గురువుగారు ఆశ్చర్యంగా "ఏమిటి! దేశమంతా తిరిగినా బుద్ధిమంతుడే దొరకలేదూ? అయితే మరి మంత్రి కావటానికి ఎటువంటివాడు కావాలని మహారాజుగారి ఉద్దేశం. ఇందుకేమైనా పరీక్షలూ పట్టాలూ అవసరమున్నదా? వయస్సూ అనుభవమూ పని ఉన్నదా?" అని కుతూహలంతో అడిగాడు.
రాజభటులు "మంత్రి కావటానికి ఇంత ఒడ్డూ పొడుగూ, అందం చందం, చదువూ సంధ్యా ఉండాలని నియమం ఏమీలేదు. స్వామీ! ఇదుగో! ఇటు చూడండి! మా దగ్గర ఉన్న ఈ పలకమీద ఒక గీత గీయబడి ఉన్నది. ఈ గీతను తాకకుండా చెరపకుండా చిన్నగీత చెయ్యాలి. అలా చేసిన బుద్ధిశాలిని వెంటబెట్టుకొని తీసుకొని రమ్మని మహారాజుగారు ఆజ్ఞాపించారు" అని మనవి చేశారు.
ఆ మాటలు వినగానే గురువుగారికి చాలా విస్మయం కలిగింది. ఆయన పలక అందుకొని, "ఇదేమిటి! చాలా చిత్రంగా ఉన్నదే! ఉన్న గీతను చెరపకుండా, ముట్టకుండా చిన్న గీతగా చేయాలంటే ఎలా కుదురుతుంది? అలా చెయ్యటానికి ఇక ఇంద్రజాలమో, మలయాళ మంత్రమో నేర్చుకోవాలి! అంతేగాని సామాన్యులకు మాత్రం సాధ్యం అయ్యేది కాదీపని! అని నీళ్లు నములుతూ పలికాడు.
అంతలోనే ఆ సంభాషణ అంతా ఆసక్తిగా వింటున్న తిమ్మరుసు "ఆర్యా! ఆ పలక ఇలా ఇవ్వండి. ఒక్కమాటు నేనూ చూస్తాను." అని అడిగాడు. గురువుగారు చిరాకు పడుతూ, "నీకెందుకురా ఇదీ? కొమ్ములు తిరిగిన గొప్ప గొప్ప వాళ్లకే ఇందులో కిటుకు అర్థంకాలేదు. ఇక నీకా ఈ రహస్యం తెలిసేదీ? అయినా చూడు ఏంపోయిందీ?" అంటూ అతనికి పలక అందించాడు. పాఠశాలలోని బాల బాలికలంతా కన్నార్పకుండా తిమ్మరుసు వైపు చూస్తున్నారు.
తిమ్మరుసు పలక మీద గీతను పరిశీలించి చూశాడు. వెంటనే బలపం తీసుకొని ఆ గీత క్రింద ఒక పెద్ద గీత గీశాడు. రాజుగారు గీసి పంపిన గీత చెరపకుండా చిన్నదైపోయింది. తిమ్మరుసు ఆ పలక గురువుగారికి చూపిస్తూ "చూడండి స్వామీ! గీత చిన్నదిగా చేశాను. ఇప్పుడు నా పెద్ద గీత ముందు అది చిన్నదేగా!" అని పలికాడు.
ఆ విచిత్రం చూచి విభ్రాంతి పొందాడు గురువుగారు. అవును! రాజుగారి ప్రకటన ప్రకారం తాకకుండా తుడవకుండా గీసిన గీత చిన్నదై పోయింది! తిమ్మరుసు తెలివితేటలకు పొంగిపోయాడు గురుదేవుడు. ఇంతకాలానికి కావలసిన బుద్ధిశాలి కన్పించాడు రాజభటులకు. వాళ్లు ఆనందంగా తిమ్మరుసును గుఱ్ఱం మీద కూర్చుండ బెట్టుకొని సగౌరవంగా రాజసభకు తీసుకొని వెళ్లారు.
విజయనగర ప్రభువు వీర నరసింహరాయలు బంగారు గద్దెపై కొలువు తీర్చి ఉన్నాడు. ఆయన సింహాసనం ముందర నేలమీద ఒక పెద్ద పట్టుతివాచీ పరచబడి ఉన్నది. రాజభటులు తిమ్మరుసుతో గూడ సభా మందిరంలో ప్రవేశించారు. "మహాప్రభూ! ఈ బాలుడే తమరు పెట్టిన పరీక్షలో నెగ్గినవాడు. అందువల్ల తమ సన్నిధికి తెచ్చాము" అని మనవి చేసుకున్నారు. సంగతంతా విని మహారాజు ఆశ్చర్యమగ్నుడైనాడు.
"ముక్కుపచ్చలారని ఈ ముద్దుబాలుడు ఎంత ప్రతిభావంతుడో! ఎవ్వరూ చేయలేని పని తాను చేశాడు. ఇటువంటి బుద్ధిమంతుడే నాకు మహామంత్రి కావాలి" అనుకున్నాడు మహారాజు.
ఆయన ఆదరంగా తిమ్మరుసు వంకచూచి, "ఆర్యా! ఇంత చిన్న వయస్సులో మీరు అంత ప్రతిభ ప్రదర్శించారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది! అందుకోసమే మీ బుద్ధిబలాన్ని పరీక్షించటంకోసం నేను మరొకసారి ప్రయత్నిస్తున్నాను. ఇదుగో! ఈ బంగారు ఉంగరం ఈ సింహాసనం ప్రక్కనే ఉన్న ఉన్నత పీఠం మీద ఉంచుతున్నాను. మీరు ఆ పట్టు తివాచీ మీద కాలు పెట్టకుండా ఈ ఉంగరం అందుకొని బయలుదేరిన చోటుకు చేరుకోవాలి. ఆవిధంగా చేస్తే ఆ అంగుళీయకమే మీకు అధికారచిహ్నం అవుతుంది! ఆ క్షణం నుంచి మీరు దానిని ధరించి మహామంత్రులవుతారు!" అని పలికాడు.
తిమ్మరుసు చిరునవ్వు నవ్వుతూ "చిత్తం మహారాజా! అలాగే ప్రయత్నిస్తాను" అన్నాడు. అంత పొడవుగా పరచబడి వున్న తివాచీ మీద నడవకుండా పీఠం దగ్గరకు వెళ్లటం ఎలాగా? తిమ్మరుసు ఒక్క క్షణం ఆలోచించాడు. వెంటనే అతడు ఆ పట్టు తివాచీని నెమ్మదిగా చుట్టివేస్తూ పీఠం ముందుకు నడచివెళ్లాడు. పీఠంమీది బంగారు ఉంగరం అందుకొని చుట్టివేసిన పట్టు తివాచీని విప్పి పరుస్తూ వెనుకకు వచ్చాడు. విజయోల్లాసంతో వ్రేలికి ఉంగరం పెట్టుకొని వినయపూర్వకంగా వీరనరసింహరాయల వైపు చూచాడు తిమ్మరుసు.
మహారాజు ఆనందంతో అతనిని కౌగలించుకొని, "ఆర్యా! ఈ క్షణంనుంచి మీరు విజయనగర సామ్రాజ్యానికి మహామంత్రులు! రండి! ఈ ఆమాత్యపీఠం అలంకరించండి! ఈ రాజ్యభారం వహించండి" అని పలికాడు. తిమ్మరుసు మహామంత్రి అయినాడు. మహామంత్రికీ జై! తిమ్మరుసు మంత్రికీ జై! అనే జయజయ ధ్వనులతో మహాసభ మారుమ్రోగింది.
* * * *
