"ఊ__తర్వాత!" కీర్తి కుతూహలంగ అడిగింది.
"లోపల వంటగదిలో ఫోటోగ్రాఫరు ఫోటోలు తీయటం ఫింగర్ ప్రింట్స్ చూడటం... మావాళ్ళు లోపల వున్నారు. నేను బైటికి వచ్చాను. సరీగ అప్పుడు ఆమె భర్త రిక్షా దిగుతున్నాడు. ఎవరో అరిచారు ఆమె భర్త వచ్చాడు అని... అంతే నేను అరిచినట్టే చెప్పాను అందరితో "ఎవరూ నోరు మెదపవద్దు" అని__
"అందరూ నాయింటి ముందు మూగారు ఎందుకు ఏమైంది?" ఆదుర్దాగా అడిగాడు అతను.
ఎవరూ సమాధానం యివ్వలేదు. నా వేపు వేలు పెట్టి చూపించారు.
అతను వక్కంగలో నా దగ్గరకు వచ్చి "ఏం జరిగింది ఇన్ స్పెక్టర్!" అన్నాడు.
అతన్ని పరిశీలనగ చూస్తూ "చాలా ఘోరం జరిగిపోయింది" అన్నాను.
"దొంగలు యింట్లో దూరారా!"
"అలాంటి ఘోరంకాదు ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు."
నా ప్రశ్నకి అతను తాపీగ నిబ్బరంగ చిన్నపాటి కధ వినిపించాడు. ఉదయం ఊరికి వెళ్ళి గంటక్రితం రైలుదిగాడుట. నడిచి యింటికి వస్తుంటే స్కూటర్ యాక్సిడెంట్ అయిదింట. అక్కడ గోల అయి గంట పట్టిందిట. తర్వాత రిక్షా ఎక్కి ఇంటికి వచ్చాను. అంటూ చెప్పాడు.
ఇంటి ముందు జనము పోలీసులు వుంటే అతను తాపీగ కధ చెప్పే తీరునాకు అనుమానం వచ్చింది.
"మీ భార్యకి యాక్సిడెంట్ అయింది. వెళ్ళి చూడండి. పరిస్థితి చాలా ప్రమాదంగానే వుంది." అనిచెప్పానోలేదో అతను రయ్యిన ఇంట్లోకి పరుగెత్తాడు. భార్యని చూస్తూనే పెద్ద పెట్టున ఏడుస్తూ "నై లెక్స్ చీరకట్టుకుని వంట చేయవద్దని ఎన్నోసార్లు చెప్పాను వినకుండా ప్రాణం మీదకి తెచ్చుకున్నావా శకుంతలా!" అంటూ గుండెబాదుకున్నాడు.
"ఆమె ఓ పక్క కాలి పోతూ రక్షించండి అని అరిచిందిట" అతన్ని పరిశీలనగ చూస్తు అన్నాను.
"ఇంపాజిబుల్" అని ఆ తర్వాత నాలుక కొరుక్కున్నాడు.
అతనే ఆమె మరణానికి కారకుడని నిర్ధారణచేసుకున్నాను.
"మీ భార్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పాగాని ఫలానా గదిలో వుందని చెప్పలేదు. కాని మీరు రయ్యిన వంట గదిలోకి వెళ్ళారు. అంతేకాదు ఈ...యీ __ కారణాల వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను" అంటూ వివరించి అతన్ని అరెస్టు చేశాను. తను తెలివి తక్కువగ తొందర పాటుతో బైట పడి పోయానని తెలుసుకుని వెంటనే తననేరం వప్పుకున్నాడు.
అతనికి పెళ్ళయి ఎనిమిది నెలలు అయింది. భార్యని కొట్టి తిట్టి ఆమె పుట్టింటి నుంచి చాలానే డబ్బు, వస్తువులు లాగాడు. వాళ్ళ నుంచి పూర్తిగ లాగటం కాగానే మళ్ళీ యింకో అమ్మాయిని పెళ్ళాడాలనుకుని యింతటి ఘోరానికి దిగాడు. ఈ మధ్యకాలంలో గంటలో ముగిసినకేసు యిదే" అంటూ ముగించాడు శివకాంత్.
"పూర్వం ఇలాంటికేసులు కోటికి వకటి నూటికి వకటి కూడా వుండేవికావు. చదువు సంధ్యలు ఎక్కువ అయి విజ్ఞానం పెరగాల్సిన ఈ రోజుల్లో మూఢులు రాక్షసులు ఎక్కువ అయ్యారు.
ప్రతివారిలో కీర్తి కాంక్ష అంతులేనిధనదాహం, స్వార్ధం ఎక్కువ అయాయి. ధర్మం నశించింది. ప్రాణాలు ధారపోసి స్వాతంత్రం సంపాదించుకుంటే దేశాన్నే అమ్మే దౌర్భాగ్యులు తయారయారు. ఆ దౌర్భాగ్యుల తమ్ముళ్ళే ఇలా భార్యలను బాధలు పెట్టేవాళ్ళు....ఆవేశంగ అందికీర్తి.
ఆ తర్వాత యిరువురు మరో అరగంట యువతరం గురించి మాట్లాడుకుని లేచారు.
కీర్తి దగ్గర శలవు తీసుకుని శివకాంత్ రాయల్ మీద వెళ్ళి పోయాడు.
శివకాంత్ ని సాగనంపి ఇంట్లోకి వచ్చి తలుపు వేసుకుంది కీర్తి.
18
కీర్తికి పుస్తకాలు చదవటం చాలా యిష్టం, గతంలో పుస్తకాల పురుగు.
డ్యూటీలో వున్నప్పుడు కూడా వీలుచిక్కితే చాలు ఏదో వక నవల చేత బట్టుకుంటుంది. వారమాసపత్రికలు తిరగేస్తుంది.
పుస్తకాలు చదవటం ఎంత యిష్టమో సినిమాలు చూడటము అంతే యిష్టం. డ్యూటీలో లేనప్పుడు ఈ రెండే కీర్తికి కాలక్షేపం.
వారం నుంచి కీర్తికి కేసు ఏదీరాలేదు.
ఉన్న వార మాసపత్రికలు ఔ పోసన పట్టటం పూర్తి అయింది. అయిదు నిమిషాలకోనవల చదువుతుంటే ఎన్నైనా అయిపోతాయి.
ఈ వారం రోజులు ఒక్క పిక్చర్ మాత్రమే చూసింది. చాలా నెలల తర్వాత తెలుగుది సంపూర్ణ హాస్యచిత్రం "మూర్ఖాగ్రేసర చక్రవర్తి"కి వెళ్ళింది. ఆ చిత్రంలో నటీనటులు వారి వారి శక్తానుసారం వెకిలి యాక్షన్ చేశారు. జనం పిచ్చివాళ్ళు కాదు కాబట్టి కన్నీళ్ళు కారుస్తూ ట్రిక్కట్టు డబ్బులు వేష్టు అయినందుకు హాలులోంచి బయటికి వచ్చారు.
