"మరేమీలేదు. మీ మాటలు వింటుంటే మీరు గొప్ప తత్త్వవేత్తలా వున్నారు. ప్రతి తత్త్వవేత్తకూ అలా కావటానికి వెనుక ఏదో బలమైన ప్రేరణ వుంటుందని విన్నాను. చదివాను. మీ స్వంత విషయాల్లో జోక్యం కల్పించుకోవాలన్న ఇది నాకేమీ లేదు... కాని...
"చాలా బలమైన విషయమే అడిగావు నాయనా! ఈ ప్రశ్న ఇదివరలో ఎవరైనా నన్ను అడిగివుంటే నేను కన్నీరు పెట్టుకోవటం తప్ప మరేమీ చేసివుండేవాడిని కాను. కాని ఇప్పుడీ ప్రశ్న విని నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నా చుట్టూ నా ఆత్మీయులంతా ఉన్నట్లే అనిపిస్తోంది. అందమైన ఈ ప్రకృతి నాకిచ్చిన మనశ్శాంతి వల్ల ఇలా ఉన్నదేమో- ఆయన చెప్పుకు పోతున్నాడు.
"బాబుగారూ! మేమంతా మీ ఆత్మీయులమని ఎందు కనుకో కూడదు" ఓదార్చాలనే ప్రయత్నంలో అనేశాను.
"ఔను అసలు బంధువులంతా రాబందులయ్యారా! ఇప్పుడీ లోకంలో అందరూ నా బంధువులే అనుకోవటానికి ఆస్కారమేర్పడింది.
"బాబూ! అడిగి తెలుసుకునే స్వభావం నీకున్నది. చెప్పి బరువు దించుకోవాలన్న తహతాహ నాకూ వున్నది. కనుక చెప్తాను విను.
అసలు నేను పుట్టింది ఈ కొండవీటికి పశ్చిమోత్తరంగా పాతిక ముప్ఫై మైళ్ళ దూరంలో ఉన్న అమరావతిలో అన్నారు.
అమరావతి పేరు వినేసరికి నాకు ఒళ్ళు జలదరించింది. ఫాతిమాదీ అమరావతే కదా! "అలాగే" అన్నాను ఆసక్తిని బైట పడకుండా అణిచేస్తూ.
"ఔను బాబూ! బ్రాహ్మణ జన్మ ఎత్తాను" మళ్ళీ శరీరం జలదరించింది. ఆసక్తిగా ముందుకు వంగాను.
"ఆంధ్ర దేశంలో పుట్టానా! కాల ప్రవాహంలో కొట్టుకు పోయాను. కొన్నాళ్ళు స్వాతంత్ర్య పోరాటంలో జైళ్ళలో మ్రగ్గాను. అక్కడే పెద్ద నాయకులతో పరిచయాలేర్పడ్డాయి. ఆ తరువాత ఉత్తరాదినే స్థిరపడ్డాను. రవ్వంత కూడబెట్టాననుకో. ఇప్పటికి పాతిక సంవత్సరాలుగా ఎం.పి. గా చేస్తున్నాను. ఆ ప్రజలకు నామీద గురి కుదిరింది. ఉభయ తారకంగా ఉంటుందని నేను కొనసాగిస్తున్నాను. ఇంతకు నన్ను గురించి వివరాలు చెప్పనేలేదు?" అని ముగించాడాయన. నేను సంక్షిప్తంగా రెండు ముక్కలు చెప్పుకున్నాను.
"అయితే రచయిత వన్నమాట? కథలు వెతుక్కుంటూ వచ్చావన్నమాట! ఇది అందుకు అనువైన చోటేలే" అని ప్రశంసించాడు. నేను తలవొంచుకుని కుర్చీలో సర్దుకుని కూర్చున్నాను. ఆయన చూపులు మళ్ళీ ఫారెస్టు వేపు మళ్ళాయి. ఏకాగ్రతగా చూస్తున్నాడు.
"బాబూ! జీవితం కూడా అరణ్యం లాంటిదే! అది భయపడే వారికి ప్రాణాంతకమయిన చోటు. కాని అలవాటు పడిపోయిన వారికి అదే పంచనటి. అదే జన్మస్థానం" చూపులు త్రిప్పకుండానే చెప్తున్నారు. చిన్న దగ్గు తెర అడ్డొచ్చింది.
"డాడీ! మీరిప్పటికే చాలా యెక్కువ మాట్లాడారు. రండి, రెస్టు తీసుకుందురుగాని" అంటూ చేయి పుచ్చుకుని లేవదీశాడా యువకుడు. మెల్లగా లోపలకు నడిపించాడు.
లోపల గదిలో కాసేపు దగ్గు తెర. కాసేపు నిశ్శబ్దంగా ఉంటున్నది. చివరకు వొక సుదీర్ఘమయిన దగ్గు తెర వచ్చి, ఆ తరువాత నిశ్శబ్దం యేర్పడింది. యువకుడు బైట కొచ్చాడు, చేతిలో విస్తరితో. "ఏమైంది?" అన్నాను.
"డాడీ భోజనం చేస్తూ దగ్గు తెరవల్ల నీరసించారు. అందువల్ల యీ విస్తరి పారేస్తున్నాను" అన్నాడా యువకుడు.
"సర్వెంట్స్ ఎవరూ రాలేదా?" ప్రశ్నించారు.
"అక్కర్లేదని నాన్నగారే వారించారు. ఎందుకో తెలియదు."
"మరి మీ అమ్మగారు?"
"పోయారు. సంవత్సరమయింది. అమ్మగారు పోయిన దగ్గరనుండీ నాన్నగారికి యీ కొండవీడు పిచ్చి మరీ యెక్కువయింది. ఇది ఏ మారుమూల వుందో ఢిల్లీలో నాకెలా తెలుస్తుంది చెప్పండి. ఎలాగో తంటాలు పెట్టి తీసుకొచ్చాను" అంటూ విస్తరిని చీకట్లోకి విసిరాడు.
"నా బాబే! నా తండ్రే! ధర్మప్రభువు...ధర్మప్రభువు" అంటూ చీకట్లోంచి వినిపించింది. అది అవ్వ గొంతు. ఆ విసిరేసిన విస్తరి వెళ్ళి అవ్వ వొళ్ళో పడింది కామోసు.
"అవ్వా, నువ్వెప్పుడొచ్చావు?" అన్నాను.
"ఇప్పుడే బాబయ్యా! కూసింత సేపయింది. బాబులెవరో దగ్గుతున్నట్టినబడితే ప్రాణం నిలవ కిటేపొచ్చా. ధర్మప్రభువు, ఎంత అన్నమో..." ఆవురావురని తింటోంది. అవ్వ ఆకలికి తేడాలు లేవు. తీరా తిన్నాక అది యెంగిలి అని చెప్పటానికి మనస్కరించలేదు.
ఈ సృష్టిలో జరిగే ప్రతి పనికీ అర్థమంటూ వుంటే దీనికీ ఉండిఉండాలి కదా అనుకున్నాను. ఇది ఏనాటి అనుబంధమో!
యువకుడు లోనికి వెళ్ళిపోయాడు. తలుపులు కూడా బిడాయించేశాడు. మా కోతులు రెండూ గదిలో పడి గుర్రు తీస్తున్నాయి. తిరిగి తిరిశాచ్చారాయె. అలసిపోయారు. గదిలోకి వెళ్ళాను. లైటు వేసే వుంది.
భోజనం నాకోసం వదలి వాళ్ళు తినేశారు. నాకోసం యెదురుచూస్తూ చూస్తూ నిద్రపోయారు కాబోలు. అస్తవ్యస్తంగా పడుకున్నారు. చొక్కాలు విప్పలేదు. కవి మిత్రుడు చెప్పులు కూడ విప్పలేదు. రమణ తలక్రింద దిండూ లేదు.
