Previous Page Next Page 
వైరం పేజి 25


    "పాపం! భర్తలేని, చదువురాని ఆడవాళ్ళు అప్పడాలూ, వడియాలూ చేసి అమ్ముకుని బతికితే మనం అపహాస్యం చెయ్యాలా ఏం?"
    "ఇందులో అపహాస్యం ఏంవుందీ? ఆండాళ్ళుగారి అప్పడాలూ వడియాలే కాదు. ఆమె చేసే కందిపొడి కూడా నాకు భలే ఇష్టం! అన్నంలో కందిపొడి కలుపుకుని కమ్మటి నెయ్యి వేసుకుని పెద్ద పెద్ద ముద్దలు తినేస్తూ వుంటే... ఆహాహా.." అంది భావన.
    "లైసెన్సు లేకుండా అప్పడాలూ, వడియాలు చేసి అమ్ముకుంటోందని ఆమె మీద ప్రతాపం చూపించబోయాడు ఎవరో ఒక అఫీషియల్.
    నమ్మశక్యం కానట్లు చూసింది భావన.
    "అన్యాయం! ఏ ఆసరా లేని ఓ ఆడది కాసిని అప్పడాలు చేసి అమ్ముకుంటూ ఉంటే..."
    "ఆ అఫీషియల్ చేసిన ఆగడం గురించి వాళ్ళ ఆఫీసరుకి కంప్లయింట్ చేద్దామని వెళ్ళాను నేను" అంది అరుణ.
    "మంచిపని చేశావ్! ఏవన్నాడేం?"
    "ఎప్పుడూ పై అధికారులు వచ్చి పైసలు ఇవ్వలేదనో, తమ వాళ్ళ పనులు చేసిపెట్టలేదనో తిట్టడం తప్ప, మనలాంటి కిందివాళ్ళు వచ్చి నిలదీయడం ఆయనకి అనుభవంలేదులాగుంది! బిత్తరపోయాడు" అంది అరుణ.
    "ఆండాళ్ళు గారు...పాపం! పెద్దావిడ!" అంది అరుణ సానుభూతిగా.
    "అంతేకదా! పోషించవలసిన టీనేజ్ కూతురు కూడా వుంది కదా!"
    "ఇంకో అయిదారేళ్ళలో దాని చదువు పూర్తయి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే..."
    "అందుకే గదా ఆమె తాపత్రయం అంతా!"
    "అదలా వుంచు! ఇంతకీ నిన్ను ఈ నెక్లెస్ రోడ్డుకి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా? అంది భావన మిస్టీరియస్ గా.
    "ఎందుకు?"
    "ఈ స్పాట్ లో కూర్చునే కదా ఆ రోజున నువ్వు సూరజ్ తో తెగతెంపులు చేసుకున్నట్లుగా మాట్లాడి తగిలేశానన్నావ్?"
    "అసలు సంబంధం అంటూ వుంటేగా తెగతెంపులూ! అతనొక న్యూసెన్సుగా..."
    "ఈ స్పాట్ ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో అరుణా! సూరజ్ లాంటి పవిత్ర ప్రేమికుడిని పరాభవం చేసి పంపినందుకు ఏదో ఒక రోజున మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి తలుచుకుని తలుచుకుని కుమిలిపోక తప్పదు! గ్యారంటీ!"
    నిటారుగా కూర్చుంది అరుణ.
    "ఇంక చాలు! ఇంకెప్పుడూ ఆ సూరజ్ సంగతి నాతో చెప్పకు - అర్థమయిందా మిస్ భావనా ఫెర్నాండెజ్?" అంది తీవ్రంగా.
    ఒక్కసారిగా నవ్వేసి, ఇష్టంగా స్నేహితురాలి చేతులని పట్టుకుంది భావన. అరుణకి ఎవరిమీదనన్నా కోపం వస్తే, వాళ్ళని పూర్తి పేరుతో, చాలా ఫార్మల్ గా పిలవడం అలవాటని భావనకి తెలుసు.
    "అబ్బో! మిస్ భావనా ఫెర్నాండెజ్ అని పూర్తి పేరుతో పిలిచేస్తున్నావే! అంటే అమ్మగారికి తిక్కరేగిందన్నమాటే! అవునా మిస్ ఆరాధ్యుల అరుణా?"
    "ఛీ! పోవే!" అని చటుక్కున మొహం పక్కకి తిప్పేసుకుంది అరుణ.
    అప్పుడు కనబడింది అరుణకి ఆ దృశ్యం!
    రెయిలింగ్ దగ్గర, ఒకళ్ళకి ఒకళ్ళు దగ్గర దగ్గరగా ఆనుకుని నిలబడి, హుసేన్ సాగర్ నీళ్ళలోకి తొంగి చూస్తున్నారు ఒక జంట.
    వాళ్ళు టీనేజర్స్.
    కాదు కాదు - టీన్స్ కూడా కాదు - బిట్వీన్స్' అని కొత్తగా ఒక పదం కామన్ చేశారే - అంటే థర్టీన్ నుంచీ ఫిఫ్టీన్ దాకా వయసు వుండి, అప్పుడప్పుడే లేత యవ్వనపు ప్రాంగణంలోకి అడుగుపెడుతున్నవాళ్ళు.
    అట్లాగే, వీళ్ళు కూడా బిట్వీన్స్. ఆ అమ్మాయికి పధ్నాలుగేళ్ళు వుంటాయి. ఆ అబ్బాయికి పదిహేనుకి మించవు!
    ఆ ఇద్దరూ కూడా ఒకళ్ళ మొహంలోకి ఒకళ్ళు "ఇదే చివరి చూపు" అన్నట్లుగా చూసుకున్నారు.
    వెనువెంటనే -  
    ఆ అమ్మాయి చటుక్కున నీళ్ళలోకి దూకేసింది!
    దూకుతూ ఉండగానే "అమ్మా" అని చావుకేక!
    ఆ అమ్మాయితో బాటుగా దూకవలసిన ఆ అబ్బాయికి ఆ కేక వినగానే భయం కలిగినట్లుగా వుంది.
    ఆమెతోబాటు తను కూడా దూకేసే ప్రయత్నం మానేసి, భయభ్రాంతుడై, కట్టెబొమ్మలా నీలుక్కుపోయాడు.
    చివాలున లేచింది అరుణ. రెయిలింగ్స్ దగ్గరికి పరిగెత్తింది.
    నీళ్ళలోపడిన అమ్మాయి ఒకసారి పైకి తేలింది.
    ఈలోగా భావన కూడా అక్కడికి చేరుకుంది.
    పైకి తేలిన ఆ పిల్ల, తనని రక్షించమన్నట్లుగా, నిస్సహాయంగా ఒక చేయి పైకెత్తింది.
    మళ్ళీ మునిగింది.
    "చీరె విప్పేసి విసిరితే అందుకుంటుందేమో" అంది అరుణ. ఆ అమ్మాయిని రక్షించడం కోసం ఏ చేయడానికైనా రెడీ అన్నట్లుగా చీరె ముడి మీదికి చేయిపోనిస్తూ.
    "అఖ్ఖర్లేదు! నువ్వీ సెల్ ఫోన్ తీసుకుని 'కంట్రోల్ రూమ్ కి ఫోన్ చెయ్. ఈలోగా నేను.." అని చటుక్కున నీళ్ళలోకి దూకేసింది భావన.
    భావనకి ఈత వచ్చునని ఆ రోజు దాకా తెలియదు అరుణకి. భావన చుడీదార్స్ వేసుకుని వుంది. అదృష్టవశాత్తూ దూకీ దూకగానే భావన చేతికి ఆ అమ్మాయి జడ చిక్కింది.
    నీళ్ళలో పడిపోయిన వాళ్ళని రక్షించడానికి సరైన పద్ధతి అదే అని అంటారు.
    మునిగిపోయే వాళ్ళకి గనక చేయి అందిస్తే, వాళ్ళు తమని రక్షించబోయిన వాళ్ళని కూడా నీళ్ళలోకి లాగేసే ప్రమాదం వుంటుంది.
    ఈదుతూనే ఆ అమ్మాయి జుట్టు మొత్తం తన గుప్పెట్లోకి తెచ్చుకుంది భావన.
    ఈలోగా, తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న చిన్న నోట్ బుక్ తీసింది అరుణ. అందులో అత్యవసర సర్వీసుల నెంబర్లు అన్నీ నోట్ చేసి వున్నాయి.
    సెల్ ఫోన్ లో లేక్ పోలీస్ కి రింగ్ చేసి వాళ్ళని అలెర్ట్ చేసింది.
    నెక్లెస్ రోడ్, టాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో వుండే పోలీసులు వాళ్లు.
    వాళ్ళు అక్కడికి చేరుకునే లోపలే, నీళ్ళలో దూకేసిన అమ్మాయి జుట్టు పట్టుకుని ఈదుతూ ఒడ్డుకి చేరుకుంది భావన.
    పోలీసులు భావనా, ఆ అమ్మాయీ పైకి రావడానికి సాయం చేశారు.
    పాపం ఆ అమ్మాయికి ప్రాణాలు దక్కాయిగానీ ప్రాణభయం మాత్రం వదిలినట్లుగా లేదు.
    గజగజ వణికిపోతోంది.
    చలితో భయంతో కూడా.
    "అరుణక్కా! కోప్పడకు!" అంది హీనస్వరంతో.
    "ఏం అననులే!" అని ఆ అమ్మాయితో చెప్పి, ఆ తర్వాత ఆశ్చర్యంగా చూస్తున్న భావనతో అంది అరుణ. "ఆండాళ్ళుగారి కూతురు-సునీత.
    "నువ్వుటే!" అంది భావన గుడ్లురిమి చూస్తూ.
    తక్షణం బావురుమని ఏడుపు మొదలెట్టి, అంతలోనే మోకాళ్ళు బలహీనమైపోయినట్లుగా నేలమీదికి జారిపోయింది సునీత. ఫెయింట్ అయిపోయింది.
    "కేసు రిజిష్టర్ చేయాలి. అటెంప్ట్ టూ సూసైడ్" అన్నాడు ఒక పోలీసు.
    "కేసు కంటే ముఖ్యం ముందుగా ట్రీట్ మెంటు కావాలి. అది షాక్ లో వుంది" అంది అరుణ స్థిరంగా.
    అప్పటికే, జనం గుంపుగా గుమిగూడిపోతున్నారు. చోద్యం చూడడానికి. పోలీసులు వాళ్ళని చెదరగొడుతున్నారు.
    ఈ గొడవ ఇలా జరుగుతూ ఉండగానే సునీత 'బాయ్ ఫ్రెండు' బతుకు జీవుడా అని చల్లగా ఎటో జారుకున్నాడు.
    "కేసు తప్పదు" అన్నాడు కానిస్టేబుల్.
    అతన్ని కాస్త పక్కకి తీసుకెళ్ళింది భావన. అనునయంగా అతనితో ఏదో మాట్లాడుతున్నట్లు కనబడింది. అతను కన్విన్స్ అయినట్లున్నాడు. తల పంకించాడు.
    "ముందుగా మన డాక్టర్ వెంకయ్య అంకుల్ దగ్గరికి తీసుకెళ్దాం" అంది భావన అరుణతో.
    ఒక పోలీసు సానుభూతిగా అన్నాడు. "ఈ పాపది మా పాప ఈడే! సినిమాలు పిల్లల్ని చెడగొడుతున్నాయ్. పదండి! మీ డాక్టర్ దగ్గరికే తీసుకెళ్దాం" అన్నాడు.
    కాసేపటి తర్వాత, అందరూ డాక్టర్ వెంకయ్య నర్సింగ్ హోమ్ కి చేరుకున్నారు. దాని పేరు 'ప్రజాహిత వైద్యశాల'. డాక్టర్ వెంకయ్య సునీతని అటెండ్ కావడం మొదలెట్టాడు.
    ఇంకో అరగంటకి అక్కడకి చేరుకుంది సునీత తల్లి ఆండాళ్ళమ్మ. షాక్ లో వుంది ఆమె కూడా.
    పిల్లకు ప్రమాదమేమీ లేదని ఆండాళ్ళు గారికి నచ్చజెప్పి, ఆమెని ఓదార్చి, అరుణ, భావనా ఇంటికి తిరిగివచ్చేసరికి పదిన్నర అయిపోయింది. అరుణ తల్లి జాహ్నవి ఇంకో అరగంటసేపు ఆండాళ్ళుకి తోడుగా వుంది. ఆ తర్వాత ఆమె కూడా తిరిగి వచ్చింది. వికలమైన మనసులతో కూర్చుండిపోయారు అందరూ.
    వంటిమీద స్పృహ లేని తన కూతురు సునీతని చూసి రోదిస్తూ ఆండాళ్ళు అన్నమాటలు అరుణ చెవుల్లో ఇంకా గింగురుమంటూనే వున్నాయి..
    "ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావే నా చిట్టి తల్లీ! నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నానే! కంటికి నచ్చినవాడు కనబడగానే కన్నతల్లి ప్రేమ దిగతుడుపు అయిపోయిందా అమ్మా!"
    హఠాత్తుగా అరుణ బాధ అంతా భావన మీద చిరాకు రూపంలో బయటపడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS