Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 25


                                    అక్బరు - వీరబలుడు

           

    వీరబలుడు అక్బరు పాదుషా ఆస్థానములో మంత్రిగా, విదూషకుడుగా నుండెను. అతడు విచిత్ర వ్యక్తి. వినోద ప్రియుడైన అక్బరు పాదుషా అతనిని మిక్కిలి ఆదరముగా చూచుచుండెను.
    ఒకప్పుడు అక్బరు చక్రవర్తికి అల్లునిపై కోపము వచ్చెను. ఆయన వీరబలుని పిలిచి "ఓయీ! లోకములో అల్లుళ్లు అందరూ చాలా పొగరుబోతులు. చక్రవర్తినైన నేనుకూడ నా అల్లుని అధికారమునకు లొంగిపోవలసి వచ్చినది. ఇక అల్లుండ్ర గర్వమును సహించను. నీవు వెంటనేపోయి ఈ పట్టణములోని అల్లుళ్లు అందరకు ఉరిత్రాళ్లు సిద్ధముచేసి ఉంచుము. ఈ రోజుతో నా రాజ్యమున ఈ అల్లుళ్ల పీడ తొలగిపోవలెను" అని ఆజ్ఞాపించెను.
    వీరబలుడు "చిత్తము" అని పలికి వెడలిపోయెను. ఆ రోజు సాయంకాలమునకు వీరబలుడు ఒక విశాలమైన మైదానములో వేలకొలది ఉరిత్రాళ్లు ఏర్పాటు చేయించెను.
    అక్బరు పాదుషా అల్లుళ్ల ఆర్తనాదము వీనుల విందుగా వినుటకు వారుపడు యమయాతనలు కనుల పండువుగా చూచుటకు వధ్యస్థానమునకు వచ్చెను.
    వీరబలుడు రాజుగారి రాకకై ఎదురుచూచుచుండెను అతడు పాదుషాను చూచి "రండి మహాప్రభూ! తమకోసమే కార్యక్రమము ఆపుచేయించినాను" అని పలికెను.
    అక్బరు పాదుషా చిరునవ్వుతో "మంచిది. మన నగరమునందలి అల్లుళ్లకందరకు సరిపోవు ఉరిత్రాళ్ళు ఏర్పాటు చేసితివా?" అని అడిగెను. వీరబలుడు "ఢిల్లీశ్వరా! మనము స్వయముగా ఒక్కమాటు ఉరిత్రాళ్ళను పరికించి వత్తము రండు" అని పలికెను. పాదుషా 'సరే' అనెను.
    వీరబలుడు పాదుషాకు వరుసగా వ్రేలాడుచున్న ఉరిత్రాళ్ళ నన్నింటిని చూపించెను. ఒకచోట ఎందుకో పాదుషాకు ఆశ్చర్యము కలిగెను. ఆయన 'వీరబల్! ఇదేమి? ఇక్కడ ఒక బంగారపు గొలుసు, ఒక వెండి గొలుసు ఉన్నవే? ఇవి ఎందులకై ఉంచితివి?' అని ప్రశ్నించెను.
    వీరబలుడు గంభీరముగా "మహాప్రభూ! అవసరముండియే వీనిని అమర్చితిని. ఆ బంగారపు త్రాడు తమకు, ఈ వెండిది నాకు. దేవరవారు అల్లుళ్ల నందరను వెనుక ముందుజూడక ఉరితీయమని ఆజ్ఞ యిచ్చినారు. తమరును, నేనుకూడ ఒకరికి అల్లుళ్లమే కనుక మనముకూడ ఆ శిక్ష అనుభవింప వలసినదేగదా!" అని పలికెను.
    అక్బరు పాదుషా నోట మాటరాలేదు. అతడు నిశ్చేష్టుడై అట్లే నిలబడిపోయెను.

                                        *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS