Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 25


"ఆ గదిలో మీరు కాక మీ యింట్లో ఎవరైనా పడుకుని చూశారా?" గోవర్ధన్ అడిగాడు.
"ఆ! మా యింట్లో అందరూ పడుకుని చూశారు. ఇలా అనిపించటం నాకు తప్ప, వాళ్ళెవరికీ జరుగలేదు. నేను చెప్పింది విని నా మాటలు కొట్టిపారేశారు. వాళ్ళంతా చెప్పిన తరువాత మరోమారు పడుకుని చూశాను. నాకు ఇదివరకు లాగానే జరిగింది" అంటూ వివరించాడు ముత్యాలరావు.
"ఆ గదిలో ఆడ దెయ్యం వుండి వుంటుంది." నవ్వుతూ అన్నాడు పర్వతరావు.
"పోరా! ఎక్కడన్నా ఆడ దెయ్యం వుంటే తోడుగా పడుకోటానికి రారమ్మంటుంది కానీ, గదిలోంచి పొమ్మని తరిమేస్తుందా ఏమిటి?"
"బహుశా నీవు దానికి నచ్చి వుండవు! కొట్లో కూర్చొనీ, కూర్చొనీ పొట్ట పెరిగిపోయి కాళ్ళూ, చేతులూ సన్నపడ్డాయి. వయస్సులో కూడా చిన్నవాడిని ఏమీకాదు గదా! పైగా నెత్తిన సగం జుట్టు ఊడిపోయింది. అందుకనే దానికి నచ్చివుండవు. ఈ తఫా క్రొత్త పెళ్లికొడుకులా తయారయ్యి, సెంటు పూసుకుని, ఆ గదిలో పడుకుని చూడు!" నవ్వుతూ అన్నాడు పర్వతరావు.
"పోరా! నీదంతా మరీ ఎగతాళి" అంటూ తనూ నవ్వాడు ముత్యాలరావు.
"నువ్వు చెబుతున్నది నిజమేనా!" అనుమానంగా అడిగాడు పుండరీకాక్షయ్య ముత్యాలరావుని.
"ఇవి కాలక్షేపం కబుర్లు కాదు నిజంగానే చెబుతున్నాను. నమ్మకంగా చెప్పాడు ముత్యాలరావు.
"ఈ నమ్మకాలనేవి ఉత్త భ్రమ అనే నేనంటాను. మొదటిసారిగా మీరు ఆ గదిలో పడుకున్నప్పుడు, దాహం వేసి నోరు ఆర్చుకుని పోయివుంటుంది. నిద్రలో భయంకరమైన కలకని వుంటారు. వళ్ళంతా ముచ్చెమటలు పోసి వుంటాయి. గదిలోంచి లేచి అవతలకి వెళ్ళి పడుకుందామా అని అనుకుని వుంటారు. ఆ రోజు ఆ రాత్రి కలిగిన భావన మీకు ప్రతిసారి కలిగి వుంటుంది. ఆ భ్రమని మీరు నమ్మకం అనుకుంటున్నారు!" గోవర్ధన్ అన్నాడు.
"నమ్మకాలనేవి మనకే కాదు ఇంగ్లీషు వాళ్లకి కూడా వున్నాయట. మొన్న 'ఆదివారం' దిన పత్రికలో చదివాను. 'భ్రాంతులు, నమ్మకాలు' అని ఒక పేజీ అంతా ఇలాంటి సంఘటనలు మొదలైన వాటి గురించీ వేశారు. వాళ్ళు రాసినవన్నీ కూడా ఇతర దేశస్థుల అనుభవాలే. భ్రాంతి, చాదస్తం, నమ్మకం మూడు వేరు వేరు అయినా, మూడింటికీ దగ్గర సంబంధం వుంది. అది ఎందరి అనుభవాల్లోనో రూపుదిద్దుకుంది" అని మొండి వాదనతో అన్నాడు గోవర్ధన్.
వాదన దేనికిలే అని అనుకున్నాడో ఏమో ఈ తఫా గోవర్ధన్ ఇంక ఆ విషయాన్ని పట్టుకుని సాగదియ్యలేదు. మాట మారుస్తూ అన్నాడు "నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీ ముగ్గురూ ఆలోచించి దానికి సరి అయిన సమాధానం ఇవ్వండి!"
"ప్రశ్నా! ఏం ప్రశ్న?" పుండరీకాక్షయ్య ఆదుర్దాగా అడిగాడు.
"సరదాగా ఓ చిన్న ప్రశ్న!"
"సరదాగా అయితే ఫరవాలేదు. తొందరగా అడిగేసెయ్యి! మాకు సరదాగా వుంది" ముత్యాలరావు తొందర పెడుతూ అన్నాడు.
"అందరూ కనేది ఏమిటి?" ఈ ప్రశ్నకి జవాబు కావాలి. చాలా తేలికైన చిన్న ప్రశ్న. ఆలోచించో, ఆలోచించకుండానో చెప్పెయండి! గోవర్ధన్ చిరునవ్వుతో అడిగాడు.
గోవర్ధన్ అడిగింది నిజంగా చాలా చిన్న ప్రశ్నే. కానీ, ముగ్గురుకీ వెంటనే జవాబు స్ఫురించలేదు. ముగ్గురూ ఆలోచనలో పడిపోయారు.
అది చూసి గోవర్ధన్ తనలో తానే నవ్వుకున్నాడు.

నిమిషం తరువాత.
"ఆ! తెలిసింది, తెలిసింది. "ఆనందంతో కళ్ళు మిలమిలలాడుతూండగా అన్నాడు పర్వతరావు.
"ఆ__తెలిసిందా?" ముత్యాలరావు అడిగాడు ఆత్రుతగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS