అయినా కసి తీరలేదు.
నాలుగేళ్ళు గడిచాయి.
రేఖ జీవితంలో మార్పు లేదు.
ఆ ఆఫీసులో వాళ్ళకు ఆమె అట్టలు చిరిగిన వార పత్రికలా కన్పిస్తూ వుంది.
ఆమె నడక మంచి కథకు చెత్తగా కాపీ కొట్టిన కథ నడకలా వుంటుంది.
ఆమె కళ్ళలో ఇప్పుడు కలలు లేవు.
కసి వుంది.
ఆమె పెదవుల్లో ద్వేషం కన్పిస్తుంది.
ఆమె మనసులోని మధువు ఇంకిపోయింది.
ఆమెను చూస్తూంటే లోకం మీద అలిగిన మనిషిలా కన్పిస్తుంది.
ఆమె హృదయంలో ఒకే ఒక కోర్కె. తీరే రోజు కోసమే ఎదురుచూస్తూ వుంది.
రమేశ్ ఎప్పటికైనా కనిపించాలి. దగ్గరగా కన్పించాలి. కసికొద్దీ ఆ చంపా ఈ చంపా వాయించాలి. ఇదే ఆమె కోరిక.
ఆ రోజు రానే వచ్చింది.
ఆమె ఎదురుచూసిన రోజు అనుకోకుండా ఎదురైంది.
ఆ రోజు కొత్త ఆఫీసరు వచ్చాడు.
కొత్త ఆఫీసర్ని చూసి రేఖ తెల్లబోయింది.
రమేశ్ రేఖను గుర్తించనట్టే నటించాడు.
రేఖ ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఆలోచిస్తూనే వుంది.
తెల్లవారి ఆఫీసుకు వెళ్తూనే ఆఫీసరు గదిలోకి వెళ్లాలి. చెప్పుతో ఆ చంపా ఈ చంపా వాయించి వాడి ముఖం మీద ఊసి వచ్చెయ్యాలి. అంతే చెయ్యాలి! అంతే!
ఆఫీసుకు వచ్చింది.
ఎప్పటిలా పనిచేసి ఇంటికి తిరిగివచ్చింది.
రేఖ ఆఫీసుకు బయలుదేరుతూ రోజూ "ఏమైనా సరే ఇవ్వాళ వాడి చెంపలు వాయించాలి. భయం ఎందుకు! ఎంత ఎరగనట్టు నటిస్తున్నాడో! రోగ్!" అనుకుంటూనే వుంది.
రెండేళ్ళ క్రితమే రేఖ తండ్రి గుండెజబ్బుతో మరణించాడు. రేఖే కుటుంబాన్ని పోషిస్తూ వుంది.
తీరా ఆఫీసుకు వచ్చాక బాధ్యతల్ని గుర్తుచేసుకొని అతి శ్రద్ధగా పనిచేసి బయటపడుతుంది.
రోజూ రేఖకు రమేశ్ కన్పిస్తూనే వున్నాడు.
అతను ఒక్కరోజూ ఆమెను గుర్తించినట్టు కన్పించలేదు.
ఆమె మనసులోని కోర్కె మనసులోనే వుండిపోయింది.
రెండేళ్ళు గడిచిపోయాయి.
రమేశ్ కు ట్రాన్స్ ఫర్ అయింది.
వెళ్తూ వెళ్తూ రేఖకు ప్రమోషన్ ఆర్డర్సు వేసి వెళ్ళాడు.
ఎస్టాబ్లిష్ మెంట్ సూపర్నెంటు ఆర్డర్సు అందించాడు.
ఆర్డరు చూసి రేఖ కసిగా పళ్ళు కొరుక్కుంది.
ముక్కలు ముక్కలుగా చింపి చిత్తు కాగితాల బుట్టలో పారెయ్యాలనుకుంది.
తనకు ఈ ప్రమోషన్ అక్కర్లేదని రాసివ్వాలనుకుంది.
ఆర్డర్సు భద్రంగా పర్సులో పెట్టుకుంది.
కొత్త సీట్లోకి వెళ్లి కూర్చుంది.
ఆఫీసులో అందరికీ కాఫీలు తెప్పించి ఇచ్చింది.
చిరునవ్వుతో అందరి అభినందనల్నీ స్వీకరించింది.
ఇంటికి వచ్చింది. తల్లి ఏదో అడుగుతున్నా వినిపించుకోకుండా గదిలోకి వెళ్ళి భళ్ళున తలుపు మూసింది.
మంచం మీద బోర్లాపడి భోరున ఏడ్చింది.
* * * *
ఈ కథ సుఖాంతమో, దుఃఖాంతమో మీరే చెప్పాలి.
అసలు ఇది ప్రేమకథో కాదో కూడా మీరే చెప్పాలి.
** ** **
