Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 27


    ఇంటికి పోయి ఏ విషయం తెలుపుతామంటూ నాన్నగారు నన్ను యింటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి గర్భవతి అనీ, అటువంటి సంబంధం చూడటానికి పోవడం తప్పనీ అన్నారు. కానీ నా మనసెందుకో అయన మాటలు లెక్కచెయ్యలేదు. ఆమెనే పెళ్ళి చేసుకుంటానని  పట్టు బట్టాను. నాన్నగారిని ఎదిరించే ధైర్యం లేకపోయినా నచ్చ చెప్పాను. ఒక్కగానొక్క కొడుకునైనా నా కోరిక కాదనలేని నాన్నగారు తన హృదయాన్ని గాయపరచుకొని అంగీకరించారు. ఆ విషయం తెలిసి సంబంధం ఖాయం చెయ్యను పోయిన వ్యక్తీ తెచ్చిన కబురు నన్ను క్రుంగ దీసింది. వారు ఊరు విడిచి ఎక్కడికో పోయారుట. జీవితంలో మొదటిసారి అపజయాన్ని పొందాను. ఒక వైరాగ్య సూచకమైన నవ్వు నా పెదవుల పై విరిసింది. అదే ప్రాప్త మంటారు పెద్దలు. ఒకసారి నాన్నగారి ఆరోగ్యం బాగులేక వేలూరు తీసి కెళ్ళాను. అక్కడ ఆమెను చూశాను. ప్రసవపు వార్డు లో నుండి కళా కాంతులు లేని మొహంతో బయటి కోస్తుండగా చూశాను. ఆమె ప్రక్కన ఆమె నాన్నగారు , అమ్మ, అమ్మ చేతిలో ఒక చిన్న పాప , ఊహించు కొన్నాను. అప్పటికి ఒక నెల క్రితమే నాకు పెళ్లయింది. ఆ తర్వాత ఇంతవరకూ జీవితంలో ఆమె నాకు తటస్థించలేదు."
    అతని మాటలు విన్న రాజ్ మనసు అతని పట్ల గౌరవాన్ని పెంపొందించుకుంది. ఇంత విశాల హృదయు లైన ఆయనకు ఈ కష్టాలెందుకు? నిజంగా భగవంతునికి హృదయం లేదనిపించింది.
    "ప్రతి యువకుడూ మీలాంటి భావాలు కలిగి ఉంటె ఈ భూమి స్వర్గంగా మారిపోతుందండీ."
    "అవన్నీ మనమనుకోవలసిందే. స్వర్గం కాకుంటే మానె నరకం కాకుంటే మేలే."
    అదీ నిజమే. భూమిని స్వర్గంగా మార్చాలని ప్రయత్నించే వారి కంటే నరకంగా మార్చాలనుకునే వాళ్ళే ఎక్కువ. మనమనుకునే లోకాన్ని మనం చూడలేం. మనమశించిన సంఘాన్ని మనం పొందలెం. భూమి స్వర్గం కావాలనీ, ప్రజలంతా దేవతలు కావాలనీ అనుకొంటే అది అత్యంత దుర్లభం అని తెలుసుకోవడానికి ఎంతో సేపు పట్టదు. మనం కనే కలలు ఫలించవు. మన ఆశలు నేరవేరవు. పూర్తిగా కాకపోయినా సగమైనా ఫలించవు. దినదినానికి పాపభూయిష్టమై పోతున్న భూమెక్కడ? అమరత్వం తో మన ఊహ కందని అందాలతో, సుఖాలతో , గుణాలతో కాలం గడిపే దేవతలుండే స్వర్గ మెక్కడ? మన కోరిక బయటికి తెలిపితే పిచ్చి వాళ్ళమంటుంది సంఘం. అవును. అది పిచ్చే కదూ? కానీ ఏం పిచ్చి? సంఘం లో , సమాజం లో, మనుజుల్లో మార్పు తేవాలనే పిచ్చి . మానవులలో రాక్షసత్వాన్ని పూర్తిగా తుడిచి పెట్టి దేవత్వాన్ని తేవాలనే పిచ్చి. చంచలమూ, క్రూరమూ అయిన మానవుడి మనస్సు ను పటిష్టం గానూ, దయా స్వరూపం గానూ మార్చాలి. కోరికలను రూపు మాపి వాంచా రహితంగా చేయాలి. మనిషికి నిలువెల్లా విషమే నన్న నినాదాన్ని పోగొట్టి అమృత వాహిని అని నిరూపించాలి. ఇదంతా చేయడం సాధ్యమా? సాధ్యం కాదు. ఎప్పుడు సాధ్యం? మానవులంతా మేల్కొని నడుం బిగించిన నాడు ఆది సులభం. విజయాన్ని అవలీలగా సాధించవచ్చు. మానవులు కోరేది దేన్నీ? పునర్జన్మ వద్దనే ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నారు. తిరిగి పాపభూయిష్టమైన ఈ లోకంలోకి రాకూడదనే తాపత్రయం అందరికీ ఉంది. కానీ అదే కొనసాగదు. అందరికీ సాధ్యం కాని, అందరికీ కనిపించే వస్తువది. అందరికీ దాన్ని అందుకోవాలనే అభిలాష. కానీ ఎవరో తప్ప అందరూ దాన్ని చేరలేరు. అలా చేరుకొన్న నాడు దాని గొప్పతనం ఏముంది? దాన్ని చేరుకొనే లోగానే ప్రక్కనే ఉన్న కోరిక లకు లొంగి పోయి ఓడిపోతారు. జన్మతోనే నాకీ మానవ జన్మ వద్దు అని చేతులు జోడించి కనబడని దేవుడిని ప్రార్ధిస్తూ వినబడని అర్ధం కాని భాషతో ఏడుస్తూ ఈ లోకంలోకి వచ్చిన నరుడు దాన్ని అంత సులభంగా అందుకోలేడు.
    తన జీవితాన్ని అతి దుఃఖ మయంగానే కాక సౌఖ్య వంతంగా మార్చు కోగలిగే తెలివిని, శక్తిని ప్రసాదించాడు భగవంతుడు. ఆ తెలివితో , ఆ శక్తితో తమ కర్తవ్యాన్ని గుర్తించి తమ జీవితాలను సార్ధకం చేసుకొంటారు కొందరు. మానవ లోకంలోనే దేవతలుగా పూజింపబడతారు. తమ చుట్టూ ఒక దివ్య తేజస్సు ను అలంకరించు కొని, ఆ తేజస్సు లో ఒక స్థావరాన్ని ఏర్పరచు కొని, మిగతా వారికి అందని గుణాలతో అలరారి ఆదర్శంగా నిలిచి పోతారు.
    ఇచ్చిన తెలివిని, శక్తిని దుర్వినియోగ పరచు కొంటూ ఐహిక వాంఛలకూ, కోరికలకూ లోబడి అల్పమైన, క్షణికమైన ఆనందాలను అనుభవించి శాశ్వతమైన ఆనందాన్ని ముక్తి మార్గాన్ని పోగొట్టు కొంటారు మరి కొందరు.
    తమకున్న శక్తిని తెలుసుకోలేక పుట్టినందుకు గాను జీవిస్తున్నామని, ఏ ఆనందాలను కోరిక, దొరికిన ఆనందాన్ని అనుభవించి జీవిత కాలమంతా అమాయకులుగా జీవించి అంత్య కాలంలో ఏమీ తెలియక, తెలుసుకోలేక చావు పుతుకలు మానవుడి కి సహజమనే భావన లో చనిపోతారు. కానీ ఈ మధ్య కాలంలో చేయవలసిన పనులు, విధులు ఉన్నాయనే భావన వారికి కలుగదు.
    తమ సామర్ద్యాన్ని తెలుసుకొని ఉపయోగించుకోలేని అభాగ్యులు ఉన్నారు. ఏ విధంగా చేస్తే ఏమి పొంద గలరో తెలుసుకోలేని తెలివి తక్కువ వారు ఎక్కువ. జీవిత కాలంలో తాము కొన్ని విధులను చేయాలి. ఫలితంగా పుణ్యాన్ని సాధించుకొని తమ జీవితాలు సార్ధకం చేసుకోవాలని తెలుసుకొన్నా ఆచరించ లేరు. అది వారి బలహీనత.
    ఇన్ని రకాల మనస్తత్వాలు కలిగిన ఈ లోకం అర్ధం కాని ఒక విచిత్రమైన అందమైన సృష్టి.     

               

                                       19
    "నాన్నా! మా అమ్మ ఎవరు? ఊహించని ప్రశ్నకు ఉలిక్కి పడ్డారు ఖాన్ గారు.
    ఎదురుగా రజియా ఏదో దృడ నిశ్చయంతో , దేన్నో తెలుసుకోవాలనే ఆత్రుతతో , పొందలేని సుఖాన్ని పొందాలనే ఔత్సుక్యంతో అడుగుతుంది. ఆమెలో వాటిని కలిగించిన వ్యక్తీ ఆమె ప్రక్కనే ఉన్నాడు. గ్రహించగలిగారు ఖాన్ గారు.
    "ఇప్పుడెందుకు , రజియా ఆ విషయాలన్నీ? మీ అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలైంది. " తప్పించుకోవాలనే ఆత్రుత వారిలో కనిపిస్తుంది.
    "నాన్నా! ఇక నన్ను మోసగించ లేవు. నిజం చెప్పు." నిలదీసి అడిగింది రజియా.
    నిట్టుర్పు విడిచారు ఖాన్ గారు. రాజ్ కళ్ళలో కాంతి కనిపించింది.
    "రజియా , ఇక దాచి ప్రయోజనం లేదు. అంతా చెప్తాను విను. నా హృదయాగ్ని బయటికి వెళ్ళ గ్రక్కుతాను. శాంతి, సౌఖ్యాలు లేని ఈ జీవిత గాధ వినే ధైర్య ముంటే విను. నే చేసినది తప్పయితే, క్షమించగలిగితే క్షమించు. నేను కడప కాలేజీ లో బి.ఎ చదువుతుండే వాడిని. మా నాన్నగారు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్. నన్నేలాగైనా కలెక్టరు ను చెయ్యాలని వారి అభిలాష. అందుకే డాక్టరీ చదువుతానన్న నా కోరిక నిరాకరించి బి.ఎ . లో చేరిపించారు.
    "ఆ రోజుల్లో ఏవేవో అశలు పెట్టుకుంటాం. భవిష్యత్తు ను గురించి కలలు కంటాం. కానీ వాటిలో ఏ ఒక్కటైనా ఫలిస్తుందో లేదో చెప్పలేము. భవిష్యత్తు కు సోపానాలను నిర్మించుకొనే రోజులవి. ఎవరెంత జాగ్రత్తగా తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తారో అంతగా వారి భావి జీవితం సుఖంగా గడిచి పోతుంది. కానీ ఆ యౌవనం, ఆ పరిసరాలు జాగ్రత్త ను మరిపిస్తాయి. కేవలం ఆనందాన్ని అనుభవించ మని చెప్పే వయసు, వయసును ఎడురించలేక అనుసరించే మనసు. రెండూ తోడైతే వినాశనానికి అడ్డు లేదు. ఆ రోజులు ఇక జీవితంలో రావు. అందుకే వాటిని ' టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్' అన్నారు. ఎవడైతే ఆదర్శాల ప్రకారం నడుచు కొంటాడో సుఖం వాని సొత్తు. అన్ని కాకపోయినా కొన్ని ఆదర్శాల నైనా పూర్తీ చేయగలిగితే భవిష్యత్తు లో ఏ డోకా ఉండదు. అలా కాక జీవితంలో ఉండే ఆనందాన్నంతా అప్పుడే అనుభవించాలనే ఉద్దేశ్యంతో చాలామంది విద్యార్ధులు ఉంటారు. వారు ముందు ముందు చాలా బాధలు పడవలసి వస్తుంది.
    "ఆ యౌవనం వింత వింత క్రొత్త కోరికలను కలిగిస్తుంది. అందని వాటిని ఆశించమంటుంది. అందుకే కొందరు కవులు యౌవ్వనం మహా ప్రవాహమని , దానికి ఆనకట్టలు కట్టి అనుకూలంగా మార్చుకోగలిగిననాడు బ్రతుకు ఫల దాయకమవుతుందని అన్నారు. అప్పుడు హెచ్చుగా ఉన్న ఆవేశానికి లోబడితే ఫలితాలు చాలా బాధాకరంగా ఉంటాయి. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే విద్యార్ధి జీవితంలో వారు ఏ పరిస్థితులలో తప్పుదారులు త్రొక్కుతారు అని. అనుభవపూర్వకంగా నేర్చుకొన్నాను కాబట్టి బయట పెట్టలేకుండా ఉండలేక పోతున్నాను.
    "మా క్లాసులో సరోజినీ అని ఒక అమ్మాయి ఉండేది. అందానికే మారు పేరు. ఆమె కోసం ప్రయత్నించని వారు ఏ కొందరో. నాకూ అప్పుడప్పుడూ ఆమెను దక్కించుకోవాలనే తాపత్రయం ఉండేది. ఆమె చూపుల్లో చూపులు కలుపాలనే కోరిక కలిగేది. ఆ పని చేసేవాడిని కూడా. కొందరిని అదృష్ట వంతులూ, మరికొందరినీ దురదృష్ట వంతులూ అని ఊరికే అనలేరు. ఆ అమ్మాయి బ్రాహ్మణు లమ్మాయి. నేను ముస్లిమును. మా ఇద్దరికీ పొత్తు కుదురేది ఎలా?
    "కొన్ని సంఘటనలు మన గీతనే మార్చి వేస్తాయి. ఒకనాడు ట్యూషన్ కు వెళ్లి వస్తున్న ఆమెను ఒక చిన్న వీధిలో అకస్మాత్తుగా చూశాను. ఆమెను చూడగానే నాలో ఏదో చెడు బుద్ది పుట్టింది. ఆమె దారి కడ్డం నిలబడ్డాను రాత్రి. జనసంచారం లేని వీధి. ఆమె తలెత్తి చూసింది. అంతే. ఏం చేస్తున్నానో తెలియకుండానే ఆమెను కౌగిట్లో కి తీసుకొని ముద్దు పెట్టుకొన్నాను. చెంప చెళ్ళు మంది. ఆ దెబ్బతో తప్పు తెలుసుకొన్నాను. లేకుంటే ఏం చేసేవాడినో తెలియదు. అక్కడి నుండి ప్రక్క సందులో పడి ఇల్లు చేరుకున్నాను. ఆ తర్వాత రెండు రోజుల వరకూ కాలేజీ ఎగ్గోట్టాను. కానీ మూడో రోజు పోక తప్పదుగా? మునుపటి ధైర్యం లేదు. తలెత్తి తిరగలేక పోయాను.
    "ఒకరోజు సినిమా నుండి ఇంటి కోస్తున్నాను. "మిస్టర్ ఖాన్' అని వినిపించింది. చూసాను. సరోజినీ. ఎక్కడ తిట్టేస్తుందోనని భయంతో పరుగెత్తి పోవాలనిపించింది. అలా చేస్తే ఎవరైనా దొంగ అంటారేమో ననే భయం. గబగబా అడుగులు వేశాను.
    "ఒక్క నిమిషం ఆగండి .' ఆ పలుకులు నా కాళ్ళ కు బందాల్నే వేశాయి. దగ్గరికి వచ్చి 'ఎందుకు నన్ను చూసి అలా భయపడుతున్నారు?' అంది.
    'నేనేం మాట్లాడే స్థితిలో లేను. ఆమె తిట్టే తిట్ల ను సహించి అడగబోయే ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను.
    "మీకు నేనంటే ఇష్టమా?' ఆమె అడిగిన ప్రశ్న అర్ధం కాక తల ఊపాను.
    "నమ్మమంటారా ?' అంది. అప్పుడు ఆమె అడిగిన ప్రశ్న నర్దం చేసుకొన్నాను. ఆమె అడిగిన ప్రశ్ననే నమ్మలేక పోయాను. అలా అడిగినట్లడిగి ఒక్కసారిగా ఎక్కడ తిట్టేస్తుందో ననే అనుమానం.
    "మీ యిష్టం' అనేశాను.
    'చేయి చాపిందామె. అ చేతిలో చేయి కలిపాను. అంతవరకు ఆమె ప్రక్కనే ఉన్న చిన్న తమ్ముడు అర్ధం కాక నా వైపు చూశాడు.
    "ఆనాడు చేతులు కలిశాయి. కాలక్రమేణా ఇద్దరం కలిసి పోయ్యాం.
    "ఖాన్, నేను తల్లిని కాబోతున్నాను.' ఆ వార్త నా గుండెల్ని చెదరగోట్టింది. ధైర్యం తెచ్చుకున్నాను. ఆమెకు ధైర్యం చెప్పాను.
    "సరూ, మీ నాన్నగారిని నేరుగా అడిగేస్తాను.' అన్నాను.
    "కోరి ఆపదలను కొని తెచ్చుకున్నట్లవుతుంది . మా నాన్న అసలే కోపిష్టి. అందుకు తోడు డి.ఎన్.సి మతాంతర వివాహానికి ఒప్పుకోడు. నిన్నూ, నన్నూ కాల్చి పారేసి నిశ్చింతగా జైల్లో కూర్చుంటాడు.' అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS