Previous Page Next Page 
ది సెల్ పేజి 25


                                             ది సెల్

    తూర్పున విజయభేరి మ్రోగింది. జగన్నాథుని రథ చక్రాలు కదిలాయి.
    పంజరం నుంచి బయటపడినట్టుగా పక్షుల రెక్కల చప్పుడు.
    దేశానికి స్వాతంత్ర్యం వచ్చి చాలా ఏండ్లు గడిచాయి. స్వాతంత్ర్య సంగ్రామంలో భరత్ భూషణ్ ఒక విశిష్ట వ్యక్తి మాత్రమే కాదు, ఒకానొక వినూత్న శక్తి.
    స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో పరాయి పాలకులను కత్తికంటే మించిన వాడిగల తన కలంతో గడగడలాడించిన యోధానయోధుడు.
    అటువంటి భరత్ భూషణ్ గురించి పట్టించుకున్నవారు లేరు. అసలు అతను జీవించి ఉన్నాడా? చనిపోయాడా? ఎవరికీ తెలియదు, తెలుసుకోవాలనుకున్నవారు లేరు. ఇది ఇప్పుడు సర్వ స్వతంత్ర దేశం!
    దేశ ప్రజలలో సంఘీభావం బలపడాలి, మాతృభూమిపై మమతను పెంచాలి. స్వదేశీ వస్తువులంటే ఆదరణ కలగాలి. విదేశీ శక్తులపై అకుంఠిత పోరాటం, పాశ్చాత్య సంస్కృతీ నాగరికతల పట్ల ఏవగింపు...
    తన రచనల ద్వారా ఇలా జన జాగృతి కలిగించిన భరత్ చూషణ్ కు విప్లవ రచయితగా ముద్ర పడింది, నాటి పాలకులు భరత్ భూషణ్ కు దేశ బహిష్కరణ లేక శిరచ్చేదానికి ఆజ్ఞలు జారీ చేశారు.
    పరాయి పాలకులకు లొంగిపోయే పిరికిపంద కాదు భరత్ భూషణ్. అంతేకాదు రోజురోజుకి వజ్రాయుధం వంటి తన కలంతో విజృంభించాడు.
    దేశ స్వాతంత్ర్య ప్రకటనను చెవులారా వినాలన్న, దాస్యశృంఖలాలను త్రెంచుకున్న భరతమాతను కనులారా చూడాలన్న కోరిక అతనిలో రోజురోజుకు రాజుకున్నది.
    కాని స్వాతంత్ర్యం వచ్చిందన్న వార్త వినటానికి, కనులారా చూడటానికి స్వాతంత్ర్య సమరయోధుడు భరత్ భూషణ్ కనిపించలేదు.
    పరిపరివిధాలనుకున్నారు ప్రజలు. కొందరు పిరికివాడు అన్నారు. ప్రాణభీతితో దేశం వదిలి పారిపోయాడన్నారు.
    మరికొందరు విదేశీ శక్తులు గుట్టుగా చంపివేసివుంటాయనుకున్నారు...
    కొన్ని దశాబ్దాలు గడిచాయి.
    ఆ సెల్ తలుపులు తెరుచుకున్నాయి. తన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని సెంట్రీ చెబితే విన్నాడు. విని చాలా దశాబ్దాలు అయ్యింది. కాని భరత్ భూషణ్ కి ఇప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందనిపించింది. స్వేచ్చా విహంగములా బయటకు వచ్చాడు.
    కారాగారవాసం అనుభవించిన భరత్ భూషణ్ లో జవసత్త్వాలు క్షీణించాయి. వయసు ముంచుకు వచ్చింది. ప్రాణాలు ఏ క్షణాన పోతాయో తెలియదు.
    మాతృభూమిపై అడుగెడుతున్న అతని మనసు ఆనందోత్సాహాలతో తేలియాడుతున్నది.
    గత జ్ఞాపకాలను, కష్టాలను నష్టాలను ఒక్కసారి తలచుకాగానే అతని మేను గగుర్పొడిచింది.
    ఒక్కసారిగా ఆవేశం అతనిలో ఉప్పొంగింది. ఆవేశం వెనుక గల ఆందోళనలు, అలజడులు గుర్తుకు వచ్చాయి.
    అంతటి ఆందోళన వెనుకగల నాటి ప్రజల ఆదరణ జ్ఞప్తికి వచ్చింది. ప్రజల ఆదరణ వెనుక, పరాయి పాలకులపై వాళ్ళకుగల అసంతృప్తి కనులముందు కదిలింది మనసు పులకించింది.
    వెనుకటి ఆలోచనలు ఒకదానివెంట ఒకటి తరుముతుంటే ఆ ముసలి హృదయం తట్టుకోలేక విలవిలలాడింది. అతని కళ్ళవెంట బొటబొట కన్నీరు కారింది. అవి ఆనందభాష్పాలో! అతనిలోని ఆవేదనకు చిహ్నాలో!

                                                                   *    *    *

    నడినెత్తిన మిట్టమధ్యాహ్నపు మార్తాండుడు నిప్పులు చెరుగుతుండగా దప్పిక కలిగి దగ్గరలోవున్న ఇంటికి వెళ్ళాడు భరత్ భూషణ్.
    "ఎవరు కావాలి?"
    బక్కచిక్కి చింపిరిజుత్తు పెరిగిన గెడ్డం, చేతిసంచితో వున్న భరత్ భూషణ్ ను అడిగింది ఆ ఇంటి ఇల్లాలు.
    "ఎవరికోసమో నేను రాలేదమ్మా! కాస్త మంచినీళ్ళు ఇస్తే తాగుతాను..." అభ్యర్ధించాడు.
    మారు మాట్లాడకుండా లోనికివెళ్ళి చెంబుతో నీళ్ళు తీసుకువచ్చిందామె.
    ఇవ్వమన్నట్లు చేయి చాపాడు.
    "దోసిలిపట్టు పోస్తాను"
    విస్తుబోయాడు అతను.
    అంటరానితనం ఈ దేశంలో ఇంకా వుందా? హరిజనోద్ధరణ ఉద్యమాలు ఏమైపోయాయో!
    అతని మనసు మూగగా రోదించింది.
    తన చిన్నతనంలో అది ఆంధ్రులను అంటరానివాళ్ళని దూరంగా ఉంచడం తెలుసు. వాళ్ళకు ఏదైనా ఇచ్చేప్పుడు చేతికి తగలకుండా ఎత్తి వాళ్ళ చేతుల్లో వేయడం తనకు తెలుసు. అలాంటి దారుణాలను చూసి తను తిరగబడిన సందర్భాలు, సనాతనులు కొందరు తనమీద విరుచుకుపడడం గుర్తుకు వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS