'క్షమించండి నాన్నగారు. నేను....నేను అక్కడికి వెళ్ళలేను.'
'వెళ్ళమని నేను ఆజ్ఞాపిస్తున్నాను.'
శ్రీకాంత్ తెల్లబోయి చూశాడు తండ్రి వైపు.
'రామచంద్ర నాకు వుత్తరం రాశాడు. ఆ కంపెనీ లో తెలివితేటల్ని ఒక్కటే చూడడం లేదు. అలా అయితే చాలామందే సెలెక్టు అయేవారు. నీతో అతను యాదాలాపంగా తనేమీ రికమెండ్ చేయలేదని అన్నప్పటికీ అతను చాలా కష్టపడి మంత్రి ద్వారా నిన్ను సెలక్టు చేయించాడు.
'నాన్నగారూ ,' శ్రీకాంత్ ఆశ్చర్య పోయాడు.
'నేనేమీ అబద్దం ఆడడం లేదు. కావాలంటే మినిష్టర్ రాసిన రికమెండే షన్ లెటర్ తాలుకూ ట్రూ కాపీ చూపిస్తాను.'
శ్రీకాంత్ బుర్ర వొంచే సుకున్నాడు. తండ్రిని యింక అతను యెదిరించలేడు. అతను గదిలోకి వెళ్ళిపోయి రాజీనామా వుత్తరం రాసి కంపెనీ లో యివ్వమని చెప్పి మెడ మీదికి వెళ్ళిపోయాడు. అతనికి దిగులుగా వుంది. దుఃఖం కట్టలు తెంచుకు వస్తోంది. తన యిష్టాన్ని ఆచరణ లో పెట్టలేని దిగులు మనసుని కుళ్ళ బోడుస్తున్నది. గంగ ని గురించి అత్త ఒక్కసారి కూడా రాయదెం? అనుకుంటున్నాడు వుండి వుండి . యింత చదువుకున్నది కదా గంగ రాస్తే ఏం? అని ఆశపడుతున్నాడు. అనుకోకుండా రెండు వెచ్చని కన్నీటి చుక్కలు రాలి బుగ్గల మీద పడగానే సిగ్గు పడ్డాడు.
వారం పది రోజులు గడిచి పోయాయి. అతను వేళకి క్రిందికి వస్తున్నాడు. తన పనులు కానించుకుని తిరిగి గదిలోకి వెళ్ళిపోతున్నాడు . ఎప్పుడైనా పూర్వం తను వెళ్ళే ఈస్ట్ కలకత్తా కెనాల్ కి , సుభాష్ సరోవర్ కి వెళ్ళి రెండు మూడు గంటల కాలాన్ని అక్కడే వృధా పుచ్చి వస్తున్నాడు. శ్రద్దగా చేపలు పట్టాలని లేదు యిప్పుడు అతనికి. పిడుగు లాంటి డిల్లీ నుంచి వచ్చే వుత్తరం ధాటికి తను తట్టుకోగలడా? అనుకుంటాడు.
ఆరోజు శ్రీకాంత్ తన గదిలో చాలాసేపు కూర్చుని యెటు వెళ్ళాలో అర్ధం కాక మంచం మీద వెలకిలా పరుండి యింటి పై కప్పు వైపు చూస్తున్నాడు. తమ్ముడు యిప్పుడు తండ్రి కూడా కాబోతున్నాడు. ఈ విషయం తమ్ముడి స్నేహితుడు అరవింద చెప్పగానే తల్లికీ చేరవేశాడు ఆ సంతోషం అయిన కబుర్ని. తల్లి బ్రహ్మానందభరితు రాలైంది. తమ్ముడే నయం. మంచి కంపెనీ లో వుద్యోగం చేస్తున్నాడు. బంగళా వంటి యింట్లో కాపురం వున్నట్లు రాశాడని అరవిందే చెప్పాడు. కృష్ణ మోహిని అడపిల్లల కాలేజీ లో డిమాన్ స్ట్రేటర్ గా పని చేస్తోందట.
అరవింద కనిపించి శ్రీకాంత్ భుజం మీద చేయి వేసి 'మొత్తానికి ఉమేష్ చాలా తెలివైన పని చేశాడు. యిద్దరూ సంపాదిస్తున్నారు. 'మా సంసారం స్వర్గం లా వుంది, మా అన్నయ్య కి కనిపించి ఈ సంగతి చెప్పు' అని రాశాడు. కృష్ణ మోహిని బుద్ది మంతురాలు అన్నాడు.
శ్రీకాంత్ కి ఆ క్షణంలో హైదరా బాదూకి యెగిరి వెళ్ళాలనిపించింది. తండ్రిని తప్పించుకుని వెళ్లినా తల్లి గుండె బేజారై పోయి యేమైనా అయిపోతే? ఈ బెంగ వల్లే అతనికి ధైర్యం చాలలేదు. హైదరాబాదు వెళ్లేందుకు. శ్రీకాంత్ డిల్లీ నుంచి వచ్చి పదిహేను రోజులు దాటి పోయాయి. అతను వూహించినంత త్వరగా రాలేదు యింటర్వ్యూ గురించిన వార్త. తప్పకుండా వస్తుందనీ, తనని వేరే అప్లై చేయవద్దని యెప్పటి కప్పుడు రామచంద్ర చౌదరి తండ్రికి ఉత్తరాలు రాస్తూనే వున్నాడు. తండ్రి అంతకు మించిన యే విషయమూ మాట్లాడడం లేదు. తనని మాత్రం డిల్లీ వెళ్ళమని ఖచ్చితంగా చెప్పాడు.
చటర్జీ శ్రీకాంత్ ని మేడ రెండో భాగం నుంచి పిలిచాడు. అతని పిలుపుకి మేడ తాలుకూ పునాదులు అదిరిపోలేదు కదా అనిపించింది ఆ క్షణం లో గోవింద కి. వంట యింట్లోంచి మసి చేతుల్ని తుడుచు కోవడం కూడా మరిచిపోయి శ్రీకాంత్ ని కేక వేసిన కారణం తెలుసుకునేందుకు వచ్చింది గోవింద. శ్రీకాంత్ ఒకే పరుగులో తండ్రి ని చేరుకున్నాడు. అతను నిలువెల్లా కంపించి పోతున్నాడు. కొడుకునీ భార్యనీ చూసి 'రాధికని నెత్తిన పెట్టుకున్నారు. చూడండి అదెంత పనిచేసిందో" అన్నాడు గొంతు చించుకున్నవాడిలా --
గోవిందా శ్రీకాంత్ అర్ధం కాని వాళ్ళ మాదిరి చూడసాగారు. చటర్జీ కుర్చీలో కూలబడి పోయాడు. అతని చేతిలో అందంగా వుల్లి పొర వంటి కాగితం మీద నగిషీ లతో చిత్రించిన రంగు రంగుల పూలు గుత్తులు గుత్తులుగా వ్రేల్లాడుతూ మధ్యలో అచ్చు వేయబడిన శుభలేఖ రెపరెప లాడుతోంది. శ్రీకాంత్ దగ్గరగా వెళ్ళి టేబిల్ మీద తండ్రి చేతిలో వున్న కాగితాన్ని అందుకుని గట్టిగానే చదివాడు. గోవింద తలుపుని ఆసరాగా చేసుకుని పడిపోకుండా నిలదొక్కుకుని నిలుచుంది. శ్రీకాంత్ అచేతనుడై పోయాడు నోట మాట రాక. 'ఛి.సౌ. గంగ ని , చి. దేవేంద్ర కి యిచ్చి తుల్జా భవన్ లో వివాహము జరుపుటకు.....'
శ్రీకాంత్ కళ్ళు ఆవాక్యాల్ని నమ్మశక్య కానట్లు పదేపదే చూడసాగాయి.
చటర్జీ ఘోల్లున నవ్వాడు. 'రాధి అటువంటిది కాదు. శ్రీకాంత్ అంటే ఆవిడకి పంచ ప్రాణాలూ అని తెగ పొగిడే దానివి యిప్పుడేమైంది? ఎందుకీలా చేయాల్సి వచ్చింది? వో అతను ఏప్. ఆర్. సి.యస్ లండన్) అఫ్ట్రారాల్ మన శ్రీకాంత్ బి.యి అదొక్కటే కారణం అయి వుంటుందంటావా?'
'నో అదేం కాదు. నేను గ్రహించ గలను. ఉమేష్ పెళ్ళి చేసుకున్నాక ఏమై పోయింది. మన యింటి మీద కాకి వాలడం లేదు. శ్రీకాంత్ నీ కొడుకని రాధికకి కొత్తగా అభిప్రాయం కలగడం లో తప్పేం వుంది? యెవరైనా కులాన్ని కూల ద్రోసుకుంటారా. అందుకే వైభవోపెతంగా వచ్చి పోతామేమో అని రేపు పెళ్లి అనగా యివాళ శుభలేఖ పంపింది.'
శ్రీకాంత్ లేచి భారంగా అడుగులు వేస్తూ క్రిందికి వెళ్ళిపోయాడు. గోవింద వెక్కి వెక్కి ఏడవసాగింది. యిన్నాళ్ళూ ఆవిడ అల్లుకున్న ఆశల పందిరి పునాదులు వోటు పోయి నేల కూలినట్లయింది. దిగులుగా నిలుచున్న చోటునే ద్వార బంధవు గుమ్మానికి అనుకుని కూర్చుండి పోయింది. చటర్జీ చిరాకుగా గదిలో పచార్లు చేయసాగాడు.
శ్రీకాంత్ గేటు తెరుచుకుని వీధి వైపు దారి తీశాడు. అతనీతో జోక్యం లేనట్లు కాళ్ళు యిష్టం వచ్చిన ప్రదేశానికి దారి తీస్తున్నాయి. అత్తయ్యే నమ్మక ద్రోహం చేస్తే తనకీ ప్రపంచంలో మరెవరున్నారు? అనిపిస్తోంది. అతను గుండెలు పగిలి పోయేలా ఏడవలేదు. చెరువుగట్టు వైపు వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలను కోలేదు. తన దురదృష్టానికీ దురసిల్లి పోతూ కనిపించిన వ్యక్లిని అత్మీయుడను కొని వాటేసుకుని కష్టాలన్నిటిని యెకరువు పెట్టలేదు. నిశ్శబ్దంగా వెనక్కి మళ్లాడు. తను పిచ్చిగా తిరిగిన ప్రదేశాలని చూసి తన తెలివి తక్కువతనానికి తనే నవ్వుకున్నాడు. మనిషి మీద నిందవేసే బదులు తన ఖర్మ యింతే అని లోలోపల బాధపడడం లోనే తృప్తి హాయీ వున్నదని గ్రహించాడు. ఆ మానసిక సంక్షోభానికి వుపశాంతి కోసం బార్ కి వెళ్ళలేదు. తిరిగి తిరిగి తిన్నగా యింటికి వచ్చాడు. అగ్ని గుండం లో నిలబెట్టి నంత తపనగా వున్నది. తల్లి భోజనానికి పిలుస్తే, రోజు కన్నా యెక్కువ సరదాగా భోజనం చేసేందుకు టేబిల్ దగ్గరకి వెళ్ళాడు. గోవింద చాలా అనుకుంది. యింటికి ఎంతో ప్రొద్దు పోయినా కొడుకు రాకపోతే యేదైనా అఘాయిత్యం కాని చేయలేదు కదా! ఒకవేళ ఏ బార్ కైనా వెళ్లి ఆత్మ శాంతి కోసం తప్పుదారి పడతాడేమో? వున్నట్లుండి రైలు యేక్కేసి హైదరాబాదు గాని వెళ్ళేడెమో యిలా పరిపరి విధాల అలోచించి అతను కనిపించగానే నిట్టురిస్తూ తృప్తిగా గాలి పీల్చుకుంది. కొడుకు వుత్సాహం చూసి ఉత్సాహంగానే వడ్డన చేయసాగింది.
అతను రోజు కన్నా ఓ ముద్ద ఎక్కువగానే తిన్నాడు. యివాళ కడుపులో రగిలే బాధలు కొన్ని వేల రకాలు. బాధని వ్యక్తం చేసి ద్రిగ్గుల్లిపోతూ దిగంతాలకి జారిపోయే వాళ్లు చాలామందే వుంటారు. కానీ శ్రీకాంత్ వలె వుండే మనుష్యులు చాలా అరుదు. 'నువ్వు నవ్వి నలుగురిని నవ్వించు . నీ యేడుపు లో యెవరికి పాలు పంచి యివ్వకు. ఒక్కడి దూరంగా యెవరికీ తెలియని చోట్ల కూర్చుని కరువు తీరా యేడ్చిరా' అనే సూత్రాన్ని శ్రీకాంత్ అక్షరాలా పాటించాలను కుంటున్నాడు. ఒక్కోసారి అతనికి చేతకాదేమో అనే భీతి కూడా కలుగుతోంది.
మరో నాలుగు రోజుల నాటికి డిల్లీ నుంచి అతనికి ఆర్డర్స్ వచ్చాయి. అతను తండ్రి తోటీ , తల్లి తోటీ చెప్పేసి రైలు యేక్కాడు. ఈసారి ప్రయాణం అతన్ని మరింత కృంగ దీయ సాగింది. ఒకవేళ డిల్లీ అంటూ వస్తే తప్పకుండా గంగని తీసుకు రావాలని కలలు గన్నాడు. కానీ విధి విలాసం తారుమారై పోయింది. శ్రీకాంత్ రెండు కాళ్ళ మీద నిలద్రోక్కుకోగల్గినందుకు తప్పనిసరిగా ఈ వుద్యోగం లోకి రావలసి వచ్చింది.
రైలు దిగిన శ్రీకాంత్ ని చౌదరి, పద్మ నభం, హేమ నళిని ఆప్యాయంగా పలకరించారు. అతను నవ్వుతూనే అందరికీ సమాధానాలు యిచ్చాడు.
యింటికి చేరుకున్నాక అతను స్నానం చేసి భోజనం చేసి పడుక్కునేందుకు తన కోసం ప్రత్యేకం యేర్పాటు చేసిన గదిలోకి వెళ్లాడు.
హేమనళిని అతని వెనుకే వెళ్లి అతనికి కొంచెం దూరంలో పెట్టి మీద కూర్చుంది. ఆ పిల్ల అలా శ్రీకాంత్ గదిలోకి వెళ్లి కూర్చోవడం గురించి వ్యాఖ్యానాలు చేయరు ఆయింట యెవరూ. కొంత చదువుకుని విజ్ఞానాన్ని అలవరచుకున్న ప్రతి స్త్రీ చాలా జాగ్రత్తగానే వుంటుందనే విశ్వాసాన్ని చౌదరి కుటుంబం మాత్రం విశ్వసిస్తుంది.
శ్రీకాంత్ హేమనళినికి దగ్గరగా కూర్చోవాలని, జరిగినదంతా చెప్పీయాలని తన పుట్టుపూర్వోత్తరాలు కూడా స్పష్టం చేయాలనీ కోరిక కలిగింది. హేమ నళినిని చూస్తూనే యిన్నాళ్ళూ తను పడిన వేదన పంచుకునే అప్రురాలి మాదిరిగా అనిపిస్తోంది. అతను రెప్ప వేయకుండా చూస్తుంటే హేమ నళిని అడిగింది. ఏమిటండి అలా చూస్తున్నారు అని.
శ్రీకాంత్ వులిక్కిపడి 'అరె యేమీ లేదు హేమా. నేను ఏదో ఆలోచిస్తున్నాను; అన్నాడు ఖంగారుని అణచుకుంటూ.
'లేదు. ఏదో చెప్పాలనుకుని మానేసి నట్లుంది. చెప్పండి. నేనేమీ పరాయిదాన్ని కాదు.'
శ్రీకాంత్ హృదయం మీద పన్నీరు చిలకరించినయింది. 'నిజం నిజం నువ్వు పరాయి దానివి యెలా అవుతావు. ఒక్క నాటికి కాలేవు. నేనూ పద్మ ఒక్కటే. పద్మకి చెల్లెలివైతే నాకు కావుటోయ్ ! అనుకున్నాడు మనసులో. పైకి నవ్వేసి 'చూడు హేమా నన్ను పేరు పెట్టి పిలుస్తే ఏం? అని అడిగాడు.
'యెందుకని?' అని అడిగింది హేమ నళిని.
'ఏమండీ , మీరూ పదాలు వినాలనిపించడం లేదు. యెవరో పరాయి వాళ్ళని పిలిచినట్లు. నా పేరు కూడా పెద్దదేమీ కాదు నోరు తిరగక పోయేందుకు.'
