Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 25

   
    "అందుకే ఆడవాళ్ళు ఇంటల్ జెంట్ శాఖలో చేరకూడదు ప్రతి కేసు ప్రాణాంతకమే ప్రతి వ్యవహారం రిస్క్ తో కూడిందే హాయిగ పెళ్ళి చేసుకుని ఇంటి పట్టున వుంటే ప్రాణానికి ఎంతహాయో!"    
    అమ్మయ్య పెళ్ళి విషయం ఎత్తగలిగాను మాటల్లో అనుకున్నాడు. శివకాంత్.    
    "నా ప్రాణానికి హాయి డ్యూటీలో వున్నప్పుడే." కీర్తి తాపీగా అంది.    
    "అయితే పెళ్ళి చేసుకోవాలని వుండదా కీర్తి!"    
    "వు...టుం...ది...    
    శివకాంత్ ముఖం చాటంత అయింది.    
    "...అయితే....నా వూహల్లో కూడా....ఇప్పుడప్పుడే ఆ....ఆలోచనలేదు." నవ్వుదాచుకుంటూ మాట పూర్తి చేసింది కీర్తి.  
    శివకాంత్ ముఖం ముడుచుకుపోయింది.    
    "పరస్పర విరుద్దం మాటలు చెపుతావు కీర్తి!" అన్నాడు శివకాంత్ ఇంకేమనాలో తెలియక.    
    "ఆడవారి మాటలు అలాగే వుంటాయి, కారణం యిప్పుడు నేను డ్యూటీలో లేను కదా!" నవ్వుతూ అంది కీర్తి    
    కీర్తి నవ్వుచూసి ధైర్యం తెచ్చుకున్నాడు శివకాంత్.    
    "కీర్తి! నువ్వుయింతవరకూ ఎవరినీ ప్రేమించ లేదా!"    
    "ప్రేమించాను. అదేం అలా అడిగావ్!"    
    "ఎవరిని ప్రేమించావ్!" ఆదుర్దాగా అడిగాడు. శివకాంత్ గుండె దడదడ లాడింది.    
    "వకరినని ఏమిటి చాలామందిని."    
    "చాలా మందినా!"    
    "ఎస్, నాశత్రువులని తప్పించి ఆ బాల గోపాలం అందరినీ ప్రేమించాను ప్రేమించే హృదయంలేని మనిషి మనిషే కాదన్నాడు ఓ మహాకవి," నవ్వుతూ చెప్పింది కీర్తి.    
    శివకాంత్ కేమి మాట్లాడాలో తెలియకుండా పోయింది!    
    "ప్రేమించి పెళ్ళాడటం నీకిష్టమేనా కీర్తి!" కాసేపు ఆగి అడిగాడు శివకాంత్.    
    కాస్తకాస్త ధైర్యం తెచ్చుకుంటూ మాటల్లో శివకాంత్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాడని కీర్తి గ్రహించింది. ఆదిలోనేతుంచేస్తే మంచిది అనుకుంది.    
    "చిన్నతనం అయితే ఏదీ తెలియదు. పెద్దలు ఎవడిని కుదిరిస్తే వాడిని పెళ్ళాడటం జరుగుతుంది. ఇంతవయసు వచ్చింతరువాత అలా పెళ్ళిచేసుకోలేము కదా! ఇష్టపడటం అన్నది ప్రేమగ తీసుకుంటే నేను ప్రేమించే పెళ్ళాడుతాను. నాకు అన్ని విధాల నచ్చిన వ్యక్తిని....నామిత్రుడివి ఆప్తుడివి నీతో చేపుతాలే భయపడకు, అయినా మనంఆశమ్మ బూశమ్మ లాంటి ఇలాంటి కబుర్లు ఏమిటి చక్కగ మంచిమంచి కేసుల గురించి మాట్లాడుకోక! శివకాంత్ నీ తీరు చూస్తుంటే ఎలా వుందంటే కళ్యాణం మీద మనసు పడుతున్నట్లు వుంది. నీకేమి మంచి జాబ్ వుంది. హాయిగ ఓ అమ్మాయి మెడలో తాళికట్టే సేయి. నేను డ్యూటీలో వుండి ఎంత పెద్దకేసులో మునిగిపోయి వున్నా నీ పెళ్ళి సమయానికి మారువేషంలోనైనా సరే వచ్చి అక్షింతలు వేసివెళతాను. డోంట్ వర్రీ!" అంటూ కీర్తి పకపక నవ్వింది.    
    శివకాంత్ ముఖంచిన్నబోయింది. తనని పెళ్ళాడే వుద్దేశ్యం కీర్తికి బొత్తిగ లేదని గ్రహించాడు. చాతగాని నవ్వొకటి నవ్వివూరుకున్నాడు.    
    ఆ తర్వాత సంభాషణ మార్చటానికి కీర్తి ఏదోకేసు గురించి చెపుతూ కూర్చుంది. అది అయింతరువాత కీర్తి అడిగింది.    
    "ఈ మధ్య నీ డ్యూటీలో కొత్త కేసు ఏమైనా తగిలిందా?    
    వుంటే చెప్పు ముందుముందు నాకు ఉపయోగపడవచ్చు"    
    "గొప్పకేసు లేమితగల లేదు. మా కెంత సేపువీధి రౌడీలు, జేబు దొంగతనాలు, లేకపోతే కట్నం తీసుకు రాలేదని పెళ్ళాన్ని చంపిన కేసులు ఈ మధ్య అవి ఎక్కువ అయిపోయాయి" అన్నాడు శివకాంత్.    
    "పోనీ అలాంటిదే ఈ మధ్యజరిగింది చెప్పు" అంది కీర్తి.    
    శివకాంత్ చెప్పటం మొదలు పెట్టాడు.    
    "శకుంతల అనే ఆవిడ నైలెక్స్ చీర కట్టుకుని స్టవ్ దగ్గర కూర చేయబోతుండగ చీరకి మంట అంటుకుని అక్కడి కక్కడే మరణించింది. తలుపులు లోపల గడియవేసి వున్నాయి. ఆమె భర్త పొరుగూరు వెళ్ళాడు. రాత్రికి వస్తాడు అదీకధ"    
    "దీనిలో పెళ్ళాన్ని చంపటం ఏముంది?" కీర్తి అడిగింది.        
    "భర్త రైలు స్టేషను నుంచి వస్తుంటే ఎవరిదో స్కూటరుతగిలి పడ్డాడు. కాస్త గీసుకు పోవటం తప్పించి పెద్దగ గాయాలులేవు. కాని అందరూ మూగటం ఇతను స్కూటర్ వాలామీద అరవటం జరిగింది. కనుక ఈమెది సహజమరణం అనగ స్టవ్ మంట అంటుకొని మరణించటం తప్ప హత్యకాదు కాని ఈమెని భర్త హత్యచేసి తెలివిగ ఎలిబీ సృష్టించుకున్నాడు....    
    "ఐసీ"    
    "మాకు కబురు వచ్చింది. హుటాహుటిన మేము బైలుదేరి వెళ్ళాము. అప్పటికే ఆమె మరణించింది ఇరుగు పొరుగు చెప్పటం, ఏదో మంట కనిపించి పరుగెత్తుకు వచ్చాము తప్ప ఆమె అరుపులు వినిపించలేదు అని....పైగా మేము తలుపులు తీసి లోపలికి వెళ్ళి చూస్తే ఆమె వెల్లకింతలా పడికాలి మరణించివుంది. శరీరమంతా కాలిందిగాని వీపు కాల లేదు పైగా వీపు మీద జాకెట్టు మధ్యలో కాలని చోట కిరసనాయిలు తడితో వుంది. కనుక ఇది ఆత్మహత్యకాదు ప్రమాదంతో కూడిన మరణము కాదని నిర్ధారణచేసుకున్నాను. అదీగాక శవం పక్కన మరికొన్ని ఆధారాలు దొరికాయి. ఇరుగు పొరుగు వారు చెప్పిన విషయాలు కొన్ని వుపయోగ పడ్డాయి__


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS