Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 26


                                    4. ఇంద్ర ధనుస్సు

                                                                     తిమ్మరుసు

    అప్పుడే మధ్యాహ్నం అయింది. మండువేసవి కావటం వల్ల ఎండ మిటమిట లాడుతున్నది. పది పన్నెండేళ్ల బాలుడొకడు పంటపొలం మీది పరిగపిట్టలను తోలుతూ చెరువు గట్టుమీద నిలబడి వున్నాడు. అప్పుడప్పుడు ఆ ప్రక్కనే గుమ్మటంలాగా ఉన్న గున్నమామిడి కొమ్మవైపు ఆశగా చూస్తున్నాడు బాలుడు. అటువైపుచూచిన కొద్దీ అతనికి మరీ నోరూరటం మొదలుపెట్టింది.
    బాలుడు చెట్టుక్రిందికి చేరుకున్నాడు. చెరువులో దిగి కాళ్లూ చేతులూ కడుగుకున్నాడు. చెట్టుకొమ్మకు కట్టి ఉంచిన అన్నంమూట అందుకున్నాడు. మామిడి చెట్టునీడన కూర్చొని మాగాయ పచ్చడి నంజుకుంటూ కడుపునిండా పెరుగన్నం తిన్నాడు. టెంకాయ పాలవంటి మంచినీళ్లు త్రాగి మత్తుగా మామిడిచెట్టు క్రింద పడుకున్నాడు. కొంతసేపటికి అతడికి బాగా నిద్రపట్టింది. బాలుడు గాఢనిద్రలో మైమరచిపోయాడు.
    అంతలోనే ఆ చెట్టు ప్రక్కన ఉన్న పుట్టలో నుంచి ఒక నాగుపాము బయటకు వచ్చింది. చల్లగాలిలో అటూ ఇటూ తిరుగుతూ బాలుడి ప్రక్కకు వచ్చి చూచింది. మెల్లగా దగ్గరకు వచ్చి బాలుడి తలమీద పడగబట్టి నిలిచింది. బాలుడు అలాగే నిద్రపోతున్నాడు. పాము అలాగే గొడుగుపట్టినట్లు పడగబట్టి ఉన్నది.
    సరిగా ఆ సమయంలోనే ఒక మహాయోగి ఆ త్రోవన వస్తున్నాడు. పసిబాలుడిపై పడగబట్టి ఉన్న పామును చూడగానే ఆ మహాయోగికి చాలా ఆశ్చర్యం కలిగింది. "ఆహా! ఎంత అద్భుతమైన దృశ్యం! ఈ బాలుడికి ఎండవేడి తగులకుండా ఎంత ప్రేమగా కాపాడుతున్నాడు నాగరాజు! ముందు ముందు ఈ బాలుడు ఎంత మహానుభావుడవుతాడో!" అనుకున్నాడు మహాయోగి.
    ఆ సిద్ధుడు వస్తున్న అలికిడి వినగానే పాము పడగదించి చరచరా పుట్టలోకి పారిపోయింది. సిద్ధుడు బాలుడి దగ్గరకు వచ్చి ఆప్యాయంగా అతని ముఖంవంక చూశాడు. ముద్దుగా ముచ్చటగా కడిగిన ముత్యంలాగా కళకళలాడుతూ ఉన్న బాలుడి ముఖం చూడగానే అతనికి చాలా అనురాగం కలిగింది. పాలుగారుతున్న ఆ పసిపాపడి లేత బుగ్గల వైపు పరీక్షగా చూశాడు మహాయోగి. అతని మనస్సులో ఏదో మధుర భావం కలిగింది. అతడు బాలుడి ప్రక్కనే నిలబడి కాంతులు చిమ్ముతున్న అతని కన్నులవంక కన్నార్పకుండా చూడసాగాడు.
    అంతలోనే బాలుడు ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా దివ్యదీప్తితో తేజరిల్లుతున్న సిద్ధపురుషుడు కన్పించాడు. బాలుడు చివాలున లేచి భక్తిపూర్వకంగా అతని పాదాలకు నమస్కరించాడు. సిద్ధపురుషుడు చిరునవ్వు నవ్వుతూ "చిరంజీవివి కానాయనా!" అని చేయెత్తి దీవించాడు. ఆదర పూర్వకంగా ఆ బాలుడి శిరస్సు నిమురుతూ "నీవు చాలా అదృష్టవంతుడవు నాయనా! అందుకే నీకు నిద్రాసమయంలో నాగరాజు పడగపట్టాడు. అది అద్భుతమైన శుభసూచన! భగవంతుడి దయవల్ల నీకు కొద్దిరోజులలో గొప్ప పదవి లభిస్తుంది! నీవు మహామంత్రివై రాజ్యరథం నడిపిస్తావు! రాజపూజలు గ్రహిస్తావు!" అని పలికి చకచకా సాగిపోయాడు మహాయోగి. బాలుడు ఆశ్చర్యమగ్నుడై కొంతసేపు ఆ యోగి వంక అలాగే చూస్తూ నిలబడ్డాడు.
    తరువాత బాలుడు అన్ని సంగతులూ అమ్మకు చెప్పాలని ఇంటివైపు పరుగెత్తాడు. రొప్పుతూ రోజుతూ లోపలికి వస్తున్న బాలుణ్ణి చూచి అతని తల్లి "ఏమిరా! తిమ్మరుసూ! ఎందుకూ అలా పరుగెత్తుకొని వస్తున్నావు?" అని అడిగింది. తిమ్మరుసు "అవునమ్మా! నేను మంత్రినవుతాను! కొద్ది రోజులలో మహామంత్రి నవుతాను! అలా అని ఇప్పుడే నాకు ఒక మహానుభావుడు చెప్పాడు.
    అతని మాటలు విని తల్లి పకపక నవ్వింది. "చాలు చాలులే! మనకోసం అక్కడ మంత్రిపదవులు కాచుకొని కూర్చున్నాయి గాని, ఇక వెళ్లి ఆ గదిలో కూర్చుని పద్యాలు వల్లెవేసుకో పో" అన్నది తల్లి. తిమ్మరుసు కూనిరాగాలు తీస్తూ చదువుల గదిలో ప్రవేశించాడు.
    ఆ మరునాటి ఉదయం తిమ్మరుసు చదువుకుంటున్న పాఠశాలలోకి ఇద్దరు రాజభటులు వచ్చారు. వాళ్ల దగ్గర ఒక రాతిపలక ఉన్నది. ఆ పలకమీద ఒక గీత గీసి ఉన్నది. రాజభటులు గురువుగారిని చూసి "అయ్యా! మేము విజయనగర ప్రభువులైన శ్రీశ్రీ వీరనరసింహరాయల సేవకులం! మా మహారాజు గారికి సమర్ధుడైన ఒక మహామంత్రి కావలసి వచ్చాడు. అందుకోసం దేశ దేశాలూ తిరిగి గాలిస్తున్నాము. కాని మాకు కావలసిన బుద్ధిమంతుడు మాత్రం ఒక్కడూ కన్పించలేదు. పోతూ పోతూ తమరిని గూడా చూచి వెళదామని ఇలా వచ్చాము" అని వినయ పూర్వకంగా పలికారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS