అయన తిరిగి విష్ చేస్తూ "బాగా చదువు తున్నావా?' అనడిగాడు.
"ఏదో చదువుతున్నాను. సార్! మీవెంట ఎప్పుడూ భానుమూర్తి గారుంటుండే వారే?"
ఆ మాట విని వామనరావు గారి మొహం రంగులు మారింది. ఏదో బాధ గోచరించింది. అప్తుడిని దూరం చేసుకున్నాననే బాధ ఆ మొహంలో కనబాడుతుంది.
"ఇంకెక్కడి భానుమూర్తి? రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడు."
"ఆయనకీ ప్రదేశం సరిపోలేదా?"
"ఈ కాలేజీ కి అతడిక్కడ ఉండడం సరిపోలేదు."
"మీ మాటలు అర్ధం కావడం లేదు, సార్!"
వామనరావు గారు భానుమూర్తి ఎందుకు వెళ్లి పోయిందీ వివరంగా చెప్పి "ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరి తోనూ చెప్పవద్దన్నాడు. నా ప్రియ శిష్యుడి వి కాబట్టి నీకు చెప్పాను. ఈ ప్రపంచం లో ఎన్నో జరుగరాని పనులు జరుగు తుంటాయి. అందుకు బాధ్యులు ఎవరైనదీ నిర్ణయించి చెప్పడం కష్టం! వస్తాను" అని ప్రక్క దారి నుండి వెళ్ళిపోయాడు అయన.
రాజ్ కు అయన చెప్పిన విషయం చాలా బాధాకరంగా వుంది. ఒక చిన్న తుఫాను రేపింది అతని హృదయం లో ఆ వార్త. ఆ వార్త వినకుండా ఉండినా బాగుండేది.
వాకిట్లో నే ఎదురయ్యారు ఆనందరావు గారు. అయన వెంట ఎవరో ఉన్నారు. రాజ్ ను చూసి "లోపల అమ్మాయి ఉంది. మాట్లాడుతుండు. ఇప్పుడే వస్తాను." అని వెళ్లి పోయారాయన.
హల్లో వసంత ఒక సోఫాలో కూర్చోని ఉంది. రాజ్ ఆమె కెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. రాజ్ నుచూసి ఏదో తప్పు చేసినట్లు తలవంచుకుంది. ఆమెను చూసిన రాజ్ మనసులో పలురకాల ఆలోచనలు ఉదయించాయి. పై కప్పు కేసి చూస్తూ తనలోని ఆలోచనలకూ ఒక మార్గాన్ని ఏర్పరచు కోసాగాడు.
తలెత్తి అతన్ని చూసిన వసంత "నేను మీ ఎదుట ఉండడం కష్టం గా ఉన్నట్లుంది." అని లేచింది.
"వసంతా! నువ్వు ఎప్పుడూ ఎదుటి వారిని గాయపరచడం నేర్చుకున్నావు గానీ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు."
ఆ మాట లామెను తిరిగి కూర్చో బెట్టినాయి.
"నీ మనసు స్థిమితంగా లేదు కదూ?"
"ఏ విషయం లో.?"
"భానుమూర్తి విషయంలో...."
నెత్తిన పిడుగు పడ్డట్లు అడిరిపడింది వసంత. అతని కళ్ళలోకి చూసింది. అవి తనను సూటిగా చూస్తూ తన హృదయం లోకి చొచ్చుకొని పోయి దేనికోసమో వెతుకుతున్నాయి. ఎక్కువసేపు చూడలేక పోయింది. అతని చూపులలోని నిర్మలత్వము తనలోని మచ్చను వేలెత్తి చూపిస్తుంది.
"మీకెలా తెలుసు?' వణుకుతుంది ఆమె కంఠం.
"నాకంతా తెలుసు" నిర్లిప్తమైన జవాబు.
"అది నా తప్పేనంటారా?"
"ఒకరిది తప్పని చెప్పడానికి వీలులేదు. అందమైన పువ్వు మానవుడి హృదయాన్ని ఆకర్షిస్తుంది. దాన్ని బలవంతంగా నైనా చేతిలోకి తీసుకొని వాసన చూసి హాయిని అనుభవించాలని కోరుకుంటుంది అతని హృదయం. ఆ ఆకర్షణకు అంత శక్తి ఉందని ఒప్పుకోవాలి. ఆఖరకు దాన్ని క్రింద పారేసి తన దారిన తాను పోతాడు. అది ఎవరి తప్పు? ఆకర్షించేతత్త్వం కలిగి ఉంది పుష్పం. ఆకర్షణకు లొంగిపోయే బలహీనత మానవుడి హృదయం లో ఉంది. అది అతనిలో భయంకరమైన కోరికలను రేపుతుంది. అనాది నుండీ వస్తున్నది. అంత విచిత్ర సృష్టి చేసిన ఆ సృష్టి కర్తదే తప్పేమో!"
అతనికి మనసులోనే జోహార్లు అర్పించింది.
"ఇప్పుడా విషయం నాన్నగారితో చెప్పాదాని కొచ్చారా?"
"మళ్ళీ నన్ను అపార్ధం చేసుకుంటున్నావు."
"క్షమించండి, పొరపాటయింది."
తిరిగి మౌనం తాండవించింది. వారి మధ్య. వసంత కు అతనితో మాట్లాడుతుంటే హృదయం తేలిక పడ్డట్ల నిపించి ఇంకా మాట్లాడాలి అనుకొంది. కానీ ఏం మాట్లాడాలి?
"మీకు రజియా అంటే ఇష్టమా?" మెల్లిగా అడిగింది.
"ఇష్టం అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఆమె తన స్నేహంతో అంధకారబందురమైన నా జీవితానికి ఒక వెలుగును తెచ్చింది. అందుకే ఆమెను అరాదిస్తున్నాను."
"మరి, ఆమె?
ఆ ప్రశ్న అడగడం లోని ఉద్దేశ్యమేమిటో అని వసంత మొహం లోకి భావాల కై వెదికాడు. కానీ ఏమీ కనిపించలేదు. అడగాలని అడుగుతుందని గ్రహించాడు.
"ఆమె నన్ను తన మనసులో ప్రతిష్టించుకొని అరాదిస్తోంది."
"వెలుగును, చీకటి ని కూడా దేవుడే సృష్టించాడు. అంతటా వెలుగు. అంతటా చీకటీ ఉండవు. అందరి కోరికలూ నెరవేరవు. ఒకరికి సుఖం, మరొకరికి దుఃఖం ప్రసాదిస్తాడు భగవంతుడు."
అందరూ నమ్మే సత్యం. అనాదిగా వస్తున్న జీవితపు నిజం. కానీ అప్పటిలో ఆమె నుండి వెలువడ్డ ఆ మాటలు రాజ్ ను బాధించాయి. ఆమె హృదయం లో రగిలే బాధను అర్ధం చేసుకొన్న బాధ అది.
ఇంతలో పోర్టికో లో కారాగిన చప్పుడు విని వసంత పైకి పోయింది.
"ఏమిటోయ్ , ఏమిటి సమాచారం? బాగా చదువుతున్నావా! అమ్మాయేది?' హడావుడి గా అడిగారు ఆనందరావు గారు వచ్చి.
"ఇప్పుడే పై కెళ్ళిందండి!"
"అదెప్పుడూ అంతేలే. ఇంతకూ ఏమిటి విశేషం? మీ అత్తయ్య బాగా చూస్తోందా నిన్ను?"
'అక్కడ దేనికీ కొదవ లేదు. ఒక విషయం అడుగుతాను. చెప్తారా?"
"ఎప్పుడైనా చెప్పనన్నానా?"
"నవ్వాడు రాజ్. "ఆనాడు మీరు రజియా ను చూసి ఎవరో జ్ఞాపకం వచ్చింది అన్నారే? ఆమెను గురించి మీకేమైనా తెలుసా?"
"ఇప్పుడు అదెందు కోయ్?"
"పని ఉండండి. అందులో ఒకరి జన్మ రహస్యం దాగి ఉందని నా అనుమానం."
"అయితే విను. నేను కాలేజీ లో చదువుకొనే రోజులవి. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. అచ్చం రజియా లాగే ఉండేది ఆమె. బహుశా ఇప్పుడేమైనా మారి ఉండవచ్చు. నా చదువై పోగానే ఒకరింటికి పెళ్ళి చూపులకు పోయాము. మరిచాను, నేనప్పుడు కడప లో చదువు కుంటుండేవాడిని. పెళ్లి చూపులలో ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్య పోయాను. అప్పట్లో అది ఆనందదాయకం కూడా అయింది. సరోజినీ. కాలేజీలో నేను ఆమెను, ఆమె నన్ను ఎరిగి ఉన్నా ఎప్పుడూ పలుకరించు కోలేదు. అప్పట్లో అంత అవసరం కలుగలేదు. పెళ్ళి చూపుల్లో ఆమె అయిష్టతనే వ్యక్తపరిచింది. ఇంతలో మా నాన్న గారి బాల్య మిత్రుడోకడు వచ్చి వారితో ఏదో మాట్లాడాలని బయటికి తీసుకు పోయాడు. ఒంటరిగా ఉన్న నాకు వారి తోటలో తిరగాలనిపించి ఆ పని చేశాను. గుబురుగా ఉన్న ఆ పూల మొక్కలను చూస్తూ ఎదురుగా నిలిచి ఉన్న సరోజినీని చూసి ఆశ్చర్య పడకుండా ఉండలేకపోయాను.
"చూడండి , మీరు నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఇష్ట పడకండి." ఆమె మాటలు నన్ను మరింత నివ్వెర పరిచాయి.
కారణమడిగాను.
"కారణం చెప్పలేను, కానీ మీరంగీకరించకండి" అంది.
'కారణం చెప్పకుండా ఆజ్ఞాపిస్తే ఎలాగండి?" మొండి కేశాను నేను.
"సరే అంతగా వినాలని ఉంటె వినండి. నేను వాసన చూడబడిన పువ్వును. మనసును తనువును రెండింటిని వేరే ఒక వ్యక్తీ కి అర్పించాను. మీరు మంచివారు. మీ కన్యాయం జరగడం నాకిష్టం లేదు' అని వెళ్ళిపోయింది.
మెరుపులా వచ్చి ఒక దాగి వున్న సత్యాన్ని చెప్పి పోయింది. తనువును, మనసును మరొకరికి అప్రించింది. అంత మాత్రం చేత ఆమె నాకు అనర్హురాలు కాలేకపోయింది. ఈ జీవితం లో ఇటువంటివి ఎన్నో ఘోరాలు జరగడం లేదు? భర్తలకు తెలియకుండా శరీరాన్ని పరుల కార్పించే పతివ్రతలు ఉన్నారు. ఏ ఒకటి రెండు మార్లో గర్బాన్ని పోగొట్టుకొని గుట్టుగా మరొకరికి అంకితమయ్యే మహా పతివ్రతలు ఎందరో ఉన్నారు. వారి కన్న ఏం ఎక్కువ తక్కువ కాలెదీమే. పైగా చేసిన దాన్ని ధైర్యంగా చెప్పింది. అప్పట్లో అది ఆమె స్వార్షం కావచ్చు. కానీ భవిష్యత్తు కు ఎంతో అపాయకారి అని తెలిసి కూడా ధైర్యం చేసి తన రహస్యాన్ని నన్ను నమ్మి నాకు చెప్పింది. వయసులో ఎన్నో తప్పులు చేస్తుంటాం. చిన్నప్పుడు చేసే ఎన్నో తప్పులు తెలివి వచ్చిన తర్వాత చేయం. అంతే. ప్రేమ అనే ప్రవాహం లో ఎన్నో తప్పులు చేస్తూ ఎంతో దూరం కొట్టుకు పోతాం. వాటి నాధారంగా తీసుకొని మనం కొన్ని జీవితాలను నాశనం చేయకూడదు. వివాహం కాకముందు చేసిన తప్పులను వైవాహిక జీవితంలో దిద్దుకోగల అవకాశాన్ని వారికివ్వాలి. అప్పుడే అందరి జీవితాలూ అమృతతుల్యాలు కాగలవు. అందుకే నిర్ణయించుకొన్నాను ఆమెనే పెళ్లి చేసుకోవాలని.
