Previous Page Next Page 
ప్రతీకారం పేజి 25


    అపరాధిలా తలవంచుకుని గడపలో నిలబడిన జగన్నాథం మీద మూర్తి కళ్ళు ఓ క్షణం నిల్చాయి. తోక మీద నిటారుగా నిల్చున్న కాల సర్పాన్ని చూసినట్టు మరుక్షణంలో కుర్చీలో నుంచి దిగ్గున లేచి నిలబడ్డాడు.
    "ఎందుకొచ్చావు? నన్ను చంపటానికేనా? రా! నా ప్రాణాలు కూడా తీసుకో! అప్పటికైనా మీ తండ్రీ కొడుకుల రక్తదాహం తీరుతుందేమో!" దాదాపు అరిచినట్టే అన్నాడు మూర్తి.
    "మూర్తీ!" అంటూ జగన్నాథం మూర్తి రెండు చేతులూ పట్టుకున్నాడు.
    "ఛీ! నా చేతులు వదులు" విసురుగా తన చేతుల్ని వెనక్కు తీసుకున్నాడు మూర్తి.
    "మూర్తీ" జగన్నాథం కంఠంలో దుఃఖం పెల్లుబికింది.
    "ఎందుకేడుస్తావు? నీ కొడుకు ఇంకా బతికే వున్నాడుగా! ఉరికంబం ఎక్కడానికి ఇంకా సమయం వుందిలే, ఇప్పటినుంచే ఎందుకేడుస్తావు?" కసిగా అన్నాడు మూర్తి.
    "మూర్తీ అంత దారుణంగా మాట్లాడకు. ఈ గుండె కోతను అర్థంచేసుకో. అమ్మా, నాన్నా, నా భార్య చనిపోయినప్పుడు బాధపడ్డాను. కాని యీ బాధ నన్ను అన్నిటికంటే దారుణంగా వేదిస్తూ ఉంది. నా ఆవేదన నీకు అర్థం కాదు!"
    మూర్తి విరక్తిగా నవ్వాడు. "అవును నీ బాధ నాకు ఎలా అర్థం అవుతుంది! ఎప్పుడో ఉరికంబం ఎక్కుతాడని కొడుకు కోసం ఏడ్చే నీ దుఃఖం చచ్చిన కూతురి కోసం ఏడ్చే నాకేం అర్థమవుతుంది?"
    "కాదు మూర్తి! నా బాధ నా కొడుకు ఉరికంబం ఎక్కుతాడని కాదు. రవి రజనీని హత్య చేశాడంటే నమ్ముతున్నావనేదే నా బాధ. రవి నిరపరాధి అని నువ్వు నమ్మితే చాలు నా కొడుకు ఉరికంబం ఎక్కినా నేను పెద్దగా బాధపడను" అన్నాడు జగన్నాథం.
    మూర్తి బిగ్గరగా నవ్వాడు.
    "రవి హంతకుడు. రవి రజని ప్రాణాలు తీశాడు. ఎవరు వదిలి పెట్టినా నేను మాత్రం వదిలి పెట్టను. రవి అంతం చూస్తాను" ప్రకాశ్ ముందుకి వచ్చి అరిచాడు.
    "నువ్వూరుకో ప్రకాశ్! అదేదో నేనే చూస్తాను. నువ్వు మాట్లాడకు" అన్నాడు మూర్తి.
    "మూర్తీ! నా మాట నమ్ము. రవి నిరాపరాధి. వాడు హత్య చెయ్యలేదు"
    "వాడే నా బిడ్డను చంపాడు. నీ రక్తమే వాడిలోనూ ప్రవహిస్తోంది. నువ్వూ హంతకుడివే "లా" నిన్ను శిక్షించలేక పోయింది. నీ కొడుకు మాత్రం తప్పించుకోలేడు. ఉరికంబం ఎక్కిస్తాను" దాదాపు అరుస్తూ అన్నాడు మూర్తి.
    "నిజం మూర్తీ! నా బిడ్డ నిరపరాధి. వాడు నిజంగా రజనీని హత్య చేసి ఉంటే, మీ అందరికంటే ముందుగా నేనే సాక్ష్యం ఇచ్చి వాణ్ని ఉరికంబం ఎక్కించేవాణ్ని."
    "ప్లీజ్ ! ముందు నువ్వు బయటికి వెళ్ళు. కసి, ద్వేషం క్రోధం మీ రక్తంలోనే ఉంది. మరో మాట అన్నావా నేను ఏం చేస్తానో తెలియదు వెళ్ళు" అరిచాడు మూర్తి.
    "మూర్తీ! కొంచెం ఆలోచించు, రజనీని హత్యచేస్తే వాడికి ఏం వస్తుంది?" రెండు చేతులూ పట్టుకుంటూ ప్రాధేయ పూర్వకంగా అన్నాడు జగన్నాధం.
    మూర్తి జగన్నాధం చేతుల్ని విసిరికొట్టాడు.
    "రజనీకి రవిని చేసుకోవడం ఇష్టంలేదు. అతనితో వివాహానికి అంగీకరించలేదు. నేను బలవంతంగా అతనితో బయటికి పంపించాను. అది తెలిసే హత్య చేశాడు. వాడూ నీ కొడుకేగా ప్రేమించిన స్త్రీ తిరస్కరిస్తే సహించలేకపోయాడు."
    జగన్నాథం ఓ క్షణం మూర్తి ముఖంలోకి చూస్తూ వుండిపోయాడు.
    "నువ్వు పొరపడుతున్నావు మూర్తీ! అది చెప్పడానికే వచ్చాను. రవి రజనీని ప్రేమించడం లేదు. ఈ వివాహం జరగడానికి వీల్లేదన్నాడు. రజని తనకు చెల్లెలిలాంటిదన్నాడు. ఆ విషయం చెప్పడానికే రవి ఇక్కడకు వచ్చాడు"
    జగన్నాథం మాటలకు మూర్తి పిచ్చి కోపంతో ఊగిపోయాడు. నిలువెల్లా కంపించిపోయాడు.
    "ఆపు! మాట్లాడకు. బయటికి నడుస్తావా మెడపట్టి గెంటాలా?" వెర్రికేకలు వేస్తూ మీద మీదకు వచ్చాడు మూర్తి.
    జగన్నాథం తల వంచుకుని బయటికి వెళ్ళిపోయాడు.
    అలా వెళుతున్న వాణ్ని చూస్తూ మూర్తి పళ్ళు పట పట కొరికాడు.
    "మిత్ర ద్రోహి! నీచుడు! పైగా అబద్ధాలు చెప్పి నమ్మించాలని ప్రయత్నిస్తున్నాడు. నేనంత ఫూల్ ని కాదు. ఇలాంటి వాళ్ళను ఎందర్నో చూశాను" గొణుక్కుంటూ కుర్చీలో కూలబడ్డాడు మూర్తి.

                                              20

    కోర్టు జనంతో కిటకిట లాడుతోంది.
    రవి బాక్సులో నిలబడి వున్నాడు.
    అందరి కళ్ళూ కుతూహలంతో ముద్దాయిని చూస్తున్నాయి.
    డిఫెన్స్ లాయర్ బాల్-బేబీ కథ చెప్పాడు. కోర్టులో వున్నవాళ్ళు కొందరు మాత్రమే ఆ కథ నమ్మారు.
    పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచాడు. ముసి ముసిగా నవ్వుతూ ముద్దాయి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు.
    "మిలార్డ్! ఈ బాల్ - బేబీ కథ ఎంత హాస్యాస్పదంగా వుందో గమనించాలి. ఈ కథ కల్పితం. ఆఫ్టర్ థాట్. ఆ కథే నిజం అయితే సాక్ష్యాలు ఎక్కడ? వారెందుకు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం లేదు? డిఫెన్స్ కథనం ప్రకారం మరో స్త్రీ కూడా అక్కడ వుంది. ఆమె ముద్దాయిని దీవించింది. ఆమె ఎందుకు ముందుకు రాలేదు? ముద్దాయి బేబీని రక్షించాడు. వారి దగ్గర కారు కూడా వున్నట్టు డిఫెన్స్ కథనం. వారు ఇంత దారుణం జరిగితే తమ బిడ్డ ప్రాణాలు రక్షించిన వాడిని ఆ పరిస్థితిలో వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? దేర్ ఫోర్ బాల్ - బేబీ కథ కవిత్వం. రజనీని ముద్దాయి హత్య చేశాడు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS