Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు - 2 పేజి 25


                                         
    
    వీడియో చూస్తూ కూర్చున్నాడు ఇండిపెండెంటు. ఆయన పక్కనే చూసిన సీనే మళ్ళీ రివైండు చేస్తూ, చూస్తూ కేరింతలు కొడుతున్నారు చిన్నా, మున్నీ. వాళ్ళిద్దరూ ఆయనే స్వయంగా కన్నడిపెండెంట్లు. అంటే ఆయన పిల్లలు. మాట వరసకి డిపెండెంట్లుగానీ ఆయనకన్నా స్ట్రాంగు ఇండిపెండెంట్లు. "ఎవర్రా ఆళ్ళూ? అమెరికాని మింగెయ్యడానికి ఆకాశం కింద నీడలా వస్తున్నారు? రష్యన్లా ఏమిటి?" అడిగాడాయన. డిపెండెంట్లకి కోపం వచ్చింది. అయినా కుర్చీలో ముడుచు కూర్చుని గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంది నాన్నారు కాబట్టి కొంచెం గౌరవంగానే - "ఇంకెక్కడి రష్యన్లు డాడీ! వాళ్లెప్పుడో థర్డ్ వరల్డ్ కంట్రీస్ కూడా దాటేసి ఫోర్తు వరల్డు లిస్టులో పడ్డారు. ఫుడ్డు కూడా లేదు" అన్నారు.
    "ఓహో! ఆహార ధాన్యాలకోసం మిడతల దండులా అమెరికా మీద పడ్డారన్నమాట" అన్నాడాయన.
    "అబ్బ! కాదు డాడీ! వాళ్ళు ఏలియన్స్! అంటే పరగ్రహంనుంచి వచ్చారన్న మాట."
    ఆశ్చర్యంగా "పరగ్రహమా! ఏ గ్రహం?" అడిగాడాయన.
    "కనిగ్రహం....శనిగ్రహం...." అంటూ వచ్చింది ఇండిపెండెంటుగారి భార్య లక్ష్మీబాయి. ఆయన వులిక్కిపడి మళ్ళీ సర్దుకుకూర్చుని "ఏమయిందే? మళ్ళీ ఎవరిని తిడుతున్నావు?" అన్నాడు.
    "మళ్ళీ తిట్టుకోవడానికి కొత్తగా ఎవరొచ్చారు? మిమ్మల్నే..... రెండు వారాల్లో ఢిల్లీ ప్రయాణం పెట్టుకుని చిన్న పిల్లాడిలా సినిమా చూస్తూ కూర్చుంటారా! హవ్వ...." అంది.
    "పొద్దున రైల్వే బుకింగాఫీసుకి వెళ్ళొచ్చాగా? నెలదాకా రిజర్వేషన్లు లేవన్నాడు. పోనీ, ఎలాగో సర్దుకుని జనరల్ కంపార్టుమెంటులో పోతాలే...." నసిగాడాయన.
    ఆవిడకు ఒళ్ళు మండిపోయింది. "ఆహా! అలాగా! ఢిల్లీ దాకా జనరల్ కంపార్టుమెంటులో కూర్చుని పోతారా? వెళ్ళేప్పుడు నాలుగు జొన్న రొట్టెలు, పండుమిరపకాయ పచ్చడి, ఉల్లిపాయ పెట్టి ఉట్టి కట్టిస్తాను. ఓ కర్రకి తగిలించి, భుజానేసుకుని నేరుగా పార్లమెంటులోకి పోండి...."
    "అబ్బే-కూర్చుని ఎందుకు పోతాను? రైలాగగానే బెర్తు మీద టవలు పరిచేస్తాగా!"
    "ఖర్మ ఖర్మ-పుట్టింటాళ్ళు పెట్టిన నగలు కూడా తాకట్టెట్టి చేబదులు తీసుకొని ఎలాగో డిపాజిట్టు కట్టాను. జీవితంలో ఏ ఘనకార్యమూ చెయ్యక పోయినా కనీసం డిపాజిట్టు కోల్పోయిన అభ్యర్ధుల జాబితా అని పేపర్లో మీ పేరు పడితే పోతే పోయింది డిపాజిట్టు అని ఇరుగూ పొరుగూ కి చూపించుకుని సంబరపడదామనుకున్నాను. ఏదో ఆ రామచంద్రుడి దయవల్లా, ఆ అల్లా చల్లగా చూడటం వల్లా, ఆ లెనిన్ దయవల్లా ఆళ్ళూ ఆళ్ళూ గొడవపడి బాలెట్ పేపర్లో మిగిలివున్న మీ ఒక్క పేరు మీద అంతా ఓట్లు గుద్దెయ్యడంవల్ల - మీలాంటి అనామకుల్ని కట్టుకొని పాతికేళ్ళుగా ఓర్పుతో సంసారం చేసినందుకు ప్రతిఫలం దొరికిందని నేను సంబరపడుతూంటే...."
    బయట టాక్సీ ఆగిన చప్పుడైంది. పిల్లలు పరగ్రహ వాసుల్ని కట్టేసి, తమ యింటికి వచ్చిన భూగ్రహవాసులెవరా అని ఆత్రుతగా బయటకు పరిగెత్తారు. ఇండిపెండెంటులేవలా శనిగ్రహం వాళ్ళోస్తే ఏమవుతుందా అని ఆలోచనలో పడ్డాడు.
    గుమ్మంలోంచే చిన్న రోదనలు వినబడ్డాయి. లక్ష్మీబాయి వాళ్ళ అమ్మ భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడుస్తోంది. వాళ్ళ నాన్న కూతుర్ని సముదాయిస్తున్నాడు. "అమ్మా! ఆయన గెలిచారే, నా ప్రాణం తోడేస్తున్నారు".
    "ఊరుకోమ్మా వూరుకో.... ఏదో మెతకమనిషిగదా అని పిల్లనిస్తే ఇంత అఘాయిత్యం చేస్తాడా! అసలు ఎవడినడిగి గెలిచాడు? గెలిచేముందు మాకు ఓ కార్డు ముక్క రాయాలన్న జ్ఞానం లేదూ అల్లుడిగారికి?" వాళ్ళమ్మ బుజ్జగిస్తోంది. తండ్రి విసుక్కుంటూ సర్దుతున్నాడు. "ఊరుకోండి. ఏమిటిది? జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగవలసిన తతంగం సంగతేదో చూడాలి. ఒసేవ్! పిల్లలు చూడు. ఎలా బిక్కమొహం వేసుకుని  నిల్చున్నారో.... వాళ్ళమొహం చూసయినా వూరుకోండి." అని తల్లీ కూతుళ్ళను లోపలికి పంపించి "ఎవరన్నా బ్రాహ్మలకి కబురు చేయండి" అని అరిచాడు. అప్పటికే ఇరుగుపొరుగు వారు పోగయ్యారు. ఓకుర్రాడు సైకిలు తీసుకొని "నేను పిల్చుకొస్తాను" అని రాయిన వెళ్ళిపోయాడు.
    మామగారు లోపలికి రాగానే ఇండిపెండెంటు లేచి నిల్చున్నాడు. చిన్నగా నవ్వబోయాడు. మామగారు అతన్ని చిరాగ్గా చూసి "కూర్చో" ----అని తనూ ఒక కుర్చీలో కూర్చుని, "ఊఁ.... గెలిచావటగదా!...." అన్నాడు సూటిగా చూస్తూ.
    ఇండిపెండెంటు తలవంచుకుని నిల్చున్నాడు.
    "కూర్చో కూర్చో..... ఎలక్షన్లో నిల్చున్నప్పుడే వుండాలి. ఇప్పుడెందుకూ? కూర్చో" అన్నాడు. ఇండిపెండెంటు కూర్చున్నాడు. అప్పుడే ఆటోలోంఛీ ఇండిపెండెంటు బామ్మర్ది ఫ్యామిలీ కూడా దిగింది. లోపలికి రాగానే బామ్మర్ది పరిస్థితి అంచనా వేశాడు. బేలగా చూస్తూ గోడకి ఆనుకుని  నిల్చున్న చెల్లెలికి ధైర్యం చెప్పి, భార్యకు చెప్పాడు వెళ్ళి పొయ్యి రాజేయమని బావదగ్గరకు వెళ్ళి "ఇంటి బావా ఈ పని? సర్లే సర్లే నువ్వూరుకో అన్నీ నేచూసుకుంటాలే" అని తండ్రిపక్కన కూర్చుని రహస్యంగా ఏదో మాట్లాడుతున్నాడు.
    అదే సమయమని ఇండిపెండెంటు నెమ్మదిగా లేచి హాల్లో మధ్యలో వేసి వున్న చాపమీద వెల్లికిలా పడుకుని విశ్రాంతిగా కళ్ళు మూసుకున్నాడు.
    బామ్మర్ది భార్య వంటింట్లోంచి వచ్చి "ఇంకా బంధువులెవరన్నా రావాలా? ఎసరు పెడుతున్నాను" అంది.
    బామ్మర్ధి భార్యను విసుక్కున్నాడు. "అప్పుడే ఎలా చెప్పగలం? పదమూడో రోజుదాకా ఎవరో ఒస్తూనే వుంటారు. పుణ్యవచనం, ప్రమాణ స్వీకారం అన్నీ అవాలిగదా!" అంటుంటే అరడజను మంది బ్రాహ్మలొచ్చారు.
    "అయ్యా! అపరాహ్నం వేళకి తంతు అంతా ముగించాలి. ఇంకా రావాల్సిన వాళ్ళెవరైనా వున్నారా? స్నానం చేయించొచ్చా?" అడిగాడు ఓ బ్రాహ్మణ పెద్ద. ఇంతలో నలుగురు బ్రాహ్మలు ప్రొఫెషనల్ గా చాపదగ్గరకెళ్ళారు.
    "పాపం....ఎక్కువ వయసు లేదనుకుంటా" అంటూ ఇండిపెండెంటు చేతిగడియారం పుటుక్కున తెంచి, గోడకానుకుని కళ్ళొత్తుకుంటున్న లక్ష్మీబాయి చేతికిచ్చారు నిజాయితీగా లక్ష్మీబాయి బిత్తరబోయింది. మాగన్నుగా నిద్రబోతున్న ఇండిపెండెంటు లేచి కూర్చున్నాడు. బ్రాహ్మలు తెల్లబోయారు. మావగారు "నేను ఒకళ్ళో ఇద్దరో వస్తారనుకుంటే ఇంతమందొచ్చా రేమిటయ్యా?" అని విసుక్కున్నాడు.
    "ఇంతకీ తమరు కబురంపిందీ..." అంటూ నసుగుతున్నాడు బ్రాహ్మలు పెద్ద.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS