలరోజులు గడిచిపోయాయి. కేవల్ రామ్ కూడా విసిగిపోయాడు, ఆయన ఒకవేళ ఇక్కడ లేడేమోనని, స్వయంగా చంద్రముఖికి కూడా సందేహం కలుగుతూ వుంది. అయినా ఆశతోనూ, విశ్వాసంతోనూ రోజులుకు రోజులు గడిచిపోతున్నాయి.
కలకత్తా వచ్చి ఒకటిన్నర మాసాల కాలం దాటిపోయింది. ఈ రోజు ఆమెకి బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు. రాత్రి పదకొండు గంటలైంది. నిరాశతో ఆమె ఇంటికి తిరిగివస్తూ వుంది. ఇంతలో చూసింది, దారిలో ఒక వైపు ఒక ద్వారం ఎదురుగా ఒక మనిషి తనలో తాను ఏదో గొణుగుతూ వున్నాడు. ఈ కంఠస్వరం ఆమెకు బాగా పరిచితమైనదే కోట్లాదిమంది మధ్యలో గూడా ఆమె ఆ స్వరాన్ని గుర్తించగలదు. ఆ ప్రదేశం కొంచెం చీకటిగా వుంది. అక్కడే ఒక వ్యక్తి మత్తులోపడి వున్నాడు. చంద్రముఖి దగ్గరకు వెళ్ళి ఒంటిమీద చేయివేసి అడిగింది_"నీవు ఎవరివీ? ఎందుకు ఇక్కడ ఇలా పడి వున్నావు?"
ఆ వ్యక్తి బిగ్గరగా అన్నాడు_ "నా మనసులోని మాటలు విను, ఒకవేళ పొందితే నేను నీ భర్తను."
చంద్రముఖికి ఇప్పుడు మరేమీ సందేహం లేదు. "దేవదాస్!" అని ఆమె పిలిచింది.
దేవదాసు ఆ మాదిరిగానే "ఊఁ!" అన్నాడు.
"ఇక్కడ పడున్నావు ఎందుకు? ఇంటికి వస్తావా?"
"రాను, బాగానే వున్నాను."
"కొంచెం మద్యం త్రాగుతావా?"
"అవును, త్రాగుతాను" అని చెప్పి అమాంతంగా చంద్రముఖి కంఠం పట్టుకున్నాడు. "ఇటువంటి మేలు చేసేవాడివి నీవు ఎవరివి సోదరా?"
చంద్రముఖి నయనాలనుంచి అశ్రువులు రాలుతున్నాయి. చాలా శ్రమపడుతూ, పడుతూలేస్తూ చంద్రముఖి భుజం ఆధారంగా చేసుకొని లేచాడు. కొంచెం సేపు ముఖం వైపు చూసిన తరువాత_"ఇది చాలా మంచి వస్తువు సోదరా?" అన్నాడు.
చంద్రముఖి నీరసంగా నవ్వి "అవును చాలా మంచి వస్తువు.కొంచెం నా భుజం ఆధారం చేసుకొని ఇంకొంచెం ముందుకు పద. ఒక బండి మాట్లాడుకోవలసి వుంటుంది" అన్నది.
"బండి ఏమి వుంటుంది?" దారిలో వస్తూ వస్తూ అలసిపోయిన కంఠంతో అన్నాడు దేవదాసు__ "సుందరీ! నీవు నన్ను గుర్తించుతున్నావా?"
"అవును, గుర్తుపడుతున్నాను" అన్నది చంద్రముఖి.
దేవదాసు నత్తిగా పలుకుతున్నాడు_ "ఇతరులందరూ నన్ను మరచిపోయారు. నీవు నన్ను గుర్తుపడుతున్నావంటే అదృష్టమే!" తరువాత బండిమీద ఎక్కి, చంద్రముఖి శరీరం మీద తన బరువును వేసే ఇంటి వద్దకు వచ్చాడు. ద్వారం వద్ద నిలబడి జేబులో ఏమీ లేదు" అన్నాడు.
చంద్రముఖి ఏమీ జవాబు చెప్పలేదు. మౌనంగా చేయి పట్టుకొని పైకి తీసికొని వచ్చి పడుకోబెట్టి "నిద్రపో" అని అన్నది.
దేవదాసు అలాగే అలసిపోయిన కంఠంతో_"ఏమీ అక్కరలేదా? జేబు ఖాళీగా వుందని ఏమీ దొరికే ఆశ లేదనీ నేను చెప్పానే" అర్ధమయిందా సుందరీ?" అన్నాడు.
సుందరి దానిని అర్ధం చేసుకున్నది. "రేపు ఇవ్వు" అన్నది.
"ఇంత విశ్వాసం మంచిదికాదు. ఏం కావాలి, విప్పి చెప్పు?" అన్నాడు దేవదాసు.
"రేపు విను" అని చెప్పి ఆమె ప్రక్కనున్న మరో గదిలోకి వెళ్ళిపోయింది.
దేవదాసు నిద్ర లేచేసరికి ప్రొద్దెక్కిపోయింది. ఇంట్లో ఎవరూ లేరు. చంద్రముఖి స్నానంచేసి వంటచేసే ప్రయత్నంలో వుంది. దేవదాసు నలువైపులా ఆశ్చర్యంగా చూశాడు. ఈ చోటుకు ఆయన ఎప్పుడూ రాలేదు. ఒక్క వస్తువు కూడా గుర్తించలేకపోయాడు. గత రాత్రికి సంబంధించిన ఒక్క మాట కూడా గుర్తుకురావడంలేదు. కేవలం ఎవరిదో హృదయ పూర్వకమైన సేవ కొంచెం స్మరణకు వస్తూ వుంది. ఎవరో చాలా స్నేహంతో తీసికొని వచ్చి నిద్రపుచ్చినట్లుగా వుంది. ఇదే సమయంలో చంద్రముఖి ఇంట్లోకి ప్రవేశించింది. రాత్రి అలంకరణకూ ఇప్పటికీ చాలా మార్పు వచ్చేసింది. ఒంటిమీద ఆభరణాలు ఇప్పటికీ అవే వున్నాయి. కాని రంగు వేసిన అందమైన చీర, నుదురుమీద తిలకం, నోట్లో తాంబూలపు మరక మొదలైనవి ఏమీ లేవు. కేవలం ఉతికిన ఒక తెల్లటి చీర ధరించి ఇంట్లోకి వచ్చింది. దేవదాసు చంద్రముఖిని చూసి నవ్వాడు. "నిన్న నన్ను ఎక్కడనుంచి ఇక్కడకు పిలుచుకొని తీసుకొచ్చావు?" అన్నాడు.
"పిలుచుకు రాలేదు. దారిలో పడివుండటం చూసి ఎత్తుకొచ్చాను" అన్నది చంద్రముఖి.
"సరే, ఇదంతా అయ్యిందేదో అయ్యింది. కాని నిన్ను ఇక్కడ ఎట్లా చూడగలుగుతున్నాను? నీవు ఎప్పుడు వచ్చావు? నీవు ఆభరణాలు ధరించేదానివి కాదుగదా, మళ్ళీ ఎలా ధరిస్తున్నావు?" అన్నాడు దేవదాసు గాంభీర్యంగా.
చంద్రముఖి దేవదాసు ముఖంవైపు తీవ్రంగా చూస్తూ "మళ్ళీ....!" అన్నది.
కాదు, కాదు, ఇది సంభవం కాదు. ఇలా పరిహసించడంలో కూడా దోషం వుంది. ఎప్పుడొచ్చావు?" అన్నాడు దేవదాసు నవ్వుతూ.
"ఒకటిన్నర నెల అయింది" అన్నది చంద్రముఖి.
