Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 25


    "భలేవారే! ఎందుకు నన్నలా అనుమానిస్తున్నారు? మిమ్మల్ని మభ్యపెట్టి, భయపెట్టి సాక్ష్యం చెప్పించడం నావల్ల అవుతుందా? అయినా, అటువంటి సాక్ష్యాన్ని ఏ కోర్టూ అంగీకరించదు. న్యాయశాస్త్రానికే అది తీరని మచ్చ. అసలు మిమ్మల్ని ఒక సాక్షిగా విచారించను!"
    రాస్తున్న కాగితాన్ని అసహనంగా చించిపారేశాడు వీరేష్.
    "సారీ ఇన్ స్పెక్టర్! మీరు నా మాటలకు దెబ్బతిన్నట్టున్నారు. మీ ప్రశ్నలకు జవాబు చెప్పనని నేను అనలేదే! నాకు తెలియని విషయాల గురించి నేను చెప్పవలసిన పని లేదంటున్నాను. మీరు నా స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకోవచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు" అంది సౌమ్యంగా.
    "థాంక్స్! ఆ అవసరం రాదులెండి. మీరు చెప్పదలచుకున్నదేదో కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు. మిమ్మల్ని విచారించి, మీ స్టేట్ మెంట్ రాసుకోవడం వలన ప్రాసిక్యూషన్ కు ఉపయోగం ఏముంటుంది?
    కాని, ఒక్కసారి నిండు మనసుతో సాటి స్త్రీగా గౌతమికి జరిగిన అన్యాయం గురించి ఆలోచించండి. "పెళ్ళి కావలసిన పిల్ల ఉరేసుకుని చనిపోవడానికి బలమైన కారణం ఏమై ఉంటుంది? ఎవరు బాధ్యులై వుంటారు?" ఆవేశంగా అడిగాడు.
    "గౌతమి ఆత్మహత్యకు సమ్రాట్ కారణం అయితే, ఆమె అతన్ని నిందిస్తూ కనీసం ఉత్తరమైనా రాయకపోయేదా?"
    "ఎస్! మీ సందేహం నా కర్థమయింది. కాని, ఆమెది సున్నితమైన మనసు. కేవలం సెంటిమెంట్ ఆమెను బలహీనురాలిని చేసి ఉండవచ్చు. అందుకనే అతన్ని నిందించలేకపోవచ్చు, కాదంటారా?"
    అనూష ఏమీ సమాధానం చెప్పలేదు.
    "సత్యాన్ని వెలికి తీయడం కోసం నా శాయశక్తులా కృషి చేస్తాను. గౌతమి ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన వాడెవడైనా అన్ని సాక్ష్యాధారాలు సేకరించి కటకటాల్లో వేస్తాను!"
    కోపంగా వెళ్ళిపోతున్న ఇన్ స్పెక్టరును చూసి నిట్టూర్చింది అనూష.


                                *    *    *    *


    స్త్రీకి, పురుషునికి మధ్యగల సంబంధం కేవలం శారీరకమైనదేనని ఆలోచించే దశలోనే ఈ సమాజం పయనిస్తున్నదా?
    పురుషుడు శారీరక సుఖం కోసం అనేక మోసాలు చేయడం, స్త్రీని విలాస వస్తువుగా వాడుకోవడం చూస్తుంటే స్త్రీ స్థానం ఎంత హీనమై పోయిందో చెప్పనవసరంలేదు.
    చాలామంది అమాయకులు కథలలో రాసినవి చదివి ప్రభావితులవుతూ, అవి జీవితంలో చేదు అనుభవాలు అవుతాయని గుర్తెరిగి ప్రవర్తించడం లేదు.
    ప్రేమ అంతిమ లక్ష్యం సుఖమే అని నిర్వచనం యిచ్చే రచయితలు వున్నంతకాలం, నిజ జీవితంలో కథలన్నీ విషాదాంతాలే అవుతాయేమో!
    అనూష పరిపరి విధాల ఆలోచిస్తూ బాధపడుతోంది.
    ఇన్ స్పెక్టర్ వీరేష్ తోపాటు తనూ సమ్రాట్ అనుమానించాలా? ఆమెకది అర్ధంకాని ప్రశ్న. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో వుంది.
    కాలింగ్ బెల్ మోగడంతో ఆలోచనలను పక్కకుపెట్టి తలుపులు తెరిచింది.
    ఎదురుగా సమ్రాట్.
    ఈవేళప్పుడు అతను తన గదికి ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు.
    అనూష గదిలో లైటు వేసింది.
    అతను గదిలోకి వచ్చాడు.
    "నీతో అర్జంటుగా మాట్లాడాలి" - అతను ఏదో ఆత్రుతగా తనతో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు గ్రహించింది.
    "చెప్పండి" అంటూ కుర్చీ చూపింది.
    అతను కుర్చీలో అసహనంగా కూర్చున్నాడు.
    "అనూషా! నువ్వు ఆనంద్ ని ప్రేమిస్తున్నావా?"
    సమ్రాట్ ఆమె జవాబు కోసం ఆమె ముఖంలోకి చూశాడు.
    ఆమె కళ్ళల్లో ఏ భావమూ గోచరించలేదు. తన వ్యక్తిగత విషయాలు అతనికెందుకో?
    అతను తన పరిధులు దాటి ప్రవర్తిస్తున్నట్టు అనిపించింది.
    ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో మళ్ళీ అడిగాడు.
    అనూష చివ్వున తలెత్తింది. ఇప్పుడామె కళ్ళల్లో ఎర్రజీర ఏర్పడింది.
    "సారీ! నీ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటున్నానని మరోలా అనుకోవద్దు. ఈ విషయంలో నువ్వు జవాబు చెప్పి తీరాలి!" అతని గొంతు స్థిరంగా వుంది.
    "అది నా వ్యక్తిగత విషయం. మీతో చెప్పవలసిన అవసరం లేదు."
    "మిస్ అనూషా! ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి వుంటుంది. అవునా?"
    అర్థరాత్రి ఆడపిల్లను నిద్రలేపి మరీ ప్రేమ గురించి సుదీర్ఘంగా ఉపన్యాసానికి ఉపక్రమించాడంటే అతన్ని ఏమనుకోవాలి?
    "అవన్నీ ఇప్పుడెందుకు? రేపు ఉదయం మాట్లాడుదురుగాని." అసహనంగా అంది.
    సమ్రాట్ తన చేతిలోవున్న కరపత్రాలను ఆమె చేతిలో పెట్టాడు.
    సభ్యత, సంస్కారం వున్న ఏ వ్యక్తీ సహించలేని విధంగా వుంది అందులోని పదజాలం. సమ్రాట్ ఈ సమాజంలో సామాన్య వ్యక్తి కాదు. ప్రఖ్యాత రచయిత. అతని పేరు ప్రఖ్యాతులను నాశనం చేసే రీతిలో వున్నాయి ఆ కరపత్రాలు. సమ్రాట్ కు, అనూషకు అక్రమ సంబంధం వుందంటూ నానా చెత్త రాసి వుంది వాటిలో.
    గిర్రున కళ్ళు నీళ్ళు తిరిగాయి అనూషకు.
    "ఎవరు వేశారు ఈ కరపత్రాలు? దయచేసి చెప్పండి!" అనూషలో ఆవేశం పొంగిపొరలింది.
    "క్షమించు అనూషా! నువ్వు ఎంతగానో అభిమానించే వ్యక్తే వాటిని వేసి రోడ్లవెంట పంచి పెట్టిస్తుంటే మా నాన్నగారు అడ్డుపడి లాక్కున్నారు."
    "చెప్పండి, ఎవరా వ్యక్తి? అతను ఎవరైనా అతన్ని నేనంత తేలికగా వదలను!" కసిగా కరపత్రాలను చించిపారేస్తూ అంది.
    "ఛ! ఛ! చదువూ సంస్కారం ఉందనుకున్న ఆనంద్ మన పరిచయాన్ని అపార్థం చేసుకున్నాడంటే అతని గురించి జాలిపడుతున్నాను."
    "ఏమిటీ, ఆనందా?"
    "ఆఁ ఆనందే! నువ్వతని మీద ఆవేశం పెంచుకోవద్దు. అతను పెరిగిన వాతావరణాన్నిబట్టే అతని ఆలోచనా వుంది. నువ్వు నన్ను మాట్లాడమంటే నేను వెళ్ళి అతనికి నచ్చచెబుతాను ఏమంటావు?"
    "అవసరం లేదు. లోకంలో మంచి_చెడు ఉన్నట్టే మనుషులలో కూడా మంచివారు, చెడ్డవారు ఉంటారు. అటువంటి వారి గురించి ఆలోచించి మన అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకోవడం తెలివితక్కువ తనమే!" అంది నిష్కర్షగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS