బడి అనే వికృతపు మరలో పెట్టి వంకర్లుగా నొక్కుతో వుంటే వద్దని తిరగబడే దీరుణ్ణి....
"నీకోసమేరా! నీ మంచి కోసమేరా!" అతన్నులు, ఆ కోపం - ఆ పుస్తకాలు, ఆ చచ్చు నీతులు, ఆ మురికి పలకలు అన్నీ -
"సుఖంగా ఆడుకుంటాను ఈ ఆనందమయమైన ప్రపంచంలో. ఆ మురికి గూడులోకి, ఆ టీచెరు పెను భూతం దగ్గిరికి పోను " - అని యేడ్చే కుర్రవాళ్ళని పెద్ద పట్టణాల్లో, నెల్లూరులో, గుడివాడలో -- యీ 1938 లో కాళ్ళు చేతులు కట్టి, పందిని పొడిచి కర్రను కట్టి లాక్కుపోయినట్టు మోసుకుపోవడం చూశాను. పండు వెన్నెల్లో చక్కని సాయంత్రాలు, ట్యుషన్లని అడుగుల మీద చంటి పిల్లల్ని బంధించి మొట్టికాయలు మొట్టడం చూశాను. వీధిలో పోయే బళ్లనీ, ఆడుకొనే పిల్లల్నీ చూసి ఆ కళ్ళల్లో కలలు కలిగితే పాఠం మరిచిందని దెబ్బలు. హటాత్తుగా టీచర్లందరూ , ముఖ్యం ట్రైనింగు స్కూళ్ల టీచర్లు అందరూ భస్మమై ఈ లోకం నుంచి వొదిలిపొతే ! పైగా ఈ నరక బాధలలో చతుర్యాలు, నడకలు , art, steps విధానాలు.
సినీమాలో -- ,మనిషికి బలికి తయారు చేసే steps - జ్ఞాపకం వొస్తాయి. ఆ కధలో ఎవరో వొచ్చి చివరికి రక్షిస్తారు. కాని యీ బళ్ల లోంచి యీ దిక్కుమాలిన బలి పిల్లల్ని రక్షించేందుకు ఏ దేవుడూ రాడు. ఇంతా చంపి చదివించి -- యెందుకు చివరికి?
"చదవండి . చదవండి . జ్ఞానం సంపాదించండి. విద్యని కీర్తించండి ." ఎందుకూ? అన్నీ Vested interests. రాజకీయం వాళ్ళకి, తమ అభిప్రాయాలు ప్రచారం చేసుకోడానికి, మందులవాళ్ళు తామ మందు ఘనత చదివించడానికి -- టీచరు బతకడానికి, యిన స్పెక్టరు తన జీతానికి, పుస్తకాలు వ్రాసేవాళ్ళు అమ్మకాలకీ, ఆఫీసుల్లో చాకిరీలకి -- చదవండి , చదవండి. చదువు. చాలామంచిది . ఈ మంచి బోధనలంత అపాయకరమైనవి , "మీ బాగుకోసమే " అనేటంత మోసం యింకేం లేదు లోకంలో.
"ఎందరు పిల్లలు?" అని యిన స్పెక్టరు ప్రశ్న.
"ఎనిమిదిమంది ఎక్కువైనారు"
"బావుంది! ఏవీ ఎన్ని పాఠాలు చెప్పావు? ఎన్నో వొచ్చు వీళ్ళకు? బావుంది"
అంతేకాని---
"ఎన్ని బెత్తాలు విరిగాయి? ఎంతమంది పిల్లలు ఏడ్చారు? ఎన్ని వేళ్ళు పోయినాయి? ఎంతమందికి ఆనందం శాశ్వతంగా చచ్చింది?"
ఈ లెక్కలు , యీ statistics ఎవరూ అడగరు.
జగ్రఫీలు, వేమన పద్యాలూ, ఉంటేనే గాని విద్య కాదనే గుడ్డి తనం వొదిలి అభివృద్ధి పొందాలని నిశ్చయించుకుంటేనే కాని, యీ ప్రపంచపు తీరుని దిద్దితే యీ బాధలు కొంతవరకన్నా తొలగి పోతాయి అనే విశ్వాసం ఉంటె కాని యెట్లా సంస్కరించగలం?
విద్య ఆనందాన్ని వృద్ది చేసేందుకు , బాధని తప్పించెందుకూ ఉపయోగపడాలి. ఎందుకు జ్ఞానం? ఆనందాన్ని యివ్వని జ్ఞానం, మనో శరీరాల సౌఖ్యం చంపే జ్ఞానం యెందుకు? యెందుకంటే , యేది గాని, యే అభిప్రాయం గాని , ఏ పనులు గాని యీ లోకమంతా మన పంచేంద్రియముల ద్వారా, బాధ సౌఖ్యమూ అనే రెండు ద్వారాలనే record అవుతోంది. ఆ విలువలు తప్పితే జీవికి వేరే విలువలు లేవు. ultimate గా చూస్తే బాధని తగ్గించి, ఆనందాన్ని వృద్ది చెయ్యని విదానాలన్నీ మనుష్యజాతికి శతృవులు. ఈ విరోదాలైన సంస్థలు విధానాలు ఎందుకు నిలిచి ఉన్నాయి యింకా? అంటే సామాన్యప్రజలు మూర్ఖులు. తెలిసిన కొద్ది మందీ స్వార్ధపరులు.
"ఏం చేస్తావురా? చదువుకోక అడుక్కుతింటావా?" అని తండ్రి అడిగితే-
ఆ బిచ్చగాడి స్వేచ్చ తలుచుకొని నిజంగా బిచ్చమెత్తుకోనిస్తాడా? అని కడుపు తరుక్కుపోతుంది -- కుర్రాడికి; "ఇంట్లోంచి పో" అని భర్త అంటే , నిజంగా పోనిస్తాడా అని ఆశపడి చూసే భార్య మనసు లాగ.
విద్యావిధానాన్ని సంస్కరిస్తారట! మనిషి స్వభావంలో విశ్వాసం లేని మనుష్యులు ఆనందానికి మనిషి హక్కు వుందని అంగీకరించని మహాత్ములు, రోజులు ఎనిమిది గంటలైనా మనిషి పనిచేస్తేనే గాని సరియైన మార్గంలో నడవని సందేహపడే వాళ్ళు విద్యను సంస్కరిస్తారట?
అనందం మనిషి హక్కు. ఈ నవనాగరికత వల్ల ఆనందాన్ని నాశనం చేసే చదువులు, నడుములు విరిచే పనులు యీ అనర్ధం తెచ్చి పెట్టుకున్నాం. యీ ఆస్తి హక్కులు, ఈ పురాతన అభిప్రాయాలూ, లెక్కలూ, నాయకుల జ్ఞానం మీదా మంచితనం మీదా ఆధారపడతారు. ఆ నాయకులు స్వార్ధపరులు. ప్రజలని మోసగించి తమ్ము తాము మోసగించుకొని పనీ, శ్రమా అంతా ప్రజల విరిగే వెన్నుల మీద పారేసి తాము సుఖంగా కాలక్షేపం చెయ్యాలని చూస్తున్నారు.
విద్య అంటే ఆనందించే శక్తిని వృద్ది చెయ్యడం, సౌందర్యలకి కళ్ళు తెరవడం. బాధల్నించి , కష్టాల నించి తప్పించుకునే నేర్పునివ్వడం, ఇతరుల స్వేచ్చల్ని అడ్డగించే స్వార్ధపరత్వం నించి, అంతా తనకే కావాలని దాచుకునే కాపీనంనించి, భయాలనించి తప్పించడం. మనిషి సుఖపడడానికి పుట్టాడు. అనందం అతని జన్మహక్కు - అనే నమ్మకం ఎవరికీ లేదు -- తిండి , గుడ్డా అతని జన్మహక్కు అనే వాళ్ళకి కూడా - ఆస్తీ , బాంకిలో డబ్బూ, ఎవరి హక్కూ కావనే వాళ్ళకి కూడా.
ఈ సోమరి భాగ్యవంతుల చేతి పని చేయించాలని కాదు -- ఆశయం.
ఈ కష్టపడేవాళ్ళ చేత , బాధపెట్టే పనిని మన్పిద్దాము అనేది.
"పని ఎందుకు చెయ్యాలి?"
"అవసరం"
"దేనికి అవసరం?"
"లోకానికి. దేశానికి. సంఘానికి"
అనడం తప్పు.
"ఆ మనిషికి అనందం గనక."
అనందం కాదా, పని చెయ్యవలసిన అగత్యం రాకూడదు.
ఎందువల్ల?
అనందం మనిషి జన్మ హక్కు.
ఇప్పుడే జరిగే మార్పులన్నీ tinkerings అటుకులు. చేతులకీ నడుములకీ భరించరా ని పని. జీవితమంతా పొట్ట గడుపుకునే యత్నంలో గడిచిపోతుంది. మరల నుంచి మనుష్యుని తప్పించాలనే ప్రయత్నంలో మనుష్యుల్నే మరలు చేస్తున్నారు. ఇప్పుడు బాగా శల్య గతాలైన అభిప్రాయాలన్నీ తారుమారు కావాలి. పైగా హితులు సలహాలిస్తారు ; - "ఎందుకు వ్రాస్తావు, ఇంకా రెండువందల ఏళ్ళకి, కాని ----"
"ఏదో కాలం మార్చవలసిందే మనం-"
"ఈశ్వరుడు చూసుకుంటారు లెండి మనకెందుకు?"
ఇంతవరకూ మనిషి ద్వారానే గాని ఈశ్వరుడు చూసుకోలేదు. ఏదీ లోకంలో. పని జరగాలంటే ఈశ్వరుడే మానిషి అవతారమెత్తుతాడు. నేను ఈశ్వరుడు, నాకన్న వేరు ఈశ్వరుడు లేడు'. నాలో కట్టుబడ్డాడు ఈశ్వరుడు, అందువల్లనే ఈ బాధ!
* * * *
