Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 25


    "పనులు ఎక్కువగా వుండి కలుసుకోలేక పోయానురా, ఫూల్!"
    "నీకేం పనులున్నాయిరా, ఇడియట్?"
    "నీ దృష్టి లో నేను మనిషిగా కనబడటం లేదేంరా , రోగ్?"
    "అది కాదురా, దుర్మార్గుడా! నువ్వు సుఖ పురుషుడివి కదా!' అని ఇంగ్లీషు తిట్లు ఆపి తెలుగులో తిట్ట నారంభించాడు ఆనంద్. రాజ్ నవ్వుకొంటూన్నాడు.
    "పోరా, నీచుడా! మా మరదలి పెళ్ళి హడావుడి కార్యక్రమంతా నానేత్తినే పడింది."
    ఆనంద్ తిరిగి ఏదో అనబోతుండగా చాలనంట్లు చూశాడు రాజ్. చేత్తో నోరుమూసుకున్నాడు ఆనంద్. అది చూచి పగలబడి నవ్వాడు గోపీ,. ఆనంద్ కోపంగా ఒక చూపు చూసి రాజ్ చూడగానే తల ప్రక్కకు తిప్పుకున్నాడు. గోపీ, ఆనంద్ కలుసుకున్నప్పుడు గౌరవంగా తిట్టుకోవడం వారికి మర్యాదైనా అలవాటు. వాళ్ళనలా వదిలేస్తే లోకంలో ఉన్న తిట్లన్నీ వాడేసు కుంటారని రాజ్ కు తెలుసు. అందుకే వారిని అప్పుడప్పుడు అదుపులో పెడుతుంటాడు.
    "పెళ్ళి ఇక్కడేనా , గోపీ?' అడిగాడు రాజ్.
    "మొదట ఇక్కడే చేయించాలను కున్నాం . కానీ వాళ్ళు తిరుపతి కొండ పైనే చేయించాలని పట్టు బట్టారు. కావున మీరంతా బంధు మిత్ర పరివారంతో వచ్చి వధూ వరులను ఆశీర్వదించి మమ్ము ఆనందింప జేయ ప్రార్ధన." దండకం చదివాడు.
    "ఊ. అది చదువను కూడా రాదు. అయినా ఎవరొస్తారు అంత దూరం? మేం రాదలచుకోలేదు" అన్నాడు ఎటో చూస్తూ ఆనంద్.
    "నీకేమైందిరా అక్కడికి రాకపోవడానికి? నువ్వు రాకపోతే వదిలే దెవరు? మక్కెలు విరగదాన్ని కాళ్ళు చేతులు కట్టి గూడ్స్ వేగన్ లో వేసి మరీ తీసుకు పోతాను."
    "ఆ. ఇలాంటి బెదిరింపులు చాలా చూశాం. అయ్యాగారు అంతదూరం రావాలంటే ఓ విమానమో లేక హేలీకప్టరో కనీసం రోల్సు వాయిన్ కారైనా ఉండాలి."
    "నీ మొహానికి అదోక్కటీ తక్కువైంది. మడక కారు కొనిస్తాను." అందులో రా."
    "అలాంటివి పనికి రావు."
    "పోనీ ఎద్దుల బండి లో వస్తావా?' అడిగాడు రాజ్.
    "నయం. ఇంకా గాడిద మీద రమ్మన్నావు కాదు."
    "ఇలా పిచ్చి పిచ్చిగా వాగావంటే అదేగతి అవుతుంది."
    "అలాగయితే పరీక్ష లైపోయిన రాత్రే మా అత్తగారి ఊరైనా పల్లెకు క్యాంప్ వేసేస్తాం."
    "ఒరే నాన్నా! అంతపని చేయకు. మా కారు ఇస్తాను. అలాగే సద్దువు గానీ.' అంగీకరించాడు గోపీ.
    'ఆనంద్!' గంబీరంగా అన్నాడు రాజ్.
    'అబ్బే, నేనేం అనలేదు రా! తమాషా కన్నాను. మీతో పాటే ట్రెయిన్ లో వచ్చేస్తాను."
    నవ్వారు వారిద్దరూ. వారితో శృతి కలిపాడు ఆనంద్.'

                                                         18
    "రజీ!"
    "ఏం, రాజ్?"
    "ఈ మధ్య అన్నీ శుభవార్తలే."
    "ఏమిటో ఆ శుభవార్తలు?"
    'ఈ విశాల ప్రపంచం లో బంధువులంటూ ఎవ్వరూ లేరు అనుకొన్న నాకు ఒక అత్తయ్య మరదలు , ఒక వదిన ఉన్నారు. గోప్పీ వాళ్ళ మరదలి వివాహం. కలుసుకుంటాడో లేదో ననుకొన్న ఆనంద్ తిరిగి నా మిత్రుడయ్యాడు."    
    "నేనూ ఒక శుభవార్త చెప్పాలను కుంటున్నాను."
    "త్వరగా చెప్పెయ్యి."
    "నాకూ ఒక అమ్మ ఉంది. తల్లి ప్రేమ దొరికింది."
    "ఎవరావిడ?"
    "మహిళా మండలి లో జరిగిన విషయాలన్నీ చెప్పింది రజియా.    
    "రాజీ ఇందులో ఒక పెద్ద రహస్యముంది. దాన్ని బయటకు లాగాలి."
    "ఎలా?'
    "అదే ఆలోచిస్తున్నాను. ఆనాడు ఆనందరావుగారు నిన్ను ఒక ప్రశ్న అడిగారు. జ్ఞాపకం ఉందా?'
    "ఉంది."
    "దాన్ని బట్టి ఈ విషయం గురించి పూర్తిగా కాకపోయినా కొంతైనా వారికి తెలిసి ఉంటుందని నా ఉద్దేశ్యం."
    'అందువల్ల ఫలితమేమిటి?"
    "నీదో ఒట్టి మట్టి బుర్ర. అయన చెప్పిన దాన్ని ఆధారంగా తీసుకొని నిజాన్ని బయటికి లాగుదాం. ఏమంటావ్?"
    "మాంచి ఐడియా నే కానీ ఫలిస్తుందా అని అనుమానం."    
    "నీ అనుమానాన్ని గాలికి వదిలెయ్యి. రేపు ఆనందరావు గారి నడిగి ఆ విషయం కనుక్కుంటాను."
    "రేపు పరీక్షలు కదా, రాజ్?'
    "ఫరవాలేదు. పరీక్ష అవగానే సాయంకాలం వారిని కలుసుకొంటాను. అదీకాక జీవితపు పరీక్షల్లో నెగ్గితే ఈ పరీక్షల్లో అవలీలగా నెగ్గినట్లే!"
    "రేపటి పరీక్షల కంత ప్రాముఖ్యం లేదు కదూ?"
    "పరీక్షలంటే పరీక్షలే. వాటికి ప్రాముఖ్యం లేకున్నా మనం ఏర్పరచు కోవాలి."
    "రాజ్, మా యింటి కొచ్చేసేయ్యి. తోడుగా చదువు కుందాం."
    "ఆహా. చదువు సాగినట్లే! మనం ఇంకా చిన్న పిల్లలమే అనుకుంటున్నావా?"
    "పెద్దవారిమే అనుకో. నీ ఉద్దేశ్యమేమిటో చెప్పు."
    "నీకు నేను , నాకు నువ్వు ఎదురుగా వుంటే చదువు సాగుతుందా!"
    "ఎందుకు సాగదు?'
    "నీకన్నీ విడమరిచి చెప్పలేను, ఫో."
    నవ్వింది రజియా.
    "రజీ!"
    "ఊ."
    "నీ వరాల నవ్వుతో గులాబీలు వికసిస్తాయి."
    "వేళాకోళాని కేం తక్కువ లేదు."
    "నిజం రజీ , అలా చూడు. సముద్రుడు కూడా నీ పెదవి చాటున దాగి ఉన్న చిరునవ్వు కోసం ఉరకలు వేస్తూ పరుగెత్తు కోస్తున్నాడు."
    "ఛ, నాకు సిగ్గేస్తోంది. " అని రజియా అతని ఒడి నుండి లేచింది.  
    రాజ్ ఆమెను రెండు చేతులతో బంధించి తన వైపుకు త్రిప్పుకొని "ఇప్పుడు నీ మనసే మంటుందో చెప్పు, రజీ" అన్నాడు.
    "ఊహూ" అంటూ రజియా తల త్రిప్పేసు కొంది.
    "రజీ!"
    "ఊ" అంది తల త్రిప్పకుండానే.
    "నువ్వలా తల త్రిప్పేసుకొని ఉంటె నీ కెంపేక్కిన చెక్కిలి లో నా ప్రతిబింబం కనబడుతోంది."
    "ఊ" అంటూ రెప్పలు తాటిస్తూ అతని కళ్ళలోకి చూసింది రజియా.
    "చూడు ఆ రెప్పలు వద్దంటున్నా నీ కన్నులు నీ హృదయం లో దాగి ఉన్న మాటల్ని నాతొ చెపుతున్నాయి."
    "మరి నన్నడగడం దేనికి?'
    "నీ నోటి నుండి వినాలని ఉంది."
    "అయితే విను. ఎప్పుడూ ఇదే విధంగా నీ సానిధ్యం లో ఆనందాన్ని గ్రోలుతూ జీవితాన్ని నీకు అర్పించ మంటుంది." అని రజియా అతని భుజం మీద వాలిపోయింది.
    'అంత పెద్ద కోరికే! కష్టం. నీ కోరిక నెరవేరదు."
    "రాజ్! కలవరపడి అరిచింది రజియా.
    'అవును, రజీ. నీ కోరిక ఈ జన్మలో తీరదు" అన్నాడు రాజ్ లోలోపలే నవ్వుకుంటూ.
    "రాజ్ , నా ప్రేమ మీద నమ్మకం లేదా?"
    "నీ ప్రేమ మీద నమ్మక ముంది గానీ, నా నొసటి వ్రాత మీదే నాకు నమ్మకం లేదు."
    "రాజ్, అటువంటి అపశకునపు పలుకులు పలుకవద్దు. నా మనసు కంపిస్తోంది."
    "ఛ - అంతలోనే కన్నీరా! ఊరికే నిన్ను ఏడిపించడానికి అన్నాను. పద పోదాం."
    "లేదు రాజ్. నా మనసు ఏదో కీడును శంకిస్తోంది."
    "పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నిన్ను నా నుండి వేరు చెయ్యడం ఎవ్వరికీ చేతకాదు. మన ప్రేమను దేవుడు కూడా నిరాకరించ లేడు."
    "నిజమా అన్నట్లు చూసి అతని కళ్ళలోని నిండుతనం చూసి ధైర్యం తెచ్చుకొని లేచింది రజియా.
    "రాజ్, పరీక్ష లై పోగానే ఏదైనా ఊళ్లు తిరిగి రావాలని ఉంది. ఏమంటావు?"
    "నీకేం? మహారాణి వి అన్ని కోరికలూ నెరవేర్చు కుంటావు."
    "ఈ మహారాజా గారికి ఏం లోటో? లక్షాదికారివేగా?"
    "ఎవరైనా వుంటే నవ్వి పోతారు. ఆ మాటలకేం గానీ పరీక్ష లై పోగానే గోపీ వాళ్ళ మరదలి పెళ్లి ఉంది. తిరుపతి వెళ్లాలి."
    "నువ్వు పొతే నాకేలాగో ఉంటుంది, రాజ్!"
    "ఏం? నువ్వు రావా?"
    "పిలువని పేరంటానికి రమ్మంటావా?"
    "ఆ మాట అంటారని నాకు తెలుసు అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాను."
    ఆ మాటలు విని ఇద్దరూ ప్రక్కకూ చూచారు. సిగరెట్ త్రాగుతూ నిలబడి ఉన్న గోపీని చూసి ఇద్దరూ ఆశ్చర్య పోయారు.
    "గోపీ, నువ్వా?' అన్నాడు రాజ్.
    "మీరా!" అంది రజియా.
    "ఆ, నేనే. మీ కోసం మీ యింటి కొచ్చాను. మీరింకా రాలేదని తెలుసుకొని త్వరలో వస్తారని విని సిగరెట్ త్రాగుతూ బయటి కొచ్చాను. దూరంగా వస్తున్న మీరు కనిపించారు. ప్రక్కనే నిలబడ్డాను. కానీ మీ దృష్టి నా పైన పడలేదు. ఏం చేస్తాం?' మీ కళ్ళకు మేం కనిపిస్తామా?' అన్నాడు గోపీ , చిరునవ్వుతో ఎత్తి పొదుపుతో.
    సిగ్గు పడింది రజియా.
    గోపీ జేబు నుండి పెళ్లి పత్రికలు తీశాడు.
    "ఇంటి కెళ్దాం పదండి." అంది రజియా.'
    "అల్ రైట్" అని అనుసరించాడు గోపీ వారిని.
    వారు కూర్చొని మాట్లాడుతుండగా అక్కడికి సుగుణ వచ్చింది.
    "ఏం అన్నయ్యా, మీ వాళ్ళింటికి పోయి ఈ చెల్లాయిని మరిచి పోయావా?' రాగానే అడిగింది సుగుణ.
    "అది కాదు, సుగుణా! ప్రతి దినమూ మీ యింటికి రావాలనే వస్తాను. కానీ మధ్యలోనే రజియా ఆ ఉద్దేశ్యాన్ని మార్చి వేస్తుంది" అని రజియా వైపు చూశాడు రాజ్.
    రజియా ఆశ్చర్యపోయి అతన్ని తీక్షణంగా చూసింది.
    "ఏమమ్మా, వదినా పెళ్లి కాకముందే కొంగున కట్టుకు తిరిగితే ఎలా? మా అన్నయ్య ను అప్పుడే మానుండి దూరం చెయ్యకు" అంది సుగుణ , రజియా మొహం లోకి చిలిపిగా చూస్తూ.
    ఆ మాటలు విని కోపంగా చూసింది రజియా. గోపీ చూస్తున్నాడని గ్రహించి సిగ్గుతో కుంచించుకు పోయింది. దీనికంతా కారణం నువ్వే నాన్నట్లు చూసింది రాజ్ ను. నాకేం తెలియదు అన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు రాజ్.
    'అప్పుడే కోపం గూడా చూపిస్తున్నావే మా అన్నయ్య మీద!" ఇక అక్కడ ఉండలేక లోపలికి పరుగెత్తింది రజియా.


                                                 *    *    *    *
    రాజ్ కాలేజీ నుండి ఆనందరావు గారింటికి బయలు దేరాడు. "మిస్టర్ , రాజశేఖరం!' పిలిచారెవరో.
    వెనుతిరిగి చూశాడు. లెక్చరర్ వామనమూర్తి గారు చిరునవ్వుతో వస్తున్నారు. ఆయన్ను చూసి విష్ చేశాడు రాజ్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS